విజ్ఞానశాస్త్రంలో వనితలు-7

కెనెడాకి చెందిన మొదటి మహిళా శాస్త్రవేత్తహేరియట్బ్రూక్స్ (1876-1933)

– బ్రిస్బేన్ శారద

          రేడియో ధార్మికశక్తి ప్రపంచాన్ని చాలా రకాలుగా మార్చివేసిందనడంలో అతిశయోక్తి లేదు. అణు విద్యుత్ కేంద్రాలూ, వైద్య సాంకేతికలో పెను మార్పులూ, కేన్సర్ చికిత్సా, ఒకటేమిటి ఎన్నో విధాలుగా రేడియోధార్మిక శక్తినీ, రేడియోధార్మిక పదార్థాలనూ ప్రయోగి స్తారు. రేడియోధార్మిక శక్తిని కనుగొన్నది హెన్రీ బేక్విరల్ అయితే, దాన్ని ముందుకు తీసికెళ్ళింది రూథర్ఫోర్డ్, మేడం క్యూరీ మొదలగు వారు. వీళ్ళే కాకుండా రేడియోధార్మిక శక్తీ, అణు శక్తీ, మొదలైన శాస్త్రాల మీద పరిశోధన చేసి అద్భుతమైన ఫలితాలు అందిం చిన శాస్త్రవేత్తలు చాలా మందే వున్నారు.

          ఎర్నెస్ట్రూథర్‌ఫోర్డ్ (Ernest Rutherford) రేడియోధార్మిక శక్తీ, అణువు స్వరూపం విషయాల్లో విజ్ఞాన శాస్త్రాన్ని మలుపు తిప్పే విషయాలు కనుగొన్నారు. న్యూజీలాండ్‌కి చెందిన ఆయన కొంతకాలం కెనెడాలోనూ, ఇంగ్లాండులోనూ పనిచేసారు. కెనెడాలోని మెక్‌గిల్ యూనివర్సిటీలో 28 ఏళ్ళ వయసులో అడుగుపెట్టినప్పుడు ఆయన టీంలో పని చేసిన శాస్త్రవేత్త హేరియట్బ్రూక్స్. ఆమెని రూథర్‌ఫోర్డ్ “దాదాపు మేరీ క్యూరి అంత మేధస్సు కలిగింది, కానీ చాలా కారణాల వల్ల పైకి రాలేకపోయింది”, అని వర్ణించి బాధ పడ్డారు.

          అణుధార్మిక శాస్త్ర పరిశోధనలో రూథర్‌ఫోర్డ్ తో కలిసి పని చేసి, ఆయన ప్రశంసలు పొందినా కూడా వృత్తిలోనూ వ్యక్తిగత జీవితంలోనూ విధి చేతిలో ఓడిపోయిన హేరియ ట్బ్రూక్ కెనెడాకి చెందిన మొట్ట మొదటి మహిళా భౌతిక శాస్త్రవేత్త.

          ఒక అణువు మధ్యలో కేంద్రకం (Nucleus), దాన్లో వున్న ప్రోటాన్లూ, న్యూట్రాన్లూ, కేంద్రకం చుట్టు పరిభ్రమిస్తున్న ఎలక్ట్రాన్లు వున్న అణు స్వరూపాన్ని గురించి హైస్కూల్లో చదువుకుంటాము. ఈ కేంద్రకం నుండి స్వయంభువుల్లా, ఏ ఉత్ప్రేరకము లేకుండా వెలువడేదే న్యూక్లియర్ రేడియేషన్ (Nuclear radiation). మొదట్లో న్యూక్లియర్ రేడియే షన్‌లో ఆల్ఫా, బీటా కణాలూ, గామా (Alpha, Beta, Gamma) కిరణాలూ అనుకున్నారు. కానీ, హేరియట్ చేసిన పరిశోధనల వల్ల, వీటితో పాటు రాడాన్ (Radon) అనే మూలకం కూడా న్యూక్లియర్ రేడియేషన్‌లో వెలువడుతుందని నిర్ధారించడానికి వీలయింది.

          ఒక కేంద్రకం నుంచి రేడియషన్లు పడ్డప్పుడు ఆ అణు కేంద్రకం కొంచెం తిరుగు శక్తిని పొందుతుంది. ఉదాహరణకి, తుపాకి నుంచి బుల్లెట్ బయట పడగానే, తుపాకి కొంచెం వెనక్కి జరుగుతుంది కదా, అలాగే. దీన్ని రికాయిల్ (Recoil) అంటారు. హేరియట్ ఈ “ఎటామిక్రికాయిల్”ని(Atomic Recoil) సరిగ్గా లెక్క కట్టారు. కానీ ఆమె భౌతిక శాస్త్రంలో పెద్దగా పరిశోధనలు చేయడానికి కుదరలేదు.

          1876లో కెనెడాలోని ఒంటారియోలో జన్మించిన హేరియట్ తొమ్మండుగురు సంతానంలో మూడవది. గోధుమ పిండి తయారీలో పని చేసే ఆమె తండ్రి 1894లో కుటుంబంతో సహా మాంట్రియల్ చేరుకున్నారు.

          తొమ్మండుగురిలో కేవలం హేరియట్, సోదరి ఎలిజబెత్ ఇద్దరే చదువుకో గలిగారు. 1894లో మెక్‌గిల్ యూనివర్సిటీ చేరిన హెరియట్ గణితం ప్రధానంగా బియ్యేముగిం చారు. మెక్‌గిల్ లో స్కాలర్‌షిప్పుకు అర్హత సంపాదించినా, రెండు సంవత్సరాలపాటు ఆమెకి ఆ స్కాలర్షిప్పు ఇవ్వనే లేదు. ఆఖరి రెండు సంవత్సరాలు మాత్రం ఆమెకి ఆ స్కాలర్‌షిప్పు డబ్బు అందింది. 1898లో ఆమె గ్రాడ్యుయేషన్ముగిసింది. సరిగ్గా ఆ యేడే ఎర్నెస్ట్రూథర్‌ఫొర్డ్ భౌతిక శాస్త్రంలో పరిశోధనకై మెక్‌గిల్ యూనివర్సిటీలో చేరారు. అక్కడ అప్పుడే పట్టభద్రురాలైన హేరియట్ అతని పరిశోధనా టీంలో చేరింది.

          రూథర్‌ఫోర్డ్ అధ్వర్యంలో హేరియట్ విద్యుదయస్కాంత శాస్త్రంలో పరిశోధన సాగించింది. తన థీసిస్కంటే ముందే ఆమె పరిశోధన కెనెడాలో ప్రచురితమయ్యే వైజ్ఞానిక పత్రికల్లో వచ్చాయి. 1899లో ఆమెకి అప్పుడే స్థాపించబడిన రాయల్ విక్టోరియా కాలేజీలో ట్యూటర్ ఉద్యోగం దొరికింది.

          1901లో హేరియట్ మెక్‌గిల్ యూనివర్సిటీ నుంచి మాస్టర్స్ పొందిన మొట్ట మొదటి మహిళ అయింది. డిగ్రీ తీసుకొన్న తరవాత హేరియట్ రేడియోధార్మికత గురించిన ప్రయోగాలు మొదలు పెట్టింది. ఈ పరిశోధనల ఫలితాలు 1901, 1902 లో రాయల్ సొసైటీ ట్రాన్సాక్షన్స్‌లో ప్రచురించబడ్డాయి.

          1901లో హేరియట్ ప్రతిష్టాత్మకమైన రెండు స్కాలర్షిప్పులు సంపాదించుకుంది. రూథర్‌ఫోర్డ్ ఆమెకి తను అంతకు ముందు పనిచేసిన కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలోని కేవెండిష్లేబొరేటొరీకి తన సిఫారసుతో పంపించాడు. అక్కడ ఆమె రూథర్‌ ఫోర్డ్ గురువు గారైన జెజె థామ్సన్ తో పని చేయడం మొదలుపెట్టారు. కానీ థామ్సన్ తన పరిశోధనలో తల మునకలుగా వుండి ఆమె పనిని కానీ, పరిశొధనా ఫలితాలను కానీ ఏ మాత్రం పట్టించుకో లేదు. నిరాశతో హేరియట్ తిరిగి 1903లో  కెనెడా చేరుకొని రూథర్‌ఫొర్డ్‌తో పని చేయడం తిరిగి ప్రారంభించారు. ఈ పరిశోధనా ఫలితాలను వాళ్ళు 1904లో ఒక పేపర్‌లో ప్రచురించారు.

          ఆ తరవాతి సంవత్సరం ఆమె న్యూయార్క్ లోని బెర్నార్డ్ కాలేజీలో అధ్యాపకురాలి గా ఉద్యోగం సంపాదించుకుంది. 1906లో హేరియట్ మరో భౌతిక శాస్త్రవేత్త బెర్గెన్ డేవిస్‌ని పెళ్ళాడదామని నిశ్చయించుకున్నారు. డేవిస్ అప్పుడు కొలంబియా యూనివర్సిటీలో పనిచేసే వారు. తమ వివాహం గురించి హేరియట్ కాలేజీ మేనేజ్‌ మెంటుకు తెలియచెప్పారు.

          చాలా విచిత్రంగా, కాలేజీ యాజమాన్యం ఆమె యూనివర్సిటీలో ఉద్యోగమో, వివాహమో, ఏదో ఒక్కదాన్నే ఎన్నుకోవాలనీ, కుటుంబమూ -వృత్తీ రెండిటినీ స్త్రీలు సంబాళించుకోలేరనీ ఉత్తరువు ఇచ్చింది. ఇంకా విచిత్రమైన విషయమేమిటంటే అప్పుడు బర్నార్డ్ కాలేజీ డీన్ లారా గిల్ అనే మహిళ. (లారా గిల్‌ని గురించి ఇంకా చాలా వివాదాస్పదమైన కథనాలు చలామణిలో వున్నాయి, అవి ఇక్కడ అప్రస్తుతం).

          ఈ ఉత్తరువుతో మండిపడ్డ హేరియట్ యాజమాన్యానికి చాలా తీవ్ర పదజాలంతో జవాబిచ్చి, తన ఉద్యోగానికి రాజీనామా చేసారు. అయితే, డేవిస్‌తో పెళ్ళి కూడా రద్దయిం ది ఎందుకో మరి.

          తన ఉద్యోగానికి రాజీనామా ఇచ్చిన హెరియట్, ఫేబియన్ సొసైటీ (Fabian Society) అనే లెఫ్ట్-వింగ్ సంఘంలో సభ్యురాలయింది. అక్కడ ఆమెకి ప్రఖ్యాత రష్యన్ రచయిత గోర్కీతో పరిచయం జరిగింది. గోర్కీ స్నేహితులందరితో కలిసి ఆమె యూరోపు అంతటా పర్యటించింది.

          ఆ పర్యటన సమయంలో ఆమె పారిస్ నగరంలో మేడం క్యూరీ పరిశోధనా సంస్థకి వెళ్ళారు. అక్కడే క్యూరీతో పాటు పనిచేయాలని నిశ్చయించుకొని పని మొదలు పెట్టారు. అక్కడ ఆమె చాలా పరిశోధనా ఫలితాలు వెల్లడించినా అవేవీ ఆమె పేరుతో ప్రచురితం కాలేదు.

          క్యూరీతో పని చేసేటప్పుడే ఆమె మాంచెస్టర్ యూనివర్సిటీలో అధ్యాపకురాలి పదవికి దరఖాస్తు చేసుకున్నారు. ఆ దరఖాస్తుకి మద్దతిస్తూ రూథర్‌ఫోర్డ్ చాలా దృఢంగా సిఫారసు చేసారు కూడా. తన సిఫారసు ఉత్తరంలో ” హేరియట్ మేధస్సులో, పరిశోధన ల్లో మేరీ క్యూరీకేమాత్రం తీసిపోదు,” అని అభిప్రాయపడ్డారు.

          కానీ, ఏవో అంతుచిక్కని తెలియని కారణాల వల్ల హేరియట్ యూరోప్ వదిలేసి కెనడా తిరిగొచ్చేసారు. 1907లో హేరియట్ మెక్‌గిల్ యూనివర్సిటీలోని ఫిజిక్స్ అధ్యాపకుడు ఫ్రాంక్పిచర్‌ని పెళ్ళి చేసుకొని మాంట్రియల్‌లో స్థిరపడ్డారు. ఆ తరవాత ఆమె యూనివర్సిటీలో ఆడవాళ్ళ కోసం ఎన్నెన్నో కార్యక్రమాల్లో పాల్గొన్నా, భౌతిక శాస్త్ర పరిశోధన మాత్రం మొత్తంగా వొదిలేసారు.

          ఎప్రిల్17 1933న యాభై యేడేళ్ళ వయసులో హేరియట్ లుకేమియాతో మరణించారు. ఆమె ముగ్గురు పిల్లల్లో ఇద్దరు చాలా చిన్న వయసులోనే మరణించారు.

          1980లో కానీ హేరియట్ పరిశోధనల ప్రాముఖ్యత గుర్తించలేదు భౌతిక శాస్త్రవేత్తలు. ఒంటారియోలోని న్యూక్లియర్ లేబొరేటరీకి ఆమె పేరు పెట్టారు. 2016 లో బాంక్ ఆఫ్ కెనెడా కరెన్సీ నోట్ల పైన ముద్రించాల్సిన స్త్రీల లిస్టులో ఆమె పేరు చేర్చారు.

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.