క ‘వన’ కోకిలలు – 17 :
చైనాదేశ సనాతన కవిత్రయంలో మూడవ మహాకవి తు ఫు : (Tu Fu / Du Fu – 712–770)
– నాగరాజు రామస్వామి
తు ఫు చైనా దేశపు 8వ శతాబ్ది మహాకవి. మానవతావాది. వాంగ్ లీ, లీ పో, తు ఫు లు తాంగ్ రాజుల నాటి సమకాలీనులు, మహాకవులు. వాళ్ళు వరుసగా బౌద్ధ, టావో, కన్ఫ్సూస్యన్ ధర్మాలను తమ కవిత్వంలో హత్తుకున్న కవిశ్రేష్ఠులు.
తు ఫు తండ్రి విద్యాశాఖలో ఉద్యోగి. చిన్న నాటనే తల్లి మరణించడం వల్ల పినతల్లి పెంచి పోషించింది. తండ్రి పరంపరగా వస్తున్న కన్ఫ్యూస్యస్ విద్యను చెప్పించాడు. చురుకైనవాడే, కాని, పరిపాలనా సంబంధిత సివిల్ పరీక్షలో (Imperial exam) ఫేలై, దేశాటన సాగించాడు. కవిత్వం రాస్తూ గొప్ప పేరు పొందాడు. లీ పో లాంటి ప్రఖ్యాత కవులను కలుసుకున్నాడు. టావోయిజాన్ని హత్తుకున్నాడు. దరిమిలా కొన్నాళ్ళు ప్రభుత్వోద్యోగం చేశాడే కాని నిలదొక్కుకోలేక పోయాడు. ఉద్యోగ నిర్వహణలో అతని నిజాయితీయే అతనికి కష్టాలు తెచ్చి పెట్టింది. ఉద్యోగంలో డిమోట్ అవటంతో, మనసు విరిగి ఊరూరూ తిరిగి, తుదకు ఓ దూరప్రాంతంలో కుటీరం కట్టుకొని, కాలం వెళ్లబుచ్చా డు.
దేశంలో తలఎత్తి, 8 ఏళ్ళపాటు కొనసాగిన An Lushan Rebellion తిరుగుబాటు చైనా సమాజాన్నిఅతలాకుతలం చేసింది. కరువుకాటకాలు, రాజకీయ అస్థిరతలు, పేదరికం, వ్యక్తిగత దుర్ఘటనలు అతన్ని కృంగదీశాయి. ప్రయాణానుభవాలు, దేశ దయనీయ పరిస్థితులు అతనిచే గొప్ప మానవీయ కవిత్వం రాయించాయి. అతని రచనలలో పలు చారిత్రిక సంఘటనల వివరణలు ఉన్నందున అతన్ని poet-historian అనేవారు. తుదకు, భార్యను, మిగిలిన ఇద్దరు కొడుకులను వదలి తు ఫు క్రీ.శ. 770 లో హనాన్ ప్రావిన్స్ లో మరణిచాడు.
తు ఫు రచించిన ముఖ్యమైన గ్రంథాలు :
Du Gongbu Collection, Facing the snow, The Selected Poems of Du Fu. అతని కవిత్వంలోని సుమారు 1500 కవితలు చైనా సాహిత్య చరిత్రలో భద్రపరచబడి వున్నవి. అతని సమగ్రసాహిత్యం ఆరు బృహత్ సంపుటాల సంశోభితం. అతని రచనలు భావావేశ మానసిక చిత్రణలలే కాక, రాజకీయ, వ్యాకుల సాంఘిక వ్యవహారాల సమాహారాలు. అతని కవితలు సింహ భాగం మానవీయ విలువలను ప్రతిఫలించే ప్రబోధాత్మక పద్యాలు. అందుకే అతన్ని Poet-Sage అన్నారు. పాశ్చాత్య పాఠకులకు తుఫు చైనీయ వర్జిల్. హోరేస్, ఓవిడ్. షేక్స్పియర్, మిల్టన్, బర్న్స్, విడ్స్ వర్త్, బిరాంగర్, హ్యూగో, బోదిలేర్లకు సమఉజ్జీ అని ప్రతీతి.
తొలి రోజుల్లో ప్రకృతి కవితలు రాసినా, తు ఫు యుద్ధానంతరం ఎన్నో గూఢమైన వ్యంగ్యార్థ కవితలు రచించాడు. అతని పరిణత కవితలు చాలా వరకు మతిలేని యుద్ధో న్మాదంలో చిక్కుకున్న సామాన్య చైనీయుని దయనీయ స్థితినే చిత్రించాయి.
చైనా కవితల నిడివి చిన్నది. పద్య శైలి, వచన నడక కలగలిసిన విశిష్ఠ కవిత్వ స్వరూపం ( form ). ఈ శైలి హాన్డైనాసిటీ ఆవిష్కరణ. ఫు ఈ కావ్య రీతిని అనుసరించాడు. అతను ఉపయోగించిన ప్రత్యేక ప్రాస (rhyme) నియతి వల్ల అతని కవితలు పద్యానికి, వచనానికి మధ్యస్థంగా ఉంటాయి. వాక్య నిర్మాణ పునరుక్తి ( parallelism) అతని కవిత్వా నికి వన్నె తెచ్చింది. అతను వాడిన ఛందస్సులో గానయోగ్యమైన వెసులుబాటు ఉంటుందంటారు. సమకాలీన సమస్త సాహిత్య ప్రక్రియలను పుక్కిటపట్టి, ప్రాచీన సాహిత్య సాంప్రదాయాన్ని పుణికిపుచ్చుకుని, చైనా సాహిత్య చరిత్ర పుటలలో శిఖరాగ్రం లో నిలిచిన పండిత కవి.
ఆనాడు సర్వత్రా వాడుకలో ఉన్న కవిత్వబాణీ లూషీ (Lushi) ప్రక్రియకు మెరుగు లు దిద్ది, కొత్త ఎత్తులకు చేర్చిన కవిసత్తముడు తు ఫు.
తు ఫు ది అనువాదానికి కొరుకుడు పడని కవిత్వం అని, అతన్ని అనువదించిన బర్టన్ వాట్సని(Burton watson), విక్రమ్ సేత్(Vikram Seth), ఆర్థర్ కూపర్(Arther Cooper) వంటి కవుల అభిప్రాయం కూడా.
తు ఫు కవిత్వం ముఖ్యంగా చైనా, జపాన్ భావితరాలను ప్రభావితం చేసిందనడంలో సందేహం లేదు.
ఇవి కొన్ని అతని ఆంగ్లానువాద కవితలకు నా తెలుగు సేతలు:
Tu Fu Poems: (దు-ఫు కవితలు)
1. ( Chungwang)
ఒక సామ్రాజ్యం విధ్వంసమయింది,
దేశంలోని గుట్టలూ, చెట్లూ
మూగబోయాయి,
వసంతం నాటిన దట్టమైన చెట్లతో
నగరం నిండిపోయింది.
ఆ వినాశనానికి చలించిన పూలు
అశ్రువులు చిమ్ముతున్నవి,
ఎడబాట్లకు బెదిరిన పక్షులు
భయపెడుతున్నవి.
మూడు నెలలుగా మండుతున్నవి
ముంచుకొస్తున్న యుద్ధ సూచక అగ్ని కాగడాలు,
మచ్చుకైనా లేదు ఉత్తరాల బట్వాడ.
నెరసిన జుట్టులోకి దూరిన మునివేళ్ళ తాకిడికి
రాలి పలచనౌతున్నవి తల వెంట్రుకలు;
(పక్క పిన్నులతో పనిలేని పరిస్థితి.)
2. (A VIEW OF TAISHAN)
గ్రేట్ పీక్ పర్వతం గురించి ఏం చెప్పను? – –
సృష్టి ప్రేరణల ప్రాణ శ్వాసల స్ఫూర్తితో,
రేబవల్ల ఉభయ శాక్తిక సమతుల్యంలో
సనాతన డ్యూక్ సామ్రాజ్యాలలో ఎటుచూచినా పచ్చదనమే.
ఛాతీ విప్పి విచ్చుకుంటున్న మబ్బులను చూస్తున్నాను,
విప్పారిన కళ్ళతో గూటికి చేరుతున్న పక్షులను చూస్తున్నాను.
కాని
శిఖరాగ్రం చేరుకొని
ఏక వీక్షణంలో అన్ని పర్వతాలను కలిపి దర్శించుకునేది
ఎప్పుడో?
3. ఎత్తైన కోట బురుజు – –
పైన రెండంతల ఆకారంలో ఒంటరి శశి.
చల్లబడిన ఏటి గట్టున చీకటి నిండిన ఇళ్ళ వరుస;
నీటి అలల మీద వ్యాకుల పైడి పూతలను చల్లుతున్నాడు చంద్రుడు.
తుంగ చాపలకు సిల్క్ తళుకులను అద్దుతున్నాడు.
శూన్య శిఖరాలు, నిశ్శబ్దం:
చెదరని చిదురుమొదురు నక్షత్రాల నడుమ
చంద్రుడు చల్లగా జారుతుంటాడు.
దేవదారు, దాల్చిని చెట్లు పెరిగిన నా పాత తోటలో
విస్తరిస్తున్నది పసిడి కాంతి.
వేల మైల్ల పర్యంతం వెన్నెలే వెన్నెల .
4. (ALONE IN HER BEAUTY)
ఎంత అందమైందో ఆమె!
ఓ నిర్జన లోయలో నవసిస్తుంది,
సంపన్న కుటుంబం లోంచి వచ్చిందే
కాని, ఇప్పుడు ఆమె ధూళిలో ధూళి.
కువాన్ ప్రాంతంతో చెలరేగిన అల్లర్లలో
ఆమె సోదరులు, బంధువులు అందరూ హతమయ్యారు;
రక్షించలేక పోయాయి వాళ్ళను వాళ్ళ హోదాలు.
కొడిగట్టిన దీపం ఆమె;
దౌర్భాగ్యాన్ని నిరసించే లోకం
నిలువరించలేక పోయింది ఆమె దైన్యాన్ని.
రోజుకో కొత్త ముఖాన్ని వెదుక్కునే తిరుగుబోతు పతి;
ఉదయకాంతులు ఉపశమించిన రాత్రి,
మండారిన్ బాతుల జంట ఒరుసుకుంటూ ఒదిగే వేళ
అతను కొత్త ప్రేయసి నవ్వు రవ్వలను ఏరుకుంటాడు.
పాత ప్రేమ కన్నీళ్ళను పట్టించుకోని కామ పిపాసి.
నలుపెక్కింది నదీమూలానికి దూరమైన స్వచ్ఛ స్రవంతి;
ఆమె పూలను తెంపుతుంటుంది,
ఆమె చేతివేళ్ళు దేవదారు ఆకు సూదులను రాల్చుతుంటవి,
పరధ్యాన్నపు సాయంత్రపు చలిగాలిలో
సన్నని సిల్క్ గౌను వేసుకొని
ఆమె వంగిన వెదురుగడను ఆనుకొని
నిరాసక్తంగా ఒరిగి పోతుంది.
5.(I Stand Alone)
ఒక డేగ ఆకాశంలో,
ఓ సీగల్ జంట నదీ తీరాల నడుమ.
దెబ్బ వేయడానికి సిద్ధంగా వుంది
సుడిగాలి;
ఐనా నిశ్చింతగా తిరుగాడుతున్నది
పక్షుల జంట.
గరిక రేకుల నిండా తడి మంచు పుష్కలంగా ఉన్నా
సన్నని దారాలను లాగుతూనే వున్నది సాలెపురుగు.
మానవ వ్వహారాలను తాకుతూనే వుంటవి
ప్రకృతి కవ్వింపులు;
లక్షల ఇబ్బందులు ఎదురైనా
నేను ఒంటిగానే ఎదురొడ్డి నిలుస్తాను.
తు ఫు మహాకవి చైనా దేశ “Poet-Historian”గా, “Poet-Sage” గా వినుతికెక్కాడు.
సనాతన చైనీయ మహాకవి తు ఫు. చైనీయ అపర కన్ఫ్యూస్యస్ తు ఫు. చైనాదేశ వర్జల్ తు ఫు.
*****