రోడ్డు రోలరు
– టి.వి.ఎస్.రామానుజ రావు
ఇంట్లో మా ఆవిడ లేదు. వాళ్ళ చెల్లెల్ని చూసోస్తానని పొద్దున్నే ఉప్పల్ వెళ్ళింది. ఏదో అన్నం, కాస్తంత పప్పు వుడ కేసుకుని భోజనం కానిచ్చాను. కాసేపు నడుం వాల్చి లేచేసరికి, సాయంత్రం నాలుగయ్యింది. కాస్త టీ పెట్టుకుని తాగి, అలా నాప్రెండు సుబ్బు గాడింటికి వెళ్ళి వద్దామని ఇంటికి తాళం పెట్టి బయల్దేరాను. ఇంతలో సెల్ ఫోను ఇంట్లో వదిలేశానన్న సంగతి గుర్తుకొచ్చింది. మా ఆవిడ ఫోను చేసినప్పుడు తియ్యకపోతే, ఆవేళ మహిషాసుర మర్ధని వేషం వేస్తుంది. అసలే దసరా రోజులయిరి, కొంప మునుగుతుంది అనుకుంటూ వెంటనే ఇంటికి పరిగెత్తి తాళం తీశానో లేదో, ఫోను మోగింది.
“ఇప్పటి దాక ఏం చేస్తున్నారు, ఫోను తియ్యకుండా?” కోపంగా అడిగిందావిడ.
“ఇప్పుడే కదా నీ ఫోను మోగింది? బాత్రూం లో వున్నాను. వెంటనే ఫోను తీశాను కదా?”
“అబద్దాలాడకండి. ఎక్కడున్నారు మీరు ఇంతకీ?” ప్రశ్నించింది.
“ఓసి, నీ దుంపతెగ! నేను బాత్రూంలోంచి రాలేదని ఎలా చెప్పావు?”
“మీరు బాత్రూం లోంచి వస్తే తలుపు చప్పుడు అవదూ?”
ఈ ఆడాళ్ళకు నాలుగు చెవులిచ్చాడ్రా బాబు, దేవుడు అనుకుంటూ, “ఇప్పుడే సుబ్బుగాడింటికి వెళ్దామని బయల్దేరాను. తాళం వేసానో లేదో, నీ ఫోను వినిపించి మళ్ళీ వెనక్కి వచ్చాను.”
“అదీ, అట్లా చెప్పండి, పేకాటకేనా? ఆడనని మాటిచ్చారు గుర్తుందా? అసలే ఆ సుబ్రహ్మణ్యం గారిది పాదరసం బుర్రం. మీకు సున్నం బొట్లు పెట్టి పంపుతాడు.”
“చాల్లెవోయ్, నేను కూడా గెలిచిన రోజులున్నాయ్! ఐనా వాడిది పాదరసం బుర్ర, నాది మట్టి బుర్ర అనడం బాగాలేదు.”
“నేనేమీ మిమ్మల్ని మట్టి బుర్ర అనలేదు. మీరే నిరూపించుకున్నారు.”
“ఇది మరీ బాగుంది” కోపంగా అన్నాను.
“మరే, బాత్రూం లోంచి వచ్చినట్లుంటే తలుపు చప్పుడు అవుతుంది గదా అని నేనంటే మీరేమన్నారు?”
“ఎట్లా చెప్పావని అడిగాను”
“అక్కడే మీ బుర్ర బండారం బయట పడింది. మీరు వచ్చి పోను తీశాకేగా, నాకు తలుపు చప్పుడైనా, మీ మాటైనా వినిపించేది? బాత్రూం తలుపు వేసి వచ్చి ఫోను తీస్తారు. తలుపు చప్పుడు ముందరే నాకు ఎలా వినిపిస్తుంది?”
లాయరులా లాజిక్ తో నన్ను బురిడి కొట్టించింది. “సుబ్బుగాడి బుర్ర కాదు నీ బుర్రే పాదరసం” ఒప్పుకున్నాను ఫ్రాంకుగా.
“సరే లెండి, పేకాట జోలికి వెళ్ళకండి. మా చెల్లెలు ఈ పూట ఇక్కడే ఉండమని బలవంత పెడుతోంది. కాస్త అన్నం కుక్కర్లో వుడకేసుకుని, కందిపొడుం, ఆవకాయ వేసుకుని తినండి. నేను రేపు పొద్దున్నే వచ్చేస్తాను.” ఫోను పెట్టేసిన చప్పుడు విని ఊపిరి పీల్చుకున్నాను.
‘నేనేమో కాస్త అన్నం వండుకుని, ఊరగాయ వేసుకుని తినాలా? నువ్వేమో చెల్లెలింట్లో పంచభక్ష్య పరమాన్నాలు తింటావా?’ లోలోపల తిట్టుకుంటూ సుబ్బుగాడింటికి వెళ్లాను.
వాడు హాయిగా పడక్కుర్చిలో పడుకుని గిరీశంలా పొగ రింగులు వదుల్తూ అమదానందం అనుభవిస్తున్నాడు.
“రా, కూర్చో. సిగరెట్ తాగుతావా?” అడిగాడు సిగరెట్ పెట్టె నాముందుకు తోస్తూ.
నేను సిగరెట్ వెలిగించి, ఒక దమ్ము పిల్చాక “ఏమిటలా వున్నావ్?” అడిగాడు.
“ఏముందీ, సాయంత్రం వచ్చేస్తానని పోయింది చెల్లెలింటికి. ఇప్పుడేమో నేను నీతో పేకాడుతున్ననేమోనని టెస్టు చేసి, ఈ పూటకు తను రాబోవడం లేదని చెప్పి, రాత్రికి అన్నం వండుకుని, ఆవకాయ వేసుకుతినమని ఆర్డరు వేసింది. ఈ ఆడాళ్ళు చాలా స్వార్ధపరులు!” కసిగా అన్నాను.
“ తప్పు తప్పు, మనకు అప్పుడప్పుడూ ఇలా స్వాతంత్రం ప్రసాదించే, శాంతి దూతలు వాళ్ళు” తమాషాగా నొక్కి చెప్పాడు.
“మిస్సమ్మ సినిమాలో రేలంగిలా మాట్లాడకు! వాళ్ళు శాంతి దూతలా? అసలు అశాంతి అంతా వాళ్ళ వల్లనేగా? ఇట్లాంటి మాటలు చెప్పావంటే, నాకు వాట్సపులో వచ్చే అడ్వర్ టైజ్మెంట్లు అన్నీ నీకు పంపుతాను. ఏ లాండురోవరో బదులు రోడ్డు రోలరు కోనేసుకుందువు గాని!” కోపంగా అన్నాను.
“ఏమా రోడ్డు రోలరు కథ?” తాపిగా ఆకాశంలో ఎగురుతున్న పక్షుల్ని చూస్తూ అడిగాడు సుబ్బు.
“ఆరు నెలల క్రితం మా బామ్మర్ది వచ్చినప్పుడు పిల్లలకు బట్టలు కొనుక్కుంటూ డబ్బులు తక్కువైనాయి అంటే, వెయ్యి రూపాయలు సర్డాను. ఇంతవరకూ దాని ఊసే లేదు. మా ఆవిడ పోనీలెత్తు అంటుంది.”
“వాళ్ళకు బట్టలు పెడితే, ఇంతకన్నా ఎక్కువ కావా అని అడిగి ఉండాలే? ఈ ఆడాళ్ళు మనకన్నా చాలా తెలివిగలాళ్ళు.” జేబులో వక్కపొడి పొట్లం చింపి నాకు రెండు పలుకులిచ్చి, తానో రెండు పలుకులు నోట్లో వేసుకున్నాడు.
“బలే వాడివి. పుట్టింటి వాళ్ళ విషయంలో అలాంటి అతి తెలివి కానీ, ఆ ఆలోచనలు కానీ వాళ్ళకు రావు, మనం అన్నామా, ఏ మాత్రం సహించరు. బట్టలు పెట్టేవి పెట్టాల్సిందే. దాని లెక్క వేరే.”
“అయినా, దానికి, ఈ రోడ్డు రోలరుకు గల కార్యకారణ సంబంధం ఏమిటి?”
“ఏముందీ, చూసి చూసి, వాట్స్ అప్ లో రోజూ నాకు వస్తున్న మూడు అడ్వర్ టైజ్మెంట్లు వాడికి పంపించాను. ఒకటి కార్ 24 , రెండోది రోడ్ రోవర్, మూడోది ఇల్లు అద్దె కివ్వబడును అని వాడి అడ్రసు ఇచ్చేశాను.”
“ఓస్, అంతేగదా! కారుంటే అమ్మేస్తాడు, కొనాలనుకుంటే చక్కగా కొత్త కారు కొనుక్కుంటాడు. అయినా దాని పేరు లాండ్ రోవర్, రోడ్ రోవర్ కాదు. ఇల్లు అద్దెకు లేదంటే లేదని చెప్పేస్తాడు.”
“లాండు రోవరో, రోడ్డు రోలరో, ఏదైతేనేం? రెండూ బరువే కదా. వాడికి కారూ లేదూ, కొనే ఓపికా లేదు. రోజూ కారు కొనమని మేస్సేజిలు, కారు లేనివాడిని అమ్మమనీ అదేవరసగా మేస్సేజిలు వస్తుంటేనూ అప్పుడైనా వాడికి బుద్ది రావాలిగా. అద్దె ఇంట్లో ఉంటున్న వాడికి ఇల్లు అద్దెకిస్తారా అని ఏడాది పొడుగునా పోన్లు చేస్తుంటే, వాడికి విసుగు రాదా? ఒక్కసారి ఈ మేస్సేజిలు పంపేవారికి వాడి ఫోను నెంబరు చేరిందా, ఇక అలాంటివి పుంఖనుపుఖాలుగా రోజూ వస్తుంటాయి. అప్పుడైనా జ్ఞానం వస్తుందేమో అనుకున్నాను.”
“చిన్న వాడుగా కొద్దిగా ఓపిక ఎక్కువ.” అన్నాడు సుబ్బు.
“అయితే వాళ్ళావిడ ఒక రోజు ఆ అడ్వర్ టైజ్మెంటు చూసి అప్పట్నుంచి, లాండు రోవరు అనడానికి బదులు రోడ్డు రోలరు అని పొరపాటున అనేసేయ్యడం, వాడు సరిదిద్దబోతే, ఏదో ఒకటి కొంటారా,లేదాని చంపుకుతింటున్నదట. మావిడ ఆడపడుచు కదా, మరదలిపై విసుక్కుంది.”
“ఇంట్రస్టింగ్, తర్వాతేమయ్యింది ?”
“వాడికింకా బుద్ది రాలేదని నేనే ఈ మధ్య వాడి తరఫున పేపరులో రోడ్డురోలరు అమ్ముతామంటూ వాడి అడ్రసుతో అడ్వర్ టైజ్మెంటు ఇచ్చాను.”
“అయితే?”
“వాడు పని చేసేది మునిసిపల్ ఆఫీసులో, రోడ్స్ అండ్ బిల్డింగ్స్ డిపార్టుమెంటు. అక్కడ్నించి అడ్వర్ టైజ్మెంటు ఎవరు ఇచ్చారని ఆఫీసు వాళ్ళు ఎంక్వయిరీ చేశారు. గవర్నమెంటు సొమ్ము నువ్వెలా అమ్ముతావని ఎక్ప్లనేషన్ కాల్ఫర్ చేశారు. వాడు లబోదిబో మన్నాడట. చివరికి ఎవరో ఇచ్చారని తనకు తెలియదని మొరపెట్టుకుంటే, ఒక వార్నింగు ఇచ్చి వదిలేశారు.”
“దానికి బదులు నువ్వే ఒక వార్నింగు ఇచ్చి వుండచ్చుగదా?”
“అప్పుడు నిత్యం మా ఆవిడ నన్ను రోడ్డు రోలరు కింద పడేసి, చదును చేసేది. నేనేమైనా “చంటబ్బాయి” సినిమాలో చార్లీ చాప్లినా లేచి నిలబడి మామూలుగా తిరగడానికి?”
“సో, ఇప్పుడేం చెయ్యాలనుకుంటున్నావ్?”
“ప్రస్తుతం హాయిగా ఫైవ్ స్టార్ హోటల్లో భోజనం చేసి, సినిమా చూసి వద్దామని బయల్దేరాను. ఒక్కడివే వున్నావు కదా, నువ్వు కూడా రారాదూ?”
“సినిమాకైతే వస్తాను గానీ, హోటలుకు రాను. ఇంకా మాట్లాడితే మనం ఇద్దరం మాఇంట్లో భోజనం చేసేసి, సినిమాకు పోదామంటాను.”
“మీ ఆవిడ లేదుగదా, నువ్వేమళ్ళీ వంట మొదలుపెట్టావా? ఇదే కాలక్షేపమా ఇవాళంతా?”
“ ఆ, నలభిమపాకం. ఇవాళే కాదు వారం అయ్యింది ఆవిడ వెళ్ళి. మీ ఆవిడ లాగా మా ఆవిడ ఎలావున్నావని కూడా అడగదు. పుట్టింటికి పోయినా మొగుడి గోలేనా అనేది ఆవిడ సిద్ధాంతం. ఇక కాలక్షేపం అంటావా, చూడక పోవటమే పాపం కానీ, Netflix వుంది. ఇక you tube పెట్టుకుంటే పార్టీల ప్రపంచ యుద్ధం, పరస్పర అవినీతి ఆరోపణల భాగోతం కలలో కూడా నిన్ను వెంటాడుతాయి. అంతే కాదు, తెల్లారి లేచిన దగ్గరి నుంచీ, ఒకడు ఏదో తింటే చస్తావని, మరొకడు తినకపోతే చస్తావనీఒక అరగంట వీడియో సుత్తి కొడతారు. ఒకావిడ అన్నం ఎలా వండుకోవాలన్న వీడియోని చూపిస్తే, మరోకావిడ ఇడ్లి ఎలా వేసు కోవాలని వీడియోలో చెబుతుంది. ఇలా ఎన్నైనా చూడవచ్చు.. ఇంతకంటే కాలక్షేపం ఏం కావాలి?”
“ అవన్నీ సరేలే, నాయనా. బతికి వుంటే బలుసాకు అయినా తిని బతకొచ్చు. వద్దు బాబు, వద్దు. నీ వంట తిని హాస్పిటల్ పాలయ్యేకన్నా, ఇంట్లో నేనే ఆవకాయ వేసుకుని తినిపడుంటాను.”
చాలా రోజుల క్రితం ఒకసారి, సుబ్బు భార్య లేనప్పుడు, ఇలాగే బలవంతం చేస్తే, వాడి వంట రుచి చూశాను. మిస్సమ్మలో రేలంగిలాగా, చేతితో కొలిచి వేశాడో, గరిటెతో వేశాడో తెలియదు కాని, కూర నిండా ఆవాలు. పులుసు అనే కంటే ముక్కలు మాడి, అడుగంటిన కూటు అనొచ్చు. దానికి తోడు అందులో సగం మెంతులు.
“క్రితం సారిలా అంత ప్రమాదం ఏం లేదులే. ఈ ఒక్కసారికి నామాట విను. మళ్ళీ ఎప్పుడూ నిన్ను మా ఇంట్లో భోజనం చెయ్యమని అడగను.” నిజంగానే ముఖ్యమైన ఫంక్షన్ కు కూడా పిలవడేమోనన్నంత నిజాయితీగా చెప్పాడు. ఇంటికెవరన్నా వస్తే, ఆహ్వానించే రోజులు పోయి, “చంటబ్బాయి”లో అల్లు రామలింగయ్యలా తలుపు చాటున దాక్కుని, ఇంట్లో ఎవరూ లేరని చెప్పే రోజులు వచ్చాయి. అలాంటి రోజుల్లో ఎందుకంత బతిమలాడుతున్నాడో అర్ధం కాక తల పట్టుకున్నాను.
“ఎందుకట్లా తినమని బలవంతం చేస్తున్నావో ముందు చెబితేనే నేను నీ వంట తింటాను.” గట్టి పట్టు పట్టాను. లోలోపల భయంగా వుంది, వీడేమి కుట్ర చేస్తున్నాడోనని.
“రేపు సాయంత్రం మావిడా ఊరి నుంచీ వస్తోంది. పనిమనిషి మా ఆవిడా లేదన్న విషయం కనిపెట్టి, రెండో రోజునే లాంగ్ లివ్ తీసుకుంది. మా ఆవిడ వచ్చే లోగా వంట గిన్నెలు, తినిపడేసిన గిన్నెలూ, కంచాలూ కడిగించేయ్యాలి.”
“అంటే నా చేత గిన్నెలు కడిగించేద్దమనుకుంటున్నావా? దుర్మార్గుడా, అతిధి చేత పని చేయిస్తే పాపం.”
“చీ, ఛి! నీ చేత అంట్లు తోమించడం లాంటి చిన్న పని చేయిస్తానా? అవసరం అయితే నేనే తోముకుంటాను. ఏం లేదు, పొద్దున్న వండిన కూరా, పులుసు ఎలాగో అలా ఇద్దరం ఖాళీ చేసెయ్యాలి.”
“అమ్మో, నేను తినను, కావాలంటే వీధిలో అడుకుతినే వాళ్ళకు ఇచ్చెయ్యి. పాపం, వాళ్ళకు ఏమైనా జరిగినా అడిగే నాధుడు కూడా ఉండడు గదా. సో, నీపై పెట్టబోయిన కేసులేం వుండవు. నేను మాత్రం హోటలుకు వెళ్లి భోజనం చేసి, సినిమా చూసి పోతాను. నాకు పదికాలాలు బతకాలని వుంది, నీ వంట తినమని మాత్రం అడగొద్దు” ఖంగారుగా లేవబోయాను. సుబ్బు ముందే ఊహించినట్లున్నాడు. నా భుజం పట్టుకుని కుర్చీలో కూలేశాడు.
“ఇక్కడ నీకు వచ్చిన ప్రమాదం ఏమీ లేదు. పొద్దున్న నేను తిన్నానుగా. వంటలన్నీ బాగానే రుచిగానే ఉన్నాయి. నీకు గుర్తుందా, అలా వంట కుదరని ఆ రోజు ఇద్దరం గ్రాండ్ కాకతీయ హోటలుకు వెళ్ళి భోజనం చేశాము.”
“మరైతే నువ్వెందుకు ఇప్పుడు ఖంగారుగా గిన్నెలన్నీ ఖాళీ చేయ్యలనుకున్నావు? ఇందులో ఏదో రహస్యం వుంది.” లేవబోయిన నన్ను మళ్ళీ పట్టుకుని ఆపేశాడు.
“ఏం లేదు, మా ఆవిడ నా వంటలో అవి ఎక్కువైనాయ్, ఇవి తక్కువైనాయ్ అంటూ వంకలు పెడుతుంది. మరీ ఎక్కువ మిగిలాయనుకో, ఇంతంత వండి తగలేస్తున్నారు అంటుంది.”
“పనమ్మాయికి మిగిలిపోయినవి ఇచ్చేయ్యచ్చుగా?”
“ఇంటావిడకు దొరికే తేలికైన సి.ఐ.డి.లు వాళ్ళే. అందుకని వాళ్ళను అసలు నమ్మరాదు.”
ఒక అరగంట వాదనల తర్వాత, సినిమా టికెట్లు కూడా తనే తీసుకుంటానని హామీ ఇచ్చాడు. మళ్ళీ ఏ ఫంక్షన్ కు కూడా పిలడేమో అనిపించి, ఇక తప్పక భోజనం చెయ్యడానికి వప్పుకున్నాను.
కూర వడ్డించినప్పుడు చూస్తే బాగానే వుంది. భయం భయంగా నోట్లో పెట్టుకున్నాను. కొంచెం ఉప్పు తక్కువ. అంతే! “నాకేం అలా లేదే? నీకు బీపీ పెరిగిపోయి, ఉప్పు తక్కువ అయినట్లు అనిపిస్తోందేమో” అన్నాడు సుబ్బు.
పులుసు పోసుకున్నప్పుడు పులుపు ఎక్కువైందనిపించింది. మొహమాట పడుతూనే చెప్పాను.
“పులుసంటేనే పులుపు” నిర్వచనం చెప్పాడు.
“పులుసులో చింతపండుతో పాటు నిమ్మకాయ కూడా పిండావా? మా అత్తారింట్లో పులుపు వున్నా సరే, మామిడి కాయ పచ్చడిలో చింతపండో, నిమ్మకాయో పిండుతారు. ఉసిరికాయ పచ్చడిలో నిమ్మకాయ పిండడం, నిమ్మకాయ పచ్చడిలో ఉసిరికాయ తొక్కు వెయ్యడం లాంటి ఎక్స్పరిమెంట్లు మన మీదే చేసి, అల్లుడికి మర్యాద చేశామని ఆనంద పడతారు. అందుకే వాళ్లను అత్తారిల్లు అనకుండా “పుల్లారిల్లు” అంటుంటాను.
“వార్ని, భలే కథ చెప్పావే. అలాంటిదేం నేను చెయ్యలేదులే. ఏదో పులుసంటే పుల్లగా వుండాలిగదాని, మామిడి కాయంత చింతపండు రసం పిండి పోశాను.”
“ఇంతకీ, అన్నీ బాగానే ఉన్నాయిగా, నువ్వెందుకు కంగారు పడుతున్నావు?” ఆశ్చర్యంగా అడిగాను.
“కూర వారం క్రితం వండి, మా ఆవిడ ఫ్రిజులో పెట్టి పోయింది. పులుసు నేను మొన్న చేశాను. క్యారెట్టు ముక్కలు వుడకలేదు. నేను తినేశాను. రెండింటినీ స్టవ్ మీద వేడిచేశానులే.”
“జోక్ చేస్తున్నావా? తమాషాగా ఉందా?”
“లేదు, నేను నిజమే చెబుతున్నాను.”
“ఎందుకట్లా అబద్ధాలు చెప్పావ్? భోజనం చెయ్యమని బలవంతం చేసింది, వారం క్రితం వండిన కూర వదిలించు కోవడానికా? దుర్మార్గుడా? ఓర్నాయనో, నాకేం మూడిందో అనవసరంగా నీ ఇంటికొచ్చాను. నాకేదయినా అయితే, నీదే బాధ్యత. ఆ పులుసు సంగతేంటి బాబూ? అది కూడా వారం క్రితం వండినదేనా?”
“పులుసు మొన్నటిదే. కాస్త వేడి చేద్దామని, స్టవ్ మీద పెట్టి బాత్రూంకు వెళ్ళి వచ్చేసరికి, మూకుడులో పులుసు ముక్కలన్నీ ఎలుకలు తినేసి పోయాయి. నువ్వు కంగారు పడతావని, ముక్కలన్నీ నేనే తిన్నానని అబద్ధం చెప్పాను. ”
“ఆ, ఎలుకలు తాగిన పులుసు నాకు పోశావా? అందుకనేనా, నువ్వు కడుపు నిండి పోయిందని పులుసు పోసుకోలేదు. ఓర్నీ, నేను నీకేం అపకారం చేశాను? ఇంత కుట్ర చేస్తావా? నీ వంటతో నన్ను చంపాలని చూస్తావా? నీ మీద కేసు పెడతాను. నేనిప్పుడే డాక్టర్ దగ్గరకు వెడతాను” కక్కుకోవడానికి ప్రయత్నిస్తూ, దబ్బున లేచిన నన్ను మళ్ళీ కుర్చీలో కూలేశాడు, “బయట తలుపు తాళం వేశాను, ఎక్కడికి పోతావు?” అంటూ.
జేబులోంచి సెల్ ఫోను తీసాను. ఫోను నెంబర్లు నోక్కబోతున్న నా వంక చూసి “ఎవరికీ ఫోను?” అడిగాడు.
“మా డాక్టర్ గారికీ, పోలీసులకు! డాక్టర్ దగ్గరకు నువ్వు పోనివ్వడం లేదుగా? ఎవరన్నా సుపారి ఇచ్చారా, నన్ను చంపడానికి? నాపై హత్యా యత్నం చేశావని పోలీసులకు ఫోను చేస్తాను” కోపంగా అరిచాను.
“నువ్వు పోలీసులకు, డాక్టరుకు ఫోను చెయ్యక్కర్లేదు, నువ్వెక్కడికీ పోనక్కర్లేదు, నీ పోలీసులు, డాక్టర్లు ఇక్కడే వున్నారు” అంటుండగానే, పక్క గది లోంచీ మా ఆవిడా, వాళ్ళ తమ్ముడూ ఇద్దరూ నవ్వుతూ బయటకొచ్చారు.
“ నీ డబ్బు ఎప్పుడో అక్కకు ఇచ్చేశాను. తను చీర కొనుక్కుంటాను, ఇచ్చినట్లు నీతో చెప్పద్దంది. సరే, ఇంతకీ ఏం పేరు పెట్టమంటావు బావా, ఈ కధకు?” నా బావమరిది నవ్వుతూ అడిగాడు.
“పెళ్ళాం పుట్టింటికెడితే…అని పేరు పెట్టు. ఇదివరకెవరో తమ సినిమాకు అలాంటి పేరు పెట్టినప్పుడు ఆడవాళ్ళందరూ తిట్టిపోశారు. ఇప్పుడు చీపుళ్ళు పుచ్చుకు వస్తారు, నీకు బడితె పూజ చెయ్యడానికి” కసిగా అన్నాను.
*****
రాయాలనిపించినప్పుడు రాసుకోవడం, చదవాలనిపించినప్పుడు చదవడం, పాడాలనో, మంచి పాటలు వినాలనో అనిపించినప్పుడు వినడం ఇవే ఇప్పటి నా వ్యాపకాలు. ఇక ఏం రాశావని అడిగితే, ఇప్పటికి రెండు తెలుగు నవలు (ఒకటి సహజీవనం, రెండవది లాకర్ నెంబరు 112) వెబ్ మాగాజైన్లలో ప్రచురితమయ్యాయి. పదేహేడు కధలు ఇప్పటి దాకా రాస్తే దాదాపు ఒక పది ప్రచురించబడ్డాయి, మిగిలినవి ఇంకా రాతప్రతిగానే ఉండిపోయాయి. నాట్సు 2015 కదల పోటిలలో నా హాస్య కథ “కంప్యూటర్ కవిత కు బహుమతి వచ్చింది. బ్యాంకు వారి పుణ్యమా అని, ఆ చెక్కు మ్యూజియంలో దాచుకున్నాను. మరొక ఇంగ్లీష్ నవల రాస్తున్నాను. ఒక రెండు తెలుగు కవిత్వం పుస్తకాలు అచ్చేస్తే, మరొక తెలుగు కవిత్వం పుస్తకం, ఒక ఇంగ్లీష్ కవిత్వ పుస్తకం ప్రింటులోకి వెళ్ళ బోతున్నాయి. ఇక హాస్య కథలంటే నాకు ఇష్టం. ఇతర కథలు కూడా రాసినా, ఇష్టమైనవి హాస్య కథలే. మొన్ననీ మధ్య పరమపదించిన,మా బందరు వాడైన ఆదివిష్ణు గారు నా హాస్య కధలకు స్ఫూర్తి. అలాగే యర్రంశెట్టి సాయిగారి కథలన్నా, వ్యంగ్యమన్నా ఇష్టం.
“రోడ్డు రోలర్” అనే ఈ కథను “Lakshmi cheppe Kathalu ” అనే యూట్యూబ్ ఛానల్ లో ఆడియో చేయడానికి అనుమతి ఇస్తారా…. దయచేసి తప్పక సమాధానం ఇవ్వండి. ధన్యవాదాలు🙏
వదలకుండా చదవింపజేసింది కథ
ఆసక్తిగా ఉంది. హాస్యం బాగుంది.
కథ కథనం రెండూ బాగున్నాయి. మొదటి నుండి చివరిదాకా చదివేటట్టుగా ఉంది. ప్రస్తుతం యూ ట్యూబ్ లో వచ్చే విభిన్నమైన విషయాల గురించి చక్కగా వివరించారు
Thank you
Nice story. Enjoyed reading it. Liked the twist at the end of the story
Enjoyed the narration of the story. Looking forward for more stories