బతుకు చిత్రం-28
– రావుల కిరణ్మయి
జరిగిన కథ: దేవత చెప్పిన సలహాలతో జాజులమ్మ తన సంసారాన్ని బాగు చేసుకొని గడిచిన కాలం లో ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చి జీవితాన్ని పండించుకుంది. ఆ తరువాత ఆమె తీసుకున్న నిర్ణయం ఈర్లచ్చిమిని ఆశ్చర్యానికి గురిచేసింది .
***
దేనికి పైసలియ్యాలె? నీ ఓటుకు సుతం సర్కారు పైసలియ్యల్నా? ఓటేసే టందుకు ఇచ్చినట్టు పైసలియ్యాల్నా? ఇజ్జతు లేదా? అడిగేటందుకు? అని గయ్యిమన్నడు. నీ బాధ్యత నువ్వు చెయ్యడానికి పైసలుగావాల్నా?’’ గొర్రెబల్తే కాపుకే లాభమని మీరంతా ఇట్లా ఆశపోతులైతేనే స్వార్థపరులు మిధ్దేలేక్కు తాండ్రు. ఇగనన్న మారరా? సదువులు లేనప్పుడు గదే ముచ్చట, సదువులు అచ్చినంక గదే ముచ్చటనా? అని అడిగినవారి మీదకు కోపం చెయ్యసాగాడు.
గాబయ్య ఎందుకే గంతగనం గయ్యిమనవడితివి? అన్నాడు రాజయ్య. రాజన్నా ..! గయ్యిమనుడు గాదె ? రాను రాను జనాలకు ……….ఇగ అనలేను గని అదిగూడ బరువే అయితాంది. అని మోటు సామెత చెప్పలేక మింగి ఆవేదన పడసాగాడు.
ఓటంటే ఒక పయిత్రత. అది దైవం లెక్క. మన ఆత్మా గౌరవం. దాన్ని అమ్ముకొని ఒకరోజు తిని తాగడానికి ఐదేండ్లు అమ్మవడితిమి.
ఓటంటే నోటుకాదురా …
ఓటునేపుడు అమ్ముకోకురా ….
న్యాయాన్ని గెలిపించు ….
నియతిని కాపాడు ……….
అని గాబయ్య పాడుతూ కూర్చుంటే …ఊరు సాటింపుతో పాటు ఈ పని గూడ అప్ప జెప్పిన్రా? అన్నారు ఇంకోగరు.
మంచి జెయ్యమని ఒగరు జెప్పాల్నా? నాకు పాడాలనిపించి అందరికి ఎరుక జేసే టందుకు పాడుతానా. ఇగ మీతోని గాదు నాకు పనున్నది నేను బోతానా! అని లేచి పోయిండు. డప్పు చాటింపు చేసుకుంటూ.
చూసినావ్ !వాడెంత మాట అనుకుంట పోతాండు. మనం పనిలేక కూసున్నమని చెప్పకనే చెప్పినట్టు బట్టల చెప్పువెట్టి కొట్టి చెప్పినట్టే చెప్పిండు గదా !అని అనుకోవడం మొదలుపెట్టారు. రాజయ్య ఉండలేక ఇంటి దారి పట్టాడు.
గాబయ్య అన్నదాంట్లో తప్పేమున్నది? ఎన్నో దినాల వట్టి సాతకాక పని మానేసి ఇంట్లనే ఉండవడితి. పొద్దు ఎట్లా పుచ్చాల్నాని ? గిట్లనే గద కూసుంది తినుడుకు అలవాటై పుక్కిడి పైసలకు ఆశవడుతున్నది. సగం మంది సాకు లేతుక్కొని సర్కారు పైసలు దొబ్బాల్నని సూడవట్టిరి, అనుకుంటూ ఇల్లు చేరాడు.
***
సైదులు పని నుండి వచ్చి సరూప దగ్గరికి పోవాల్నని తొందరగా స్నానం చేసి బయటవడుతుంటే … ఈర్లచ్చిమి అడిగింది.
ఏందిరా ? వచ్చుడచ్చుడే మల్ల బయట వడుతానవ్? పిల్లగాండ్లతోని మాట్లాడేది లేదారా? అన్నది.
పోయ్యేటోన్ని ఆపి అడుగుడు అక్కెర్నా? మగోడన్నంక అవతల సవాలచ్చ పను లుంటయ్. నువ్వు అన్నీటికి అద్దంలా బుడ్డరకాన్ లెక్క అడ్డువడ్తవ్? అని కోపం చేసాడు.
ఇన్నోద్దులు నువ్వు ఇల్లు నాదిగాదు, ముంగిలి నాదిగాదు అన్నట్టు దిరిగినవ్!ఇప్పుడు వాణ్ని అట్నే జేత్తానవ్. అని ఈర్లచ్చిమి ..అంటుండగానే ,సైదులు …అవ్వా ..! జర ఆపరాదే ! నీ లొల్లి పాడుగాను!అని గట్టిగా అనగానే ఈర్లచ్చిమి ఇంకా మాట్లాడలేక పోయింది.
తల్లి మౌనం చూసి సైదులే తల్లి దగ్గరికి పోయి ..
అవ్వా !నేనో ముఖ్యమైన పని మీద బయటికి పోతున్నా. అచ్చినంక చెప్త! సరేనా ?అని నిమ్మలం జేసి బయటపడ్డాడు.
జాజులమ్మతో జరిగిన విషయం చెప్పింది ఈర్లచ్చిమి. జాజులమ్మమనసు బాధపడింది. ఈ మనిషి మళ్ళ తాగుడు అలవాటు అయిండని అనుకున్నది, కానీ అత్తతో ఏమీ అనలేదు.
కమల నిన్నటి నుండి సడ్డమాలినట్టు ఉంటాంది. ఎమైనదని అడుగ మందామని అనుకున్న. కొన్ని కొన్ని అత్తకు, ఇంకోగరికి చెప్పుకోనివి భర్తకు చెప్పుకోవాలనిఅనిపిస్తయి అని అడుగమందామంటే వాడే నా మీదకి ఇంత్తెత్తు లేసె అన్నది ఈర్లచ్చిమి.
అవునత్తా! కాని, అంతా ముఖ్యమైన పని ఏందో పోనీ తీ! అట్ల గాకుంటే ఇప్పుడు జేసేదే మున్నది? గని, కమలను దేవతక్క దగ్గరకు తొలక పో ! అన్నది ఈర్లచ్చిమి .
***
కమల, జాజులమ్మ వెళ్లేసరికి దేవత దగ్గర ఇద్దరు ముగ్గురు ఉండడంతో వారు వచ్చెంత వరకని బయిటనే కూర్చున్నారు.
కమలా! ఏమనిపిస్తున్నదే? నాకైనా చెప్పచ్చు గదా!
నీకు గాకుంటే ఎవరితోని చెప్పుకుంటనే? నాకు ఏ పని చేయ్యబుద్దయిత లేదు. తిన బుద్ది సుతఅయిత లేదు. గాభరా గాభర ఉంటాంది.
ఎందుకే? అట్ల? అని తలపై ఆప్యాయంగా చేయ్యివేసింది.
ఏమోనే! తెలుస్తలేదు.
పోనీ! అత్తకన్న చెప్పచ్చు కదా!
అవును గని, ఆమె పాణమే అంతంత ఉండవట్టె! నా వల్లే అట్లున్నదేమో నని నాకు దిగులు గావట్టె, అనవసర భయాలు పెట్టుకోకుండా ఉండు. మనం మంచిగుంతనే ఆమె మంచి గుంటది. అని చెప్తుండగానే … దేవత పిలవడంతో లోపలికి వెళ్ళారు.
జాజులును బయటనే ఉండమని చెప్పి కమలను వేరే గదిలోకి తీసుకెళ్ళి మాట్లాడింది.
కాసేపటి తరువాత బయటకు వచ్చి జాజులమ్మతో, కమల తల్లి కాబోతు న్నది. ఆమెకు మంచి ఆహారం కావలసి ఉంటుంది.పెద్దాసుపత్రికి ప్రతీ నెలా పోతే మంచి మందులు ఉచితంగా ఇస్తారు. అని అన్ని వివరాలు తెలియ జేసింది.
జాజులమ్మకు చాలా సంతోషం కలిగింది. కమలను గట్టిగా కౌగిలించు కుంది. ఎంత మంచి ముచ్చట చెప్పినవక్కా! నీ నోట్లో చక్కర పొయ్య! అంటూ అక్కడి నుండి ఇద్దరూ ఇల్లు చేరారు.
ఈర్లచ్చిమి ముచ్చట విని ఏమనలేక పోయింది.
జాజులమ్మే అడిగింది.
ఏమత్తా! మనుమడు వత్తాండంటే నీకు సంబురంగ లేదా? అని.
నాకు ఎవరైనా ఒకటేలేవే! పాపం! తల్లి లేనిదీ గదా! కమలకు చెప్పుకోడానికి.
నాకు మాత్రం ఉండపటికనా? అత్తా! మాకు అత్తవైనా, అమ్మవైనా నువ్వే !
అవును, అత్తా! నేను గూడ తల్లి లెక్కనే అనుకోవడితి, నాకు ఏది గావనన్నా నీకే చెప్పుకుంట అన్నది కమల.
సరెలేవే ! ముందు ఈ ముచ్చట వానికి నువ్వే చెప్పు. ఈ కాన్నుండి పనికి పోకు. నీ బదులు నేను పోత తీయ్! అన్నది.
రాజయ్యతో చెప్పగా చాలా సంతోషించినా, ఈ తాపన్న వారసుడు పుట్టాలని కనపడని దేవునికి దండాలు పెట్టాడు.
***
సైదులు సరూప ఇల్లు చేరాడు.
సరూప ఒక్కతే ఉన్నట్టుంది. పిల్లలు కూడా కనిపించలేదు. ఇంకా అనుమాన పడుతూ ..
ఏమిటిది?ఎవరూ లేనన్ని వేళ ఒంటరిగా నన్నెందుకు పిల్సినట్టు అనుకుంటూనే….
సరూపా …!అని పిలిచాడు.
రెండుసార్లు పిలిచేసరికి లోపలి నుండి వచ్చి ,
రా…రా…! నీ కోసమే చూత్తానా!
అన్న లేడా?
అన్నుంటే నిన్నెందుకు ఇంటికి పిలుత్త? నిన్న చెప్పింది మర్సినవా? సరేగాని, లోపలికి రా..!
ఇంకెక్కడికి?
అబ్బ! రమ్మన్న గదా! ఈడ ఎవరన్న వత్తే , జూత్తే బాగుండదు. పద.!అని చొరవ చేసి చేయి పట్టుకొని, మూలకున్న ఒక గదిలోకి తీసుకెళ్ళింది.
అక్కడ మంచం దానికి దగ్గరగా ఒక చిన్న టేబుల్. దాని పై మందు సీసా, ఖాళీ గ్లాసు, పక్కనే ప్లేట్లో గారెలు పెట్టబడి ఉన్నాయి.
అవీ చూడగానే , ఎందుకివన్నీ ? నాకు అవతల చాలా ఏగిరమున్నది, నేను పోవాలె, ఇవన్నీ నాకేమి వద్దు. సతాయించక ముచ్చట చెప్పు.
ఎందుకంత ఏగిరం? చానా చెప్పెడున్నది కాబట్టే ఇవన్నీ. నువ్వు పైసలు దేనికి ఇయ్యకుగని, తినుకుంట నేను చెప్పేది సాంతం విను అని బలవంతం గా కూర్చోబెట్టి తానూ పక్కగా కూర్చొని మందును గ్లాసులోకి వంపి చేతికిచ్చింది.
ఇవన్నీ తరువాత, ముందు సంగతి చెప్పు అన్నాడు మళ్ళీ.
మీ అవ్వను గురించే,
మా అవ్వ గురించా? మా అవ్వకు ఏమైంది.. అన్నాడు తడబడుతూ.
మీ అవ్వకు ఏమైందో నాకు తెలుసు గని, మీకే ఎవలకు తెలువదు, మీకే గాదు ఇంకే వలకు తెలువదు, నేనూ ఎవరితోనూ అనను గని, నువ్వు మీఅవ్వకు వాలిన ఆ చెడును మంత్రంతోని తీసేయించు…..
ఆమె మాటలకు అడ్డుతగులుతూ మంత్రాలకు చింతకాయలు రాల్తయా? ఎక్కనన్న? అయినా, మా అవ్వకు ఏమయిందని ? అన్నడు చెప్పడం ఇష్టం లేక.
నాకు తెలుసు, రోగం బయట పడితే మీ అవ్వ ఇంకింత్ నా రాజు అయిత దని మీరెవ్వరు చేప్తలేరు. అదే మంచిది లే! అని గారే ఇచ్చింది. నేను ఎవరి తోనీ ఈ సంగతులు చెప్పను గని, నువ్వు ఇగ ఈ దాపరికం ఆపి నేనుచెప్పినట్టు కొన్ని సామాన్లు తీసుకొని నేను చెప్పే కాడికి పోయినవంటే మీ అవ్వ మీదున్న దిట్టి పొయ్యి పాణం బాగయ్యి ఎప్పటోల్గనే అయితది. నా మీద నమ్మకముంచు. కాకపోతే పైసలే చాన ఖర్చైతయ్! అయినా పాణం కంటే ఎక్కువ ఏది గాదు. మల్ల ఈ మంత్రం ఎప్పుడు వడితే అప్పుడు చేసేది కాదు. నిండు అమాస నాడన్న, నిండు పున్నమి నాడన్న చెయ్యాలే. అమాస ఎల్లుండే గావట్టే గని, పున్నమి నాటికన్న పైసలు తయారుజేస్కో. ఇంకో ముఖ్య మైన సంగతి ఏందంటే, మంత్రం జెయ్యటానికి బొక్కలు గావాలె. అవి కాష్టం కాడికి పోయి నువ్వే తేవాలే. దినాలు ఎల్లని వాళ్ళయ్ ఎవరికీ అరుక గాకుండ ఎరుక రావాలె అన్నది.
బొక్కలు అనగానే సైదులు కు పొలమారింది,
ఆ ..ఆ ..గాభరా పడకు. బొక్కలు తెచ్చేది సుత ఒపద్ధతున్నది. నువ్వు నేను చెప్పినట్టు చెప్పిన దినాం వచ్చుకుంట ఒక్కసారే పైసలన్ని అప్పజేప్పి నవంటే మీ అమ్మ ఏ మందు మాకు లేకుండనే మునుపటోలె అయితది. అని నమ్మకంగా చెప్పింది.
*****
ఫోటో ఆర్ట్: రమేష్ పొతకనూరి
రావుల కిరణ్మయి .తల్లిదండ్రులు అనసుర్య పుల్లచారి గార్లు.జననం హుజురాబాద్ ,తెలంగాణ.తెలుగు భాషోపధ్యాయిని.70 వరకు కథలు.100కు పైగా కవితలు.చైతన్య గీతాలు,బాలగేయాలు,వ్యాసాలు,వివిధ పత్రికలలో ప్రచురితాలు.ఔధార్యం కథా సంపుటి.జీవశ్వాస నవల.వివిధ సాహితి సంస్థల తో బహుమానాలు.ప్రశంసలు.సమాజాన్ని చైతన్య పరిచేవిధంగా రచనలు చేయడం పట్ల చదవడం పట్ల ఆసక్తి.