వెలిబతుకుల నిషిద్ధాక్షరి అర్ధనారి (బండి నారాయణస్వామి అర్థనారి నవలా సమీక్ష)

-వి.విజయకుమార్

“…మగ శరీరాలలో దాక్కున్న ఆడతనాలు గోడలు పగలగొడుతున్నాయి.

గీతలు చెరిపేస్తున్నాయి. ప్రవాహపు ఒడ్డుల్ని తెగ్గొడుతున్నాయి. 

వారు గలాటా చేస్తున్నట్టు లేదు. దేనినో అపహసిస్తూ ఉన్నట్టున్నారు. 

దేనిని? లోకాన్ని!

సమాజాన్ని! పితృస్వామ్యంలో మగ కేంద్రాన్ని!

         జీవిత యుద్ధంలో ఓడిపోయిన వాళ్ళు, కుటుంబానికి, ఊరికి వెలి అయిన వాళ్లు, సమాజం గేలి చేసిన వాళ్ళు, శరీరమే పరిహాసాస్పదమైనవాళ్లు!

         మగ దుస్తులు కప్పుకున్నా, నడకలలో ఆడతనం ఒలికి పోయేవాళ్ళు! ఆడతనాన్ని దాచుకునీ దాచుకునీ అలసిపోయిన వాళ్లు!…” 

         “…తల్లిదండ్రుల దగ్గర ఒంటరితనం, తోబుట్టువుల మధ్య ఒంటరితనం, కుటుంబంలో ఒంటరితనం, సమాజంలో ఒంటరితనం. రాజ్యంలో ఒంటరితనం. 

         రాత్రి కప్పుకున్న దుప్పటిలో కూడా ఒంటరి తనపు భయం!

         అది గంధర్వలోకమా? కాదు కాదు; కిన్నెర లోకం…!”

         ప్రకృతెందుకో చిన్న చూపు చూసింది! బొమ్మని చేసి ప్రాణం పోసిన సృష్టి స్థితి లయకారుడెవడో పగ చూపేడు! అవమానాలు, చీదరింపులు, ఛీత్కారాలు, చిత్ర వధలు, ఛిధ్ర వ్యధలు, భగ్న హృదయాలు! అమ్మ పొమ్మంటుంది, తండ్రి “బృహన్నల నా కొడకా!” అని తిడతాడు, ఊరు కాకై పొడుస్తుంది, సమాజం చూపుల శూలాలు విడుస్తుంది! కళ్ళ ముందు నుంచి వెళ్ళిపోమంటుంది! 

         అనాకారితనాన్ని ముసి ముసి నవ్వులతోనైనా మూస్తుంది, అజ్ఞానాన్నీ సహిస్తుంది, అన్ని రకాల ఆంగిక లోపాల్నీ భరిస్తుంది, అర్థనారి మొహాన్న మాత్రం తుపుక్కున ఊ(మూ)స్తుంది! ఒక జలదరింపు, ఒక జుగుప్స, ఒక వెరపు, ఒక భయం, ఒక భీతి, పక్కకు త్వరగా తప్పు కెళ్ళాలను కుంటుంది! యేంపాపం చేశామని ఈ బతుకు? ఏం నేరం చేసినందుకు ఈ నరకం? ఈ రూపం ఎవరి శాపం? ఈ వైరుధ్యం అభ్యంతరకరం! ఒక లాఫింగ్ స్టాక్! “లోకానికి అన్నీకావాల. అన్నీ తెలియాల. ప్రతిదీ దాని కొలతలకు లొంగి పడివుండాల. అటు అయినా వుండు, ఇటయినా వుండు. అటూ ఇటూగాక గాడి తప్పితే సహించదు…

         సృష్టిలో ఆడ అంటే ఆడ, మగ అంటే మగ…అదే గాడిలో నడవాల…”

         సృష్టి గాడితప్పితే ఫర్వాలేదా లోకమా? సృష్టి గాడి తప్పినా విలువలు గాడి తప్ప కూడదు. అంతేనా సమాజమా??” “స్వీయ అస్థిత్వమే ప్రశ్నార్థకమైన వారికి సామాజిక ధర్మాలు వర్తిస్తాయా?” ఎంత ఆవేదన చూడక పోతే నారాయణ స్వామి నిలేస్తారిలా!

         అర్ధనారి! ఆడా మగే సృష్టి ధర్మం అని నమ్మేవాడి కోసం కాదిది! అధోజగత్ తృతీయ ప్రవృత్తి సహోదరుల నిషిద్ధ అంతఃపురంలోకి తొంగిచూసిన వెలుగు దారి! సభ్యత ముసుగు మీద సారించిన వింటి నారి! తన ఇష్టా ఇష్టాలతో ప్రమేయం లేకుండా, ఒక లోపంతో జన్మించిన మనుషుల వెలివేతల్ని నిలవరిస్తున్న ప్రశ్నార్థకమిది. 

         లోకం వద్దనుకున్న రోడ్ మస్ట్ నాట్ టేకెన్ లోకి నారాయణ స్వామి నిబ్బరంగా అడుగేశారు, అక్కర్లేని, ఎవరికీ పట్టని హమామ్ వెలి వాడల్లోకి తొంగి చూశారు. అనుభవమైన పురుష ప్రవృత్తిలోకో, నిరంతర సాన్నిహిత్యంతోవుండే  స్త్రీ హృదయం లోకో వెళ్ళడం సహజమే కానీ ఏనాటికీ అనుభవంలోకి రాలేని, సృష్టి విరుద్దమనిపించే హృదయ సీమల్లోకి వెళ్ళిపోయి రాగద్వేషాల్ని పట్టు కున్నాడీ తాత్వికుడు. వినబడని వేదనల్ని ఆవాహన చేశాడు! నిషిద్ధమని తీర్మానించేసుకున్న సామాజిక నీతుల్ని ప్రశ్నించాడు. లోకం కావాలనే పరిహరిస్తున్న, పరిహసిస్తున్న అధోజగత్ సహోదరుల హృదయార్ణవమైన అనుభూతుల్ని సానుభూతితో అర్థం చేసుకున్నాడు. చంద్రన్న వురఫ్ రమణి నే కాదు, ఆధునిక సమాజంలో టాబూ గా చీదరించుకునే, రవీంద్రనాథ్ రెడ్డి నరసప్పల మధ్య హోమో సెక్సువల్ సంబంధాల్ని “వాన్ని పైకి ఎక్కించు కుంటే తప్ప పనిచేయదు నాకు. పిలుచు వాన్ని. ఎక్కు డుండాడో…” అని భార్య రెడ్డమ్మతో గుసగుసగా అరవడంలోని జుగుప్సనికూడా భరించమంటూ సవాలు చేసేరు. 

         అర్ధనారి ఒక ఆధునిక ఎపిక్, నిషిద్ధ మానవుల ఎలిజీ, ఒక విషాద కావ్యం, ఎవరికీ అక్కర్లేని తృతీయ ప్రవృత్తి మూర్చన. మర్యాదస్తుల సమకాలీన లైంగిక నీతులకూ, కట్టు బాట్లకూ ఎదురెళ్లి, తమని ఛీ కొడుతున్న సమాజాన్ని వెలివేసి బతికే నిషిద్ధ మానవలోకాన్ని పరిచయం చేయడమే దాని ఉద్దేశం! 

         నాటు సారా వాసనా, వూసిన కిళ్లీ తుంపర్లు, కుమ్మరించి వెళ్లిపోయిన స్పెరమ్ మరకలు తప్ప మరేమీ వుండని అపవిత్ర రంగస్థలం. సినిమా టాకీస్ సందుల్లోనో, కొట్టాల కిందనో, బజారు దాపునో శరీరం వొంచి బేరాలు చూసుకొనే వెరపు పుట్టించే లోకమిది! తాగుడూ, నోరు పట్టని బూతులూ, నోరంతా తెరుచు కొని తుపుక్కున వుమిసే తాంబూలాలూ, చేలాలూ, తాలీలూ, పురుషుడికీ పురుషుడికీ మధ్య సాగే అనైతిక, అశుద్ధ, ప్రకృతి విరుద్ధ కామ కేళి…అంతేనా!

         నాన్సీ ఫ్రైడే ఫ్లవర్స్ ఆఫ్ గార్డెన్ లోనో హెరాల్డ్ రాబిన్స్ నవల్లో శృంగార కేళి పేజీల్లోనో, సిడ్నీ షెల్డన్ పెవిడ్ పెవిలియనో, వాలెస్, గోల్డెన్ రూమో  వెతుక్కునే వారికి ఇది ఆశాభంగమే! స్త్రీ, పురుష ప్రవృత్తి కోరుకునే రొమాంటిక్ అనుభూతులకు చంద్రన్న వురఫ్ రమణి అందించేశృంగారం ఒక ఆశాభంగం!

         వారి జీవితానందం కూవగం కూతాండవర్ కోవెల ముందు ఆరావన్ తో ఒక్కనాటి వైవాహిక వైభోగం! పెళ్లినాటి వారి నృత్య హేలలా, కమలాదాస్ వర్ణించినట్టు wailed and writhed in vacant ecstasy… అదొక బుద్బుద ప్రాయపు మెరుపు…మర్నాడే  వైధవ్యం పొందే క్షణ భంగుర శాపగ్రస్త జీవితం!

         కానీ ఈ అమర్యాదకర, అశుద్ధ జీవితం వెనుక, నేపథ్యంలో వినిపించే అనితర సాధ్యమైన మానవ సంగీతం వుంది! జీవిక వుంది! అది విషాద గీతికే అయినా ఈ నవల అంతఃస్సారం అదే! ఎవరైతేనేం, బడుగు జీవులు, పతితు లు, భ్రష్టులు, బతుకుకాలి పనికిమాలి రథచక్రపు టిరుసులలో పడి నలిగిన హీనులు… దీనులు…అసమంజస వికృత వ్యవస్థ దాస్టీకాలకు నిరంతరం బలయ్యే నిరుపేదలు… 

         ఈ విశృంఖల రంగభూమి అట్టడుగు బతుకుల జీవన గుండె ఘోషల్ని తడుము తుంది. అడ్డాలో కనబడే మేస్త్రీ, వెంటాడే పది మంది పురుషుల నుండి భద్రత కోసం మళ్లీ ఒక  పురుషుడికి వళ్ళప్పగించి మోసపోవడానికి సిద్ధపడే రామలక్ష్మి లాంటి వాళ్ళు, ఆ రామలక్ష్మిని “అంగడి పెట్టినా వంటనే!” అని మగ భాషలో అడిగే పోలీసు రాజ్యపు అనైతిక హెడ్డు కనిస్టీబుల్, ఎర్రి స్వామి లాంటి జర్రి పోతును భరిస్తూ, ఫ్రిజ్జు చల్లదనాల కోసం, రాయంచలా కదిలి వెళ్లే కార్ల సుఖాల కోసం, బిడ్డని డాక్టరీ చదివించడం కోసం, మధ్య తరగతి లక్ష్మణ రేఖల్ని వెర్రి భర్త ఎర్రి స్వామితోనే చెరిపించి, రంగారెడ్డి పంచన జేరి, బతక నేర్చిన మణి మాలలు, ఇరుగు పొరుగున అతిశయం చూపి బతుకు బండిని భద్రంగా లాక్కెళ్లి పోయే గడుసు పుల్లమ్మలు కూడా తారసిల్లు తారిక్కడ. 

         “…దక్షిణం వైపు ఏడవ గదిలో దయ్యం ఉందని అనుకుంటే ఆ దయ్యం అదే గదిలో జీవితాంతం ఉన్నట్టు భయపెడుతుంది. ఒకసారి ఆ గదిలోకి పోయి కిటికీలు తెరిచి అటు ఇటూ నాలుగు అడుగులు నడిచి వస్తే  దయ్యమూ లేదు గియ్యమూ లేదు అని తెలిసొ స్తుంది. సామాజిక భయము అంతే…మనిషి పుట్టడమే ఒక దారి తెన్నులేని ప్రపంచంలోకి విసిరివేయబడతాడు. ఇంక దారి తప్పడం ఏముంది…

         మనసు నుంచి తప్పొప్పుల చిట్టా తప్పిపోయింది… వర్తమానంలో వైనంగా బతకడమే వివేకం… భర్త వదిలేసి పోయిన ముగ్గురు బిడ్డల తల్లి రామలక్ష్మి, పడుపు వృత్తిలోకి భద్రంగా చేయి పట్టి నడిపించిన అదే సమాజం లో గత్యంతరం లేక ఎంచుకున్న జీవన మార్గం ఇది! “…కడుపులో నుంచి కల్మషాలు దింపుకొని, మళ్లీ పొట్ట నింపుకొని, డబ్బుతో వ్యవహారాలు చేసి, ఏవో ఒక వూక దంపుడు మాటలు మాట్లాడి, ఆత్మ నుంచి వేర్లు తెగిన నవ్వులు నవ్వి, వివర్ణమైన జీవితంలో రంగులు వెతుక్కుంటూ, పడుతూ లేస్తూ, గసపోసుకుం టూ, క్షణ క్షణమూ వ్యర్థమై, గంటలు గంటలు నిరర్థకమై, బతికే ఒక తాపమై… శాపమై బరువు బరువై గుదిబండగా మారి జీవితంలో బరువు మోయడం కూడా ఒక అలవాటుగా మారినప్పుడు” జీవితాలు ఇలానే మిడుకుతాయి.

         మొత్తంగా ఇక్కడ అర్ధనారులే కాదు, సామాజికంగా పరిపూర్ణతకు నోచని అబలా స్త్రీ లోకమూ వుంది! పురుషుడు పురుషుడిలానే ఉన్నాడు! “తను” గాని దేన్నైనా కామపు “సరుకు” గా మార్చేసుకొని కొత్త నీతుల తోవల్లో దారి వెతుక్కో వడం అలవాటు పడినవాడు! వీడిని కదా మనం పరిహరించాల్సింది!

         ఈ అహంభావుకతని కదా ప్రశ్నించాల్సింది? 

         I don’t call myself a woman and I know I am not a woman…అని తన్ని తాను వర్ణించుకున్న కేట్ బోర్న్ స్టీన్ ఒక చోట అడుగుతుంది అమాయకంగా Gender outlaw అనే పుస్తకంలో, …Is the determination of one another’s gender a social responsibility? Do we have the legal or moral right to decide and assign our own genders? అని! ఓ మర్యాదల ముసుగు ప్రపంచమూ! సమాధానం చెప్పు!

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.