నల్లబడిన ఆకాశం
– డా॥కొండపల్లి నీహారిణి
కొంత చీకటి తలుపు తెరుచుకొని వచ్చాక
నిన్నటి కారు మేఘం క్రోధమంతా మరచినప్పుడు
కొత్త దారిలో చూపుగాలానికి చిక్కుతుంది
మసక బారిన దృశ్యాలు కంటి తెరపై టచ్చాడి
ఉచ్చులు విడదీసుకుంటూ పెనవేసుకుంటూ
గది మొత్తం కథలా కదలాడుతుంది
పెదవి విరిచిన ముసలినవ్వొక్కటి
నువ్వు పుట్టినప్పటి సంగతులు గతితప్పనీయని మజిలీలనుకున్నది
మబ్బులు కమ్మిన నింగి వెనుక ఏమి దాగుందో
చీకటిలో కలవాలనే హృదయ జ్యోతులు
వ్యధాభరిత వృద్ధాప్యానికి పెనుసవాళ్ళనేమీ విసరవు
సన్నగిల్లిన ఏకాగ్రత
మరుపు దారి పట్టిన జ్ఞాపకశక్తి ప్రేరణ లేని జీవనం
గాఢతలేని స్పందన సవ్యాపసవ్యాలను తనవి చేసుకున్న
ముదిమి ఆవృతం
నిన్ను ఏ వృత్తంలో బంధిస్తాయి
పరిపూర్ణత మొత్తం ఏ చట్రంగాక
వయసు పరాధీనతల అవమానాలు
వివేక శూన్యులనే బిరుదుల సత్కారాల
పండుటాకులు
పాత సామాన్లు గా
పట్టలేని శూన్యత చేరిన స్పాట్లైట్ మౌనం
ఎన్ని కంటకాలు పరివృతమైనాయో
దాటి వచ్చిన రాళ్ళూరప్పలు ఇప్పుడు మంచం చుట్టూ నడుస్తున్నట్టున్న మాటలు
ఒక్కో ప్రహరీకి ఒక ముచ్చట ఇంటింటికోమంటిపొయ్యి
కేర్ టేకర్లూ లేని ఎండుటాకులు మూడో కాలుతో
భూతద్దపు అద్దాలతో
ఊడిన పళ్ళతో
ఊగిసలాడే మనసుతోనే వెళ్ళదీత
గదిని కాపలా కాసే చీకటి ఒక్కటే ఇప్పుడు వాళ్ళ కు స్నేహమైంది
నడిచొచ్చిన అన్ని ప్రయాణాలను కాలదన్నిన
ఈ దీర్ఘ జీవితం
పశ్చిమాకాశం వెలుగు చిన్నబోయి
కనుపాపగా మారినట్టు
ఆ నల్లబడిన ఆకాశం ముసలిదైపోయింది
*****