ఎవర్నీ నమ్మలేం

-కందేపి రాణి ప్రసాద్

          సోనీ, రాకీ స్కూలుకు తయారవుతున్నారు. సోనీ మూడవ తరగతి చదువుతున్నది. రాకీ ఒకటో తరగతి చదువుతున్నాడు. రోజూ స్కూలు బస్సు వచ్చి తీసుకెళ్తుంది. ఆ సందు చివర వరకు స్కూల్ బస్సు వస్తుంది. సందు చివర దాకా అమ్మ నళిని వెళ్ళి ఎక్కించి వస్తుంది.
 
          నళిని రోజూ ఉదయమే పేపర్ చదువుతుంది. అందులో విషయాలు చదివి భయ పడుతుంది. అందులోను పిల్లల కిడ్నాపుల గురించి చదివినా, విన్నా వణికిపోతుంది. అవన్నీ పూసగుచ్చినట్లు ప్రకాష్ కు చెప్పి భయపడుతుంది. చాలా జాగ్రత్తలు తీసుకోవా లని ఆలోచిస్తుంది.
 
          నళిని పిల్లలకు రోజూ బోలెడు జాగ్రత్తలు చెపుతుంది. ఎవరైనా ఆహార పదార్థాలు ఇస్తే తినకూడదనీ, కొత్తవాళ్ళు మాట్లాడిస్తే మాట్లాడకూడదనీ, మీ అమ్మా, నాన్నా పిలుస్తున్నారని పిలిస్తే వెళ్లకూడదనీ ఎన్నో జాగ్రత్తలు చెప్తుంది. ఒకటికి వందసార్లు చెప్పిన విషయాలే చెప్తుంది. పిల్లలు ఈ జాగ్రత్తలు బాగా వినేవాళ్ళు, బుద్ధిగా తల ఊపి వెళ్ళేవాళ్ళు.
 
          ఒకరోజు బస్సు రిపేరుకు వెళ్ళింది. స్కూలు యాజమాన్యం ఎవరికి వాళ్ళనే స్కూలు కు రమ్మన్నారు. ఆ రోజు నళిని పిల్లల్ని స్కూలు దగ్గర వదిలి పెట్టమని ప్రకాష్ కు చెప్పింది. ప్రకాష్ పిల్లల్ని స్కూలు దగ్గర దింపి ఆఫీసుకు వెళ్ళిపోయాడు. సాయంత్రం కూడా పిల్లల్ని ఇంటికి తెమ్మని నళిని ఫోన్  చేసి చెప్పింది. ప్రకాష్ స్కూలు దగ్గరకు వెళ్ళాడు. పిల్లల్ని తీసుకుని బయల్దేరబోయెంతలో ఆఫీసు నుండి ఫోన్ వచ్చింది. ఏదో అర్జంటుగా ఆఫీసుకు రమ్మని ఫోన్ చేసారు. ఏం చేయాలా అనుకున్నాడు ప్రకాష్. ఒక ఆటోను పిలిచాడు. పిల్లల్ని జాగ్రత్తగా ఆటో ఎక్కించాడు. ఆటో డ్రైవరు పేరు, ఫోన్ నంబర్ తీసుకున్నాడు. ఆటో నంబరు కూడా రాసుకున్నాడు. అడ్రస్ చెప్పి ఇంటి దగ్గర దింప మని చెప్పాడు.
 
          ప్రకాష్ పిల్లలతో సోనీ, రాకీ నేను మరల ఆఫీసుకు వేళ్ళాలిరా, కాబట్టి మీరు ఇంటికి వెళ్ళిపొండి జాగ్రత్తగా వెళ్ళండి. ఇంటి దగ్గర అమ్మ ఎదురు చూస్తూంటుంది అని పిల్లలకి నచ్చచెప్పి తను బండి స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోయాడు.
 
          ఆటో బయల్దేరింది. పిల్లలు భయంభయంగా ఆటోలో కూర్చున్నారు. పరిసరాలను గమనిస్తూ కూర్చున్నారు. స్కూలు దగ్గర ఆటో ఆగినప్పుడు బొమ్మలమ్ముకునేముసలావిడ ఆటో దగ్గరగా వచ్చింది. బొమ్మలు కావాలా బాబూ! అంటూ అడిగింది. పిల్లలు భయంతో ఏయ్ దూరంగా పో మాకు బొమ్మలు వద్దు అంటూ అటువైపుకు జరిగిపోయారు.
 
          కొద్ది దూరం పోయాక ఆటోడ్రైవరు పిల్లల్ని చూశాడు. భయంగా జితుకు జితుకు మంటూ కూర్చున్న పిల్లల్ని చూసి జాలిపడ్డాడు. తన కూతురి కోసం కొన్న చాక్లెట్లు పిల్లలకు ఇవ్వాలనుకున్నాడు. “పాపా, బాబూ ఇదిగో చాక్లెట్లు తినండి” అంటూ ఎంతో ప్రేమగా ఇచ్చాడు. పిల్లలు వాటిని తీసుకుంటూనే బయటకు విసిరి పారేసారు.దీన్నిఆటో డ్రైవరు గమనించలేదు. ఎదురుగా వస్తున్న వాహనాలను తప్పించుకునే పనిలో ఉన్నాడు.
 
          ఇంకొద్దిగా ముందుకు వెళ్ళాక ఆటో ఒక సందులోకి వెళ్ళింది. పిల్లలకు తమ ఇంటి దారి తెలుసు. నళిని ఎన్నోసార్లు రోడ్ల గురించి చెప్పింది. మన ఇంటిదారి కాకుండా వేరే దారిలోకి వెళ్ళి పిలల్ని అమ్మేస్తారు అని ఎన్నోసార్లు ఇంట్లో ఉన్నప్పుడు చెప్పింది. “ఒరే రాకీ వేరే రోడ్డులో తీసుకెళ్తున్నాడేమిట్రా” అని సోనీ అడిగింది. చిన్నోడు కదా వాడికేమి తెలుసు ‘ఏమో అక్కా’ అన్నాడు భయంగా. సోనీ బాగా ఆలోచించింది.
 
          ఆటో స్పీడు పెరిగింది. సోనీకి అనుమానం బలపడింది. ఆటోడ్రైవరు తమను కిడ్నాప్ చేస్తున్నాడు అని ఉహించింది. తమ్ముడు రాకీ చెవిలో ఏదో చెప్పింది. వాడు ఓకే అక్కా అన్నాడు. ఇద్దరూ ఒక మాట అనుకుని సమయం కోసం వేచి చూస్తున్నారు. నళిని అర్జంటుగా ఫోన్ చేయడంతో ప్రకాష్ గబగబా ఇంటికొచ్చాడు. హాల్లో సోఫా మీద పిల్లలిద్దరూ కనిపించారు. హమ్మయ్య అని ఊపిరి పీల్చుకుంటూ దారి వంక చూశాడు. కాళ్ళు చేతులు కొట్టుకుపోయి, తోలు లేచిపోయి, కొద్దిగా రక్తం వస్తున్నది. ‘ఏమైంది’ అని భార్యను అడిగాడు.
 
          మీ పిల్లలు ఈ రోజు పెద్ద సాహాసం చేసారు. ఆటోడ్రైవరు మెయిన్ రోడ్డు మీద ట్రాఫిక్ ఎక్కువగా ఉందని సందులోకి తిప్పాడట. వీళ్ళు భయపడ్డారు. సందులో ఎవరూ అడ్డు రాకపోవడంతో స్పీడుగా నడిపాడట. దాంతో పిల్లలకు అనుమానం ఎక్కువైంది. ఆటో డ్రైవరు కిడ్నాప్ చేస్తున్నాడని భయపడి ఇద్దరు ఒక ఆలోచన చేశారట. మూల మలుపు దగ్గర ఆటో స్లో అవుతుంది కదా అక్కడ ఆటోలో నుంచి దూకేయాలని నిశ్చయించుకున్నారట. ఇదీ ఫలితం అని నళిని నవ్వుతూ చెప్పింది.
 
          ‘మరి వీళ్ళను ఎవరు ఇంటికి తీసుకువచ్చారు’. పూర్తిగా అర్థం అయ్యీ కాక అయోమయంగా అడిగాడు ప్రకాష్.
 
          ఇంకెవరు ? ఆటో డ్రైవరే మరల ఆటోలో కూర్చోబెట్టుకుని తీసుకువచ్చాడు. దెబ్బలు తగిలాకా ఏమి చేయలేక ఆటోలో అలాగే కూర్చున్నారు “చాలా తెలివిగా చేశారు కదండీ” అడిగింది కళ్ళు తిప్పుతూ నళిని.
 
          అసలు నీ వల్లనే వచ్చిందే ఇదంతా. ప్రతిరోజూ పిల్లల్ని భయపెడుతూ కథలు చెబుతావు. ఎక్కడెక్కడో జరిగిన విషయాలన్నీ పిల్లల చిన్న మెదళ్ళలో కూరేస్తావు. వాళ్ళు ప్రతిదాన్నీ అనుమానంగా చూస్తున్నారు. ప్రతివాళ్ళనీ దొంగలనే అనుకుంటున్నారు. ఇదంతా నీ అనుమానపు జబ్బు వాళ్ల కంటించడం వలనే ఇలా జరిగింది. అని బాధగా తల పట్టుకుని సోఫాలో కూలబడ్డాడు ప్రకాష్.
 
          నేనేం చేశాను. రోజూ టీవిలో, పేపర్లలో చూడటం లేదా ఎలాంటి సంఘటనలు జరుగుతున్నాయో! అందుకే వాళ్ళను ముందుగా హెచ్చరించాలనుకున్నాను. నా తప్పే ముంది అంటూ నళిని రోషంగా అడిగింది.
 
          అప్పుడే పక్కింట్లోని బామ్మగారు పిల్లల్ని చూసేందుకు వచ్చారు. వీళ్ళిద్దరి గొడవను విన్నారు. నువ్వు ఇలాంటి విషయాలు వాళ్ళ లేత మెదళ్ళకు ఎక్కించకూడదమ్మా. మనమే జాగ్రత్తపడాలి. ఇంకా ఎవరు మంచి, ఎవరు చెడు అనే విషయాలను మనతో తీసుకువెళ్తూ పిల్లలకు తెలియజేయాలి. ఇప్పుడున్న బిజీ లైఫులో అందరూ ఇలాగే సతమతమవుతున్నారు. ఈ కాలంలో మీకు చదువు డబ్బు అన్ని ఉన్నాయి గానీ మానసిక ప్రశాంతత కొరవడింది ఏం చేస్తాం దీనికి విరుగుడు వస్తుంది చూద్దాం !
 
          అలాగే ప్రకాష్ , “తల్లిగా నళిని జాగ్రత్త పడటంలో కూడా తప్పు లేదు కాకపోతే డోస్ ఎక్కువైంది అంతే” అంటూ నిట్టూరుస్తూ వెళ్లిపోయింది బామ్మగారు.

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.