ధీర
(నెచ్చెలి-2023 పోటీలో ప్రథమ బహుమతి- శ్రీమతి కె.వరలక్ష్మి ఉత్తమ కథా పురస్కారం పొందిన కథ)
– బ్రిస్బేన్ శారద
ఆఫీసులో నా కేబిన్‌లో ఎప్పట్లానే పనిలో తల మునకలుగా వున్నాను. ఈ రిపోర్ట్ శుక్ర వారం కల్లా పంపాలి. వున్నట్టుండి మీటింగ్ అలర్ట్ మోగింది. పొద్దున్న తొమ్మిదింటికి ఏం మీటింగ్? చిరాగ్గా కంప్యూటర్ మీద కేలండర్ తెరిచి చూసాను. అంజనాతో మీటింగ్!
అంజన నా టీంలో ఒక యేణ్ణర్థం కింద చేరింది. పర్సనల్ మీటింగ్ రిక్వెస్టు పెట్టింది
నాలుగు రోజుల క్రితం. గుర్తొచ్చింది.
టైపు చేస్తున్న డాక్యుమెంటు మూసి, కంప్యూటర్‌లోంచి లాగవుట్ చేసి, ఆఫీసు కిచెన్‌లోకి వెళ్ళి ఒక కప్పు వేడి కాఫీ తెచ్చుకుని కూర్చున్నాను. ఫోన్ తెరిచి ఊరికే మెసేజీ లు చూస్తూండగానే తలుపు తెరుచుకొని లోపలికొచ్చింది అంజన.
“గుడ్ మార్నింగ్ మేడం!” కుర్చీలో కూర్చుంటూ అంది.
“గుడ్ మార్నింగ్ అంజనా. ఎలా వున్నావ్?”
“బానే వున్నాను మేడం.”
“ఆఫీసులో పనీ, టీం మేట్స్ అంతా అలవాటయ్యారా? హోప్ దేర్ ఆర్ నో ప్రాబ్లంస్,” ఆమె వంక నిశితంగా చూస్తూ అడిగాను. సాధారణంగా పర్సనల్ మీటింగ్ రిక్వెస్ట్ అంటే పని మార్చమనో, గ్రూపు మార్చమనో రిక్వెస్టు వుంటుంది. ఇదీ అలాటిదే అయి వుంటుంది.
అంజన కొంచెం సర్దుకోని కూర్చుంది. గొంతు సవరించుకుంది. మొహం
సీరియస్‌గా వుంది.
“అదీ, మేడం! ఇది కొంచెం సీరియస్ మేటర్.” కొంచెం ఆగింది.
నేను ఏమీ మాట్లాడకుండా కూర్చున్నాను. ఇటువంటి సంభాషణల్లో అవతలి వారి
ఆలోచనలు డిస్టర్బ్ చేయకూడదు. వాళ్ళు ఆలోచనలనీ, మాటల్నీ కూడదీసుకునేందు కు కావాల్సిన సమయం ఇస్తూ మౌనంగా వుంటే చాలు. చెప్పదల్చుకున్నది వాళ్ళే చెప్తారు. మనం వినాలి.
“మేడం, ఇది శ్రీనాథ్ సార్ గురించి. మీరిద్దరూ కొలీగ్సే కాదు మంచి ఫ్రెండ్స్ అట కదా?”
ఆశ్చర్య పోయాను. శ్రీనాథ్ గురించా? శ్రీనాథ్ నేనూ ఈ సంస్థలో ఒకేసారిట్రెయినీలు గా చేరాం, పదిహేనేళ్ళ క్రితం. ఇద్దరమూ అందుకే మంచి స్నేహితులం కూడా. కొంచెం వృత్తిపరమైన పోటీ వున్నా, ఇద్దరమూ ఒకే టీం కావడంతో పరస్పర సహకారంతోనే పని చేసుకుంటున్నాము. శ్రీనాథ్ అధ్వర్యంలో ఒక నలుగురు జూనియర్ ఇంజినీర్లు పని చేస్తున్నారు. వాళ్ళలో అంజన కూడా ఒకర్తి. ఇప్పుడు శ్రీనాథ్ గురించేం చెప్తుంది తను? ఇంకొంచెం అటెంటివ్ మోడ్‌లోకి వచ్చి అన్నాను,
“అవును అంజనా, శ్రీనాథ్ నేనూ ఒకే బాచ్‌లో ట్రెయినింగ్ మొదలు పెట్టాం. పదిహేనే ళ్ళుగా కలిసి పనిచేస్తున్నాం కాబట్టి, వీ హేవ్ అ గుడ్ రాపో. అయితే, అదంత ముఖ్యమైన విషయం కాదు. ఏం చెప్పదలుకున్నావో నిర్భయంగా చెప్పు.”
“మేడం, శ్రీనాథ్ సారు ఒక ఆరు నెలలుగా నన్ను ఇబ్బంది పెడుతున్నారు.మొదట
కొంచెం అతి పర్సనల్‌గా మాట్లాడటం, నా డెస్కు దగ్గర అతి దగ్గరగా నిల్చోవటం, అనవసరంగా భుజాల చుట్టూ చేతులేసి దగ్గరకు లాక్కోవడం, నా బట్టలూ, మేకప్పూ గురించి సలహాలివ్వడం మొదలు పెట్టారు. ఆ తరవాత ఇంకొంచెం డోసు పెంచారు. నాకు చాలా ఇబ్బందిగా వుంది. చాలా స్ట్రెస్ఫుల్ గా అనిపిస్తుంది. ఇలా బయటికి చెప్తే అన్నీ చిన్న విషయాలే అనిపిస్తుంది కానీ, చాలా చిరాగ్గా వుంది. “
చాలా ఆశ్చర్యపోయినా, మొహం మీద అదేమీ కనపడనీయలేదు.
“ఆర్ యూ ష్యూర్?” అన్నాక ఆమె నా వైపు చూసిన చూపు చూసి, అలా అడగకుండా
వుండాల్సింది అనుకున్నాను.
“మేడం, నా దుస్తుల సైజు అడగటం, అసభ్యమైన సినిమా పాటల గురించిచర్చలు
లేవదీయడం, ఇవన్నీ ఆయన అందరు అమ్మాయిలతో చేస్తారో లేదో తెలియదు. నాకు మాత్రం ఆ ప్రవర్తన అసలు నచ్చడం లేదు. ఒక నెల రోజుల కింద ఆదివారం సాయంత్రా లు మా ఇంటికి రావడం మొదలు పెట్టారు. అమ్మా నాన్నలకి సర్ది చెప్పేసరికి చాలా కష్ట మయింది. ఆఖరికి ఒక రోజు నేనే ఆయనతో చెప్పాను, మా ఇంటికి ఆయన రావడం నాకు నచ్చడం లేదని. మొకంగంటు పెట్టుకోని నాతో మాటలు తగ్గించారు. కానీ టీం మీటింగ్స్ లో నాతో చాలా మొరటుగా మాట్లాడడం, అందరిలో నన్ను హేళన చేయడం మొదలు పెట్టారు. మొన్న నేను ఒక రిపోర్టు అందరికీ పంపితే, దాని గురించి ఫీడ్ బేక్ పేరిట చాలా
దురుసుగా వ్యాఖ్యానాలు రాసి, అందరికీ ఈమెయిలు లో పెట్టారు. దట్ వాస్ వెరీ ఇన్సల్ టింగ్.” ఆమె మొహం ఎర్రబడింది.
“సరే, అయితే, ఇప్పుడేం చేయాలని? పై స్థాయికి కంప్లైంట్ చేయాలని వుందా?”
“తెలియదు మేడం. అందుకే మీ దగ్గరికి సలహా కోసం వచ్చాను. మీరు చెప్పండి,
నేనేం చేయాలి?”
“నువ్వు కంప్లైంట్ చేయగానే ముందుగా ప్రూఫ్ అడుగుతారు. నీ దగ్గర అలాటి
వేమైనా వున్నాయా?”
“ప్రూఫ్‌లా?”
“ఏదైనా పర్సనల్ టోన్‌తో వున్న మెసేజీలో, ఈ-మెయిల్సో, లేకపోతే అతను నిన్నిబ్బంది పెడుతూంటే చూసిన వాళ్ళో..”నా గొంతులో ఎంత అణుచుకుందామనుకు న్నా కొంచెం అసహనం, చిన్న ఇరిటేషన్ చోటు చేసుకుంది. ఆమెకి నా మొహంలో అపనమ్మకం కనిపించిందో ఏమో, కొంచెం చిన్నబోయింది.
“మీరు నన్ను నమ్మట్లేదు మేడం,” అంది నిరాశగా.
“అంజనా, నా నమ్మకంతో ఇక్కడ పనిలేదు. మేనేజ్మెంట్ దృష్టికి ఇది తీసికెళ్ళా లంటే నువ్వు అన్ని రకాలుగా తయారయి వుండాలి. ఎనీ హౌ, నాకొక్క వారం రోజులు టైమివ్వు, ఆలోచించి ఏం చేయాలో నిర్ణయించుకుందాం. ఈలోగా, కావాలంటే నిన్ను ఇంకొక టీంలోకి మార్చడానికి ప్రయత్నిస్తాను.”
“టీం మారొచ్చు మేడం, కానీ నాకు ఇప్పుడు నేను చేస్తున్న పని చాలా నచ్చింది. ఇంకో టీంలోకి మారితే, నేను మళ్ళీ అన్నీ కొత్తగా నేర్చుకోవాలి. నేనేం తప్పు చేసానని నాకు పనిష్మెంట్?”
“నాకు తెలుసు అంజనా. సరే, నాక్కొంచెం టైమివ్వు. హెచ్ ఆర్ టీంతో కూడా
ఒకసారి మాట్లాడతాను. ఓకె? కొంచెం కాఫీ ఏమైనా తాగుతావా?”
“నో మేడం. మీ సజెషన్ కోసం ఎదురు చూస్తూ వుంటాను. ప్లీజ్ ఏం చేయాలో
చెప్పండి.”
అంజన లేచి బయటికి వెళ్ళింది. ఏం చేయాలో ఆలోచిస్తూ కొంచెం సేపు కాఫీ తాగుతూ కూర్చున్నాను.
***
పదిహేనేళ్ళ క్రితం మా సంస్థ నిర్వహించిన గ్రాడ్యుఏట్ రిక్రూట్మెంట్ లో భాగంగా నేనూ శ్రీనాథ్, ఇంకా చాలా మంది ఫ్రెష్ ఇంజినీర్లం చేరాం. ఆ తరవాత సంస్థతో పాటు మేమూ ఎదిగాం. శ్రీనాథ్ చాలా తెలివైనవాడు, కష్టపడి పనిచేస్తాడు కూడా. కానీ కొన్ని సార్లు అతని మాటలూ, ఆలోచనలూ పరిచయమైన కొత్తలో చిరాకెత్తించేవి. మా బాచిలో
నలుగురమే ఆడపిల్లలం. మిగతా అంతా మొగ పిల్లలే. తరవాత బేచీల్లో అమ్మాయిలు బాగ చేరేవారనుకోండి. మాదొక మేనుఫేక్చరింగ్ యూనిట్ కావడంతో ఎక్కువగా మెకానిక ల్, ఎలక్ట్రికల్ ఇంజినీర్లని ఎక్కువగా ఉద్యోగాల్లోకి తీసుకునేవాళ్ళు.
అయిదేళ్ళ క్రితం నుంచీ మాకొక పూర్తి ఐటీ శాఖ తెరిచి చాలా మంది కంప్యూటర్ గ్రాడ్యుఏట్లని తీసుకోవడం మొదలు పెట్టారు. అలా మా గ్రూపులో చేరిన అమ్మాయి బీ టెక్ కంప్యూటర్స్ చేసిన అంజన. మా గ్రూపుకి కావాలసిన చిన్నా-పెద్దా వస్తువుల గురించి న వివరాల డేటా బేస్ నిర్వహణ ఆమె డ్యూటీ. ప్రోగ్రామింగ్, డేటా బేస్ మాత్రమే కాకుండా తను కంప్యూటర్ హార్డ్‌వేర్ విషయాల్లో కూడా చాలా సమర్థురాలు. గ్రూపులో చీఫ్ మెకానిక ల్ ఇంజినీరు శ్రీనాథ్ ఆమె తయారు చేసిన డేటాబేస్‌ని ఎప్పటికప్పుడూ సర్టిఫై చేస్తూ వుండాలి. అందుకే ఎప్పుడు అతనికి అందుబాటులో వుండాలి. అది అతనికి ఏవో లేని పోని ఆలోచనలనిచ్చిందా?
ఇంతవరకూ అతను ఆడవాళ్ళపట్ల అసభ్యంగా ప్రవర్తించడం కానీ, మాట్లాడడం కానీ నా దృష్టికైతే రాలేదు మరి. అయితే అంజన అబధ్ధం చెప్తూందా? పోనీ పొరపాటు పడిందా? అసలీ విషయాన్ని శ్రీనాథ్‌తో ప్రస్తావించడం ఎలా?
ప్రస్తావించాలా లేకపోతే చూసీ చూడనట్టు వదిలేయాలా? ఇటు వంటి సమస్య
ఎప్పుడూ ఎదురుపళ్ళేదు నాకు. ఆఫీసుల్లో వెకిలిగా మాట్లాడే మగవాళ్ళకు తక్కువేమీ లేదు మా సంస్థలో. కానీ ఇంత వరకూ దాన్ని గురించి బయట మాట్లాడింది ఎవరూ లేరు, నాతో సహా. అయితే మాకిలాటి ఇబ్బదికరమైన పరిస్థితులు ఎదురుపడ్డప్పుడు మాట్లాడ డానికి సీనియర్ కేడర్‌లో ఆడవాళ్ళెక్కువ వుండే వారు కాదు. వున్న ఒకరిద్దరితో మాకు ఎక్కువ చనువూ, మాట్లాడే ధైర్యమూ వుండేవి కాదు. అలాగే తిట్టుకుంటూ, పళ్ళ బిగువున
పని చేసుకుంటూ పోవడం అలవాటై పోయింది. ఇప్పుడేం చేయాలో అర్థం కాని ఈ పరిస్థితి. ఒకవైపు సహృదయుడూ, వృత్తిలో మంచి మిత్రుడూ అయిన శ్రీనాథ్, ఇంకో వైపు ఎన్నో ఆశలతో ఉద్యోగంలో చేరిన అమ్మాయి. ఇద్దరిలో ఎవరిని సమర్థించాలి?
***
సాధారణంగా ఆఫీసు విషయాలు ఇంటిదాకా తీసుకుపోవడం నాకిష్టం వుండదు కానీ, ఆ రాత్రి పడుకునేటప్పుడు ఆనంద్‌తో ఈ విషయం చెప్పాను.
మా బాచ్‌లో అందరికీ పెళ్ళిళ్ళైపోయాయి, ఒకరి పెళ్ళికి ఒకరం వెళ్ళొచ్చాం కూడా. మా సంస్థ మాకని కట్టి ఇచ్చిన ఇళ్ళల్లో ఒకే టౌన్షిప్ లో వుండడంతో సహజంగా కుటుంబ స్నేహాలు కూడా పెరిగాయి.
శ్రీనాథ్, ఆనంద్ కూడా మంచి స్నేహితులయ్యారు. ఇద్దరూ ప్రతీ వారం కలిసి టెన్నిస్ ఆడతారు. ఒకవేళ శ్రీనాథ్ మనస్తత్వంలో కానీ, ప్రవర్తనలో కానీ మార్పులొస్తే ఆనంద్ దృష్టిలోకి రాకుండా వుండదు.
“ఏమిటీ? శ్రీనాథ్ అసభ్యంగా ప్రవర్తించాడా? అన్బిలీవబుల్. అసలు ఈ మధ్య ఆడపిల్లలు చచ్చేంత అటెన్షన్ సీకింగ్గా తయారవుతున్నారు. వాళ్ళ వైపు చూసినా తప్పే, చూడకపోయినా తప్పే. లేకపోతే శ్రీనాథ్ ఎవరో ఆడపిల్లని వేధించడం ఏమిటి? తను చెప్పినా నువ్వెలా నమ్మావ్?”
“ఆడపిల్లలు ఇటు వంటి విషయాల్లో అబధ్ధం ఎందుకు చెప్తారు ఆనంద్?”
“టు ప్రువ్ దట్ దే ఆర్ డిజైరబుల్! ఎవరో తమని కోరుకుంటున్నారన్న విషయం వాళ్ళ అహాన్ని సంతృప్తి పరుస్తుందేమో! ఎవడికి తెలుసు?”
నిర్లక్ష్యంగా అన్నాడు. అతని మాటలకి చిరాకు ఎక్కువై చర్చ పొడిగించ లేదు.
ఆ పై ఆదివారం నేనూ, ఆనంద్ వూరికే శ్రీనాధ్ ఇంటికి వెళ్ళాం. శ్రీనాథ్ భార్య అనిత బేంకులో పని చేస్తారు. ఇద్దరూ చక్కటి జంట. ముత్యాల్లాటి ఇద్దరు ఆడపిల్లలు.
మేం వెళ్ళేసరికి భార్యా భర్తలిద్దరూ హాయిగా టీవీలో ఏదో సినిమా చూస్తూ వున్నారు. రెండు మూడు గంటల సేపు సరదాగా గడిపాం. మేం తీసుకెళ్లిన పావ్ భాజీ తిని అనిత చేసిన టీ తాగి బోలెడు కబుర్లు చెప్పుకున్నాం.
శ్రీనాథ్లో అసలు ఎటువంటి మార్పూ కనబడలేదు. ఎప్పట్లాగే ఆఫీసు మేనేజి మెంటునీ, హైదరాబాదు ట్రాఫిక్కునీ తిట్టిపోసాడు. పిల్లలతో పాటు కార్టూన్లు చూసి పడీ పడీ నవ్వాడు. భార్య మీద బోలెడన్ని జోకులు వేసాడు. ఎప్పట్లాగానే సందడిగావున్నాడు.
అంజనానే ఏదో పొరబడి వుంటుంది.
అంజనా అబద్ధం చెప్పకపోతూ వుండొచ్చు, కానీ శ్రీనాథ్ చూపించే మామూలు
స్నేహాన్నీ, ఎక్స్ట్రావొర్టెడ్ బాడీ లాంగ్వేజీని తప్పుగా అర్థం చేసుకుని వుండొచ్చు. సర్ది చెప్తే తనే తెలుసుకుంటుంది. శ్రీనాథ్‌ని కూడా కొంచెం జాగ్రత్తగా వుండమని చెప్తే సరి. ఇంత చిన్న విషయానికి ఒక మనిషి నిర్మించుకున్న కుటుంబాన్నీ, కుటుంబ సభ్యుల మనశ్శాంతినీ, ప్రొఫెషనల్ గుర్తింపునీ పాడు చేయటం అవసరమా? ఎన్నో యేళ్ళ పరిశ్రమ అది. ఏదో చాపల్యం కొద్దీ అతను అతి చనువు చూపించే వుండొచ్చు. ఇంత చిన్నదానికి మేనేజిమెంట్ దాకా వెళ్ళి అందరి బ్రతుకుల్నీ చిందర వందర చేయడం
అవసరమా? ఆ ఆలోచన మనసుకి కొంచెం రిలీఫ్ ఇచ్చింది కానీ ఎందుకో నిద్ర సరిగా పట్టలేదు.
***
“పూజా! బాగున్నావా?” ఫోన్లో తార గొంతు చాలా రోజుల తరవాత విన్నాను. తారా నేనూ చిన్నప్పుడు పక్క పక్క ఇళ్ళల్లోనే వుండి, ఒకే కాలేజీలో చదువుకున్నాం. తరవాత ఉద్యోగాలు పెళ్ళిళ్ళతో ఇదే నగరంలో చెరో మూలా వున్నాం. అప్పుడప్పుడూ ఫోన్లో పలకరింపులూ, పిల్లల పుట్టినరోజు వేడుకల్లాటి వాటిల్లో కలుసుకోవడాలు, అంతే.
“హాయ్ తారా! బాగున్నావా? చాలా రోజులయింది నిన్ను చూసి.”
“బాగున్నా పూజా. నీకొక ఎక్సైటింగ్ వార్త చెప్దామని ఫోన్ చేసా. నీకు మనచిన్నప్పుడు మన కాలనీలో మనతో పాటు బస్సులో వచ్చే సుచిత్ర గారు గుర్తున్నారా? ఆ రోజుల్లో మనం ఆవిడని భలే ఆరాధించే వాళ్ళం. ఆవిడ మొన్న నాకు ఒక సినిమా థియేటర్లో కనిపించారు. మనం కాలేజీ వదిలిన ఇన్నేళ్ళలో మళ్ళీ ఆవిడని చూడనేలేదు. నేను గుర్తు పట్టి పలకరించాను. ఆవిడ అడ్రసు తీసుకున్నా. మనిద్దరం ఒకసారి వెళ్ళొద్దామా?”
“అవునా? అలాగే. ఎప్పుడు వెళ్దాం? పై ఆదివారమా? సరే. వెళ్ళొద్దాం.”
ఇంకాసేపు మాట్లాడి ఫోన్ పెట్టేసాను. ఉన్నట్టుండి సుచిత్ర గారి ప్రసక్తి నా బ్రతుకు లోకి ఇప్పుడు రావడమేంటి, విచిత్రమైన కోఇన్సిడెన్స్ కాకపోతే! దాదాపు ఇరవైయేళ్ళ క్రితం కాలేజీ రోజుల్లో నేనూ, తారా, ఇంకొంత మంది స్నేహితులమూ కలిసి రోజూ వెళ్ళే బస్సు గుర్తొచ్చింది.
***
బీటెక్ చదివే రోజుల్లో ఇంకొంత మంది అమ్మాయిలతో కలిసి నేను రోజూ బస్సులో యూనివర్సిటీకి వెళ్ళొచ్చేదాన్ని. మేమంతా ఆ బస్సు కండక్టరుని చూస్తే రావణాసురుణ్ణి చూసినట్టే భయపడేవాళ్ళం. చూడ్డానికి మామూలుగానే వుండేవాడు. కానీ ఆ చూపులే తేడాగా, ఒళ్ళంతా తడిమేస్తూ, చాలా చిరాగ్గా, ఇబ్బంది పెట్టేవి. పైగా, “టికెట్, టికెట్”
అంటూ భుజం మీద తట్టి అడిగేవాడు. కొన్నిసార్లు మెడమీదా, కొన్నిసార్లు జడమీదా, అతని చేతి స్పర్శ ఇన్నేళ్ళ తరవాత కూడా గొంగళి పురుగు పైన పాకినట్టనిపిస్తుంది.
అతని ఆ పరమ నికృష్టమైన టచ్ తలుచుకుంటే మాకు ఆ బస్సు ఎక్కబుద్ధయ్యేది కాదు. కొన్ని రోజులు బస్సు మార్చి చూసాం కానీ, ఎన్ని రోజులు కాలేజీకి ముందో, ఆలస్యంగానో వెళతాం?
అక్కడికీ, ఒక చిన్న ఉపాయం కనిపెట్టాము ఆడపిల్లలమంతా. మాలో ఒక్కళ్ళం అతడి మీదే దృష్టి నిలబెట్టి, అతడు మా దగ్గరికి రాగానే బస్సు పాసులు తీసి పట్టుకుని అతడి కళ్ళ ముందు ఆడించేవాళ్ళం, “పాస్, పాస్” అని అరుస్తూ. అయినా ఎవరికో ఒకరికి భుజం మీద వాడి చేయీ, వెకిలి నవ్వూ తప్పేవి కావు.
ఆ రోజు నేనెప్పటికీ మర్చిపోలేను. పవర్ సిస్టమ్స్ లో పరీక్ష. ఎంత చదివినా ధైర్యం రావడం లేదు, బస్సులో కూడా టెన్స్‌గా నిలబడ్డాను. చేతిలో బాగు కూర్చున్న ఒక అమ్మాయికిచ్చి నా నోట్స్లోకే దీక్షగా చూస్తున్నాను. వున్నట్టుండి చేతి మీద మోచేతికీ మణికట్టుకీ మధ్య పాము పాకినట్టు స్పర్శ. దాదాపు కెవ్వు మన్నాను. వెనక్కి తిరిగి చూస్తే ఏ భావమూ లేని మొహంతో గుంట నక్క ఎక్స్ప్రెషనుతో కండక్టరు. “టికెట్ వుందా” అంటున్నాడు. కడుపులో తిప్పి, దాదాపు వాంతయినంత పనయింది. పరీక్ష టెన్షనూ, అనుకోని అదురుపాటూ, అసహ్యమూ అన్ని కలిసి కళ్ళల్లో నీరు తిరిగాయి. “పాస్ వుంది” అన్నాను బలహీనంగా. “ఏదీ, చూపించు” అన్నాడు అదే ఎక్స్ప్రెషన్తో. వణుకుతున్న చేతుల్తో బస్ పాస్ తీసి చూపించాను. వేళ్ళు తాకిస్తూ ఆ పాస్ అందుకోని అటూ ఇటూ తిప్పి చూసి మళ్ళీ వేళ్ళు తాకిస్తూ నా చేతికిచ్చి వెళ్ళిపోయాడు దరిద్రుడు.
నాకు కొంచెం ముందుగా నిలబడి వున్నారు సుచిత్ర గారు. ఆవిడ సెక్రెటేరియట్‌లో పని చేసేవారు. అప్పుడప్పుడూ మా బస్సులోనే వచ్చేవారు. ఆ రోజు ఆవిడ మనసెలా వుండిందో కానీ ఆ కండక్టరు మీద ఆడపులిలా విరుచుకు పడ్డారు.
“అలా ముట్టుకోని మరీ టికెట్ టికెట్ అని అమ్మక్కర్లేదు. మాకు బాగానే వినిపిస్తుం ది. అసలేమైనా మర్యాదా, సంస్కారం వున్న మనిషివేనా? రోజూ చుస్తున్నా, ఆడపిల్లల్ని తాకుతూ కానీ మాట్లాడలేవా?” ఆవిడ గొంతూ, ఆ గొంతులో వున్న కోపమూ మా అందరి కెంత సంతోషాన్నిచ్చాయో చెప్పలేము.
కండక్టరూ ఊరుకోలేదు.
“నా పని నేను చేస్తున్నానండీ. మీ దగ్గర టికెట్లు లేకపోతే నా నెత్తిమీది కొస్తుంది. ఎవరి గాలీ సోకద్దనుకుంటే కార్లో వెళ్ళాలి, ఇటువంటి బస్సుల్లో అందరితో పాటు ఎందుకొస్తారు?”
“నిన్నెవ్వరూ టికెట్లివ్వొద్దనట్లేదు. ముట్టుకోని మాట్లాడక్కర్లేదంటున్నా. అర్థం కావట్లేదా? అయినా అందరూ స్టూడెంట్సూ, ఉద్యోగస్తులే వుంటారీ బస్సులో. ఆ మాత్రం బాధ్యత మాకూ తెల్సు. నీకంటే పల్లెల్లో గొడ్లు కాసుకునే వాళ్ళు నయం. మర్యాదగా ప్రవర్తిస్తారు. ఇంకోసారి బస్సులో ఆడవాళ్ళ మీద చేతులేస్తే నిన్నొదిలేది లేదు. నీ పై ఆఫీసరుకి కంప్లెయింటిచ్చి సస్పెండు చేయిస్తా! ఏమనుకుంటున్నావో!” ఆవిడ ఛడా మడా దులిపేసారు.
చుట్టూ వున్న మగవాళ్ళు, “వూరుకొండి మేడం. అతనితో ఏంటి గొడవ”, అని
కొందరూ, “అబ్బ, ఏదో కొంచెం చేయి తగిలితే ఇంత అల్లరి చేయాలా,” అని కొందరూ
వ్యాఖ్యానాలు మొదలు పెట్టారు.
ఆవిడ, “మీరూ కొంచెం అర్థం చేసుకోండి సార్. మీ ఇంట్లో ఆడవాళ్ళకీ ఇటువంటి ఇబ్బందులూ, సమస్యలూ ఎదురవుతూనే వుంటాయి. ఎవరూ సహాయం చేయరు. సమస్య మాది కాదనుకోని మీరంతా పట్టనట్టే వుంటారు. మీ ఇళ్ళల్లో ఆడపిల్లలు బయట ఎంత బిక్కు బిక్కు మంటూ వుంటారో ఒక్కసారి అడిగి చూడండి. మా బాధేంటో మీ కప్పుడు అర్థమవుతుంది,” అన్నది.
ఆమె ధాటీకి కండక్టరూ, మిగతా మగవాళ్ళూ కొంచెం బెదిరారు. నిశ్శబ్దంగా అయిపోయారు.
ఆ తర్వాత మా వైపు తిరిగి, “మీరిల్లా మేక పిల్లల్లా వుండొద్దమ్మా. పిచ్చి వేషాలేస్తే చెప్పు తెగుతుంది, అని భయపెట్టాలి. లేకపోతే జీవితాంతం ఇలా గుడ్లల్లో నీళ్ళూ, నోళ్ళల్లో చెంగూ కుక్కుకోవటం తప్ప వేరే దారుండదు,” అని ఇక మౌనంగా వుండి పోయింది.
ఆ తరవాత యేడాది పాటు ఆ బస్సులో కండక్టరు మా దగ్గర ఒళ్ళు దగ్గర పెట్టుకొని మర్యాదగా ప్రవర్తించాడు. ఆవిడ ఆ బస్సులో ఎక్కువగా వొచ్చేవారు కాదు, కానీ బయట కాలనీలో ఆవిడతో నాకూ, తారకూ బాగా స్నేహం కుదిరింది. ఆవిడ స్నేహంలో నేనెన్నో విషయాలు నేర్చుకున్నాను. ఆవిడ చూపించిన ధైర్యంతో ఇంకొకరోజు ఆడపిల్లలమంతా బస్సులో ఆడపిల్లలకి ఒళ్ళంతా రాస్తూ నిలబడే ఇంకొక గుంట నక్కకి పదిమందిలోగట్టిగా బుద్ధి చెప్పాం. ఆ రోజు ఎంత గర్వంగా అనిపించిందో! ఆ తరవాత సుచిత్ర గారు ట్రాన్స్‌ఫరయి ఇంకేదో ఊరికి వెళ్ళిపోయారు. కానీ నేను ఆవిడని మాత్రం మరిచిపోలేదు. లేకపోతే మరిచిపోయానా?
***
ఆ పై ఆదివారం నేనూ తారా ఆటోలో ఆవిడ చెప్పిన అడ్రసుకి వెళ్ళాం. రిటైరై వచ్చిన డబ్బుతో ఒక చిన్న ఫ్లాటు కొనుక్కోని వొంటరిగా వుంటున్నారావిడ.
“ఎంత పెద్దైపోయావు పూజా! పెద్ద ఇంజినీరువయ్యావట కదా? సో హేపీ!” అన్నారు ఆవిడ నన్ను ప్రేమగా హత్తుకొని. ముగ్గురం చాలా సేపు కబుర్లు చెప్పుకున్నాం. మాటల్లో ఆవిడ ఆ రోజు కోప్పడ్డ కండక్టురుని గుర్తు చేసుకున్నాం.
“అసలు అంతకు ముందు చాలా రోజుల్నించే నేను వాణ్ణి గమనిస్తూనే వున్నా.
ఎలాగూ తమని ఎవ్వరూ ఏమి అనరన్న నమ్మకమే అలాటి వాళ్ళకి వుండే ధైర్యం. ఒక్క సారి ఆ నమ్మకం మీద దెబ్బ కొడితే వాళ్ళు తోక ముడుస్తారు. అంతే. ఆడవాళ్ళు ధైర్యంగా నోరు విప్పితే ఇటు వంటి ప్రెడేటర్స్ నుంచి కొంతైనా తమని తాము కాపాడుకోగలుగు తారు. “ఆవిడలో చిన్నప్పటి ఆవేశమూ కోపమూ ఏమీ తగ్గలేదు అనిపించింది.” కొన్ని సార్లు పాపం ఆడవాళ్ళు గొంతెత్తడానికి ధైర్యం చేసినా, ఎవరూ మద్దతు ఇవ్వరు. ఆడ వాళ్ళం కొంచెం సంఘటితంగా వ్యవహరిస్తే, ఒకరికొకరం కనీసం మోరల్ సపోర్ట్ ఇచ్చు కుంటే, గొంతెత్తి మాట్లాడడానికి ధైర్యం వస్తుంది. మనం మన ఇబ్బందులు చెప్పుకున్న ప్పుడు చుట్టూ వున్నవారు, “అబ్బ, ఇంతేనా?” అని మన సమస్యని చిన్నదిగా చేసి పక్కన
పెట్టించేస్తారు మనతోనే. ఆ మాటకొస్తే, అసలు తప్పంతా నీదే అని కూడా వాదిస్తారు. ఇప్పుడు దీన్ని గేస్ లైటింగ్ అనో ఏదో అంటారటకదా? నా బ్రతుకంతా ఇలా గేస్ లైటింగ్ అవుతూనే గడిపాను. కానీ మనం వొదలకూడదు.
చిన్నదో, పెద్దదో, ఈ పరిస్థితి నాకు నచ్చటం లేదు అని నోరు విప్పి చెప్పుకునే అవకాశం, పరిస్థితీ అందరికీ వుండాలి. “సుచిత్ర గారి మాటలు వింటూ ఆలోచనలో పడిపోయాను.
***
ఆ రాత్రి పడుకునే ముందు అంజనాకి తన మొబైల్‌కి ఫోన్ చేసాను.
“అంజనా, నువ్వు చెప్పిన విషయం గురించి మనం ఇంకా వివరంగా మాట్లాడు కుందాం. రేపు నేను ఆఫీసుకి సెలవు పెట్టి ఇంట్లో వుంటా. నువ్వు మా ఇంటికి రా. మనకి మాట్లాడుకోవడానికి టైమూ ప్రైవసీ వుంటాయి. ఇక ముందు చేయాల్సిందేమిటో ప్లాన్ చేద్దాం.”
ఏం చేస్తానో నాకూ తెలియదు. కానీ ఏదో చేస్తాను. ఒక నిశ్చయానికి వచ్చాక
హాయిగా నిద్ర పట్టింది.
*****
ఆస్ట్రేలియా ప్రభుత్వోద్యోగిగా పనిచేస్తూ, బ్రిస్బేన్ నగరంలో నివసించే శారద తెలుగులో, ఇంగ్లీష్‌లో కథలు, అనువాదాలు వ్రాస్తూ వుంటారు. 1996 లో మొదలైన కథా రచనతో దాదాపు నలభై తెలుగు కథలు, ఇరవై అనువాద కథలూ ప్రచురించారు.
“నీలాంబరి”, “మలయ మారుతం” పేర్లతో రెండు కథా సంపుటాలు వెలువరించారు.. “వీలునామా” అనే అనువాద నవలా, “తమసోమా జ్యోతిర్గమయా” అనే తెలుగు నవలా కినిగెలో ఉచితంగా లభ్యమవుతున్నాయి. “శంకరాభరణం” అనే అనువాద కథల సంపుటి ఆర్కైవ్ డాట్ ఆర్గ్ లో ఉచితంగా లభ్యమవుతుంది.
బాగుంది. మగబుద్ధి కి తగిన శాస్తి జరగాలి.
కధ అసంపూర్తిగా ఉందనిపించింది
సమాజంలో నిత్యం స్త్రీలు ఎదుర్కొంటున్న సమస్య ను ప్రతిభావంతంగా చెప్పారు రచయిత్రి.
బస్సుల్లో అమ్మాయిల వేళ్ళను తాకుతూ, రాసుకుంటూ పూసుకుంటూ తిరిగే కండక్టర్ లాంటి వాళ్ళు ఎందరో….! ఆఫీసులో సహ ఉద్యోగినులతో, కింద ఉద్యోగినులతో పైకి మంచి వాడిగా నటిస్తూ ఎవరూ లేనప్పుడు వెకిలిగా ప్రవర్తించే వారు ఎందరో…! పైకి చెప్పుకోలేక లోలోపల కుమిలిపోతున్న చాలా మంది ఆడవారి సమస్య ఇది. కానీ అబలలు గా మిగిలిపోకూడదని “ధీర”లు గా ఎదుర్కోవాలని చెప్పిన మంచి కథ. రచయిత్రికి అభినందనలు .
Feed back నెపంతో అందరికీ మెయిల్ చేసిన ఆనంద్ కామెంట్స్ పూజ చూసి అనలైజ్ చేసి ఉండచ్చు, ఎందుకంటే ఆమె కూడా అదే టీమ్ లి ఉంది కదా. అలా చూసినట్టు వ్రాసి ఉంటే అంజనాని ఇంటికి పిలవడం కరెక్ట్ ముగింపు.
చాలా బాగుంది..ముగింపు కూడా ఇస్తే బాగుండేది…ఒక పరిష్కారం ఇచ్చినట్లుగా బాగుంటుంది..
కథ చాలా అర్థవంతంగా ఉంది. కాస్త మీ మనసుకి నచ్చినట్లు ముగింపు కూడా ఇచ్చి ఉంటే బాగుణ్ణు అని నా అభిప్రాయం మేడం. కనీసం కొందరికి అయిన దిశా నిర్దేశం అయ్యి ఉండేది.
కథ బాగుంది. నలుగురికి తెలుస్తుంది అన్న భయం వుంటే చాలు అటువంటి మగవారు అదుపులో వుంటారు.
ఇప్పుడు ఇండియాలో ప్రతి సంస్థ లోనూ ఒక ఇంటర్నల్ కమిటీ తప్పనిసరి. అయినా కంప్లైంట్ చేయడానికి ఎవరూ ముందుకు రారు. ఏదో లోపాయికారిగా పరిష్కారం కోరతారు.
కథ వర్తమానానికి చాలా దగ్గరగా ఉన్నది. కానీ ముగింపును మన ఆలోచనకు వదిలేసి రచయిత్రి గారు తప్పుకున్నారనిపిస్తున్నది. ఎందుకంటే ఈ కథలో ముగింపును రెండు, మూడు రకాలుగా చెప్పవచ్చు. చెప్పే ముగింపు అందరికీ నచ్చకపోవచ్చు. అందుకని చక్కటి నిర్ణయం తీసుకున్నారు. కథాగమనం అద్భుతంగా సాగింది. రచయిత్రి గారికి అభినందనలు
చాలా చక్కని కథ. ఇటువంటి పురుష పుంగవులు కి తగిన శాస్త్రి చెయ్యాలి …రుజువులు కావాలి.
చాలా బాగా రాశారు మేడం.