ఆంతర్యం (కథ)

– లలితా వర్మ

          ఆఫీసు నుండి యిల్లు చేరి లోపల అడుగుపెట్టే సరికి ఘుమఘుమలాడే పకోడీ వాసన ముక్కు పుటాలను చేరి, అంత వరకూ ట్రాఫిక్ జామ్ లో, పొల్యూషన్ లో, పెట్రోల్ వాసనలు, దుమ్ము పీల్చి పీల్చి అలసిన ముక్కుకి స్వాంతన చేకూర్చింది.
 
          తొందరగా ఫ్రెషప్పయి సోఫాలో కూలబడి టీ.వీ.రిమోట్ చేతిలోకి తీసుకున్నానో లేదో అమ్మ పకోడీ ప్లేటు అందించి పక్కనే కూర్చుని
 
          “తులసి ఆంటీ ఫోన్ చేసింది “అంది ఉపోద్ఘాతంగా
 
          “ఏంటట” అన్నాను కొంచెం కేర్ లెస్ గా 
 
          “వాసుకి ట్రాన్స్ఫర్ అయి హైదరాబాద్ కి వచ్చేశారట. ఓ సారి రమ్మంది.” అంది అమ్మ
 
          “ఎందుకుట ” మనతో పనేంటి అనే భావం వుట్టిపడేలా అన్నాను.
 
          నా మనోగతం అమ్మకు అర్థమవుతూనే వుందని నాకు తెలుసు.అయినా అమ్మ ఓపిగ్గా చెప్తుంది.
 
          “వాసు అక్కడేదో స్టేజ్ మ్యారేజ్ చేసుకున్నాట్ట. భార్యని తీసుకుని వచ్చాట్ట. ఓ సారి వచ్చివెళ్ళమంది.”
 
          “ఓహో! అలాగా!! అయితే నువ్వెళ్ళు”  పకోడీలు కర కరా నముల్తూ,  వెటకారంగా, కాస్త రోషంగా అన్నాను.
 
          “సరే నన్ను దింపేసిరా మళ్ళీ కాల్ చేసినపుడు వొచ్చి పిల్చుకెళ్లు యింట్లోకి రావద్దు లే” అంది అమ్మ.
 
          “నడిచెళ్ళు దగ్గరేగా “అన్నాను .
 
          ” నువ్వుదింపుతావా నన్ను బండి తీసికెళ్లమంటావా ” అమ్మ సీరియస్ అవుతుందని తెలుస్తుంది.
 
          “అమ్మో! ఒద్దులే యీ ట్రాఫిక్ లో ! !వస్తాలే రెడీ అవ్వు ! నా మొహాన కాస్త టీ నీళ్లు పోసి!!!
 
          అంటూండగానే అమ్మ టీ తీసుకొచ్చి చీర మార్చుకోవడానికి లోపలికెళ్లింది.
 
          టీ.వీ.లో ఏదో చూస్తున్నా , యథాలాపంగా కళ్ళు చూస్తూనే వున్నాయి కానీ మెదడుని చేరట్లేదు.
 
          మెదడంతా గతంలో జరిగిన విషయాలను నెమరేస్తుంది…………..
 
          చిన్నప్పటి నుండీ  సీతాఫల్ మండిలో వుంటున్న తమకి చుట్టుప్రక్కల అందరూ స్నేహితులే కానీ, బంధువలెవరూ లేరు. ఆరేళ్ళ క్రితం ఆ ఏరియాకి తమ దూరపు బంధువుల కుటుంబమొకటి వొచ్చినట్లు తెలిసి అమ్మ తనని తీసుకుని వెళ్లింది.
 
          అపుడు తను పదవతరగతిలో వుంది. తులసి ఆంటీని మొదటిసారి చూసినపుడు గౌరవభావం యేర్పడింది.
 
          పోచంపల్లి కాటన్ చీరలో, నుదుట పెద్ద బొట్టుతో, మెడమీదుగా వేసుకున్న ముడితో, సరియైన యెత్తు, యెత్తుకు తగిన లావు, చాలా చక్కని పర్సనాలిటీ ఆంటీది. అమ్మా, ఆంటీ వాళ్లబంధువులనందర్నీ తోడి తోడి గుర్తు చేసుకుంటూ కబుర్లు చెప్పుకుంటుంటే 
ఇల్లంతా పరిశీలనగా చూసింది తను. ఇంట్లో పొందిగ్గా అమర్చిన వస్తువులు, షెల్ఫ్ లో కొన్ని ఫోటో ఫ్రేమ్ లు. అందులో ఒక ఫోటో తనని ఆకట్టుకుంది. తులసి ఆంటీకి ప్యాంటు షర్టు వేస్తే యెలావుంటారో అలా వున్నాడా ఫోటోలోని వ్యక్తి. అచ్చుగుద్దినట్లున్నాయి పోలికలు.
 
          వాళ్ళబ్బాయేమో అనుకుని చూస్తుండగా ఆంటీనే “మా అబ్బాయి వాసు, బి.కాం. చేస్తున్నాడు.” అంటూ పరిచయం చేసింది ఫోటోని.
***
          చాలాబాగున్నాడు అనుకుంది తను.
 
          ఆ తర్వాత రెండు కుటుంబాల మధ్య రాకపోకలు మొదలయ్యాయి. వాసు కూడా అపుడపుడూ వొస్తుండేవాడు. మామూలుగా మాట్లాడుకునే వాళ్ళు. అలా నాలుగేళ్ళు గడిచాయి. వాసుకి బ్యాంకులో వుద్యోగం దొరికి  వరంగల్  లో పోస్టింగ్ రావడంతో వెళ్లి పోయాడు. 
 
          ఒక రోజు అమ్మ అడిగింది.
 
          ” మాధురీ! తులసి ఆంటీ వాసుకి పెళ్ళిచేయాలను కుంటుంది. ఆంటీకి నువ్వంటే చాలా యిష్టం. నువ్వు తన కోడలైతే బాగుంటుందని అనుకుంటుంది యేమంటావ్” అని.
 
          కాసేపు ఆలోచించింది తను. వాసు మంచివాడే. ఆంటీ అంకుల్ కూడా చాలా ప్రేమగా వుంటారు తనతో. వాసు స్నేహంగానే వుంటాడు కానీ అతనికి తన పైన యే ఫీలింగ్స్ వున్నాయో తెలియదు.
 
          తనకీ ప్రేమలాంటి ఫీలింగ్ యేమీ లేదు బట్ లైఫ్ బాగానే సెటిలవుతుంది. అలా ఆలోచించి సరేనంది తను.
 
          కానీ రెండు రోజుల తర్వాత అమ్మా నాన్న మరో అబ్బాయితో తనకి పెళ్లిచూపులు యేర్పాటు చేసేసరికి స్టన్నయింది తను.
 
          విషయమేమిటంటే వాసు తనని చేసుకోనన్నాడట. అమ్మ మీద ఆంటీ మీద పీకల దాకా కోపమొచ్చేసింది. అతణ్ణి అడక్కుండానే ఆ విషయం తనతో ప్రస్తావించడ మెందుకు????
 
          నా ఆత్మాభిమానాన్ని దెబ్బతీయడమెందుకు ??????
 
          చేసుకోనన్నాట్ట!
 
          ఎందుకు??????
 
          ఆయనగారి అందానికి తను సరిపోదా???
 
          అద్దంలో చూసుకుంటూ ఎన్నిసార్లు పాడుకుందో “అందంగా లేనా! అసలే బాలేనా! నీ యీడు జోడూ కాననా! !!అంటూ….
 
          థాంక్ గాడ్ తను అతని పై  యే వూహలూ అల్లుకోలేదు, యెలాంటి కలలు కనలేదు
 
          అయినా యెక్కడో ఈగో హర్ట్ అయింది
 
          ఆతర్వాత.
 
           అంకుల్ రిటైర్ అవడంతో వాళ్ళు వరంగల్ షిఫ్టయారు..
 
          ఇన్నాళ్ళకు మళ్లీ యిప్పుడిలా! !!
 
          “పద మాధురీ! ” అమ్మ పిలవడంతో జ్ఞాపకాల్లోంచి బయటపడి బయలుదేరాను.
 
          అయిదు నిమిషాల్లో ఆంటీ యిల్లు చేరాం.
 
          “సరే !వెళ్ళు మరి!  ఓ అరగంట తర్వాత కాల్ చేసేదా”????
 
          అడిగింది అమ్మ.
 
          నాకెందుకో ఆ అందగాడు చేసుకున్న ఆ అందగత్తె యెలావుంటుందో చూడాలన్పిం చింది. బండి పార్క్ చేసి” నేనూ వస్తా పద” అంటూ లోపలికెళ్ళాను.
 
          హాల్లో ఆంటీ ఒక్కర్తే సోఫాలో కూర్చుని వుంది.
 
          మమ్మల్ని చూడగానే ఆవిడమొహంలో సంతోషం!!!!
 
          బాగున్నారా వదినా? బాగున్నావా మాధురీ ?అంటూ ఎదురొచ్చింది.
 
          లేని నవ్వు మొహాన పులుముకుని నమస్తే ఆంటీ అని కూర్చున్నాను.
 
          అమ్మా ఆంటీ మాట్లాడుకుంటున్నారు.
 
          రెండు నిమిషాల తర్వాత వాసు గదిలోంచి బయటకొచ్చి నవ్వుతూ పలకరించి తనూ కూర్చున్నాడు.
 
          యిప్పుడే వస్తానంటూ ఆంటీ లోపలికెళ్ళి రెండు నిమిషాల్లో వొచ్చికూర్చుంది.
 
          మరో అయిదు నిమిషాలు వరంగల్ విశేషాలు, పిచ్చాపాటీ మాటలు కొనసాగు తుండగా బిస్కట్, టీలున్న ట్రే పట్టుకుని ఒకమ్మాయి వొచ్చి మాకు టీ లందిస్తుంటే
 
          “యిప్పుడే తాగేసి వొచ్చాము వొద్దమ్మా అన్నాను.”
 
          “ఫరవాలేదు హాఫ్ కప్ తీసుకోండి”!! అందా అమ్మాయి.
 
          పనమ్మాయైనా వాయిస్ చాలా బాగుంది.
 
          ‘మనిషి నల్లగా బక్క పలుచగా యెత్తుపళ్లతో చూట్టానికి అందవికారంగా వున్నా వాయిస్ చాలా బాగుందే’ అనుకున్నాను.
 
          మా ముగ్గురికీ టీలందించి బిస్కట్స్ వున్న ట్రే టీపాయ్ మీద పెట్టిందా అమ్మాయి.
 
          “నువ్వూ  కూర్చోమ్మా  “!! అని ఆంటీ చెప్పడంతో వాసు ప్రక్కన కూర్చున్న తనని చూసి షాక్ అయ్యాను.
 
          అమ్మ వంకచూస్తే అమ్మకూడా బిత్తరవోయి చూస్తుంది.
 
          మేము ఆశ్చర్యం నుండి తేరుకోక ముందే మా కోడలు దీపిక అంది ఆంటీ.
 
          మాకు నోట మాట రావట్లేదు. ఆ అమ్మాయి నమస్తే అందేమో !!!! మేమిద్దరం చిన్నగా తలూపామేమో! !!!ఏమో !!!!
 
          వాసు చేసుకుంది యీ అమ్మాయినా? ???? జీర్ణించుకోలేక పోతున్నాను.
 
          మా ఆశ్చర్యాన్ని ఆ అమ్మాయి కూడా పసిగట్టినట్లుంది. ఇబ్బందిగా కదిలింది.
యెక్కువ సేపు వుండలేక బై చెప్పి బయటపడ్డాం.
***
          ఇల్లుచేరి సోఫాలో కూలబడి వాసు గురించే మాట్లాడుకున్నాం. వాసు చాలా అందం గా వుంటాడు.అతనికి తగిన అమ్మాయి ఎక్కడదొరుకుతుందో అనుకునేవాళ్ళం. చివరికిలా చేశాడెందుకు???
 
          “వాసు పనిచేస్తున్న బ్యాంక్ కి అమ్మాయి తరచూ వచ్చేదట. ఏదో ప్రైవేట్ స్కూల్లో టీచర్ గా చేస్తూ తనకొచ్చిన జీతంలో కొంత వికలాంగుల సహాయం కోసం దాచేదట. చాలా ఉదార స్వభావమట. అది నచ్చినందుకే వాసు చేసుకున్నాట్ట.”
 
          ఆంటీ ఫోన్ లో చెప్పిన విషయాలు అమ్మ చెప్తుంటే వింటూ కూర్చున్నాను.
 
          ఇంతలో ఫోన్ రింగయింది.” హలో హనీ యిప్పుడే ఎయిర్ పోర్ట్ కి బయలుదేరాను. నైట్ ట్వెల్వ్ అవుతుంది వొచ్చేసరికి. డైరెక్ట్ గా యింటికెళ్లిపోతాను. నువు రేపు మార్నింగ్ వచ్చేసెయ్” 
 
          నాలుగు రోజులక్రితం ఆఫీసు వర్క్ పైన చెన్నై వెళ్లిన భర్త రాజేష్ ఫోన్ లో.
 
          “అలాగే లెండి ” అని చెప్పేసి
 
          ” అమ్మా పొద్దున్నే వెళ్తాను. తొందరగా లేచి టిఫిన్ గిఫిన్ అని కంగారు పడకు. నేను వెళ్లి చేసుకుంటాలే రాజేష్ కి కూడా అవసరం కదా ” అని అమ్మతో చెప్పి బట్టలవీ సర్దుకోవడానికి గదిలో కెళ్ళాను.
***
ఆరు నెలల తర్వాత
 
          ఒకరోజు అమ్మ ఫోన్.
 
          “మాధురీ ! నీ ఫ్రెండ్ అడ్వొకేట్ ఒకమ్మాయి వుంది కదా! తనతో మాట్లాడాలి” అంది
 
          “యెందుకేమిటి “?అన్నాన్నేను.
 
          “విడాకుల కోసం.”
 
          “ఛ  యీ వయసులో విడాకులేంటి మమ్మీ! అయినా నాన్న బాగానే చూసుకుంటాడుగా నిన్ను లేదంటే నాన్నకేమైనా ఏఫైరా?????”
 
          “నోరు మూస్తావా నువ్వూ నీ కుళ్ళు జోకులు విడాకులు దీపకు .
***
          నోట్లో పెట్టుకున్న చపాతీముక్క జారిపోయింది నేను నోరుమూయడం మర్చిపోవడంతో.
 
          తెరచిన నోరు మూయటానికి క్షణం పట్టింది “దీపకి విడాకులా?  ఎందుకుట”
 
          “సాయంత్రం రా చెప్తాను, అట్లాగే మీ ఫ్రెండ్ని కూడా తీసుకురా” అని ఫోన్ పెట్టేసింది అమ్మ.
 
          ఆఫీసులో వర్క్ చేస్తున్నా అదే ఆలోచన. వాసు యెంతో ఆదర్శంగా చేసుకున్నాడా అమ్మాయిని. ఏం జరిగివుంటుంది? ఎందుకు విడాకులు????
 
          బుర్ర యెంత బద్దలుకొట్టుకున్నా ప్రయోజనం లేదని తెలిసి ఆ ప్రయత్నం మానేసి’ సాయంత్రం అమ్మా వాళ్లింటికెళ్తున్నాను అక్కడికే వొచ్చేయండి ‘అని రాజేష్ కి మెసేజ్ పెట్టి వెళ్లాను.
 
          అమ్మ సున్నుండలు జంతికలున్న ప్లేటు తెచ్చివ్వబోతే “ఇపుడవన్నీ వొద్దు అసలేం జరిగిందట? నీ కెలా తెలుసు? అడ్వొకేట్ ని మనం చూడటం దేనికి”?   అని ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేస్తుంటే 
 
          చెప్తా కూర్చో అంటూ చెప్పసాగింది అమ్మ.
 
          “ఒకసారి ఆంటీ దీపని తీసుకుని మనింటికొచ్చింది. తర్వాత దీప తరచూ ఒక్కర్తే వొచ్చి కాసేపు కూర్చుని వెళ్ళేది. వాళ్ళ పుట్టింటి సంగతులు, అత్తగారి మంచితనం అన్నీ చెప్తూ చాలా చనువు యేర్పరచుకుంది నాతో. నాక్కూడా ఆ అమ్మాయి మనస్తత్వం నచ్చింది. తను డబుల్ ఎం.ఏ చేసిందట. నాన్నగారి కాలేజీలో పోస్టేదైనా ఖాళీగా వుంటే చెప్పమని అడిగింది. సరే నని చెప్పాను. పోయిన్నెల్లోనే జాబ్ లో జాయినయింది.
మొన్ననొక రోజు సాయంత్రం యింటికొచ్చి ఏడవటం మొదలెట్టింది. ఏంటని అడిగితే ‘నేను విడాకులు తీసుకోవలనుకుంటున్నానాంటీ. నాకిక్కడ యెవరూ తెలియదు. మీరే సహాయం చేయాలి’ అంది.
 
          ‘ఎందుకని అడిగాను.’
 
          వాసు నన్ను చాలా హింసిస్తున్నాడాంటీ అంది.
 
          వాసు నిన్ను హింసించడమా? నేన్నమ్మను అన్నాను.
 
          అవునాంటీ యెవరూ నమ్మరు. కానీ యిది నిజం. మీరు నా తల్లిలాంటివారు. అందుకే చెప్తున్నాను మా అమ్మకి కూడా చెప్పలేదాంటీ యీ విషయం.
 
          వాసు ….వాసు ..ఈజ్ ఆన్ ఇంపోటెంట్.
 
          ఆ విషయం దాచిపెట్టి నన్ను యేరికోరి పెళ్లిచేసుకున్నాడు. మొదటి రాత్రే ఆ విషయం యెవరితోనైనా చెబితే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు.
 
          అయినా యింత అనాకారిని నన్నెవరు చేసుకుంటార్లే అని, వాసు భార్యగా సంఘంలో ఓ గుర్తింపు, గౌరవమన్నా దక్కుతాయికదా !అనుకుని సరిపెట్టుకున్నాను.
 
          కానీ  ప్రతి వొక్కరికీ పనిగట్టుకుని తానేదో నన్ను ఉధ్దరించినట్లు పిలిచి మరీ పరిచయం చేయడం, ఆదర్శంగా వివాహం చేసుకున్నానని టముకేసుకుని చెప్పడం, అందరూ నా వంక అదోలా చూడటం చాలా బాధేస్తుందాంటీ.
 
          ఇక వుద్యోగంలో చేరినప్పటి నుండీ రాత్రుళ్ళు నరకమే. నేను పనికి రానని యెవరైనా దొరుకుతారని వెళ్తున్నావా వుద్యోగం వంకతో. కాకపోతే యిపుడు జాబ్చే యాల్సిన అవసరమేమొచ్చింది అని టార్చర్ పెడుతున్నాడాంటీ అని బోరున యేడ్చిందమ్మా “
 
          అని చెప్పడం ఆపింది అమ్మ.
 
          ఇంతలో వొచ్చింది సుధ. ఏంటే అర్జంట్ గా రమ్మని మెసేజ్ పెట్టావ్ అందివొస్తూనే.
 
          విషయమంతా వివరించారు తల్లీ కూతుళ్ళు అడ్వకేట్ సుధకి.
 
          “అంటే వికలాంగులంటే వున్న కన్సర్న్ తో వాసుని ఒక వికలాంగుడిగా భావించి సర్దుకు పోయింది.
 
          బట్ అతనిలోని మానసిక వికారాన్ని తట్టుకోలేక పోతోంది. అందుకే విడాకులు కోరుతుందన్నమాట.!!!! ఆవిడ నిర్ణయం సరైనదే. ! ఫామిలీ కోర్టు ద్వారా యిప్పిం చొచ్చు…. ఆ కుటుంబం పరువు కాపాడాలని కదా ఆ అమ్మాయి విషయం యెవరికీ చెప్పలేదు. ఆప్తులనుకున్న మీకే చెప్పింది కదా. !!!!! సరే పిలిపించండి మట్లాడదాం” అంది సుధ. 
 
          దీప కోరినట్లే విడాకులు మంజూరయ్యాయి.
 
          నేను మాత్రం షాక్ నుండి తేరుకోవడానికి చాలా రోజులు పట్టింది. మనిషి అందం, ప్రవర్తన, అన్నీ మన కళ్ళకి అద్భుతంగా కన్పించినా  …  
 
          “ఆంతర్యం ” మాత్రం కన్పించదు కదా! !!! అనే నిజాన్ని చాలా రోజుల తర్వాత జీర్ణించుకో గలిగాను.

*****

Please follow and like us:

6 thoughts on “ఆంతర్యం (కథ)”

  1. ఆంతర్యం కథ చాలా బాగుంది లలితా వర్మ గారు. వాసు అందంగా ఉంటాడని పెళ్లి చేసుకోవాలని ఆశపడిన మాధురికి, అతని ఆంతర్యం తెలిసింది. విడాకులతో దీపకు న్యాయం చేసారు. అభినందనలు లలితా వర్మ గారు.

  2. Magatanam లేని వాడు విషయం దాచి పెళ్లి చేసుకోవటమే పెద్ద నేరం.. న్యాయ రీత్యా విషయం తెలిసిన వెంటనే కేసు ఫైల్ చేసే.ప్రావదానం ఉండాలి. అంతవరకు ఇలాంటి వివాహాలు జరుగుతూనే ఉంటాయి.
    అమ్మాయిలుi ఈ స్థితికి బలి కాక తప్పదు.
    Suguna (అక్షర).

  3. కథలు వ్రాసే వాళ్ళు ఎడిటింగ్, విరామచిహ్నాలు అన్నీ సరి చూసుకుంటే చదవడానికి సాఫీగా ఉంటుంది.

  4. ఈ కాలం లో జరుగుతున్నవి. కళ్లకు చూపించి నట్లుంది. కారణం ఏదైనా, ప్రేమించి, పెళ్లి చేసుకోవడం ఆ తర్వాత విడి పోవడం.
    మనిషి బాహ్య సౌందర్యం చూడకూడదు అనే సందేశం ఇచ్చారు.

  5. ఆంతర్యం కథ బాగుంది.పెళ్లి చేయాలంటే, అందం చదువు, ఆస్తి లాంటివి చూస్తాం. వారి గుణగణాలు, ఆంతర్యం తెలియవు.ఇంకా మగ వాళ్లకి మగతనం, ఉందా, లేదా అనేది పెళ్లి అయినాక భార్యకి మాత్రమే తెలుస్తుంది.మగతనం లేని మగవాడు పెళ్లి చేసుకోవడమే పెద్ద తప్పు. అది చాలక భార్యను హింసించడం మహాపరాధం.అలాటి వాడికి విడాకులు ఇవ్వడం న్యాయము. రచయిత్రి మంచి ముగింపు ఇచ్చారు.రచయిత్రికి అభినందనలు.

Leave a Reply

Your email address will not be published.