సహనంగా ఉంటే చాతగాదని కాదు
మౌనంగా ఉంటే మతాలు రావని కాదు
ఓపిక పట్టామంటే ఎదురు తిరగలేరని కాదు
భరిస్తున్నామంటే పోరాడలేరని కాదు!
నీ పరువెందుకు తీయటమని కావచ్చు
నీ మీద మిగిలిన ప్రేమ నమ్మకం కావచ్చు
నీలాగా దిగజారి మాట్లాడలేక కావచ్చు
నీలాగా అవినీతి వెంట నడవలేక కావచ్చు!
అంతేకానీ
నువ్వేం చేసిన చెల్లుతుందని కాదు
నువ్వేం మాట్లాడినా నెగ్గుతుందని కాదు
అన్యాయం ఎల్లవేళలా కాపుకాస్తుందని కాదు
కాలం కొండలా అడ్డు నిలబడిందని కాదు
పదే పదే అవమానిస్తే వెనక్కి తోసేస్తే
కావాలని గొప్పదనాన్ని తగ్గించి చులకన చేస్తే
వర్ణం రూపం కులం ప్రాంతం జెండరంటూ
వివక్ష చూపి అణగ తొక్కేయాలని చూస్తే
బలహీనులని బాధ్యత లేకుండా ప్రవర్తిస్తే
అసహాయులని అబలలని మీది మీది కొస్తే
చేతికి గాజులు తోడుక్కున్నారని ఎత్తిపొడిస్తే
ఏమి చేస్తారులే అని అనవసరంగా రెచ్చిపోతే
చూస్తూ ఉరుకునేదే లేదు!
సయ్యంటూ రణరంగంలోకి దూకేయ్యడమే
దారిలోని ముల్లులా తీసి పక్కన పారేయ్యడమే
అబద్దపు నీలి రాతల్ని తుడిచి పారేయ్యడమే
శిశుపాలుడి వంద తప్పుల్ని లెక్కపెట్టడమే!
అసత్యానికి దిక్కులేని చావు తప్పదు
అక్రమానికి అంతులేని శిక్షలు తప్పదు
నిజానికి ఎప్పటికైనా విజయం తప్పదు
ధర్మానికి యుద్ధం తర్వాతైనా గెలుపు తప్పదు!