#మీటూ -2
సంపాదకురాలు: కుప్పిలి పద్మ
పుస్తక పరిచయం: సి.బి.రావు
స్త్రీలు ఎదుర్కొంటున్న వివిధ రకాల హింసల గురించి, Me Too ఉద్యమ పుట్టుక, అందులో, కాలక్రమేణా వచ్చిన మార్పుల గురించిన పరిశీలన మొదలగు విషయాలతో, సంపాదకురాలి ముందుమాటతో ఈ పుస్తకం మొదలయింది.
కుప్పిలి పద్మ కథలోని నిఖిత తరగతిలో మొదటి స్థానంలో వుండేందుకు, ప్రొఫెసర్ కు దగ్గరవుతుంది. చాల సంవత్సరాల తర్వాత, మిటూ అంటూ ఒక పోస్ట్ పెడుతుంది. నేటి స్త్రీలు హింసలే కాకుండా, ప్రలోభాలకూ లొంగిపోతున్నారు. కార్యాలయాల్లో, పదోన్నతి కోసం, సినిమాలలో నాయిక పాత్రకోసం ఆడవారు అయిష్టంగా నైనా లొంగిపోతున్నారు. ఈ నేపధ్యం లో స్త్రీలు ఎదుర్కొంటున్న లైంగిక వేధింపులపై 13 మంది రచయిత్రులు, తమదైన పంధాలో, విభిన్నంగా స్పందించి, మనకిచ్చిన కథల సమాహారమే, ఈ మిటూ కథాసంపుటం.
జనవరి నెల, 2020 నెచ్చెలిలో ఉమా నూతక్కి కథ పరిచయం చేసాను.
ఈ నెల మరి కొన్ని కథలు, పరిచయం చేస్తున్నా మీ కోసం.
ఈ కథాసంపుటం లో కథలకు పేర్లు లేవు, కేవలం సంఖ్య మాత్రమే వుంటుంది.
కథ సంఖ్య: 7 రచన: సాంత్వన చీమలమర్రి
తన అసైన్మెంట్ ను మెచ్చి, టీచర్, స్టాఫ్ రూమ్ కి వచ్చి కలువు అంటే భయంగా వెళ్లిన ధన్య, అతని ప్రోత్సాహకరమైన మాటలకు, గాలిలో తేలిపోయింది. క్లాస్ లో తను స్పెషల్. అప్పుడప్పుడు వెళ్ళి, టీచర్తో మాట్లాడటం మాత్రమే కాకుండా, టీచర్ పై జోక్ వేసేంత చనువు పెంచుకుంది. స్కూల్ వద్ద ఒక రోజు, బస్ దిగాక, తన హాస్టల్ ఫ్రెండ్స్ చెప్పిన విషయం, నమ్మలేకపోయింది. ఆ క్రితం రాత్రే టీచర్, హాస్టల్ ఖాళీ చేసి వెళ్ళిపోయాడని. కారణం అంతుపట్టలేదు. అయితే, చాల కాలం తరువాత, తన క్లాస్ మేట్ తులసి, ఒక సెమినార్ లో కలిసినప్పుడు, ఒక సంభ్రమం కలిగించే వార్త, తన ద్వారా తెలుసుకుంటుంది. స్కూల్ హాస్టల్ లో, తులసి బాత్రూమ్ కెళ్ళి, తిరిగివచ్చే సమయంలో, తన స్కూల్ టీచర్, తులసి పట్ల అట్లా ప్రవర్తించాడంటే, ఒళ్ళు గగుర్పొడుస్తుంది. తులసి ఫిర్యాదుపై అతని ఉద్యోగం ఊడుతుంది. ఇలాంటి కీచక టీచర్లు గురించి, మనం దినపత్రికలలో చదువుకున్నాం. ఈ కథ, వాస్తవానికి ఎంతో దగ్గరగా వుంది. కథ చెప్పిన తీరు బాగుంది. రచయిత్రి తొలి కథతోనే ఆకట్టుకుంది.
కథ సంఖ్య: 2 రచన: ఝాన్సీ పాపుదేశి
మన తెలంగాణా, కర్ణాటక, తమిళ్నాడు లలో వున్న దేవదాసి ఆచారం ఇతివృత్తంగా వ్రాయబడ్డదీ కథ. రెండే ముఖ్య పాత్రలతో కథ నడుస్తుంది. హరిజన వాడ లో పుట్టిన దీప, ఒక స్వచ్ఛంద సంస్థ నడిపే శ్రావణి. దీప తల్లి మాతమ్మ. ఆమె కూడా దేవదాసీనే. దీప ఆరొగ్యం బాగయితే, జోగినిని చేస్తానని ఆమె తల్లి మొక్కుకుంటుంది. జోగిని అయ్యాక, తనను వూరి జనం దేవతలా చూడటం, సంబరాన్నిచ్చినా, అక్కడి కామందులు తన శరీరం తో ఆడుకోవటంతో తీవ్రమైన వెతచెందుతుంది. శ్రావణి మాటలతో నిజం తెలుసుకుని, ఆమెతో కలిసి పట్టణం వెళ్ళిపోతుంది. శ్రావణి ఆమెను Sexworkers మీద ఒక Presentation కోసం, పూనె పట్టణం తీసుకెళ్తుంది. అక్కడ విదేశీ ప్రతినిధులను, తన వుపన్యాసం లో భాగం గా దీప అడుగుతుంది “నా సమస్య మీదిగా తీసుకుని, నాతో కలిసి మీరు పోరాటంలో భాగస్వాములవుతారా?”. బలంగా కథ చెప్పటం లో రచయిత్రి సఫలమయ్యింది.
కథ సంఖ్య: 6 రచన: ఎండపల్లి భారతి
అచ్చమైన మదనపల్లె మాండలీకంలో వచ్చిన ఈ కథ గ్రామీణభారతపు, పల్లె స్త్రీల, లైంగిక వేధింపుల గురించినది. అక్కడి కామందు చిన్నరెడ్డి, వృద్ధ స్త్రీలను కూడ విడిచిపెట్టడంటే ఏమనుకోవాలి? ఆ వూరు కొచ్చిన కొత్త కోడళ్ళకు చిన్నరెడ్డి పొలాని కి వెళ్ళొద్దని, ముందస్తుగానే హెచ్చరిస్తారు. ఈ రావణాసురుడి నుండి స్త్రీలకు విముక్తెప్పుడు?
కథ సంఖ్య: 4 రచన: దేవికారెడ్డి
ఆడపిల్ల అన్న కారణంతో, యువతులు ఉద్యోగాలలో, కొన్ని సవాళ్ళు ఎదుర్కొంటున్నారు. వారు చెయ్యగలిగిన పనులు కూడా, ఆడపిల్ల అనే సాకు చూపి, ఆ అవకాశాలు వారికివ్వడం లేదు. ఇది మిటూ క్రింద రాదా? అని ప్రశ్నిస్తున్నారు రచయిత్రి.
కథ సంఖ్య: 3 రచన: సుజాతా వేల్పూరి
ఈ కథ తొలిసారి చదివాక, సంభ్రమం, Shock తగిలిన అనుభూతిలో వుండిపోయా, చాలసేపటి వరకు. దినపత్రికలలో, మైనారిటి మత కుటుంబాలలో, incest తో కూడిన కథలు, చదివివున్నాను. ఐతే, హిందు కుటుంబాలలో, ఇలా ఎవరూ తలచని వ్యక్తి నుంచి మహి కు ఇలా లైంగిక వేధింపు వస్తుందని, ఊహించకపోవటంతో, మనసు గిజగిజలాడింది. కథ చివరలో రితిక మాటలు విన్నాక, పాఠకుడికి మరో షాక్. ఈ కథ, నేను ఇంతకన్నా విపులంగా, చెప్పరాదు. కథ చదివి, మీరు, మీదైన అనుభూతికి, లోను కాగలరు.
కథ సంఖ్య:10 రచన: ఉషా తురగా రేవెల్లి
ఈ కథ ఇతివృత్తం, ఈ సంపుటం లోని మిగతా కథలకు కొంచం విభిన్నంగా వుండి, ఒక ప్రత్యేక కథగా నిలుస్తుంది. కథ శిల్పం, చెప్పిన తీరులో వేగం బాగున్నాయి. తార జర్నలిస్ట్. అసిస్టంట్ ఎడిటర్ గా ఒక పత్రిక లో పనిచేస్తున్న తార, తన బాస్ సురేంద్ర లైంగిక వేధింపులకు గురవుతుంది. మిత్రుల సలహా పై సంపాదకుడికి సురేంద్ర పై ఫిర్యాదు చేస్తుంది. నిబంధనల మేరకు, పత్రికవారు, ఫిర్యాదు పై విచారించటానికి ఒక కమిటీని వేస్తారు. అన్ని విచారణల తర్వాత, సాక్ష్యాధారాలు లేవన్న కారణంతో సురేంద్ర పై ఎలాంటి చర్యలు వుండవు, ఒక Sorry చెప్పడం తప్పించి. తార ఫిర్యాదు వీగిపోయిందని, మీసం మెలేస్తున్న సురేంద్రకు, తార ఎలా పాఠం చెప్పిందన్నదే మిగతా కథ. ముగింపు పాఠకుడికి నచ్చుతుంది. ఈ కథ, మిటూ సంపుటి లోని కథలలో, మకుటాయమానంగా నిలుస్తుంది.
ఇప్పటి వరకు పరిచయంచేసిన కథలే కాకుండా, కుప్పిలి పద్మ, ఊడుగుల జరీనా, స్వర్ణ కిలారి, డా.మమత వేగుంట సింగ్, మైథిలి అబ్బరాజు, మరియు స్వేచ్ఛ వొటార్కర్ వ్రాసిన కథలున్నాయి మొత్తంగా. Spoilers వుంటాయని, అన్ని కథలు చెప్పటం లేదు. మీరు చదివి, వాటిని ఆనందించండి అనలేను; ఎందుకంటే ఇవన్నీ అనుభూతి ప్రధానమైనవి.
పై కథలలో చర్చించిన స్త్రీల వెతలపై, పరిష్కారానికి, సంపాదకురాలు అంటారు “స్త్రీల పురుషుల సంబంధంగానేకాక, యిద్దరు సమాన మానవుల మధ్యనుండే సమసంబంధంగా రూపొందించుకుంటే తప్ప, మానవ సమాజం గురించి, మన స్వప్నం నిజమయ్యే అవకాశం లేదు.”
#మీటూ
(ఉమ నూతక్కి కథ – అనుబంధం తో కలిపి)
సంపాదకత్వం: కుప్పిలి పద్మ
పుటలు 128, డెమి పరిమాణంలో,
ధర ₹165/-
ప్రాప్తిస్థలం
Navodaya Book House,
Kachiguda X Roads,
Hyderabad
మరియు
amazon.in
*****
సి.బి.రావు విశ్రాంత స్టేట్ బాంక్ ఆఫ్ ఇండియా అధికారి. హైదరాబాదు నివాసం. పక్షులన్నా, పర్యాటకమన్నా చాల ఇష్టం. ఛాయాగ్రహణం వీరి అభిరుచి. పలు వెబ్ సైట్ల లో పుస్తక సమీక్షలు చేసారు. దీప్తిధార బ్లాగులో పర్యాటక వ్యాసాలు ప్రచురించారు. వీరి మరో బ్లాగు పారదర్శి లో భిన్న అంశాల పై వ్యాసాలు వెలువరించారు.