వీమా

(వంగూరి ఫౌండేషన్ 2023 ఉగాది ఉత్తమ రచనల పోటీలో అత్యుత్తమ కథగా బహుమతి పొందిన కథ) (కౌముది ఏప్రిల్ 2023 ప్రచురణ)

-డా.కె.గీత

          ఆఫీసు నించి వస్తూనే ఉయాల్లోంచి పాపని ఒళ్ళోకి తీసుకుని తల, చెవులు  నిమురుతూ తనలో తాను గొణుక్కుంటున్నట్లు ఏదో అనసాగేడు సాగర్. 

          “అదేవిటి బట్టలు కూడా మార్చుకోకుండా…. ఇంకా ఏదో అనబోతూ గది గుమ్మం దగ్గిరే ఆగిపోయేను.  నా వైపు చూడకపోయినా సాగర్ ముఖంలోని మెలితిప్పుతున్న  బాధ గొంతులో వినిపించి వెనకడుగు వేసేను. 

          “తగ్గిపోతుందిరా కన్నా… నా బంగారు తల్లీ…. నీకు ఏమీ కాలేదురా….” ఇంకా గొణుగు తూనే ఉన్నాడు. 

          పాపాయికి ఏదో అర్థమైనట్టు చిన్ని కళ్ళని తెరిచి చూసి, మళ్ళీ కళ్ళుమూసుకుంది. 
“క్రోమోజోము రిపోర్టు వచ్చిందా?” ఆత్రంగా భుజమ్మీద చెయ్యి వేసి అడిగాను. 

          మంచమ్మీద పాపాయిని జాగ్రత్తగా పడుకోబెట్టి దగ్గరకు జరిగి నిస్త్రాణగా పడుకుని కళ్ళుమూసుకున్నాడు. 

          తల మీద చెయ్యివేసి “హాస్పిటల్ కి ఫోను చేసావా? ఏమన్నారు డాక్టర్?” అన్నాను మెల్లగా భయంగా. 

          నా గొంతు తడారిపోయింది. భయంతో కాళ్ళు వణకసాగేయి. పక్కనే టీ పాయ్ మీద  రిపోర్టు కవరు తీసి చూసేను. దాదాపు పది, పన్నెండు కాగితాల నిండా మా ముగ్గురి క్రోమోజోము రిపోర్టులు బొమ్మలతో సహా.  ఏవేవో వివరాలు. నాకేమీ అర్థం కాలేదు. 

          ఇంతలో ఫోను మోగింది. అట్నుంచి హాస్పిటల్ అపాయింట్మెంట్లు చూసే నర్సు. 
పాపాయి లేస్తుందేమోనని హాల్లోకి వచ్చి మెల్లగా “హలో” అన్నాను.

          “మీ పాపకి “డౌన్ సిండ్రోమ్” అని క్రోమోజోము టెస్టులో “కన్ఫర్మ్” అయ్యింది. మీ ఇద్దరితో డాక్టరు మాట్లాడాలి. రేపు మధ్యాహ్నం కుదురుతుందా?”   

          ఎలాగో గొంతు పెగుల్చుకుని “సరే” అన్నాను. 

          అత్తయ్య మా అపార్ట్ మెంటు  కాంప్లెక్సులోనే ఉన్న ఫ్రెండు కూతురు ఇంటికి వెళ్ళింది. లేకపోతే నా గొంతులో దుఃఖాన్ని వెంటనే కనిపెట్టేసి ఉండేది. 

          ఫోను పెట్టేసి సాగర్ దగ్గిరికెళ్ళగానే  నన్ను కౌగలించుకుని చిన్నపిల్లాడిలా ఏడవ సాగేడు. 

          “మనకే ఎందుకిలా జరిగిందిరా….”  

          నిస్సహాయంగా తనని చుట్టుకున్నాను. అతని భుజం నా కన్నీళ్లతో తడవసాగింది. 
జీవితంలో ఇప్పటి వరకు ఇంత బాధ ఎప్పుడూ కలగలేదు. మేమిద్దరం కలిసి దుఃఖ పడిన సందర్భం అయితే ఇప్పటిదాకా ఒక్కటీ లేదు. మేం ఒక్కళ్లనొకళ్ళం ఓదార్చు కుంటూ, దుఃఖపడుతూ… ఎంతసేపయ్యిందో తెలియలేదు. అత్తయ్య కాలింగ్ బెల్లు కొట్టేసరికి గబుక్కున సింకు దగ్గిరికి పరుగెత్తి ముఖాన నీళ్లు చిలకరించుకున్నాను. 

          “సాగర్  నిద్రపోతున్నాడా? ఇదుగో పాపకి, సాగర్ కి ఈ బాబా విభూది పెట్టు. మాలతి ఇచ్చింది”

          ఆవిడ మాటలు వినబడనట్టు మళ్ళీ బాత్రూములోకి వెళ్లి తలుపేసుకున్నాను. 
“ఊ…”  నా వెనకే ఈసడింపుగా నిట్టూర్చడం వినిపించింది. 

          ఏడ్చి ఏడ్చి కందిన ముఖాన కాస్త పౌడరు పూసుకున్నాను. నాకు ముప్పయయిదేళ్లు అంటే నమ్మరు ఎవరూ అత్తయ్య తప్ప. వాళ్ళబ్బాయి కంటే నేనే పెద్దదానిలా ఉంటానని ఎందరి దగ్గిరో అనడం నా చెవిన పడదని ఆవిడ నమ్మకం. అది ఆవిడకి ఆనందమైనా అద్దం ముందు నిలబడ్డప్పుడల్లా మనసులో గుచ్చుకుంటూ ఉంటుంది నాకు.  

          “వయసు మీరి కంటే ఇలాంటి పిల్లలే పుడతారు మరి. మా రోజుల్లో పాతికేళ్లకే పురుళ్ళు, పుణ్యాలు అయిపోయేవి” ఆ మధ్య ఎప్పుడో టీవీలో ఇలాంటిదేదో చూసి ఆవిడన్న మాటలు చప్పున గుర్తుకు వచ్చాయి నాకు. 

          “ఈ విషయం ఎట్టి పరిస్థితుల్లోనూ ఈవిడకి తెలియనివ్వకూడదు. మరో పదిహేను రోజుల్లో ఈవిడ రిటన్ ఫ్లైటు ఎక్కేవరకూ ఎలాగో ఓపిక పట్టాలి”  దృఢంగా  నిశ్చయించు కున్నాను. 

          “వాణ్ణి లేపి కాస్త భోజనం పెట్టు. పొద్దుట లేచిన దగ్గరి నుంచీ యంత్రంలాగా పని చేస్తూనే ఉంటాడు.  మధ్యాహ్నం ఎప్పుడు తిన్నాడో ఏమో. అన్నీ చెప్పాలి ఈవిడకి.”  సణుగుతూ నిద్రకుపక్రమించింది అత్తయ్య. 

          నాన్నకి హై బీ. పీ తో అనుకోకుండా కాంప్లికేషన్స్ వచ్చేసరికి అమ్మ డెలివరీకి రాలేక పోయింది. అత్తయ్య వచ్చినా పెద్ద ఉపయోగం ఉండదని తెలిసినా పెద్దవాళ్ళు ఎవరో ఒకరు ఉండాల్సిందేనన్న సాగర్ బలవంతమ్మీద ఒప్పుకున్నాను. 

          అసలే రాకరాక వచ్చిన గర్భం. మూడేళ్ళుగా అన్ని రకాలుగా ప్రయత్నించి చివరికి ఆరు నెలల పాటు ఐవీఎఫ్ చెయ్యగా ఫలించింది.  

          నాలుగో నెల నిండుతూ ఉండగా డాక్టరు “ఆమ్నియోసింటసిస్ (amniocentesis) డయాగ్నస్టిక్ టెస్టు చేయించుకుంటావా” అని అడిగింది. 

          ప్రశ్నార్థకంగా చూస్తున్న నన్ను  చూస్తూ  “భయపడాల్సింది ఏమీ లేదు. ఒకవయసు వచ్చిన గర్భిణీలకు రొటీన్ గా చేస్తాం. అయినా ఇది ఆప్షనల్ మాత్రమే. ఇందులో బేబీకి ఏదైనా జెనిటిక్ కాంప్లికేషను ఉంటే తెలుస్తుంది. కానీ దీని వల్ల నొప్పి, అబార్షన్ కావడం వంటి రిస్కులు కూడా ఉంటాయి. మీకు ఇష్టమైతేనే” అంది. 

          “ఒకవేళ బేబీకి కాంప్లికేషను ఉంటే మాత్రం ఏం చేస్తాం డాక్టర్ ” అన్నాను అప్పటికే మూణ్ణాలుగు రోజులుగా బుడుగు బుడుగుమని కదులుతున్న కడుపులోని బిడ్డని అపురూపంగా తడుముకుంటూ. ఆ ఆలోచనకే కడుపులో దేవసాగింది.  

          “టెస్టు వద్దు సాగర్”  దృఢంగా అన్నాను బయటికి వచ్చేక.  ప్రెగ్నెన్సీ నెలనెలా ఒక్కొక్క రకమైన అనుభవం. మొదటి మూణ్నెల్లు వికారం, వాంతులతో లేవలేకపోయే దాన్ని. ఏమీ సహించేది కాదు. ఇక బిడ్డ కదలిక మొదలయ్యిన దగ్గరనించి అసలు నిద్ర పట్టేదే కాదు. చివరి నెలల్లో మరీను. ఇక డెలివరీ అంటే ఎంత భయం వేసేదో. డాక్టరుని ఎన్నో ప్రశ్నలు వేసి విసిగించేదాన్ని. అసలు ఏ చిన్న నొప్పి అనిపించినా డెలివరీ నొప్పి ఇదేనేమో అని సాగర్ కి, హాస్పిటలుకి ఫోను చేసేదాన్ని. వాళ్ళు ‘ఎంతసేపు నొప్పి ఉంది? ఇంకా ఏమేం సింటమ్స్ ఉన్నాయి?’ అని లక్ష ప్రశ్నలు వేసి ఇంకా సమయం ఉంది అని తేల్చేవారు. 

          డాక్టరు ఇచ్చిన డెలివరీ డేటుకి  వారం ఉందనగా కారు సీటు ట్రైనింగుకి అప్పాయింటుమెంటు దొరికింది మాకు. డెలివరీ అయ్యి ఆసుపత్రి నించి ఇంటికి వచ్చేటపుడే బేబీని కారు సీట్లో ఎలా కూచోబెట్టాలో, బెల్టులు ఎలా పెట్టాలో, అసలు చిల్డ్రన్ కారు సీటు ఏ దిశగా అమర్చాలో ఇచ్చే ట్రైనింగు అది. 

          పొద్దున్నే ఇంటి నించి బయలుదేరి పది మైళ్ళ అవతల ఉన్న  ట్రైనింగు ఏరియాకి వెళ్లాం. సరిగ్గా ట్రైనింగు మధ్యలో ఉండగా చిక్కని నీరు వంటిది ఏదో పోతున్నట్టు అర్థం కాసాగింది. నిలబడలేక ట్రైనర్ కి విషయం చెప్పగానే నిమిషం ఆలస్యం చెయ్యకుండా హాస్పిటలుకి తిన్నగా వెళ్ళిపోమని హడావిడిగా పంపేశాడు. 

          ఆఘమేఘాల మీద హాస్పిటలుకి వెళ్లాం. తీరా వెళ్ళగానే ఇదేదో చాలా మామూ లన్నట్లు స్థిమితంగా జాయిను చేసుకుని టెస్టులేవేవో చేసి, పాపాయి అడ్డంతిరిగి
ఉంది కాబట్టి  సిజేరియన్ చెయ్యాలని చెప్పారు. మామూలుగా అసలు సిజేరియన్ లు చెయ్యడం అన్నది అమెరికాలో చాలా అరుదట.  

          ఆపరేషన్ అంటే చాలా భయం వేసింది కానీ నొప్పి తెలియకుండా ఇచ్చిన సెడేషన్ వల్ల, సాగర్ నా తల దగ్గర కూర్చుని, నుదుటి మీద తన చెయ్యి వేసి ఉంచడం వల్ల ధైర్యంగా ఉండగలిగేను. నిజానికి డెలివరీ అంటే  ఇంత సులభమా అనిపించింది. 
ఆపరేషన్ థియేటర్ లోకి ఇలా తీసుకువెళ్లి అలా అరగంటలో పాపనిచ్చి రూముకి పంపే సారు.  అంత మత్తులోనూ పాపని చూసిన అద్భుతమైన మొదటి క్షణాన్ని, వెలిగిపోతున్న సాగర్ మొహంలోని సంతోషాన్ని ఇంకా మర్చిపోలేను. 

          నొప్పి తెలియకుండా ఇచ్చిన మందుల వల్ల మూడో రోజే చాలా సులభంగా లేచి నా అంతట నేను బాత్రూముకి వెళ్లగలిగేను. పుట్టగానే పాపకి పాలు ఎలా పెట్టాలో నర్సు వచ్చి నేర్పించింది. అయినా నాకు అసలు పాలు ఎలా పట్టాలో, పిల్ల అందుకుంటుందో లేదో అని కంగారు పుట్టింది. అయితే ఎంతో విచిత్రంగా నర్సు పాపని నా దగ్గిరికి తీసుకురాగానే
అందుకోసమే ఎప్పటినించో అలమటిస్తున్నట్లు కండంతా నోట్లోకి ఇముడ్చుకుని ఆదరా బాదరా చీకసాగింది పాప. నాకు నవ్వూ, కండరంలో చిన్న నొప్పి ఒక్కసారి వచ్చేయి.  అయినా ఎంతో మాధుర్యంగా, అపురూపంగా అనిపించింది.

          గుండెలోని ప్రేమని అందిస్తున్న అత్యంత మాధుర్యమైన అనుభూతి అది. నాలుగో రోజు హాస్పిటల్ నించి డిశ్చార్జి చేస్తామనగానే సంతోషం వేసింది. 

          సాగర్ బెలూన్లు కొనుక్కొచ్చాడు. రోజూ వచ్చినట్టే రౌండ్స్ కి వచ్చిన డాక్టరుతో మరో స్పెషలిస్టు వచ్చాడు ఈ సారి. పాపాయిని అటూ ఇటూ తిప్పి పరిశీలించారు ఇద్దరూ. చిన్న చిన్న చీపి కళ్ళు, చిన్న చెవులు, వెనక చిన్నగా ఉబ్బినట్లున్న మెడని తడుముతూ “ఎందుకైనా మంచిది. పాపాయికి క్రోమోజోము టెస్టు చేయించండి.” అన్నాడు స్పెషలిస్టు. 

          “ఏదైనా ప్రాబ్లమా డాక్టర్” అంటూ వెనకే వెళ్ళాడు సాగర్. 

          “అట్నుంచి వస్తూనే ఏమీ లేదులేరా. ఈ డాక్టర్లు అవసరం ఉన్నా లేకపోయినా ఏదో ఒకటి చెప్పి భయపెడతారు” అని తేలికగా నవ్వేవరకు నాకు టెన్షను ఆగలేదు. 

          “డాక్టర్లు ఎందుకు చెప్పారో ఏమో.  వాళ్ళు చెప్పినట్టే పాపకి క్రోమోజోమ్ టెస్టు చేయిద్దాం సాగర్. ఒక శంక తీరిపోతుందిగా. అయినా వెల్ బేబీ చెకప్ కి ఎలాగూ నెల్లాళ్ళ లో మళ్ళీ హాస్పిటల్ కి రావాల్సి ఉందిగా” అన్నాను నా చిటికెన వేలుని గట్టిగా పట్టుకుని ముద్దులొలుకుతున్న చిన్నారి పాపని హత్తుకుంటూ. 

          “అది సరే లేరా. ఇవేళ మధ్యాహ్నం డిశ్చార్జి  అయ్యేలోగా బర్త్ సర్టిఫికేటు అప్లికేషను కోసం మనం పేరు చెప్పాలట. నువ్వనుకున్నటు “రీమా” అని పెడదాం సుమా.అన్నాడు సాగర్ నవ్వుతూ. 

          గుండ్రని చందమామ లాంటి ముఖం, పెద్ద పెద్ద బుగ్గలు, ఒత్తు జుట్టు. “బంగారు తల్లికి ఏ లోపం లేకుండా చూడు భగవంతుడా!” మనసారా ప్రార్థిస్తూ, తల ఊపుతూ

          “ఏమ్మా నీకూ సరేనా” అన్నాను పాపాయితో. 

          పేరు నచ్చిందో లేదో కానీ, నా మొర ఆలకించినట్టు కొద్దిగా కళ్ళు తెరిచి నాకేసి చూసింది పాపాయి. ఇంటికి వెళ్ళగానే అత్తయ్య గుమ్మంలోనే దిష్టి తీసింది. హాల్లోకి అడుగు పెట్టగానే ఉదయం సాగర్ ఎందుకు లేటుగా వచ్చాడో అర్థమయ్యింది. 
అరంగుళం ఖాళీ లేకుండా పింకు కలర్ బెలూన్లతో, గోడలన్నీ డెకరేషన్లతో నిండిపోయి ఉన్నాయి. 

          ఆ ఆనందం అంతా ఇవేళ ఆవిరైపోయినట్టు అనిపించింది నాకు. పాపాయికి లోపల ఏమేం బాధ కలుగుతోందో అన్న చింత మొదలయ్యి కడుపులో నించి మెలితిప్పుతూ విపరీతమైన దుఃఖం. 

***

          క్రోమోజోము రిపోర్టు వచ్చిన మర్నాడు సాగర్ ఆఫీసుకి సెలవు పెట్టి ఇంటర్నెట్టులో ఏవేవో ఆర్టికల్స్ చదువుతూ గడిపేడు. 

          మధ్యాహ్నం డాక్టరు అప్పాయింట్ మెంటుకి పాపని తీసుకుని రమ్మనడంతో అత్తయ్య కూడా వస్తానని తయారవబోయింది. ఆవిడకి ఏదో చెప్పి ఒప్పించి ఇంట్లోనే ఉంచాడు సాగర్.  

          నేను  ఇవన్నీ పట్టించుకునేలా లేను. అసలు మతి మతిలో లేదు. ఎందుకిలా జరిగింది? ప్రెగ్నెన్సీ లోనే డయాగ్నస్టిక్ టెస్టు చేయించుకుని ఉండాల్సిందా? ఒకవేళ అప్పుడే తెలిసి ఉంటే ఈ బిడ్డని అక్కడే తుంచి వేసేవాళ్లమా? ఛీ.. ఛీ.. దుర్మార్గపు ఆలోచనలు. లేదు.. లేదు… అలా ఎన్నడూ చేసేవాళ్ళం కాదు. కాకపోతే ఈ దుఃఖం అప్పటి నించే మొదలయ్యేది. 

          సాగర్ కూడా నాలాగే  మరేదో ఆలోచిస్తున్నట్టు కారు స్టార్టు చెయ్యకుండానే ఏవేవో బటన్లు నొక్కసాగేడు. హాస్పిటల్ కి చేరేవరకూ ఇద్దరం మాట్లాడుకోలేదు. 

          వెనక సీట్లో పక్కనే కూచుని బేబీ కారు సీటులో ప్రశాంతంగా నిద్రపోతున్న పసి కూనని చేత్తో తడుముతూ, కర్చీఫ్ లోకి ముక్కు చీదుతూనే ఉన్నాను.  పార్కింగులో  మోడులైన చెట్లు వికృతంగా కనిపించసాగేయి. పుల్లల చేతుల్తో గొంతు నొక్కి పెట్టడానికి మీదిమీదికి వస్తున్న భ్రాంతి. ఎదురుగా ఎవరొచ్చినా పాపాయిని లాక్కుని దూరంగా తీసుకు పోతారన్న పిచ్చి భయం కలగసాగింది. ఇదేవిటి నిన్నటిదాకా బానే ఉన్నా కదా? 
సాగర్ చేతిని గట్టిగా పట్టుకుని “మన తల్లికి ఏమీ కాదు కదా!” అన్నాను భయంగా. 

          బదులుగా సాగర్ నన్ను పొదివి పట్టుకున్నాడు. 

          నర్సు మా పేరు పిలవగానే చెయ్యని నేరం ఏదో చేసి బోను ఎక్కడానికి  వెళ్తున్న ఖైదీల్లా హాస్పిటలు గదిలోకి అడుగుపెట్టాం. 

          మామూలుగా ఒక డాక్టరు కాకుండా ముగ్గురు డాక్టర్లు మాకోసం ఎదురుచూస్తున్నారు. 
అందులో ఒకరు పిల్లల స్పెషలిస్టు, ఒకరు క్రోమోజోము టెస్టుల స్పెషలిస్టు, మరొకరు కౌన్సలింగ్ స్పెషలిస్టు. 

          “ముందు మీ టెస్టు గురించి మీకు ఏవైనా ప్రశ్నలున్నాయా?” అన్నాడు ఒక డాక్టరు. 
మేం తలలు నిలువుగా, అడ్డంగా ఊపడం చూసి 

          “సరే. చిన్న ఇంట్రడక్షన్ చెపుతాను.  డౌన్ సిండ్రోమ్ టెస్టులో అతి ముఖ్యంగా డౌన్ సిండ్రోమ్ అని నిర్ధారణ అయ్యే క్రోమోజోము గురించి చూస్తాం.” అన్నాడు. 

          అర్థం కానట్టున్న మా మొహాలు చూసి మా ఇద్దరి క్రోమోజోము టెస్టులని, పాపాయి టెస్టుని పక్క పక్కన పెట్టి “సాధారణంగా అందరికీ 23 జతల క్రోమోజోములుంటాయి. అయితే డౌన్ సిండ్రోమ్ ఉన్న వారికి ఇదుగో చూసారా ఒక క్రోమోజోము అధికంగా ఉంటుంది.  దీన్ని వైద్య పరిభాషలో ట్రైసమీ21  (Trisomy 21) అంటాం. కణాల్లో ఉన్న ఈ అధిక క్రోమోజోము వల్ల డౌన్ సిండ్రోమ్ వస్తుంది.” అన్నాడు. 

          అయినా అర్థం కానట్టు నిశ్శబ్దంగా తలలూపాం. 

          ఏవైనా ప్రశ్నలున్నాయా?

          సాగర్ అలాగే  మౌనంగా, తేరుకోలేనట్లు చూడసాగేడు. నేను గొంతు పెగుల్చుకుని “ఇది ఎప్పటికి తగ్గుతుంది?” అన్నాను. 

          డాక్టరు గొంతు సవరించుకుని “దురదృష్టవశాత్తు ఇది జన్యుపరమైన లోపం. తగ్గే కండిషన్  కాదు” అన్నాడు. 

          ఆపుకోలేక భోరుమని ఏడవసాగేను. 

          అంతా నిశ్శబ్దం అయిపోయేరు. 

          పక్కనే ఉన్న డాక్టరు టిష్యూ పట్టుకొచ్చి ఇచ్చింది. 

          “ఇలా చూడండి సుమా! మీరు కాస్త స్థిమితపడండి. భయపడకండి.” “పాపాయిని ఒకసారి ఎగ్జామిన్ చేస్తాం. ఇక్కడ పడుకోబెట్టండి” అన్నారు. నా ఒళ్ళో నించి పాపని తీసుకుని  ఎగ్జామినేషన్ బల్లమీద పడుకోబెట్టాడు సాగర్. 

          ఎదురుగా ఉన్న కంప్యూటరులో పాప బరువు, పొడవు, అప్పటి వరకు చేసిన అన్ని బ్లడ్ రిపోర్టులు తెరిచి ఒకరు చూస్తూ ఉండగా, ఒకరు పాపని తడిమి చూసేరు. 

          కౌన్సిలర్ నా దగ్గిరికి మంచినీళ్లతో వచ్చి “ఆర్యూ ఓకే నౌ?” అంది. 

          కళ్ళు తుడుచుకుంటూ నీళ్లు తాగి తలూపాను. 

          “సాధారణంగా డౌన్ సిండ్రోమ్ ఉన్న  పిల్లలకి మిస్సింగ్ ఆర్గాన్స్ ఉంటాయి. గుండెలో కన్నాలు ఉండడం వంటివి కూడా సర్వసాధారణం. గుడ్ న్యూస్ ఏవిటంటే మీ పాప పూర్తిగా ఆరోగ్యంగా ఉంది.” అన్నారు. 

          “థాంక్ గాడ్” అన్నాను ఊపిరి గట్టిగా పీల్చుకుంటూ పాపకేసే దిగులుగా తదేకంగా చూస్తున్న సాగర్ వైపు  చూస్తూ. 

          డాక్టర్ కేసి తిరిగి “డౌన్ సిండ్రోమ్ ఉంటే ఏమవుతుంది?” అన్నాను గొంతులోకి కొంచెం  ధైర్యం తెచ్చుకుంటూ. 

          “బుద్ధి మాంద్యం ఉంటుంది. ఎముకలు బలహీనంగా ఉండడం వల్ల త్వరగా నడవ లేకపోవచ్చు. చెవుల్లో నాడులు చిన్నవిగా ఉండడం వల్ల వినికిడి సమస్య ఉండొచ్చు. అందువల్ల మాటలు రాకపోవచ్చు. మాటలు వచ్చినా నాలుక పొడవుగా ఉండడం వల్ల స్పష్టంగా రాకపోవచ్చు. ఆహార వాహిక చిన్నగా ఉండడం వల్ల పెద్దవేవైనా మింగడం
కష్టమవుతూ ఉంటుంది….” 

          ఇక వినలేక నా గొంతు మళ్ళీ పూడుకుపోవడం మొదలయ్యింది. ఒళ్ళో  ప్రశాంతం గా నిద్రపోతున్న పాపని గుండెకు హత్తుకున్నాను. నా చిన్నారికి ఇన్ని కష్టాలా? మరో డాక్టరు కల్పించుకుని పాపకి అక్కణ్ణించి నెలనెలా చెయ్యాల్సిన టెస్టులు, తప్పనిసరి అపాయింటుమెంట్లు అన్నీ వివరించింది.  

          “అసలు ఇలా జన్యులోపం ఎలా ఏర్పడుతుంది? అన్నాడు సాగర్ మెల్లగా. 

          “కారణం ఇదీ అని చెప్పలేం. ఇంకా పరిశోధనలు కొనసాగుతూనే ఉన్నాయి. క్రోమోజోముల్లో ఇలాంటి చిన్న చిన్న అవరోధాలు ఉండడం అన్నది పిండం ఏర్పడే టప్పుడే సహజంగా జరుగుతుంది.”

          ఒక్క నిమిషం నిశ్శబ్దం తరువాత గట్టిగా ఊపిరి తీసుకుంటూ అడిగాడు సాగర్.  “మా పాపకి మేమేం చెయ్యగలం డాక్టర్?” 

          “ఇన్ఫర్మేషను అంతా మీకు ఇచ్చిన ప్రింట్ అవుట్ లో ఉంది. మీకు ఆర్థికంగా సహాయ పడడానికి, పాప మానసిక ఎదుగుదలకి,  మానసికంగా మీరు తేరుకోవడానికి సహాయం చెయ్యగలిగే ప్రభుత్వ సంస్థల వివరాలు కూడా ఇందులో ఉన్నాయి. మీరు చెయ్యాల్సిందల్లా ధైర్యంగా ఉండడం, పాపకి తగిన తోడ్పాటునివ్వడం.”

          చివరి ప్రశ్నగా “లైఫ్ టైమ్ ఎంత ఉండొచ్చు డాక్టర్” అన్నాను సందేహిస్తూ. 
“దాదాపుగా అరవై ఏళ్ళు” మళ్ళీ దుఃఖం. ఆరునెలలైనా నిండని  నా పసితల్లికి ఆయుష్షు ఎంత ఉంటుందని అర్థం లేని మాట అడిగినందుకు నన్ను  నేనే నొచ్చుకుంటూ నడవ లేనట్లు బయట రిసెప్షనులో కూర్చుండి పోయాను. సాగర్ నిశ్శబ్దంగా నా చెయ్యి పట్టుకుని కూచున్నాడు. 

          “జీవితంలో వచ్చే అతి పెద్ద సమస్యల్లో భయం ఒకటి. భయంలో చిక్కుకున్న మనస్సు గందరగోళానికి, సంఘర్షణకు లోనవుతుంది.”  హఠాత్తుగా జిడ్డు కృష్ణమూర్తి గుర్తుకు వచ్చాడు. 

          కాస్సేపట్లో నేనే ముందు తేరుకుని “కారు నేను నడుపుతాను. పాపాయి దగ్గిర నువ్వు కూర్చో” అన్నాను. 

          “పుట్టగానే గొంతు విప్పి ఏడవకపోతే ఏమో అనుకున్నాను. లోపలి అవయవాల అవకతవకల వల్లనా బంగారు తల్లీ?”

          వెనక సీట్లోంచి నాకు సాగర్ మాటలు మెల్లగా వినిపించసాగేయి. 

          దారి  కనబడకుండా అల్లుకుపోతున్న  కన్నీళ్ళని తుడుచుకుంటూ “వద్దు సాగర్, మనం ఇలా అధైర్యపడొద్దు. డాక్టర్లు చెప్పినవేవీ నిజం కావద్దని నమ్ముదాం. రేపే సహాయక సంస్థల్ని సంప్రదిస్తాను. మన పాపకి అన్ని విధాలా తోడ్పాటునిద్దాం.”  అన్నానే గానీ అత్తయ్య ఫ్లైటు ఎక్కే వరకూ ఈ విషయమై మేమిద్దరం మాట్లాడుకోవడానికి కూడా కుదరలేదు. 

          ఇద్దరం ముభావంగా ఉంటూ ఉండడం చూసి అత్తయ్య “ఏంటి? మళ్ళీ కొట్టుకున్నారా?” అంది. 

          ఆ రెండువారాల పాటు సాగర్ మరీ దిగులుగా ఉండడం చూసి వెళ్ళేటప్పుడు ఆవిడ “ఎంత పెళ్లాంతో  గొడవ పడితే మాత్రం ఇన్నాళ్లు డీలా పడిపోయేవాడిని నేనెక్కడా చూళ్ళేదు. సమయానికి తింటూ ఉండరా నాయనా! బిడ్డని నువ్వే కన్నట్టు చిక్కి సగమ య్యేవు” అంది నిష్టూరంగా నా వైపు చూస్తూ. 

          నిజానికి మా ఇద్దరికీ కళ్ళ కింద నల్లచారలు వచ్చేసాయి. నా మనసులోనూ అప్పటికి బెంగ పేరుకుపోయి భరించలేని దిగులుగా, బాధగా ఉంది. ఎవరితోనూ పంచుకో లేని బాధ. దిగులుగా బయటికి చూసేను. కిటికీకి ఎదురుగా మోడువారిన చెట్టులో నా ముఖం కనిపించసాగింది. 

***

          అత్తయ్య  వెళ్లిన మర్నాడే  జిల్లా సహాయక సంస్థ (రీజినల్ సెంటర్) కి ఫోను చేశాను. రెండు మూడు రోజుల్లో రీజినల్ సెంటర్ కో ఆర్డినేటర్ ఒకావిడ వచ్చి తలుపు తట్టింది. 

          “మీ పాప “రీమా” కి సంబంధించిన ఆసుపత్రి రిపోర్టులు చూపించగలరా?” అంది. 
అవన్నీ పరిశీలించేక “అమెరికన్ డిసేబిలిటీ యాక్టు(ADA), కాలిఫోర్నియా లాంతర్ మేన్ యాక్టు (Lanterman Act) ప్రకారం మాలాంటి రీజినల్ సెంటర్లు డిసేబిలిటీ ఉన్న ఏ వయసు వారికైనా సహాయాలు అందజేస్తాయి. ఈ సహాయాలు ఏమేం అందుబాటులో ఉంటాయో, ఎలా పొందవచ్చో మీకు తెలియజేయడమే కాకుండా, కొంత వరకు ఆర్థిక సహాయం, ఇతరత్రా సహాయాలు కూడా చేస్తాయి. ఇందుకు మీ అమ్మాయి కూడా అర్హురాలు.”  అంది. 

          కాస్సేపట్లో ఏవేవో డాక్యుమెంట్లు, సంతకాలు అయ్యేక “మీ పాప “రీమా” కి కావాల్సిన అన్ని సహాయాలు అందజేస్తాం, తనకి కాగ్నిటీ డెవలెప్ మెంట్ కోసం ఎర్లీ స్టార్ట్ అని, అలాగే మీ లాంటి పేరెంట్స్ కోసం డౌన్ సిండ్రోమ్ నెట్ వర్క్స్ ఉన్నాయి. మీరు వాళ్ళని కూడా సంప్రదించండి. ఇంకా…..  ” ఏదేదో చెప్పుకుంటూ  వెళ్ళిపోతూ ఉంది. బొత్తిగా ఆమె ఏం చెబుతుందో, ఇవన్నీ ఏవిటో అర్థం కాని అయోమయం అలుముకుంది నన్ను. 
సాగర్ ఇంటికి రాగానే విషయం చెప్పబోయాను. 

          “అస్తమాటూ పాపాయికి ‘డౌన్ సిండ్రోమ్’ అనే మాట ఎత్తి నన్ను విసిగించకు. నా చిట్టి తల్లికి ఏమీ లేదు.” అని మండిపడ్డాడు. 

          ఈ మధ్య అర్థరాత్రి వరకూ పూర్తిగా ఆఫీసు పనిలోనే గడపడం మొదలుపెట్టేడు. 
వ్యథావేదనని తట్టుకోవడం కోసం అతనెన్నుకున్న మార్గం నన్ను మరింత ఒంటరిని చెయ్యసాగింది. 

          “మాకే ఎందుకిలా జరిగింది. కాదు కాదు నా చిట్టి తల్లి  రీమాకే ఎందుకిలా జరిగింది?” జవాబు లేని ప్రశ్న. 

          పాపాయికి పాలిచ్చి పడుకోబెట్టి కిటికీలోంచి బయటికి చూస్తూ కూర్చున్నాను. ఆకులు రాలిపోయి, రూపురేఖలు కోల్పోయి మోడై పోయిన మేపిల్ చెట్టు నిస్సహాయంగా బాధతో మెలికలు తిరుగుతున్నట్టు కనిపించింది . అచ్చం నాలానే. 

***

          రెండో రోజు ఎర్లీ స్టార్ట్ నించి ఆండ్రియా వచ్చింది.  దాదాపు యాభై అయిదేళ్ళుంటా యేమో. 

          వస్తూనే “ఇలా చూడండి, మీకు మొదటగా మీకే ఎందుకిలా జరిగింది అనే జవాబు లేని ప్రశ్న వస్తుంది” అంది ఓదార్చే గొంతుతో.   

          ఆశ్చర్యంగా చూసాను తన వైపు. 

          “దాదాపు ప్రతి ఏడెనిమిది వందల మందిలో ఒకరికి ఇటు వంటి ఏదో ఒక కండిషన్ ఉంటుంది. ముందు మీరు మీ అమ్మాయికి ఉన్న కండిషన్ ని యాక్సెప్ట్ చెయ్యాలి. అప్పుడే తనకి సహాయ సహకారాలు అందజెయ్యగలరు. అందుకు మీరు ధైర్యంగా ఉండాలి.”

          కన్నీళ్లు కనిపించకూడదని తల వాల్చుకున్నాను. 

          కానీ అప్పటిదాకా ఎన్నో రోజుల నుండి బయట పడకుండా ఉండే మార్గమేమీ లేక గడ్డకట్టి పోయిన దుఃఖాన్ని ఆపుకోలేకపోయాను. 

          కాస్సేపు మౌనంగా ఉండి అనునయంగా అందామె. 

          “నిజమే. తట్టుకోవడం ఎంతో కష్టం. నాకు కూడా ఇలా సహాయం అవసరమైన పాతికేళ్ల కొడుకు ఉన్నాడు. తల్లిదండ్రులుగా ధైర్యంగా ఉండడమే మన తక్షణ కర్తవ్యం.”  
తల వంచుకునే “ఊ” అన్నాను. 

          “ఎర్లీ స్టార్ట్ తరగతులు దగ్గర్లోని సెంటర్లో వారానికి మూడు రోజులు జరుగుతాయి. నెలల పిల్లల దగ్గర నించి మూడేళ్ళ వయసు వారి వరకు పిల్లల ఎదుగుదలకు తోడ్పడే ఎన్నో రకాల యాక్టివిటీస్ ఉన్నాయి. అంతేకాదు అక్కడికి వస్తే మీకు మరి కొందరు పేరెంట్స్ పరిచయం అవుతారు. ఇటు వంటి విషయాల్లో ఒంటరిగా ఉండడం కంటే అందరితో కలిసి ఉండడం ఎంతో మేలు చేస్తుందని అనుభవం ద్వారా తెలుసు కున్నాను.” 

          చిన్న గొంతుతో లాలనగా మాట్లాడుతున్న ఆండ్రియా ఆ క్షణంలో దేవతలా కనిపించింది. 

          కళ్ళు తుడుచుకుని “దగ్గర్లో సెంటర్ ఎక్కడ ఉందన్నారు?” అన్నాను. 

          అన్నానే గానీ రెండో నెల పిల్లకి అక్కడ ఏం నేర్పుతారో తెలియదు. ఆండ్రియా వెళ్తూ వెళ్తూ ఇచ్చిన  డౌన్ సిండ్రోమ్ గురించిన అవగాహన కలిగించే పుస్తకాలు తెరిచాను.  మొదటి పుస్తకాన్ని ఎక్కడా ఆపకుండా ఏకబిగిన చదివేసాను. 

          ముందుగా ఇటు వంటి అనుకోనివి ఎదురైనపుడు మనుషులు సర్వ సాధారణంగా ఎలా ఆలోచిస్తారో రాసి ఉంది. మొదటగా షాక్ కి గురవుతారట. ఆ విషయాన్ని అసలు ఒప్పుకోవడానికి ఇష్టపడరట. ఆ తర్వాత కోపం, డిప్రెషన్ చుట్టుముడతాయి. చివరగా అంగీకరిస్తారట. 

          ఎంత సరిగ్గా రాసేరో! 

          అందులో మేం మొదటి రెండు మూడు స్టెప్పుల్లోనే ఉన్నాం ఇంకా. ఆండ్రియా చెప్పింది నిజమే. ఎంత త్వరగా అంగీకరించగలమో, ఎంత వేగంగా ఇందులో నించి బయటికి రాగలమో అప్పుడే దాన్నెదుర్కొనే సత్తువ, ధైర్యం వస్తాయి. 

          కానీ ఎలా? పాపాయి ఏడ్చినప్పుడల్లా తనకేమైనా బాధ కలుగుతుందేమో, ఎలా తెలుసుకోవాలోనన్న ఆదుర్దా. మర్నాడు ఎర్లీ స్టార్ట్ తరగతి గదిలోకి అడుగు పెడుతూనే కనబడ్డ మొదటి పేరెంట్ సారాని అడిగేసేను. 

          “నాకు ఇద్దరు ఆడ పిల్లల తరువాత మూడో సంతానంగా పుట్టిన అబ్బాయి వీడు. డౌన్ సిండ్రోమ్ తో బాటూ పుట్టినప్పుడే గుండెలో రంధ్రంతో పుట్టేడు. ఈ రెండేళ్లలో వీడికి రెండు సార్లు ఆపరేషన్లు చేయించేం. 

          మీ పాపకి డౌన్ సిండ్రోమ్ తో బాటూ ఇతరత్రా ఆరోగ్య సమస్యలేవీ లేవు కాబట్టి ఏమీ ఆందోళన చెందక్కరలేదు. ఈ పిల్లలూ అందరిలాగే ఆకలేస్తేనో, డైపర్ తడిస్తేనో ఏడుస్తారు. ఇతరత్రా ఎటువంటి నొప్పులూ ఉండవు.” అని ధైర్యం చెప్పింది సారా. 

          దాదాపుగా పది మంది పిల్లలు ఉన్న ఆ విశాలమైన క్లాసురూములో డౌన్ సిండ్రోమ్ పిల్లలే కాక వేరే కాంప్లికేషన్సుతో ఉన్న పిల్లలు కూడా ఉన్నారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య. అయినా ఆ పసిపిల్లలు శారీరక, మానసిక ఎదుగుదల లోపాలు, బుద్ధి మాంద్యం ఉన్నట్టే కనిపించడం లేదు. హాయిగా ప్రశాంత వనంలో ఆడుకుంటున్న జింక పిల్లల్లా
ఎగురుతూ, తుళ్ళుతూ ఆడుకుంటూ ఉన్నారు. 

          మోకాళ్ళ కింద నించి రెండు కాళ్ళూ లేని పసిబుడతడు అయితే చెప్పనే అక్కర లేదు. అందరికంటే వేగంగా ముందుకు కదలసాగేడు. వాణ్ణి కనిపెట్టుకుని కూడా ఉన్న నాన్నమ్మలా ఉన్న ఆమె దగ్గిరికి వెళ్లి 

          “వాళ్ళమ్మ రాలేదా?” అన్నాను వాడివైపు మురిపెంగా చూస్తూ. 

          “నేనే వాడి తల్లిని” అంది. 

          అరవయ్యేళ్ళకి  జన్మనిచ్చింది ఆమె వాడికి. ఆశ్చర్యపోయాను. అలా అడిగినందు కు ఏమనుకుందోనని క్షమించమని అడిగేను.  

          “ఫర్వాలేదులే. వాడికి గుండెలోను, కిడ్నీలలోను సమస్య వల్ల కాళ్ళు తీసెయ్య వలసి వచ్చింది. అయినా నా చిన్నితండ్రి ఎంత హుషారైన వాడో” అంది. 

          గుండె దుఃఖంతో బరువెక్కింది నాకు. “అయామ్ సారీ” అన్నాను పెగుల్చుకుని. 
ఇంతలో గబగబా అటూ ఇటూ చలాకీగా పాకుతూ ఉన్న ఆనీ అనే ముద్దులొలికే పాప తల్లి నన్ను చూసి దగ్గిరికి వచ్చింది. 

          చేత్తో మోసే ఉయ్యాల తొట్టిలాంటి కారు సీటులోనే ఆదమరిచి నిద్రపోతున్న రీమాని చూస్తూ “ఎంత ముద్దుగా ఉంది!

          ఎన్నో  నెల?”  అంది. 

          చెప్పగానే “అప్పుడే వచ్చేసిందా ఎర్లీ స్టార్ట్ కి! అయినా మంచిదేలే. ఇక్కడి టీచర్ల మాటలు, పాటలు  వినీ వినీ మాటలు త్వరగా నేర్చుకుంటుంది” అంది. 

          “మీ అమ్మాయికి ఎన్నో నెల అన్నాను?”

          “పద్దెనిమిది నెలలు” ఇంకా నడవడం లేదు ప్చ్..” అని ఒక్క క్షణం ఆగి “కాకపోతే ఎంత త్వరగానో పాకేస్తుంది. అన్నీ తీసి పైనెక్కడో సర్దుకోకపోతే అవీ ఇవీ పట్టుకుని నిల్చుని అన్నీ లాగేస్తుంది అల్లరిపిల్ల” అంది. 

          అక్కడున్న గంటన్నర భలే ధైర్యంగా అనిపించింది. వీళ్లంతా ఎలా తట్టుకో గలుగుతున్నారు ఇవన్నీ? పిల్లల్ని చుట్టూ కూర్చోబెట్టుకుని ముగ్గురు, నలుగురు టీచర్లు పాటలు, కథలు వినిపిస్తూ, క్లాసులో ఉన్న రకరకాల ఆటవస్తువులతో ఆడిస్తూ, సందడిగా గడపసాగేరు. తల్లిదండ్రుల్లో ఎవరో ఒకరు పిల్లల్తో ఉండాల్సిన నిబంధన వల్ల పేరెంట్స్ పిల్లల్ని ఒళ్ళో కూచోబెట్టుకుని వాళ్లతో బాటూ పాడుతూ, ఆడసాగేరు. 

          మరో డౌన్ సిండ్రోమ్ పాపని ఆడిస్తున్న నార్త్ ఇండియన్ లా ఉన్న పెద్దావిడ దగ్గిరికి వెళ్లేను. కాస్సేపు మాట్లాడగానే హిందీలో అన్నీ ఏకరువుపెట్టింది. 

          “మేం ఇక్కడే ముప్పయ్యేళ్లనించి ఉంటున్నాం. ఇరవై ఆరేళ్ల మా పెద్దమ్మాయికి మొదటి సంతానం ఈ పాప. ఒక విధంగా ఇక్కడి సొసైటీ చాలా నయం. ఇండియాలో ఇటు వంటి పిల్లల్ని పెంచాలంటే ఎంతో కష్టం. సమాజంలో వెలివేతని భరించలేం” అంటూ “ఇక్కడి సమాజంలో ఇటు వంటి వారిని వింతగా చూడకపోవడం వల్ల, తగిన తోడ్పాటునిచ్చే ఇటు వంటి సంస్థల వల్ల వీళ్లంతా ఇవన్నీ నిబ్బరంగా తట్టుకోగలుగు తున్నారేమో అనిపిస్తుంది. అయినా మా మనవరాలి పరిస్థితికి వాళ్ళమ్మ ఎన్నాళ్ళో డిప్రెషన్ లోకి వెళ్ళిపోయింది. ఇప్పుడిప్పుడే కాస్త మన లోకంలోకి వస్తూ ఉంది.” అంది
కళ్ళు ఒత్తుకుంటూ. 

          ఇంతలో ఆ పాప అమ్మమ్మ దగ్గిరికి వచ్చి ఏదో సైగ చేసింది. 

          “అన్నిటికన్నా ముఖ్యంగా మా చంటిదానిలా వినికిడి లేని పిల్లలు త్వరగా అర్థం చేసుకోవడానికి సైన్ లాంగ్వేజీ కూడా ఇక్కడి ఆటపాటల్లో భాగం. దీనికి బిస్కెట్లు కావాలట. ఎలా  అడుగుతుందో చూడు” అంది మురిపెంగా ఎత్తుకుని ముద్దాడుతూ. 

          రీమాని వారానికోరోజు తప్పనిసరిగా తీసుకెళ్లసాగేను. బయటి చెట్లు మళ్ళీ చిగురు తొడుగుతున్నాయి. రోజూ వచ్చే దారైనా ఏదో కొత్త దారి కనిపించినట్టైయింది నాకు.

***

          “మా చిన్ని తల్లి రీమా ఎక్కడుందీ….”  క్లోసెట్ లో దాక్కున్న పాపని చూసి కూడా చూడనట్టు వెతకసాగేను. 

          కిలకిలా నవ్వు వినబడసాగింది. దగ్గిరికి వెళ్లేసరికి చాలా దీక్షగా పొడవు డ్రెస్సుకున్న చిన్న బొత్తాలు కష్టపడి లాక్కోసాగింది. 

          “అయ్యయ్యో కొత్త గౌను. అలా పాడుచేసుకోకూడదురా” అంటూ ఎత్తుకున్నాను. 

          నిమిషం చేతుల్లో ఉండకుండా నేల మీదికి జారి వేగంగా రెండు పల్టీలు కొట్టి సోఫాని అనుకుని తలకిందులుగా పడుకుంది. వెన్నెముక లేనట్టు మెత్తగా జారిపోతుంది. కానీ ఏ పొజిషన్ లోనైనా కంఫర్టుగా కూచోగలుగుతుంది. 

          అయిదో నెలలో బోర్లా పడింది. 

          ఎనిమిది నెలలకి పాకడం ప్రారంభించింది. 

          పధ్నాలుగు నెలలకి అడుగులెయ్యడమూ ప్రారంభించింది. 

          ఎర్లీ స్టార్ట్, ఫస్ట్ ఫైవ్, లైబ్రరీ స్టోరీ టైం… ఇలా కనబడ్డ అన్ని కార్యక్రమాలకీ పాపని తీసుకువెళ్ళసాగేను. 

          శారీరకంగా కొంచెం ఆలస్యం అయినా చక్కగా అన్నీ నేర్చుకుంది రీమా. 

          అయితే వేళ్ళతో ఏదైనా పట్టుకోవడానికి కాస్త ఇబ్బంది పడుతుంది.  

          కాగితాలు చింపి పొయ్యడం, రంగులు ఒళ్ళంతా పూసుకోవడం మాకు ముద్దుగా ఉన్నా “వీటికి మోటార్ స్కిల్స్ ప్రాబ్లమ్, అటెన్షన్ స్పాన్ లేకపోవడం” అంటూ డాక్టర్లు చెప్పే భాష్యానికి దిగులేసేది.  

          రీమా రెండో పుట్టినరోజు నాడు మొదటి మాటగా  “దాదీ”  అంది. 

          అప్పటిదాకా ఎర్లీ స్టార్ట్ లో నేర్చుకున్న సైన్ లాంగ్వేజీతో సైగలు చేస్తూ ఉండేది.  

          సాగర్ ఆనందానికి అవధుల్లేవు. తన కూతురు మొదటగా తననే పిలిచినందుకు మాత్రమే కాదు. అసలు మాట్లాడుతున్నందుకు. 

          సంవత్సరంలో రెండు సార్లు హాస్పిటల్ నించి తప్పనిసరిగా చేసే హియరింగ్ టెస్టుల రిపోర్టులు వచ్చే వరకూ టెన్షనే. పిల్లకి చెవులు వినిపిస్తున్నాయో, లేదో అని. ‘మాట్లాడడానికి వినికిడి ముఖ్యం’ అని మొట్టమొదట్లో డాక్టర్లు చెప్పింది జ్ఞాపకం వచ్చింది. 

          పాపాయి “దాదీ” అని అనగానే సాగర్ పాపని అమాంతం ఎత్తుకుని నా దగ్గిరికి వచ్చేడు. “ఏదమ్మా మళ్ళీ పిలువు ..” అంటూ. 

          మా కళ్ళల్లో ఆనందబాష్పాలు నింపుతూ రీమా మళ్ళీ  “దాదీ” అంది. 

          చిత్రంగా ఎన్ని సార్లు చెప్పినా “అమ్మా” అననే లేదు. 

          నా ఉక్రోషం చూసి సాగర్ ఆటపట్టిస్తూ “మా బంగారు తల్లి” అంటూ మురిసి పోయాడు. 

          ఆ తరువాత ఇక ఇల్లంతా రీమా చిట్టి చిట్టి పలుకులతో నిండిపోయింది. 

          అయితే పొడవైన నాలుక వల్ల ఏ మాటా స్పష్టంగా మాట్లాడలేకపోయేది. 

          ఒకటికి రెండు సార్లు విన్నా తనేం మాట్లాడుతూ ఉందో అర్థం కావడం కష్టంగా ఉంది. 

          అయితే క్రమంగా “దో” అంటే బయటికి, “దీ” అంటే ఇవ్వు…అంటూ తనకే ప్రత్యేక మైన కొన్ని పదాలు పలుకుతూ ఉందని అర్థమైంది. 

          వారానికి రెండు సార్లు పాపని స్పీచ్ థెరపీకి తీసుకెళ్తూనే ఉన్నాను. 

          మాకు ఇంట్లో పూర్తిగా తెలుగులో మాట్లాడుకోవడమే అలవాటు. అందువల్ల పాపకి ఇంగ్లీషుతో బాటూ తెలుగు కూడా బాగా అర్థమవుతూ ఉందని తను కూడా మా సంభాషణ మధ్యలో మమ్మల్ని ఆసక్తిగా చూడడం, నవ్వడం వంటివి చెయ్యడంతో కనిపెట్టాను. 

          అయితే ఎంత ప్రయత్నించినా తిరిగి ఒక్కమాట కూడా తెలుగులో చెప్పించలేక పోయాను. 

          పైగా ఒక్క భాష మాత్రమే నేర్పించమని స్పీచ్ థెరపీ డాక్టరు సలహాతో విరమించు కున్నాను.  

          బజారుకి, పార్కుకి అంటూ ఎక్కడికి తీసుకువెళ్లినా పాప ముఖ కవళికల్ని బట్టి ఇట్టే కనిపెట్టేసేవారు డౌన్ సిండ్రోమ్ అని. 

          అయినా బయటపడకుండా “ఎంత క్యూట్ గా ఉందో మీ అమ్మాయి” అని మాత్రం అంటూ ఉండేవారు. 

          క్రమంగా తన ఈడు మామూలు పిల్లల కంటే వెనకబడి ఉన్న ఈపిల్లని అక్కడక్కడా వింతగా చూసే చూపులు తప్పించుకోవడానికి అలవాటు పడడానికి చాలా సమయం పట్టింది నాకు. ముఖ్యంగా ఇండియన్స్ ఎక్కడ కలిసినా చప్పున మొహమ్మీదే అడిగేసే వారు. “పాపకేమైంది?’ అంటూ. 

          ఆ రోజు మా అపార్ట్ మెంటులో కింద ఉండే వాళ్ళబ్బాయి నాలుగో బర్త్ డే పార్టీకి దగ్గర్లో ఉన్న పిల్లల గేమ్ సెంటర్ కి పిలిచారు. 

          నేను పాపని హుషారుగా రెడీ చెయ్యసాగేను. 

          సాగర్ విసురుగా వచ్చి గట్టిగా అరుస్తూ నా చేతుల్లో నించి పాపని దగ్గరికి తీసుకుని  “రీమాని “బర్త్ డే పార్టీ” లు అవీ అంటూ ఎక్కడికీ తీసుకెళ్లొద్దు” అన్నాడు. 

          ఆశ్చర్యపోయాను. ఎందుకు ఇలా హిస్టీరిక్ గా బిహేవ్ చేస్తున్నాడో అర్థమైనా “సాగర్! అందరూ వింతగా చూస్తే చూడనియ్యి. కానీ పసిదాన్ని నలుగుర్లో తిప్పితేనే కదా దానికి మంచీ, చెడూ తెలిసేది” అన్నాను. 

          “అవసరం లేదు. అందుకోసం పిల్లని ఎవరైనా అవహేళన చేస్తుంటే, వింతగా చూస్తుంటే చూస్తూ ఊరుకోవాలా? నేను తట్టుకోలేను. అంతకంటే ఎక్కడికీ తీసుకువెళ్లక పోవడమే మంచిది ” అన్నాడు ఆవేశంగా. 

          సాగర్ బాధని అర్థం చేసుకోగలను. కానీ బాధని అధిగమించ గలిగిన ధైర్యం నాకు ఎర్లీ స్టార్ట్ ప్రోగ్రాము, డౌన్ సిండ్రోము నెట్ వర్క్ గ్రూపు ఇచ్చాయి. మా లాంటి పేరెంట్స్ నించి ఎంతో నేర్చుకున్నాను. 

          సాగర్ ఎప్పుడూ ఆఫీసు అంటూ ఎర్లీ స్టార్ట్ లాంటి చోట్లకి ఎప్పుడూ వచ్చేవాడు కాదు. ఇదన్నమాట సంగతి. 

          సాగర్ దగ్గరికి వెళ్లి అనునయంగా చెప్పడానికి ప్రయత్నించాను. “మనం మన పాపకి తనంతట తను బ్రతికేలా స్వత్రంత్రతని నేర్పించాలి, తను ఎవరి మీదా ఆధారపడ కూడదు అన్నదే మన లక్ష్యం కదా! మరి అందుకు మనం సహకరించాలి కదా. మనలో మనమే న్యూనతకి గురవుతూ పిల్లని ఇంట్లో కూర్చోబెడితే తనకి ప్రపంచం ఏం అర్థమవు తుంది?” 

          ఒక్కసారిగా దుఃఖం కట్టలు తెంచుకున్నట్టు ఏడవసాగేడు. అప్పటికే అరుపులకి బిత్తరపోయిన పాపాయి వెంటనే ఏడుపు ప్రారంభించింది. 

          పాపని ఊరుకోబెడుతూ బాల్కనీలోకి వెళ్లాను. రెండు నిమిషాల్లో అంతా మర్చిపోయి నట్టు నా వైపు చూసి చిరునవ్వు నవ్వింది. 

          మనసంతా దిగులు దుఃఖం కమ్ముకుంది. 

          అసలే లోపల్లోపల ఒక పక్క పాప గురించిన దిగులే తినేస్తూ ఉంటే ఇక సాగర్ పరిస్థితిని ఎలా చక్కదిద్దాలి?  కౌన్సిలింగ్ వంటివంటే తనకి అస్సలు గిట్టదు. 

          ఏదేమైతే అయ్యిందని హాల్లోకి వచ్చి “పాపని బర్త్ డే పార్టీకి నేను తీసుకువెళ్తు న్నాను.” దృఢంగా అని బయటికి వచ్చేను. 

          అన్నానే గానీ నాకు కూడా  బెరుగ్గానే ఉంది. అయితే అక్కడ మమ్మల్ని ఎంతో బాగా రిసీవ్ చేసుకోవడమే కాకుండా, అన్ని ఆటల్లోనూ చిన్నారిని అంతా ముద్దుగా భాగస్వామ్యు రాల్ని చేశారు. ఇక వరుసలో కూర్చోబెట్టి కేకు వగైరాలు పెట్టినప్పుడు ఇంట్లో అయితే అన్నీ చిందరవందర చేసే రీమా చాలా చిత్రంగా మిగతా వారిని చూస్తూ,  వాళ్ళేం చేస్తే బుద్ధిగా అలాగే చెయ్యసాగింది. 

          ఆ వారాంతంలో అక్కడ తీసిన వీడియోని సాగర్ కి చూపించేను. అప్పటిగ్గానీ సాగర్ కి బాధ తగ్గలేదు. 

          ఒళ్ళో పాపాయిని ముద్దాడుతూ, పక్కన కూర్చున్న నా చేతిని గట్టిగా పట్టుకుని “నువ్వన్నదే కరెక్టు. బయటి ప్రపంచాన్ని సాధ్యమైనంత వరకు పరిచయం చేద్దాం మన చిట్టితల్లికి.” అన్నాడు. 

          సమస్య తేలిగ్గా తేలిపోయినందుకు ఊపిరి తీసుకున్నాను. 

***

          మూడో  ఏడాది నిండే సరికి ఎర్లీ స్టార్ట్ ప్రోగ్రాము పూర్తి కావడంతో ప్రీ స్కూలు కోసం వెతకడం మొదలుపెట్టాం. 

          అప్పటిదాకా నేను పాప వెంటే ఉండడం వల్ల తనకేం అవసరమైనా మా పని సులభమయ్యేది. ప్రీ స్కూల్లో పూర్తిగా తల్లిదండ్రులు వెంట ఉండడానికి కుదరదు. 

          ఇటు వంటి పిల్లల కోసం స్కూళ్ళని “స్పెషల్” స్కూళ్ళని పిలుస్తారు. 

          ప్రీ స్కూళ్లలో పూర్తిగా పాప వెంట తల్లిదండ్రులు ఉండకుండా అంతా వారే చూసే మాటైతే నెలకి నాలుగైదు వేల డాలర్ల పైచిలుకు ఖర్చవుతుంది. 

          కొన్ని స్కూళ్లలో తల్లిదండ్రులకి  కొంత వరకు వాలంటీర్ చేసే అవకాశం కల్పించి  అందులో కొంత ఫీజు తగ్గింపుకి చేర్చుకుంటారు. టాయ్ లెట్ ట్రైనింగు వగైరా ఇంట్లో తల్లిదండ్రులు నేర్పించాల్సిందే. 

          ఏదేమైనా ఈ బడులన్నీ ఒక్క పూట మాత్రమే నడుస్తాయి. 

          అయితే ఇలా స్పెషల్ స్కూలు కాకుండా మామూలు స్కూళ్లలో చేర్పించడానికి ఆ వయసులో ఉన్న మిగతా పిల్లలతో సమానంగా అన్ని స్కిల్స్ ఉన్నాయని నిరూపించాలి. దాదాపుగా మామూలు  స్కూళ్లు అన్నిటిలోనూ అసలు అప్లికేషను ఇవ్వడానికే  నిరాకరిం చారు.  

          స్పెషల్ స్కూల్లో తనలాగే మాటలు రాని పిల్లల మధ్య తనేం నేర్చుకుంటుంది? 

          పట్టువదలని విక్రమార్కురాలిలా వెతికి ఇండియన్లు నడుపుతున్న మామూలు ప్రీ స్కూలు ఒకటి పట్టుకున్నాను. 

          పాపని చూస్తూనే, సంగతి చెప్పకముందే గ్రహించింది కౌంటరులోని అమ్మాయి. లోపలికి వెళ్లి సెంటరు మేనేజరుని పిల్చుకొచ్చింది.  

          అయితే విచిత్రంగా ఆయన ఏమీ అడగకుండా “అడ్వాన్సు ఫీజు పే చేసి, రేపట్నుంచి జాయిను చెయ్యండి” అని వెళ్ళిపోయేడు.  

          మొదటి వారం రోజులు ఎందుకైనా మంచిదని నేను రోజూ పార్కింగ్ లోనే కార్లో ఉండసాగేను. 

          అసలు ఏ కంప్లైంటు లేదు. రీమా కూడా చక్కగా అలవాటుపడింది. అప్పుడప్పుడు చాటుగా చూడడానికి కూడా పర్మిషను ఇచ్చారు. టీచరు దగ్గర్లో కూచుని పిల్లలందరితో పాటుగా పాటలు పాడుతోంది రీమా. 

          వసంత కాలం కావడంతో బయటంతా ఎక్కడ చూసినా అందమైన పూలు విరబూసి ఉన్నాయి.    

          అయితే డాక్టర్లు చెప్పినట్టు మందబుద్ధి లేకుండా రీమా చదువులోనూ రాణించ గలదేమోనని ఆశ కలిగింది. ప్రశాంతంగా అనిపించింది. 

          అయితే మాట స్పష్టత లేకపోవడంతో రైమ్స్ లో అన్ని పదాలు పలకలేక, ఎన్నో పదాలు మధ్యలో వదిలేస్తూ ఏదేదో పాడేది రీమా. 

          తన పేరుని కూడా “వీమా” అని పలకసాగింది. 

          స్పీచ్ థెరపీ కి వెళ్లొస్తూనే ఉన్నాం. 

          ప్రీస్కూల్లో ఆ సంవత్సర కాలంలో అక్షరమాలలో కొన్నిటిని పలక గలిగినా, రాయడం మాత్రం మొదటి అక్షరం ఒక్కటే నేర్చుకుంది.  

          కానీ తోటి పిల్లల్తో ఆటపాటలు, క్రమశిక్షణని పాటించడం, పెద్దవాళ్ళతో పలకరింపు లు వగైరా మిగతా పిల్లల్ని చూసి కాబోలు బాగా నేర్చుకుంది.  

          పికప్ కోసం వచ్చే తల్లిదండ్రులందరికీ నవ్వుతూ “బై” చెప్పడం రీమాకి దినచర్యగా మారింది. 

          క్లాసులో తన పక్కన కూర్చునే అర్జున్ నయితే కౌగలించుకుని  “బై” చెప్పకుండా రాదు రీమా. 

          అర్జున్ వాళ్ళమ్మ లీల ఆ రోజు ప్రీ స్కూల్ విడిచిపెట్టే సమయంలో పలకరించింది. 

          “నాకసలు వీడితో గడిపేందుకు సమయం దొరకదండీ. ఎమ్మెస్ చేస్తున్నా. ఉద్యోగ ప్రయత్నాల్లోనూ ఉన్నా. 

          ఇక్కణ్ణించి సరాసరి వీణ్ణి డే కేర్ లో దించి పరుగులెట్టాల్సిందే.”  అంది నవ్వుతూ. 

          అంతలోనే జాలిగా మొహం పెట్టి “పాపం మీరు……..” అంది సందేహంగా. 

          “నేను ఆర్నెల్ల కిందటే ఆన్  లైన్ ఎమ్మెస్ డిగ్రీ పూర్తి చేశాను. ఇటీవలే స్టార్టప్ లో పార్ట్ టైమ్  ఉద్యోగానికి కుదురుకున్నా” అన్నాను చిరునవ్వుతో. 

***

          ఆ సంవత్సరంలో  పబ్లిక్ స్కూల్లో మామూలు కిండర్ గార్టెన్ లో చేర్పించడానికి అప్లికేషను పెట్టాం. 

          మామూలుగా కిండర్ గార్టెన్ లో చేర్చుకోవడానికి అర్హత పరీక్ష పెడతారు. దాని ప్రకారం పిల్లలకి అన్ని అక్షరాలు చదవటం, కొన్ని రైమ్స్ వంటివి చెప్పడం వచ్చెయ్యాలి. 

          అప్లికేషనులో “డిసేబిలిటీ” గురించి చూడగానే పరీక్ష తంతు ఏవీ లేకుండా పిల్లకి స్పెషల్ డే క్లాసులో సీటిచ్చామని చెప్పారు. ఆ సీటు కూడా మా ఇంటి దగ్గర్లో  ఉన్న స్కూల్లో కాకుండా మూడు మైళ్ళ అవతల ఉన్న మరో స్కూల్ లో ఇచ్చారు. ఇక్కడ మామూలుగా ప్రతి మైలుకి ఒక పబ్లిక్ స్కూలు ఉంటుంది. 

          ఇంత చిన్నపిల్లకి  అంత దూరంలో ఉన్న స్కూల్లో సీటు ఇవ్వడం ఏవిటి? పైగా మామూలు తరగతి కాకుండా ఈ స్పెషల్ డే క్లాసు ఏవిటి? 

          స్కూలు ప్రిన్సిపాలుతో మాట్లాడడానికి వెళ్లాం. 

          ఎంతో మర్యాదగా కుశల ప్రశ్నలు వేసి “చూడండి. మీ అమ్మాయికి ఉన్న”కండిషన్ “ వల్ల స్కూలు డిస్ట్రిక్టు అలాట్ మెంట్ ప్రకారం స్పెషల్ డే క్లాసుకి మా స్కూల్లో సీటు వచ్చింది. స్పెషల్ డే క్లాసు అంటే ఇలాంటి పిల్లలకి పూర్తి సహకారాన్ని అందించే విధంగా విడిగా నిర్వహించే తరగతి అన్నమాట. ఇందులో రెండు రకాలున్నాయి.  మైల్డ్ టు మోడరేట్, మోడరేట్ టు సివియర్. పిల్లల కండిషన్ ని బట్టి ఎందులో చేర్చాలో డిస్ట్రిక్టు వారు నిర్ణయించిన ప్రకారం సీటు ఇవ్వబడుతుంది. ఇందులో టీచరుతో బాటూ ఇద్దరు, ముగ్గురు పిల్లలకి ఒక సహాయక టీచరు, ఎయిడ్ కూడా ఉంటారు. ఇందువల్ల పిల్లలకి స్పెషలు అటెన్షను ఇవ్వడానికి కుదురుతుంది.” అన్నాడు. 

          “ఇంతకీ మా అమ్మాయిని చేర్చుకున్నది  ఏ స్పెషలు తరగతిలో?”  అన్నాను. 

          “మోడరేట్ టు సివియర్” 

          తనది “మోడరేట్ టు సివియర్” కండిషన్  అని ఎలా నిర్ణయించారు? 

          ఇవన్నీ స్కూలు డిస్ట్రిక్టు నిర్ణయిస్తుంది. 

          “అంటే ఇండివిడ్యుయల్ అసెస్ మెంటు చెయ్యకుండా “డౌన్ సిండ్రోమ్” అన్న పదం చూడగానే  “మోడరేట్ టు సివియర్” కండిషన్ గా పరిగణించి ఎలాట్ మెంటు ఎలా చేస్తారు?” అన్నాను. 

          సాగర్ నా వైపు ప్రశంసాపూర్వకంగా చూసాడు. 

          “చూడండి. అన్నీ మీ అమ్మాయి మంచి కోసమే చేస్తాం. మీకు ఇదంతా నచ్చక పోతే జాయిను అయిన 45 రోజుల తరువాత  ఇండివిడ్యుయలైస్డ్ ఎడ్యుకేషన్ ప్రోగ్రాం (IEP) అసెస్ మెంటు చేయించమని మీరు రిక్వెస్టు చెయ్యవచ్చు. అప్పుడు అర్హతని బట్టి “మైల్డ్ టు మోడరేట్” అని భావిస్తే మరొక స్పెషల్ డే క్లాసుకి మార్చే అవకాశం ఉంటుంది.” అన్నాడు ప్రిన్సిపాలు. 

          “మామూలు తరగతిలో చేర్చుకునే అవకాశమే లేదా?” ప్రశ్నకి సమాధానం తెలిసీ, నిరాశగా వెనుతిరిగాం. 

          ఆ రాత్రి డౌన్ సిండ్రోమ్ నెట్ వర్కు ఈ మెయిలు ఫోరంలో ఈ ప్రశ్నని పోస్టు చేశాను.  

          వెంట వెంటనే ఎన్నో సమాధానాలు వచ్చాయి. 

          ఇటు వంటి ఎన్నో కేసుల గురించి ఆన్ లైనులోనూ  చదవసాగేను.

          పబ్లిక్ స్కూళ్ళు స్పెషల్ డే క్లాసుల పేరుతో పిల్లల్ని సామాజికతకి దూరం చేస్తున్నా యని భావించిన తల్లిదండ్రులు కోర్టులని ఆశ్రయిస్తూ వస్తున్నారు. మాకూ ఇంతకు మినహా దారి లేదని  అర్థం అయ్యింది. 

          “కేసులు అవీ వద్దు సుమా. మనకున్న వర్కు వీసా నిబంధనలతో మనం కోర్టు వరకూ వెళ్లకపోవడమే మంచిది. 

          ఇండివిడ్యుయల్ అసెస్ మెంటు చేయించమని రిక్వెస్టు చేద్దాం” అన్నాడు సాగర్ దిగులుగా ఆలోచనలతోనే అలిసిపోయినట్టు. 

***

          రెణ్ణెల్ల తరువాత డిస్ట్రిక్టు సైకాలజిస్టుతో బాటూ ఇద్దరు ముగ్గురు స్పెషల్ టీచర్లున్న  టీముతో మాకు ఐ.ఈ.పీ (Individualized Education Program) మీటింగు జరిగింది. 

          ముందుగా డిస్ట్రిక్టు సైకాలజిస్టు గొంతు సవరించుకుంది. 

          “మీ అమ్మాయి ఏమేం చెయ్యగలదు?” 

          “అన్నీ మామూలుగా చేస్తుంది. కాస్త మాటలు స్పష్టంగా మాట్లాడలేకపోవడం తప్ప”

          “అక్షరాలు రాయగలుగుతుందా?”   

          “ఏవో ఒకట్రెండు”

          “టాయిలెట్ కి సొంతంగా వెళ్లగలుగుతుందా” 

          “ఉహూ”

          “ఎక్కువసేపు స్థిరంగా కూర్చుని ఏ పనైనా చెయ్యగలుగుతుందా?” 

          “ఉహూ”

          “మరి అన్నీ మామూలుగా చేస్తుందన్నారు? 

          కోర్టులో ఖైదీతో లాయరు మాట్లాడుతున్నట్టు చకచకా కడిగిపారేస్తున్న కఠినమైన ఆమె గొంతుకి బాధ కలగసాగింది. 

          అంతలో అంది. “సరే. మేం మీ అమ్మాయికి తగిన పరీక్షలన్నీ పెట్టాం. రిజల్టు ప్రకారం, “డౌన్ సిండ్రోమ్ ని “మోడరేట్ టు సివియర్” కండిషన్ గా పరిగణించి ఈ బడిలోనే సీటుని కొనసాగిస్తున్నాం.”

          “అదేవిటి? మా అమ్మాయికి మా ఇంటి పక్కనున్న మైల్డ్ టు మోడరేట్ స్పెషలు తరగతిలో సీటు ఇవ్వవచ్చుగా”

          అన్నాను గొంతు సవరించుకుని.  

          “కుదరదు. అక్కడ ఉన్న స్పెషలు తరగతి పిల్లల్లందరూ చదువులో ముందున్న వారు. కేవలం సామాజిక శిక్షణ మాత్రమే అవసరమైన వారు.”

          “మా అమ్మాయికి ప్రత్యేక సామాజిక శిక్షణ అవసరం లేదు. తనకి అన్నీ తెలుసు. చదువులో శిక్షణ కూడా మిగతా పిల్లలందరితో పాటూ కలిపి మామూలు తరగతిలో ఇవ్వండి. ఇప్పటిదాకా తను మామూలు ప్రీస్కూలుకే వెళ్ళింది. తనకలా చదువుకోవడం అలవాటే.” 

          “ఇక్కడ అలా కుదరదు. టాయిలెట్ ట్రైనింగు కాని మీ అమ్మాయిని మామూలు తరగతిలో వేస్తే తనకే ప్రత్యేకమైన ఎయిడ్ ని పెట్టాలి. ఆ ఖర్చంతా డిస్ట్రిక్టు భరించాలి. అది వారికి  తలకు మించిన భారం. అయినా  మీ అమ్మాయికి పెట్టిన పరీక్షల్లో వచ్చిన రిజల్టుని బట్టి తను మామూలు  పిల్లలతో కలిసి చదువు కొనసాగించడం సాధ్యమయ్యే పని కాదు.” 

          బయటికి రాగానే మ్లానమైన నా మొహాన్ని చూడకుండానే “ఇదేవిటి ఈవిడ ఇంత దారుణంగా మాట్లాడుతోంది?” అన్నాడు సాగర్. 

          ఇంటికి రాగానే డౌన్ సిండ్రోమ్ నెట్ వర్కు ఫోరమ్ లో నాకు బాగా తెల్సిన రెబెకాకి ఫోను చేశాను. 

          తన సలహా ప్రకారం నెట్ వర్కు ఈ మెయిలు ఫోరమ్ లోనూ పోస్టు చేశాను. 

          మిగతా తల్లిదండ్రుల సలహా ప్రకారం ఆ మర్నాడు డిస్ట్రిక్టులో కంప్లైంటుఇచ్చాను. 

          సాగర్ కాస్త భయపడుతూ  “పాపకి అన్యాయం జరుగుతూ ఉందని అర్థం అవుతూ ఉంది. కానీ… మనలాగా వలస వచ్చిన వాళ్ళం ఇలా పోరాటాలు చెయ్యగలమంటావా?  ఇమ్మిగ్రేషను వాళ్ళతో ప్రాబ్లమేదైనా వస్తేనో…” సందేహంగా అన్నాడు. 

          “అదంతా కనుక్కున్నాను. దీనికి, ఇమ్మిగ్రేషనుకి సంబంధం లేదు. అయినా మనమేమీ కేసు వెయ్యబోవడం లేదు. కంప్లైంటు ఇచ్చామంతే. బయటి వారు అర్థం చేసుకోలేకపోతే నాలెడ్జి లేక అనుకోవచ్చు. ఒక స్కూలు సైకాలజిస్టు అలా మాట్లాడడాన్ని ఎందుకు సహించాలి? ” స్థిరంగా అన్నాను. 

          వారంలో డిస్ట్రిక్టు నించి క్షమాపణ కోరుతూ ఈ మెయిలు వచ్చింది. 

          మరో నెలన్నరలో రీమాకోసం మరో సైకాలజిస్టుని పంపించి రీ -అసెస్మెంటు చేసారు.

          ఈ సారి మారు మాట్లాడకుండా మా ఇంటి పక్క స్కూలులో సీటు ఇచ్చారు. 

          అయితే వాళ్ళు అనుకున్నట్టే “స్పెషలు డే క్లాసు” లో సీటు ఇచ్చారు గానీ, మామూలు తరగతిలో మాత్రం సీటు ఇవ్వలేదు. 

          అప్పటినించి ప్రతి విద్యా సంవత్సరం ఆఖరులో ఐ.ఈ.పీ జరుగుతూనే ఉంది. 

          ప్రతి సారీ మామూలు తరగతిలో సీటు కోసం అభ్యర్థిస్తూనే ఉన్నాం. 

          “ఫిజికల్ ట్రైనింగు క్లాసు, ఆర్ట్ క్లాసు, భోజన సమయాల్లో మిగతా పిల్లలతో కలుపు తున్నాం” అని చెప్తారు. 

          అయితే అదృష్టం కొద్దీ రీమాకి లాంగ్వేజీ స్కిల్స్ బాగా పట్టుబడ్డాయి. 

          ఇదంతా బడి చదువువల్లనో, స్పీచ్ థెరపీ వల్లనో, లేదా సాగర్ ముద్దుగా కొనిచ్చిన ఐ- పాడ్ పెట్టుకుని అదేపనిగా యూట్యూబు నించి మాటలు వినడం వల్లనో. 

          రీమాకి పదేళ్లు నిండాయి. 

          ప్రతి ఏడాది స్పెషలు డే క్లాసులో మరో తరగతి ముందుకు వెళ్లిందన్నందుకు సాక్ష్యంగా తరగతి అంకె మారుతుంది. 

          అక్షరాలు అన్నీ రాయగలుగుతుంది. రెండో తరగతి వరకూ పుస్తకాలు చదవగలుగు తుంది. లెక్కల్లో కూడికలు, తీసివేతలు వంటి లాజిక్కులు మాత్రం అర్థం కావు.  

          మాటల్లో స్పష్టత ఇప్పటికీ లేదు. రీమా ఇప్పటికీ తన పేరు “వీమా” అనే పలుకు తుంది.  

          అయితేనేం! తినడం, స్నానం, బట్టలు మార్చుకోవడం వంటి తన పనులు తను అన్నీ సొంతంగా చేసుకోగలుగుతుంది. 

          ఐ పాడ్ మీద అతి వేగంగా ఆటలు ఆడగలుగుతుంది. పాటలు, డాన్సులు అంటూ ఎప్పుడూ నవ్వుతూ, తుళ్ళుతూ  ఉంటుంది.  

          అన్నిటినీ మించి అబద్ధమాడడం రాదు!  

          తనకే ప్రత్యేకమైన ఆ కళ్ళు , మనస్సు అందరిలాంటివి కావు! కల్మషరహితమైనవి!! 

          తనేమిటో తనకి తెలియదు. ఎప్పటికైనా తెలిస్తుందో లేదో. తెలియపోతే బావుణ్ణు! 

          కానీ తన ఆనందాన్ని  చూస్తూ ఉంటే ప్రతిరోజూ నాకు ఒకకొత్త వెలుగు కనిపిస్తుంది. 

*****

Please follow and like us:

15 thoughts on “వీమా (కథ)-డా||కె.గీత”

  1. Heart touching narration Geeta garu. చదవటం పూర్తయినా వీమాను కళ్ళ ముందు నుండి కదపలేకపోతున్నా… Nursing course లో ఎన్నో చూసా… They need empathy and not sympathy. ఆ తల్లి తపనకు, మనోధైర్యానికి జోహార్లు. అలాంటి పాపాయిల వంక అదే పనిగా చూడటం కూడా వారిని, వారి సంబంధితులను బాధించటమే అని తెలుసుకున్నా….My love and hugs to such innocence ❤️

  2. వీమా చాలా అసాధారణమైన చిన్ని character ni తీసుకుని ఎంతో విపులంగా study చేసి రాసిన కథ. కథ కాదు నిజమా అనిపించేట్టు ఉంది. రీమా తల్లి తండ్రి బాధ గ్రహించ గలను. ఏమంటే మాకుంటుబం లో ప్రస్తుతం ఇలాంటి పాప ని మా అనుభవాలు కూడా అలాగే ఉన్నాయి. డౌన్ సిండ్రోమ్ గురించి ఇంత పరిశీలించి ఇంత కన్విన్సింగ్ రాసిన గీత గారికి ఎన్నెన్నో అభినందనలు.
    Sincerely suguna ( అక్షర)

  3. Geetha madam , డౌన్ సిండ్రోమ్ గురించి చాలా వివరంగా తెలిపారు. అటువంటి దియాబిలిటి కి గురి అయిన బాధ పడి తిరిగి ఎలా పరిస్థితిని ఎదురుకుంటు పాపని ఎలా పెంచుకుంటున్నారు ఆ ఇద్దరూ అన్నది ఎంతో comvincing గా రాశారు. హృదయపూర్వక abhinanalu.
    Sincerely suguna ( అక్షర)

  4. కధ బాగుంది అనటం తేలిక కానీ, ఆ తల్లిదండ్రుల వ్యధ వర్ణించటం అంత తేలికకాదు,ఒక సమస్యను ఎలా ఎదుర్కోవాలో తెలియచేశారు,అభినందనలు

  5. geetha mam,

    the agony of the parents who have children with such disorders are highly pathetic. what happens to these children after the demise of their parents, your story superbly reflected the agonized experiences of the parents, ur story brought tears to my eyes as it made me to reflect on the deplorable condition of my sister’s grand daughters who are born with autism

  6. డౌన్ సిండ్రోమ్ సంతానం ఉన్న తల్లిదండ్రుల ఆవేదన, మనోభావాలు చాలా చక్కగా తెలియచేశారు. వారితో ఇతరులు ఏ విధంగా ప్రవర్తిస్తే బాగుంటుందో, కూడా తెలుస్తుంది. వారి మీద జాలి కాక, చేయూత నిచ్చి చెరదేయాలి వారిని అర్థం చేసుకొని. ఈ ప్రపంచం వారిది కూడా కదా, వారికీ జీవితాన్ని ఆస్వాదించే అవకాశాలు ఉండాలి. అదే న్యాయం. ఈ కథలో చాలా సమాచారం ఉందని కచ్చితంగా చెప్పగలను.

    1. మీ వ్యాఖ్యకి ధన్యవాదాలు. మీ పేరు రాయలేదు. వీలైతే చెప్పగలరా?

      1. నా పేరు రాయప్రోలు వెంకట రమణ శాస్త్రి (రా. శా. )
        హైదరాబాద్

        1. నాపేరు పి. వి. శేషారత్నం ‘డాక్టర్ కె. గీత గారి వీమా కథ అద్భుతం గా ఉంది. 1991 లో డాక్టర్ వి చంద్రశేఖర్‌ గారి జీవని అనే ఇటువంటి కథను నేను రేడియో నాటకి కరణ చేసాను. జాతీయ స్థాయిలో ప్రథమ బహుమతి పొందాను. సమాజంలో ప్రస్తుతం ఇటువంటి పిల్లలు ఎక్కువవుతున్న నేపధ్యంలో వీరూ వంటి కథలు ఎందరికో మార్గ దర్శనం చేస్తాయి.
          అమెరికా నేపద్యంలో ని ఈ కథ ఆధునిక శిక్షణా రీతులను తెలియ జేస్తూ ఎందరికో ఆ త్మ స్థైర్యాన్ని స్తుందనడంలో
          ఎలాంటి సందేహం లేదు.

  7. గీతగారూ! కథ సూపర్! ఈ మధ్య తరుచుగా ఇలాంటి పిల్లలు కనబడుతున్నారు. గుండె భారమవుతుంది
    అలాంటి పిల్లల్ని చూస్తుంటే ! వారిపట్ల ఎలా ఉండాలో, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చాలా చక్కగా వివరించారు.👏

    1. మీ ఆత్మీయ ప్రతిస్పందనకు ధన్యవాదాలు లలిత గారూ!

Leave a Reply

Your email address will not be published.