వ్యాధితో పోరాటం-19
–కనకదుర్గ
డాక్టర్ పెట్టిన చివాట్లతో నాకు బుద్దివచ్చి మళ్ళీ క్లీనింగ్ లు కానీ, వంటలు కానీ చేయలేదు కానీ చైతన్య స్కూల్ హోం వర్క్ నా దగ్గరే కూర్చుని చేసుకుంటుంటే చూసేదాన్ని, క్లాస్ ప్రాజెక్ట్స్ చేయడంలో కూర్చునే సాయం చేసేదాన్ని. ఇలా జాగ్రత్తగా నెల అయిపోయింది. చెకప్ కి వెళితే డాక్టర్ అన్నీ చెక్ చేసి బ్రెదిన్ పంప్ (Brethen pump) తీసేసారు. పాప ఆరోగ్యంగా ఉంది, నేను బాగానే ఉన్నాను. బెడ్ రెస్ట్ చాలన్నారు. ’హమ్మయ్య’ అనుకున్నాను. ఇంట్లో మామూలుగా పనులు చేయడం మొదలుపెట్టాను. వారానికోసారి చెకప్ కి వెళ్తున్నాము. పాపకి కావాల్సిన బట్టలు, డైపర్స్, చైతన్య సంతోషం గా బొమ్మలున్నషీట్స్, బొమ్మలు కొనడానికి సాయంచేసాడు. జనవరి 8న డెలివరీ డేట్ ఇచ్చారు. చివరి వారం చెకప్ కి వెళితే అల్ట్రా సౌండ్ చేసి చూసారు. చూసి చెబుతాము కూర్చోమన్నారు. కాసేపయిన తరవాత నర్స్ లోపలికి రమ్మన్నది.
“హాయ్ మిసెస్ డింగరి, యువర్ అల్ట్రా సౌండ్ ఈజ్ నార్మల్.యువర్ బేబి ఈజ్ హెల్తీ. బట్….” అని ఆగింది డాక్టర్.
“బట్ వాట్ డాక్టర్,” అన్నాను నేను కంగారుగా.
“ఉమ్మనీరు ( amniotic fluid) ఈజ్ వెరీ లో….”
“వాట్ హాపెన్స్ నౌ..”
“డోంట్ వర్రీ మిసెస్ డింగరి. వియ్ వేట్ కపుల్ ఆఫ్ డేస్, ఇఫ్ ద లేబర్ డసన్ట్ స్టార్ట్ వియ్ హావ్ టు ఇన్ డ్యుస్ ద బేబి.”అంది డాక్టర్.
“వాట్? ఇన్ డ్యుస్ ద బేబి..? నో,నో,నో…మై ఫస్ట్ బేబి బాయ్ వాజ్ ఇన్ డ్యుస్డ్…. అండ్ ఇట్ వాజ్ వెరీ పేన్ ఫుల్.” అన్నాను నేను కంగారుగా…
“కమాన్, దుర్గా (ముందు మిసెస్ డింగరి అని పిల్చినా కాసేపయిన తరవాత దుర్గాకి వచ్చేస్తారు.) కామ్ డౌన్. లెట్స్ వేయిట్ 2 డేస్ అండ్ కాల్ అజ్..దెన్ వియ్ విల్ టేక్ ద డిసిషన్. ఓకే?”
ఇక మాట్లాడేది ఏమి లేక నీరసంగా లేచి వచ్చేసాము.
డాక్టర్లు చెప్పినవి చెప్పినట్టు చేసినా మళ్ళీ నొప్పులు రాకుంటే మందు ఇచ్చి నొప్పులు తెప్పించి డెలివరీ చేస్తారు. చైతన్య పుట్టినపుడు అలాగే చేసారు.
మొదటి కాన్పు, అప్పట్లో డాక్టర్లు కాన్పుల గురించి వివరంగా చెప్పేవారు కాదు. తొమ్మిది నెలలు నిండినా నొప్పులు రాలేదు, ఇది ’90 ||సం|| వెంటనే సిజేరియన్ చేసేవాళ్ళు కాదు. దాదాపు 10 రోజుల తరవాత కూడా నొప్పులు రాకుంటే డా.త్రిపుర హాస్పిటల్ లో వచ్చి జాయిన్ అవ్వమంది. ఆ అనుభవం తల్చుకుంటే ఇప్పటికీ నాకు ఒళ్ళు జలదరిస్తుంది.
అమ్మ వాళ్ళింటికి నేను తొమ్మిదో నెలలో వచ్చాను. అత్తగారింట్లో ఉన్నప్పుడు అక్కడ ఇంటికి దగ్గర ఉన్న నర్సింగ్ హోమ్ లో గైనకాలజిస్ట్ డా.శాంతకు చూపించు కునేదాన్ని. ఒకరోజు మా ఇంటి ముందు నుండి డా.శాంత వెళ్తుంటే మా అత్తగారికి, అమ్మమ్మ గారికి చూపించాను. ఆమె వెళ్తుంటే వీధి తలుపు దగ్గరకు వచ్చి చూసారు. మా అత్తగారు ఏమి అనలేదు కానీ అమ్మమ్మ గారు మళ్ళీ రాగాలు తీసారు, “రంగమ్మా, చూస్తే ఇంత చిన్నగా ఉంది. ఆమె ఏం కాన్పు చేస్తుందే?” అని.
“డాక్టర్లకు చిన్నా పెద్దా ఏంటి? ఆమె గైనకాలజిస్ట్, అంటే స్త్రీల డాక్టర్. కాన్పులు చేస్తారు, వారికి వచ్చే జబ్బులు, సమస్యలన్నింటికీ ట్రీట్మెంట్ ఇస్తారు.” అని చెప్పాను.
“అనుభవం ఉన్న డాక్టర్ లాగ అనిపించటం లేదని అన్నాను. మీ ఇష్టం వచ్చినట్టు చూసుకొండి అమ్మా!” అని తన చెంబుల్లో నీళ్ళు పట్టుకోవడానికి వెళ్ళింది.
నాకు ముందు నుండి అన్ని సింపుల్ గా చేసుకోవాలని ఉండేది. నాన్న రిటైర్ అయ్యారు, సాంప్రదాయమైన పెళ్ళికి చాలా డబ్బు ఖర్చవుతుందని రిజిస్టర్ మ్యారేజ్ గురించి మాట్లాడకుండా మా అమ్మ వాళ్ళు అడ్డు పడ్డారు, ఎందుకంటే శ్రీని ఒక్కడే కొడుకని , వాళ్ళ చెల్లెలికి ఈ సంబరాలు అన్ని చేసి సంతోషించే అవకాశం లేదు కాబట్టి మా పెళ్ళి సాంప్రదాయంగా చేస్తే అందరూ ఆనంద పడతారని నా నోరు నొక్కేసారు. అయితే పెళ్ళి పీటల పై కూర్చున్నప్పుడు శ్రీని, నేను ఇద్దరం చికాకుగానే ఉన్నాము. పక్క పక్కన కూర్చున్నపుడు తను నా వైపు చూసినపుడు, ’పెళ్ళికి ఇంత హంగామా అవసరమా,’ అన్నాను. ’అదే నేను ఆలోచిస్తున్నాను. దీనికంటే ఈజీగా రిజిష్టర్ మ్యారేజ్ చేసుకుంటే బాగుండేదనిపిస్తుంది.’ ’ఇపుడా చెప్పేది. ఊళ్ళోనే కదా ఉంది, పెళ్ళయ్యే వరకు కలుస్తూ ఉంటే ఎన్నో విషయాలు మాట్లాడడానికి అవకాశం ఉండేది కదా!’ అన్నాను నేను కొంచెం కోపంగా.
శ్రీని మనస్తత్వం తన కుటుంబ సభ్యుల మనసు నొప్పించడం ఇష్టంలేదు. తనకేం ఇష్టమో అంతగా ఆలోచించడు. నన్ను చాలా ప్రేమగా చూసుకునేవాడు. నేను నా మనసు లో ఏదున్నా ఈజీగా ఓపెన్ అవుతాను. కానీ శ్రీని గుండెల్లో పెద్ద పెద్ద గోడలు కట్టుకున్నా డు. ముందు నాకు తన మనస్తత్వం అర్దం కాలేదు. ముందుగా ఇంట్లో అడ్జస్ట్ కావడానికి సమయం పట్టింది. మా ఇంట్లో వాతావరణం ఒకలా ఉండేది. ఇక్కడ శైలజ మానసిక ఎదుగుదల లేని అమ్మాయి కావడంతో ఇంట్లో పరిస్థితి ఒకలా ఉండేది. మా ఇంట్లో వారికి నా మనస్తత్వం బాగా తెల్సు. నేను చాలా ఎమోషనల్, నాకు నచ్చని విషయాలు సూటిగా మాట్లాడతాను, అందుకని నాకు కోపమెక్కువని, ఆవేశపరురాలినని కొన్ని బిరుదులు కూడా వచ్చాయి. చాధస్తురాలయినా పెద్దావిడ, చిన్న పిల్లల మనస్తత్వం గల ఆడపడు చు. వాళ్ళ మధ్యన నేను ఇమడగలనా లేదా అనే సందేహం నాకు కలిగి నేను “వద్దని,” చెబితే ఎంతో మంది ఎన్నో రకాలుగా నాకు నచ్చచెప్పడానికి ప్రయత్నించారు. నాకు కట్నం తీసుకునేవాడిని చేసుకోవడం ఇష్టం లేదు. మా ఇంట్లో వాగ్వివాదాలు జరుగు తుండగా వారి కుటుంబం నుండి నాకు నచ్చే కబురు వచ్చింది. నాతో మాట్లాడడానికి వచ్చి తీసుకెళ్తానన్నాడని, కట్నం తీసుకోవడం అతనికీ ఇష్టం లేదని.
ఒక శనివారం వచ్చి వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి తీసుకెళ్ళాడు. ఆటోలో వెళ్తుండగా కొద్దిగా సంబాషణ జరిగింది. నేను ఏదైనా పార్క్ కో, జనసంచారం లేని ప్రదేశానికి వెళ్తే ఒకరి గురించి మరొకరు తెలుసుకోవొచ్చు అనుకున్నాను. కానీ తను ముందే తన క్లోజ్ ఫ్రెండ్ ఇంటికి తీసుకెళ్ళాలని నిర్ణయించుకుని వచ్చాడు కాబట్టి నేనేమి మాట్లాడలేదు. నేను డైరెక్ట్ గా, “కట్నం తీసుకుంటున్నారా?” అని అడిగేసాను. “ఊహు, తీసుకోవటం లేదు. నాకు చెప్పకుండానే మా వాళ్ళు కట్నం కోరడం, మీ వాళ్ళు ఒప్పుకోవడం జరిగింది. నాకు తెలిసిన తరవాత వద్దని చెప్పాను. పెద్దవాళ్ళకి కొంచెం కోపం వచ్చింది కానీ ఇప్పుడు అంతా సద్దు మణిగింది.” అన్నాడు.
తరవాత హాబీస్ గురించి మాట్లాడినప్పుడు, మా ఇద్దరికీ పుస్తకాలు చదవడం ఇష్టమని, నాకు నచ్చే రచయితల బుక్సే తనూ చదువుతాడని తెలిసి మురిసిపోయాను.
వాళ్ళ ఫ్రెండ్ భార్య నన్ను చూసి,”మీరు చాలా సన్నగా ఉన్నారు, కాస్త లావవ్వా లండి,”అంది బజ్జీలు మా ముందర తెచ్చిపెడ్తూ. నేనన్నాను,”నాకు రాదండీ! తననే సన్నగా అవ్వమనండీ.” సురేష్, శ్రీని ఫ్రెండ్, “ఈ మధ్య వరకు మా వాడు సన్నగా ఉండే వాడండి,పెళ్ళి కోసమే కొద్దిగా లావయ్యాడు,”అన్నాడు.
వూళ్ళోనే కదా అప్పుడపుడు వచ్చి కలుస్తూ ఉంటే నాకున్న భయాలు, ఒకరి గురించి మరొకరు తెలుసుకోవచ్చని నాకుండేది. కానీ వెడ్డింగ్ కార్డ్స్ ప్రింట్ చేయించు కుని వచ్చి అవి మా ఫ్రెండ్స్ కి ఇవ్వమని వచ్చాడు అంతే. ఆ తరవాత బట్టలు కొనేపుడు అందరితో కలిసాము.
నాకున్న భయాలు పోవడానికి నేను అఫ్జల్ గంజ్ స్టేట్ లైబ్రరీకెళ్ళి, ఉస్మానియా యునివర్సిటి లైబ్రరికెళ్ళి మెంటల్ రిటార్దేషన్ అంటే ఏంటి? వాళ్ళతో ఎలా నడుచు కోవాలి? వారిని ఎలా చూసుకోవాలి? లాంటి విషయాలు చదివేదాన్ని.
మామగారు ఆఫీసుకి కొంచెం లేట్ గా వెళ్ళేవారు, ఎందుకంటే శైలజకి పొద్దున్న పనులు చేయడానికి మా అత్తగారికి సాయం చేసి వెళ్ళేవారు. అందుకని రాత్రికి లేట్ గా వచ్చేవారు. నేను ముందు వాళ్ళ టైమింగ్స్ ప్రకారమే ఉండడానికి ప్రయత్నించాను. నేను స్నానం చేసేసి, కూరలు కోసి, కిచెన్ లో క్లీనప్ చేసి వాళ్ళ స్నానలవ్వడానికి ఎదురు చూస్తూ కూర్చునే దాన్నిపేపర్ చదువుతూ. అమ్మమ్మగారు,అత్తగారు, వార్తలడిగేవారు. అమ్మమ్మ గారు వెండి, బంగారం ధరలు అడిగేవారు. వాళ్ళు రెగ్యులర్ గా చేతి, కాలి గోళ్ళు తీసుకునేవారు కాదు. ఒకరోజు నేను చూసి, నెయిల్ కట్టర్ తీసుకువచ్చి అందరి పెద్ద పెద్ద గోళ్ళు తీసేదాన్ని. ఒకోసారి, తలలకి నూనె రాసి దువ్వేదాన్ని. మద్యాహ్నం మా అత్తగారి చీరలన్నీ చాలా ముడతలయి పైకి చుట్టుకుపోయేవి, అవన్ని తీసుకొచ్చి నీట్ గా ఇస్త్రీ చేసేదాన్ని. ఆ చీరలు చేస్తుంటే, శైలజ తన లంగా, బ్లౌజులు చేయమని, అమ్మమ్మ గారు తన పట్టు చీరలుతెచ్చి ఇచ్చేవారు. మా మామగారి ఆఫీసుకేసుకెళ్ళే బట్టలు అన్నీ ఇస్త్రీ చేసేదాన్ని. నన్నెవరూ అడగలేదు ఈ పనులు చేయమని, మా ఇంట్లో ఎలా ఉండే దాన్నో అలాగే ఇక్కడ వీళ్ళతో కలిసి పోవాలని నా కోరిక… ఇంటి ముందర ఒక జాజి మల్లె తీగ ఉండేది. నాకు పూల మొక్కలు, వీలయితే కూరల మొక్కలు, తీగలు పెట్టుకోవాలని ఇష్టం. శ్రీని కూడా సరే అన్నాడు. మొక్కల నర్సరీకి వెళ్ళి పూల మొక్కలు, కొన్ని పచ్చటి క్రోటన్స్ తెచ్చి భూమిలో నాటాము. అత్తగారికి వంటలో సాయం చేసేదాన్ని. శైలజ గొడవ పెడుతున్నా బూజులు దులిపి ఇల్లంతా శుభ్రం చేసేదాన్ని.
పూల మొక్కలు తెచ్చి పెట్టినందుకు డబ్బులు ఖర్చు అయ్యాయని అమ్మమ్మ గారు గొడవ పెట్టారు. నాకు ముందు అర్థం కాలేదు తండ్రి కొడుకు ఇద్దరు సంపాదిస్తున్నారు ఇందులో తప్పేముంది అనిపించింది. కానీ వాళ్ళిద్దరూ ఆఫీసుకి వెళ్లిపోయాక అసలు విషయాలు బయట పెట్టేది. పెళ్లికి మేము కట్నం ఇవ్వలేదు కనుక పెళ్ళి ఖర్చులకి అప్పు చేశారట. మా నాన్న రిటైర్ అయ్యాక ఏ అప్పు లేకుండా పెళ్ళి చేసారు. నేను శ్రీనిని అడిగాను, “అప్పెందుకు చేసారని?”
“ఆమెకు చాధస్తం ఎక్కువ, కొంచెం వుంటె ఎక్కువ చేసి మాట్లాడుతుంది. నాన్న, రిసెప్షన్ కోసం కొద్దిగా ఫ్రెండ్స్ దగ్గర తీసుకున్నారు. అవి తీర్చేస్తాము.”
“నేనెంత తీసుకున్నారు,” అని అడిగితే, “ఎంతో కొంత తీర్చేస్తామని చెప్పాగా.” అని అక్కడ నుండి లేచి వెళ్ళిపోయాడు.
ముందు నుండి శ్రీనికి డబ్బుల విషయం నాతో మాట్లాడడం అలవాటు లేదు నేను మాట్లాడడానికి ప్రయత్నించినా తను విషయాన్ని డైవర్ట్ చేసేవాడు. నాకు ముందు నుండి ఏ సమస్య వచ్చినా దాన్ని అప్పటికప్పుడే పరిష్కరించుకోవాలి అని ఉండేది. నేను ఎప్పుడు ప్రయత్నించినా అది పనిచేయలేదు ఇంటి విషయాలు తన కుటుంబ విషయాలు షేర్ చేసుకోవడం ఇష్టం ఉండేది కాదు. నేను ప్రతి విషయం ఏ దాపరికం లేకుండా మాట్లాడడం నా కలవాటు. నేనెప్పుడూ ఏ విషయం గురించి మాట్లాడడానికి ప్రయత్నించినా తను సీరియస్ గా తీసుకొని మాట్లాడడం మానేసేవాడు దాంతో నాకు చాలా చిరాకుగా అనిపించేది. కట్టుకున్న భార్యకి తన మనసులో ఉన్న మాట చెప్పకపోతే ఇక ఈ బంధం ఎందుకు అనిపించేది.
అంతేకాక తను చాలా బాగా పుస్తకాలు చదివాడు. అన్ని రచయితలవి అన్ని రకాల పుస్తకాలు చదివి ఉన్నాడు. అందుకే అతను అందరికన్నా వేరుగా ఉంటాడనుకున్నాను. తనకి తల్లి, చెల్లి, అమ్మమ్మ, తండ్రి అంటే చాలా ఇష్టం అది చూసి నేను నన్ను కూడా అర్థం చేసుకుని తన మనసు విప్పి మాట్లాడతాడనుకున్నాను. నన్ను బాగా చూసుకోలేదా అంటే బాగా చూసుకునేవాడు. కానీ నేను ఏ విషయాల్లో కల్పించుకోవడం ఇష్టం ఉండేది కాదు.
నేను శైలజ విషయంలో ఏవైనా మార్పులు, చేర్పులు చేయాలని చెబితే ముందు ముందు బాగానే విన్నారు. శైలజ మానసిక ఎదుగుదల 6 ఏళ్ళ వయసు దగ్గరే ఆగి పోయింది. చిన్నపుడు మానసిక ఎదుగుదల తక్కువ ఉన్నవారి కోసం ఒక స్కూల్ ఉంది, ఆ స్కూల్ బస్ వచ్చి తీసుకెళ్ళేవారట. కానీ అక్కడ నేర్చుకున్నదాని కంటే తిట్లు, బండ బూతులు, అందరిని కొట్టడమ్ వచ్చిందట. ఒక రోజు బస్ వచ్చే వరకు శైలజ రెడీ అవ్వలే దట, ఆ బస్ డ్రైవర్ ఆగకుండా వెళ్ళిపోయాడట. అందుకని స్కూల్ మానిపించేసారు. తన బాడీకి అస్సలు ఎక్సర్సైజ్ ఉండేది కాదు, అదీకాక తన శరీరం బాగా వణుకు తుండేది. ఒకరోజు శైలజని మంచి న్యూరాలజిస్ట్ కి చూపిస్తే బాగుంటుంది అని చెప్పాను మా అత్తగారితో. ఆ వణుకు తగ్గడానికి వాళ్ళు ఏదైనా ట్రీట్మెంట్ కానీ సర్జరీ కానీ చేస్తే ఫలితం ఉంటుందేమో అని అన్నాను. కొన్నాళ్ళు ఆలోచించి నిమ్స్ ఆసుపత్రి లో ఒక ఫేమస్, మంచి న్యూరాలజిస్ట్ దగ్గర అప్పాయింట్మెంట్ తీసుకుంటే నేను, మా అత్తగారు కల్సి ఆటోలో తీసుకెళ్ళాము. ఆటోలో ఎక్కడానికి, దిగడానికి శైలజకి కష్టమైంది. ఆటో అతను సాయం చేసాడు. డాక్టర్ గారికి మా దగ్గరున్న పాత రిపోర్ట్స్ చూపించాము. రిపొర్ట్స్ చూసి, శైలజని చూసి చాలా పాజిటివ్ గా మాట్లాడారు. “రెండు వారాల తరవాత వస్తే కొన్ని పరిక్షలు చేసి మెదడుకి చిన్న సర్జరీ చేస్తే ఈ వణుకు తగ్గుతుందమ్మా.” అని చెప్పారు. “కానీ నేను చెప్పినట్టుగా రెండు వారాల తరవాత రావాలి. పిల్ల బాగవ్వాలని మీకు నిజంగా ఉందో లేదో చూడడానికే కరెక్ట్ గా రెండు వారాల సమయం ఇస్తాము. రెండు వారాల తరవాత వస్తే మాత్రం కష్టం. ఏమ్మా మీ అమ్మాయికి వణుకు తగ్గాలని ఉందా మీకు?” అని మా అత్తగారిని అడిగారు. ఆమె కొచెం బెరుకుగా, “సర్జరీ చేస్తే మా అమ్మాయికి ఏం కాదు కదా?” అని మెల్లగా అడిగింది.
“ఏమవుతుందమ్మా? వణుకు తగ్గుతుంది తన పనులు తానే చేసుకుంటుంది. మంచి సర్జన్స్ ఉన్నారు మా దగ్గర, మీ అమ్మాయిని బాగా చూసుకుంటారు. ఇపుడు వెళ్ళి రెండు వారాల తరవాత రండి.” అని పంపించేసారు.
ఇంటికి వచ్చిం తరవాత అందరూ సంతోషిస్తారనుకున్నాను, నేను తప్ప అందరూ విచారంలో మునిగిపోయారు. మెదడు సర్జరీ అంటే మాటలు కాదు పిల్లకి ఏమన్నా అయితే ఎట్లా? ఎన్నో తర్జన భర్జనలు, నేను శ్రీని నచ్చచెప్పడానికి ప్రయత్నించాము. శైలజ మాత్రం తన లోకంలో తను ఉంది. వీళ్ళు ఆలోచించడానికి చాలా సమయం తీసు కున్నారు. పాత డాక్టర్స్ దగ్గరకు వెళ్ళారు, జ్యోతిష్యుల దగ్గరకు వెళ్ళారు. రెండు వారాలు దాటిపోతుంటే నేను గుర్తు చేసాను.
” ఏం చేయాలో అర్ధంకావటం లేదమ్మా!” అన్నారు అత్తగారు. “మరి డాక్టర్ రెండు వారాల తర్వాత రమ్మన్నారు కదా! వాళ్ళు రమన్న టైంకి వెళ్ళక పోతే ఇంట్రెస్ట్ పోతుం దేమో మరి,” అని నేనంటే… “అట్లా అంటే ఎట్లాగమ్మా? మనం అన్నీ ఆలోచించుకోవాలి కదా! మెదడు సర్జరీ కదా ఎవరికైనా భయంగానే ఉంటుంది కదా! కొన్నాళ్ళయ్యాక వెళ్దాములే ఏం కాదు.” అన్నారు అత్తగారు.
*****
(సశేషం)
నేను హైద్రాబాద్ లో పుట్టి పెరిగాను. గత 26 ఏళ్ళుగా అమెరికా, పెన్సల్వేనియా లో నివసిస్తున్నాము. ’90 నుండి ఫ్రీలాన్సర్ గా డెక్కన్ క్రానికల్, ఉదయం, ఆంధ్రజ్యోతి, ఆంధ్రభూమి, సాక్షి, వార్తాపత్రికలకు, వెబ్ మ్యాగజైన్స్ కి ఆర్టికల్స్ రాస్తూనే వున్నాను. తెలుగువన్ అంతర్జాల రేడియోలో ఆర్.జే గా ’పాటలపల్లకీ,’ కార్యక్రమాన్ని 13 సంవత్సరాలుగా నిర్వహిస్తున్నాను. ’మయూరి,’ ’రచన’ మాసపత్రికలో, వివిధ వెబ్ మ్యాగజైన్స్, ’విహంగ,’ ’శిరాకదంబం,’ ’తెలుగువన్.కామ్’ లో ’ కథలు ప్రచురింపబడ్డాయి. పుస్తకాలు చదవడం, జీవితంలో చిన్నప్పట్నుండి మధ్యతరగతి జీవితాల్లో సంబంధాల గురించి గమనించడం, వాటి గురించి కథలుగా రాస్తే ఎలా వుంటుంది అని దాదాపు 13, 14 ఏళ్ళ వయసప్పట్నుండే ఆలోచించడం అలవాటయింది. ఇంకా ఎంతో చదవాలి, పుస్తకాలు, జీవితాన్ని ఇంకా ఎంతో రాయాలి అనే తపన ఉంది. శ్రీనివాస్ తో, జీవిత సహచర్యం, చైతన్య, స్ఫూర్తి(పిల్లలు) మీనా(కోడలు) ముందుకు సాగమని స్ఫూర్తినిస్తుంటారు.