మధ్య తరగతి మకరందం
-ఎజ్జు మల్లయ్య
అమ్మ నేర్పిన తొలి పలుకుల నుంచి
అమ్మ ఒడిలో పడుకున్న వెచ్చని నిద్ర నుంచి
అమ్మ మోసిన కట్టెల మోపు నుంచి
పాత బట్టలకు కుట్టేసిన సూది దారం నుంచి
అమ్మ చేసే పరమాన్నం తిన్న పరమానందం నుంచి
నాన్న వాడిన ఉల్లి-బాడిష నుంచి
నాన్న చెక్కిన పళుగొర్రు నుంచి
నాన్న దున్నిన గుంటిక వరుసల్లోంచి
నాన్న పేర్చిన బండి పల్గడి దబ్బల నుంచి
నాన్న అల్లిన పుల్జరితట్ట నుంచి
నాన్న నేసిన పగ్గం-మోకు నుంచి
నాన్న కప్పిన తాటాకు కొట్టం నుంచి
తొండి మొండి చేసి గోటీలు గెలుచుకునే
తమ్ముడు ఆడిన గోటీలాట నుంచి
ఉత్తీత నేర్చుకున్న లంబడొళ్ళ బావి నీళ్ళ నుంచి
అవ్వ వడికిన ఉన్ని కండె నుంచి
తాత నేసిన నల్ల గొంగడి అంచు నుంచి
గొర్లెంట నడిచిన అడవి దారుల నుంచి
వసతిగృహాంలో ప్రార్థన చేసి తిన్న బువ్వ నుంచి
అనుభవాల నుంచి
అనుభవించిన మధురానుభూతి నుంచి
నేను వికసిస్తాను అనుభూతి కవితనై
నేను ప్రవహిస్తాను అనుభవాల సాగరానై
నేను పరిమళిస్తాను మధ్య తరగతి మకరందానై
నేను మళ్ళీ మళ్ళీ పుడతాను పల్లె కవినై…
*****