నా అంతరంగ తరంగాలు-3
-మన్నెం శారద
ఒక ఆర్టిస్ట్ గా ఇది నా అక్కసో, బాధో అని మీరు అనుకోవచ్చు.
మా చిన్నతనంలో బొమ్మలు వేయాలంటే మాకు వడ్డాది పాపయ్యగారో, లేదా బాపు గారి బొమ్మలో శరణ్యమయ్యేయి. లేదా ఇంట్లో గోడలకి వున్న రవివర్మ పటాలు దిక్కయ్యేయి. వాటిని చూసే ప్రాక్టీస్ చేసే వాళ్ళం.
ఇప్పటిలా గూగుల్ లో వెదకి పట్టుకునే పరిస్థితి మాకు అప్పుడు లేదు. సినిమా తారల ఫోటోలు పత్రికల మీద అందుబాటులో వున్నా వాటిని వెయ్యడం నాకు నచ్చేది కాదు.
తీరా బాగా చిన్నతనంలో ఏదన్నా దొరక బుచ్చుకుని కష్టపడి వేసుకుంటుంటే కాకినాడలో వున్న మా మూడో మామయ్య చూసాడంటే అంతే సంగతులు!
“ఏంటి, బొమ్మలేస్తున్నావా.. ఇంటికి దరిద్రం పడుతుంది. “అంటూ సర్రున చింపేసే వాడు. కళ్ళనిండా నీళ్లు కుక్కుకుని అలాగే నిలబడి పోయేదాన్ని.
పిల్లల పాలిటి యముడు… ఈయన. వెయ్యి కళ్ళు పెట్టుకుని రంగూన్ నుండి మా తాతగారు తెచ్చిన వాలుకుర్చీలో కూర్చుని మా అందరి కదలికలూ కనిపెడుతుండే వాడు డిటేక్టీవ్ లా.
ఈయన ఒక్కరే పీచు వ్యాపారం చేస్తూ ప్రభుత్వ ఉద్యోగం చేయలేదు.
మిగతా ముగ్గురూ చదువుకుని మంచి జాబ్స్ చేసేవారు. అందుకే వాళ్ళు వేరే ఊళ్లలో ఉండి ఎప్పుడయినా వచ్చి పోతుండేవారు.
పక్కనున్న ఆవులదొడ్డి అని పిలవబడే (మా తాతగారి హయాంలో అందులో ఆవు లుండేయట. మాకు వూహ వచ్చేనాటికే అవేమీ లేవు ) దొడ్డిలో ఈయన వ్యాపారం. పెద్ద పాకలో పనివాళ్లు పీచు కట్టలు కడుతుండేవారు. అవన్నీ షిప్పులో ఇతర దేశాలకి తరలించేవారు.
చుట్టూ పళ్ళ మొక్కలు ఉండేవి. రక రకాల అంటు మామిడి చెట్లు, సపోటా జామ, మొదలైన మొక్కలతో చిలుకలు తిరుగుతుంటే భలే చూడ ముచ్చటగా ఉండేది ఆఁ దొడ్డి. కానీ, మా ఛండశాసన మామయ్య మమ్మల్ని ఎలవ్ చేసేవాడు కాదు.
మా వీధిలో అసలెవరూ నడిచే వారే కాదు. అన్నీ మా ఇళ్ళే. అయినా అయిదేళ్ల పిల్లలం, మాకూ బయటకొస్తే శిక్షలు వేసేసే వాడు. అందుకే కాకినాడ అంటే ఎంత ఇష్టమో ఈయనంటే అంత విముఖత!
“అమ్మా, బొమ్మలు వేస్తే ఎందుకు దరిద్రం?” అని అమ్మని అడిగాను.
“ఎవరన్నారు? “
మావయ్య. కష్టపడి వేస్తే చింపేసాడు “అన్నాను కన్నీళ్లతో.
“ఏదో అంటాడులే, అయినా ఎప్పుడూ నీకదే పిచ్చి.. మన ఊరేళ్ళాక వేసుకో వచ్చులే “అంది చిరాగ్గా.
మా అమ్మకు ఈ అన్నగారంటే చాలా ఇష్టం. మాట పడనివ్వదు. తర్వాత చాలా మందిని అడిగి చూసినా నాకెవరూ సరయిన జవాబు చెప్పలేక పోయారు.
అసలు ప్రశ్నించడానికి హక్కులేని ఆడపిల్లలం మేము.
చివరకు మెల్లిగా ఒకసారి పెదనాన్న నడిగితే నవ్వి “రవివర్మ, రవీంద్రనాథ్ ఠాకూర్ … వీళ్లంతా జమిందార్లు.. వారు హాబీగా బొమ్మలు వేసుకునేవారు. సామాన్య మైన ఆర్టిస్టులు బొమ్మలు వేసుకోవడంలో లీనమయితే ఇంటిని పట్టించుకోరు. మరో పని చెయ్యరు. దానితో సంపాదన వుండదు. అందుకని ఆలా అంటుంటారు. ఇప్పుడలా కాదులే ” అని చెప్పారు.
తర్వాత రోజుల్లో నేను నాగార్జునసాగర్ హై స్కూల్ లో చదివేటప్పుడు మాకు సత్య వర్మ అనే డ్రాయింగ్ మాష్టారుగారు ఉండేవారు. ఆయనది రాజస్థాన్.
ఆయన కూడ నాకు డ్రాయింగ్ నేర్పిస్తానంటే మా వాళ్ళు ఒప్పుకో లేదు. ఆయనకి అక్కడ ఉండగానే పెళ్లయింది. ఆమె కూడా అందంగా ఉండేది. కొంత కాలం చాలా బాగుండేవారు. తర్వాత మాష్టారు గడ్డం పెంచుకుని ఎప్పుడూ బొమ్మలు వేసుకుంటూ కూర్చొని ఉండేవారు. ఆమె ఒంటరిగా దిగులుగా కూర్చుని ఉండేది. అప్పుడు కొంచెం పరిస్థితులు అర్ధమయ్యేయి.
మా చిన్నప్పుడు బ్రిటానియా బిస్కెట్స్ కేలండర్ మీద జేపీ సింఘాల్ వేసిన పెయింటింగ్స్ చాలా అపురూపంగా ఉండేవి దాని కోసం తెగ ప్రయత్నించే వాళ్ళం. ఫ్రెండ్స్ కూడా ఎక్కడ అందమైన పెయింటింగ్స్ దొరికినా మాకు తెచ్చి ఇచ్చేవారు.
ఒక సారి ఒక అందమైన అమ్మాయి నీళ్లలో తడిసి చెట్టు పట్టుకుని నిలబడ్డ బొమ్మని సింఘాల్ వేశారు.
ఆఁ బొమ్మ చూసి ఎలాగయినా ఆఁ బొమ్మ వేయాలని అనుకున్నా నేను. అయితే ఏ టెక్నాలజీ తెలియదు నాకు. చిత్రకారులందరూ ఏది ఛాలెంజ్ గా భావిస్తారో నాకు తెలియదు కానీ తడిసిన బట్టలతో వేయగల్గడం ఒక ఆర్టిస్ట్ కి ఛాలెంజ్ అనుకున్నా నేను!
ఆఁ కేలండర్ హాల్లో తగిలించి నప్పుడల్లా మా నాన్నగారు చుట్టి లోపల పడేసేవారు.
ఎందుకో అర్ధం కాక మేము మళ్ళీ తగిలించేవాళ్ళం.
చివరికి అర్ధమయ్యి నేను దానికి బ్లౌజ్ వేసి తగిలించాక ఆయన ఊరుకున్నారు. విషయం అర్ధమయ్యాక నేను చాలా ఫీల్ అయ్యాను.
ఒక ఆర్ట్ పీస్ ని కూడా ఇలా చూడటం నాకు నచ్చలేదు. అర్జునుడు విలువిద్య నేర్చుకునేటప్పుడు ‘మనద్రుష్టి లక్ష్యం మీదనే ఉండాలి ‘ అని ద్రోణాచార్యులు చెప్పడం గుర్తొచ్చింది.
చివరికి ఆఁ బొమ్మ కష్టపడి వేసాను. చాలా బాగా కుదిరింది. చెన్నై లో వున్న మా మణక్క అడిగితే తనకి ఇచ్చేసాను.
1984 లో నేను వాసిరెడ్డి సీతాదేవి గారితో కలిసి మద్రాస్ లో అప్పుడు జరిగిన తెలుగు మహాసభలకు వెళ్ళాను. చెన్నై నాకు కొత్తది కాదు. అక్కా వాళ్ళు హబీబుల్లా రోడ్డులో ఇల్లు కట్టుకునే వరకు నుంగంబాకంలో అద్దె ఇంట్లో ఉండేవారు.
మేం సీతాదేవి గారి ఫ్రెండ్ పందిరి మల్లికార్జునరావు గారి అమ్మాయి ప్రమీల గారని గుర్తు… వాళ్ళింట్లో దిగేము. సీతా దేవి గారు అస్తమా వల్ల త్వరగా నిద్ర లేచేవారు కాదు.
నేను ఏమీ తోచక క్రిందకు వచ్చి తిరుగుతుంటే ఆఁ ఏరియా తెలిసిన దానిలా అనిపించి ముందుకు నడిచాను.
అది కుమారప్పా ముదలి స్ట్రీట్. తిరుమూర్తినగర్ లో అక్కా వాళ్ళు అద్దెకున్న ఓనర్ గారు ఉండేది అక్కడే. ఉత్సాహంగా చూసుకుంటూ ముందుకు నడిచాను.
ఆశ్చర్యంగా ఆవిడ ఇల్లు ఏ మాత్రం మార్పులు లేకుండా అలానే వుంది. వెంటనే పైకి వెళ్లాను. మెట్ల ఎదురుగానే నేను వేసిన బొమ్మ స్వాగతం పలికింది.
తెల్లబోవడం నా వంతయ్యింది. ఆమె చాలా సంతోషంగా నన్ను ఆహ్వానిస్తూ ఆఁ బొమ్మ వైపు నా వైపు గిల్టీగా చూసి “మాణిమాల కొత్త ఇంట్లోకి వెళ్తూ ఈ పెయింటింగ్ నాకు ఇచ్చారు “అని చెప్పారు.
“థాంక్స్ మీరు భద్రంగా ఉంచుకున్నందుకు ” అన్నాను.
కానీ దానిమీద నా పేరు చెరిపి వాళ్ళ రెండో అమ్మాయి పేరెందుకు రాసేరు “అని మాత్రం అడగలేక పోయాను. ఎక్కడో ఒక చోట నా పెయింటింగ్ జాగ్రత్తగా ఉందని మాత్రం సంతోషించాను.
కొన్నాళ్ల క్రితం నేను అహల్య బొమ్మ వేస్తే కొందరు చాలా గొడవ చేశారు. ఏం చెప్ప గలను.. ఆ నాటి త్రేతాయుగంలో అప్పుడు నార చీరలు మాత్రమే ధరించే వారని… రవికలు లేవని వారికి మాత్రం తెలియదా???
ఏదయినా చూసే దృష్టిలో ఉంటుందని. రవి వర్మ, బాపు, వడ్డాది గారి బొమ్మల్ని ఎలా వేసినా పొగిడే వారికి ఒక స్త్రీ ఆర్టిస్ట్ పట్ల వున్న వివక్షకు మాత్రం చాలా బాధ పడ్డాను. ఒక స్త్రీగా నాకు నా హద్దులు తెలుసు. వారి చూపులకి, ఆలోచనలకు నేను జవాబు దారిని కాదుకదా!
*****
(సశేషం)
నా పదహారవ ఏటనుండి కథలు రాస్తున్నాను. నా మొదటి మూడు నవలకి బహుమతులు వచ్చాయి. అనేక కథలు బహుమతులు అందుకున్నాయి. రెండుసార్లు నంది అవార్డ్స్ అందుకున్నాను. తెలుగు యూనివర్సిటీ నుండి ఉత్తమ రచయిత్రి అవార్డు అందుకున్నాను. నంది అవార్డ్స్ కమిటీ లో రెండుసార్లు పనిచేసాను. The week Magazaine నన్ను Lady with golden pen గా ప్రశంసించింది. దాదాపు వెయ్యి కథలు, 45 నవలలు రాసాను. చిత్రకళ నా హాబీ.
ఈ భాగం చదివి రెండు ఆశ్చర్యకరమైన కొత్త విషయాలు తెలుసుకున్నానక్కా. మొదటిది సాహిత్యచౌర్యమే కాకుండా ఆర్ట్ ని కూడా దొంగిలిస్తారా.. ఆర్ట్ కింద ఒకరి పేరు చెరిపేసి వాళ్ళ పేరు రాసుకుంటారా. అసలు మనస్సాక్షి అంటూ వుండదా…? ఇక రెండోది ఆర్టిస్ట్ లలో కూడా స్త్రీ పురుష వివక్ష వుంటుందా.. స్త్రీలు నిండుగా గుడ్డలు కప్పుకోవటమే కాకుండా వారు గీసే బొమ్మలకు కూడా నిండా బట్టలుండాలా… రవిక లేని అహల్యను పురుష ఆర్టిస్ట్ మాత్రమే వేయాలా… My goodness… ఒక రచయిత్రిగా, కళాకారిణిగా ఎంత వివక్ష ఎదుర్కొన్నారు మీరు. మీ జీవితానుభవాలు చక్కని జీవితపాఠాలు.
ఇందులో రెండు చాలా ఆశ్చర్యకరమైన విషయాలు తెలిసాయక్కా. మొదటిది ఆర్ట్ చౌర్యం.
కథలు, కవితలు..సాహిత్యచౌర్యం గురించి విన్నాను గాని ఇలా ఆర్ట్ కింద పేరు చెరిపేసి వాళ్ళ పేరు రాసుకున్న ఆర్టిస్ట్ గురించి మొదటిసారి వింటున్నా… కొందరికి మనస్సాక్షి అంటూ వుండదు. ఇక రెండోది స్త్రీ పురుష వివక్ష ఆఖరికి బొమ్మలు వేసేవారిలో కూడానా… కళను కళాత్మక దృష్టితో చూడలేకపోవటం ఎంత దౌర్భాగ్యం..! అయితే నిండు బట్టలతో తప్ప లేడీ ఆర్టిస్ట్ లు బొమ్మలు వేయకూడదన్నమాట. రవిక లేని అహల్యను మగ ఆర్టిస్ట్ మాత్రమే వేయాలన్న మాట…కళాకారిణిగా, రచయిత్రిగా జీవితంలో ఎంత వివక్షను ఎదుర్కొన్నారు… మీ జీవితానుభవాల నుండి ఎన్ని జీవితపాఠాలు నేర్చుకోవచ్చో కదా… Looking forward to read your next episode❤️