వెనుతిరగని వెన్నెల(భాగం-50)

డా||కె.గీత

(*“కౌముది” లో ధారావాహిక నవలగా 2015 నుంచి 2020 వరకు ప్రచురించబడిన  “వెనుతిరగని వెన్నెల” ఇప్పటివరకు చదవని వారి కోసం కౌముది సౌజన్యంతో నెల నెలా ఆడియోతో బాటూ ఇక్కడ ఇస్తున్నాం.) 

***

జరిగిన కథ: అమెరికాలో తన తల్లికి స్నేహితురాలు, స్త్రీలకు సహాయం చేసే సంస్థ “సహాయ”ను నడిపే ఉదయినిని కలవడానికి వస్తుంది సమీర. నాలుగు నెలల గర్భవతైన సమీర, తనకు విడాకులు తీసుకోవాలని ఉందని, అందుకు దోహదమైన పరిస్థితుల్ని చెపుతుంది. ఉదయిని “తన్మయి” కథ చెపుతాను, విన్నాక ఆలోచించుకోమని చెప్తుంది సమీరతో. చుట్టాల పెళ్ళిలో కలుసుకున్న తన్మయి, శేఖర్ లకు పెద్దవాళ్ళ అనుమతితో పెళ్ళి జరుగుతుంది. పెళ్ళయిన మరుక్షణం నించే శేఖర్ అసలు స్వరూపం బయట పడుతుంది. మొదటి సంవత్సరంలోనే అబ్బాయి పుడతాడు. శేఖర్ తో ఒక పక్క కష్టాలు పడుతూనే తన్మయి యూనివర్శిటీలో ఎమ్మే పాసయ్యి, జే.ఆర్.ఎఫ్ సాధించి, పీ.హెచ్.డీ లో జాయినవుతుంది. తన్మయి ఆశయాల్ని భరించలేని శేఖర్ గొడవ చేసి ఇంట్లో నుంచి వెళ్ళిపోయి విడాకుల నోటీసు పంపుతాడు. ఎన్నో రోజులు పోరాడి, తన్మయి చివరికి శేఖర్ కు తనే విడాకులు ఇస్తుంది. హైదరాబాదుకు దగ్గర్లో తన్మయికి లెక్చరర్ గా ఉద్యోగం వస్తుంది. చిన్ననాటి స్నేహితుడు ప్రభు అనుకోకుండా మళ్ళీ ఎదురవుతాడు.

***

          కాలేజీకి వేసవి కాలం సెలవులు వచ్చేయి. సిద్దార్థ ప్రభుతో మాట్లాడతానన్నాడు.  స్పాట్ వేల్యూయేషన్ లో కలిసినా సిద్ధార్థ తన హడావిడిలో తనుండడం వల్ల తన్మయి ఏవీ అడగలేక పోయింది. అతనూ ఏవీ చెప్పలేదు. 

          సిద్ధార్థ ఏం మాట్లాడేడో, ప్రభు స్పందన ఏవిటో తెలుసుకోవాలనే కుతూహలం రోజురోజుకీ పెరిగిపోసాగింది. 

          సెలవులు అయ్యేంత వరకు రోజులు ముళ్ళ మీదున్నట్టు భారంగా అనిపించ సాగేయి తన్మయికి. 

          సిద్ధార్థ అసలు ప్రభుతో మాట్లాడేడో, లేదో కూడా తెలియదు. బహుశా: సెలవులకి సొంత వూరు వెళ్ళడం వంటి పనుల్లో పడి అసలు కలిసే ఉండకపోవచ్చు.

          “అయినా తన పిచ్చిగానీ ప్రభు తనకు తగినవాడవునో కాదో తనకు తెలుసు కదా!

          సిద్ధార్థ కొత్తగా అతన్ని అంచనా వేసేదేవుంటుంది?” అని ఒక వైపు

          “సిద్ధార్థ తనకు మంచి మిత్రుడు. తన మేలుకోరే వాడు. ప్రభు గురించి తనకు కొంత మాత్రమే తెలుసు. తనకి తెలియనివి, అర్థం కానివి సిద్దార్థ తెలుసుకుని తనకు సలహా చెప్పడంలో తప్పేముంది” అని మరోవైపు అనిపించసాగింది.

          అదీగాక తనొక్కతే ఇవన్నీ ఆలోచించి చాలా అలిసిపోతూంది. తన ఆలోచనలు మరెవరితోనైనా పంచుకోవాలని అనిపిస్తున్న తరుణంలో సిద్ధార్థ తనంతట తనే సహాయం చేస్తానని ముందుకొచ్చేడు. 

          ఏదేమైనా తను తప్పు నిర్ణయం తీసుకోకూడదు. అసలే మొదటిసారి శేఖర్ విషయంలో తను అతన్ని పూర్తిగా నమ్మి మోసపోయింది. 

          ప్రభు విషయంలో తొందరపడకూడదు, ఎంత కాలం పట్టినా తను తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. ఆలస్యం అమృతం విషమైనా, మరేదైనా.

          ఇప్పుడు తనున్న పరిస్థితుల్లో తనకి పెళ్ళి ఒక జీవితాంతపు తోడే కాదు, అవసరం కూడా. 

          కానీ అవసరాల కోసం, స్వార్థాల కోసం కలుపుకునే బంధాలు పటిష్టమైనవి కావని శేఖర్ నిరూపించేడు.  

          తనూ ఇప్పుడు అలాగే ఆలోచిస్తూందా? ఛ.. ఛ..  లేదు. తను శేఖర్ లా నీచంగా ఎప్పటికీ ఆలోచించలేదు, ప్రవర్తించలేదు.

          ప్రభుని తను మనసారా ప్రేమించి, అతను తనకి కావాలని అనుకుంటూంది. అతనితో జీవితం పంచుకుని, హాయిగా బతకాలని తాపత్రయపడుతూంది. 

          కానీ తనకు కావలసిన ఆలంబన కోసం ఇప్పుడిప్పుడే మొదలవుతున్న అతని జీవితాన్ని కాలరాసే అధికారం తనకు లేదు.

          అతనే స్వయంగా అందుకు సిద్ధపడుతున్నప్పటికీ, అతన్ని మనసారా ప్రేమించే వ్యక్తిగా తను అతని జీవితం ఎప్పుడూ చక్కగా ఉండాలని కోరుకుంటూంది.

          పైగా అతను తనతో జీవించడంలో ఎన్నో త్యాగాలు చేయాల్సి వస్తుంది.

          వాటన్నిటికీ తను అర్హురాలైనా, కాకపోయినా అతను భవిష్యత్తులో ఎప్పుడైనా బాధ పడకుండా ఉండగలడా?

          తీసుకున్న నిర్ణయాలు సరైనవి అవునని ఇప్పుడు నమ్ముతున్నట్లే జీవితాంతం నమ్మి, కట్టుబడి ఉండగలడా?

          ఏ ప్రేమతోనైతే అతను తనకు దగ్గిర కావాలనుకుంటున్నాడో ఆ ప్రేమ అజరామరంగా తాము జీవించి ఉన్నంతకాలం ఉండగలదా?

          అంత బలమైన ప్రేమని ప్రేరేపించ గల గొప్ప హృదయాలు తామిద్దరికీ ఉన్నాయా?

          దృఢమైన నిర్ణయాలు, బలమైన ప్రేమ, ఎన్ని కష్టాలెదురైనా తట్టుకుని, ‘మేమిద్దరం ఒకటి’ అని ఎదురు నిలబడగలిగిన స్థైర్యం…. ఇవన్నీ ప్రభులో ఉన్నాయో లేదో తెలుసుకోగలగాలి సిద్దార్థ. 

          అతని మాటల్లోనూ, చేతల్లోనూ తనకి కనబడుతున్న నిస్వార్థ ప్రేమ, నిజాయితీ  సిద్దార్థకు కనిపించాలి. 

          అప్పుడే అసలు ఈ ప్రయత్నం సఫలమవునో కాదో అర్థమయ్యేది….

***

          తల స్నానంచేసి బట్టలు ఆరవెయ్యడానికి డాబా మీదికి వచ్చింది తన్మయి. 

          పొడవైన కుదుళ్ళకు కట్టుకున్న తువ్వాలుని విప్పి ఒక పక్కగా నిలబడి ఎండకి జుట్టారబోసుకోసాగింది.

          పక్కనే ఎక్కడి నుంచో టీవీలోంచి పాట వినిపిస్తోంది.

“నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చింది

కన్నుల్లో నీరు తుడిచి కమ్మని కల ఇచ్చింది”

          ఎన్నిసార్లు విన్నా మనసు ఆర్ద్రమయ్యే గొప్ప పాట-

          శేషేంద్ర శర్మ గారి కవిత్వం జ్ఞాపకం వచ్చింది.. 

“చెట్టుగా ఉంటే ఏడాదికి ఒక వసంతమైనా దక్కేది

 మనిషినై అన్ని వసంతాలూ కోల్పోయాను”

“కాలాన్ని నా కాగితం చేసుకుంటూ దాని మీద లోకానికి ఒక స్వప్నం రాసిస్తా 

దాని కింద ఊపిరితో నా సంతకం చేస్తా”

….చిత్రంగా గుర్తుకొచ్చిన కవితలన్నీ ప్రభు తన గంభీరమైన గొంతుతో  తన చెవుల్లో వినిపిస్తున్నట్లు అనిపించసాగేయి తన్మయికి.

          తను ప్రభుని దూరం పెట్టేనని అనుకుంటూంది గానీ, అసలు తను తన ఆలోచన ల్లోంచి ఎప్పుడైనా దూరం పెట్టగలుగుతోందా? 

          తన్మయి ఆలోచనల్లో ఉండగానే కింద పోస్ట్ మేన్ వచ్చిన కేక వినబడింది.

          ఆ వెంటనే తాయిబా పిలుపు వినబడింది.

          తన్మయి కిందికి గబగబా వచ్చి సంతకం పెట్టి పార్శిల్ తీసుకుంది.

          “Let us C”  సీ ప్రోగ్రామింగు పుస్తకం. 

          మొదటి పేజీలోంచి తొంగి చూస్తున్న ఉత్తరం కనిపించేసరికి సంతోషం ఉరకలు వేసింది తన్మయికి.

          అమాంతం లోపలికి వెళ్ళి పుస్తకాన్ని గుండెలకు హత్తుకుని, ఉత్తరాన్ని ముద్దు పెట్టుకుని విప్పింది.

ప్రియాతిప్రియమైన తనూ!

          ‘ప్రియమైన ప్రభూ!’ అని నన్ను పలకరించిన నీ లేఖ ఇవేళ నాకు ఆనందాతిరేకా న్ని నింపిన రోజుని బహూకరించింది.

          ఎప్పుడెప్పుడు ఆఫీసు అవుతుందా, ఎప్పుడు నీకు ఉత్తరం రాద్దామా అని మనసు పొద్దుట నీ ఉత్తరం అందుకున్న దగ్గిర్నించీ తహతహలాడుతూంది.

          సమయం ఉన్నప్పుడల్లా నీ ముత్యాల్లాంటి అక్షరాల్ని నా కనురెప్పల్తో తడుముతూ, ప్రతీ పదంలోనూ తొణీకిసలాడుతున్న ప్రేమను అమాంతం హత్తుకుని గొప్పగా పొంగి పోతూ నీ కోసమే కలవరిస్తున్నాను.

          ఏ జన్మ అనుబంధమో మనది! కష్టాల జీవితాన్ని ధైర్యంగా ఎదుర్కొని ధీరవనిత వైన నువ్వు నమ్మకపోవచ్చుగానీ, నువ్వు నన్ను చేరుకోవడం కోసమే నీ జీవితంలో అవన్నీ జరిగాయని నేను నమ్ముతున్నాను! మనల్నిక ఎవరూ ఆపలేరు. నిన్ను నా నించి ఎవరూ దూరం చెయ్యలేరు. 

          నన్ను పెళ్ళి చేసుకోవడానికి నీ మనస్సులో ఏవైనా సందేహాలున్నాయేమో గానీ, నాకు లేవు.

          నీ పట్ల నా ప్రేమ నిజమైనదే అయితే మనం తప్పక పెళ్ళి చేసుకుంటాం.

          ఎప్పుడెప్పుడు మన గడువు తీరుతుందా, ఎప్పుడు నిన్ను చూద్దామా అని మనసు తహతహలాడుతూంది. ఊహూ… అసలు మనసు నా వశంలోనే ఉండడం లేదు.”

          …….ప్రేమ ప్రవాహం లా సాగిపోతున్న ఉత్తరాన్ని గుండెకి హత్తుకుంది తన్మయి.

          “ఇంత గొప్ప ప్రేమకి తను అర్హురాలేనా? చాలు అజ్ఞాత మిత్రమా! ఈ జన్మకిది చాలు!!” 

          ఉత్తరాన్ని ఎన్నిసార్లు చదువుకుందో లెక్కలేదు. ఉత్తరానికి జాబు రాసి కవరు అతికించింది.

          నాలుగు రోజులకొక ఉత్తరం వస్తూనే ఉంది. జవాబులు రాస్తూనే ఉంది. 

          ఆ మధ్యాహ్నం గదిలో చాపమీద పడుకుని చుట్టూ ఉత్తరాలు పేర్చుకుని, ఒక దాని తర్వాతొకటి మళ్ళీ, మళ్ళీ చదవసాగింది. ప్రభు ఉత్తరాల్లో కేవలం ప్రేమ పలకరింతలు, పలవరింతలే కాదు… 

          జ్ఞానాన్నిచ్చే ఎన్నో అంశాలు కూడా ఉంటాయి. 

          “కంప్యూటరు సైన్సు తరగతులు ఎంత వరకూ వచ్చాయి? విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్స్ కూలంకషంగా ఉపయోగించడం వచ్చిందా? డబ్ల్యు.డబ్ల్యు.డబ్ల్యు  అంటే ఏవిటో గుర్తుందా? సీ ప్రోగ్రామింగులో చుక్కల్తో త్రిభుజం నిర్మించడం ఎంత వరకు వచ్చింది?”  

          అతనికొచ్చిన విజ్ఞానమంతా తనకీ నేర్పాలన్న ఉత్సాహం తన్మయికి ఎంతగానో నచ్చుతుంది. 

          ఎప్పటికైనా అతనితో సమఉజ్జీ కాగలదో లేదో తెలియదు కానీ, కొత్త సబ్జెక్టు తెలుసు కోవడం తనకీ ఉత్సాహంగా ఉంది. 

          ఇవేళ్టి ఉత్తరం చివర్న “బాబుకి ముద్దులు. నీకు మాత్రం ఏవీ లేవు.” అనే  కొంటె వాక్యాన్ని చూసి బోర్లా తిరిగి రెండు చేతులూ గెడ్డం కింద పెట్టుకుని నవ్వుకుంది.

          వారం పొడవునా ప్రభు ఉత్తరాల కోసం ఎదురు చూడడం, ఉత్తరం అందుకోగానే తిరిగి ఉత్తరం వ్రాయడమే జీవితంగా గడుస్తూంది. 

          వేసవి కాలం తన జీవితంలో గతపు చేదునంతా తీసివేసి కొత్త ఉత్సాహం నిండు కున్నట్టు అత్యంత ఆనందంగా గడవసాగింది తన్మయికి.

          సెలవుల్లో ఇంటికి వెళ్ళి రావాలనుకుంది కానీ, మనసు బాధగా అనిపించి వెళ్ళడం మానేసింది. అలా వెళ్ళకపోవడం ఒక విధంగా మంచిదే అయ్యింది.

          తను ప్రభు ఉత్తరాలతో రోజులు ప్రశాంతంగా, హాయిగా గడపగలుగుతూంది.

          ఈ మధ్య తల్లిదండ్రులిద్దరూ ఉత్తర భారతదేశ తీర్థయాత్రలకు వెళ్ళేరు. 

          తనూ వస్తానంటే తనకీ, బాబుకీ టిక్కెట్లు తనే కొనుక్కోవాలని నిర్మొహమాటంగా చెప్పింది తల్లి.

          తన్మయికి మొదట వెళ్ళాలనిపించినా, ఈ మాటతో వెళ్ళే ఉత్సాహం మొత్తం పోయింది. 

          తల్లి ప్రవర్తనకి ఒక్కొక్కసారి తన్మయికి చాలా ఆశ్చర్యం వేస్తుంది. 

          తన డబ్బులు సరిపడాలేకపోతే తనకి చెప్పొచ్చు కదా! తనే అందరికీ టిక్కెట్లు తీసేది కదా!

          వాళ్ళిద్దరికీ వాళ్ళు కొనుక్కుని, తనకీ, బాబుకీ తను కొనుక్కోవడం ఏవిటో తనకి అస్సలు అర్థం కాదు!

          లేదా కూతురి సంపాదించిన డబ్బులు తీసుకోవడం ఇష్టం లేకపోతే, తననీ తీసుకెళ్లాలనుకున్నపుడు అందరికీ వాళ్ళే కొనగలిగినప్పుడే ప్రయాణం పెట్టుకోవచ్చు కదా!

          ఇటు వంటి సందర్భాలో వాళ్ళకి తను పరాయిదన్న భావన తనని కలచి వేస్తుంది.

          తల్లిదండ్రులు కూడా తనకి పరాయివారైతే అసలు తనకంటూ ఎవరున్నారు?

          బాబూ, తనూ ఒకరికొకరు తప్ప. ఉహూ.. ప్రభు ఉన్నాడు. అవును తనని అతనె ప్పుడూ పరాయిగా ఆలోచించిన సందర్భం ఒక్కటీ లేదు.

          అతని పట్ల ఇష్టం బాగా పెరిగిపోవడానికి ఇదొక కారణం. అవధిలేని ప్రేమ ఆ అక్షరాల నిండా.

          తన్మయి కళ్ళు నీళ్ళతో నిండుకున్నాయి. 

          అతని అవ్యాజమైన ప్రేమకి ఏమిచ్చుకోగలదు తను?

***

          కాలేజీ తెరిచిన మొదటి రోజు అత్యంత ఉత్సాహంగా ఆవరణలోకి అడుగు పెట్టింది తన్మయి.

          ఎప్పుడెప్పుడు సిద్దార్థ వస్తాడా, ప్రభుతో మాట్లాడిన వివరాలు చెప్తాడా అని మనసంతా ఆతృతగా సిద్దార్థ కోసం ఎదురుచూడసాగింది. 

          సిద్దార్థ వస్తూనే నవ్వు ముఖంతో పలకరించాడు.

          “ఏవిటి, ఏదో ఆతృతగా ఎదురు చూస్తున్నట్టున్నారు?’ అన్నాడు.

          తన్మయి “అహ, ఏవీ లేదు” అని కళ్ళు కిందికి దించుకుంది.

          చేతిలోని బ్యాగుని టేబుల్ మీద పెడుతూ, “ప్రభుని కలిసేను” అన్నాడు.

          తన్మయి సాధ్యమైనంత తక్కువ ఉత్సాహం చూపించాలన్నట్టు “ఏమని మాట్లాడేరు? ” అంది.

          “మంచి వార్తలు అంత సులభంగా చెప్పేస్తే ఎలా?” అన్నాడు చిన్నగా నవ్వుతూ.

          తన్మయి నవ్వుతూ “ఏం కావాలో చెప్పండి మరి!” అంది.

          సిద్దార్థ “అలా నడుద్దామా ఇంకా గంట టైముంది కదా కాలేజీ మొదలవ్వడానికి”అని బయటికి దారి తీసేడు.

          కాలేజీ బయటికి వచ్చి పక్కనే ఉన్న డొంక దారివైపు తిరిగేరు. కాలేజీ ఊరి చివరన ఉండడం వల్ల చుట్టూ రకరకాల తుప్పలు మొలిచేయి. అక్కడక్కడా సీతాఫలంమొక్కలు తలలూపుతూ ఉన్నాయి. జూన్ నెల మొదటి వారం కావడంతో వేసవి ఇంకా ప్రతాపం చూపిస్తూనే ఉంది. ఉదయాన్నే ఎండ ముఖానికి చుర్రుమని తగులుతూ ఉంది.

          ఫర్లాంగు దూరం నడవగానే సిద్దార్థ గొంతు సవరించుకున్నాడు. 

          “ప్రభు మీకు ఎలా పరిచయం అన్నారు?”

          తన్మయి చెప్పింది.

          “కానీ అతనికి మీ మీద జన్మజన్మల ప్రేమ ఉంది. తెలుసా? మేలిమి బంగారం, ఇంకేం ఆలోచించనవసరం లేదు. మీరిద్దరూ చాలా అదృష్టవంతులు. మీలాంటి వారు ఒకరికొకరు దొరకడం చాలా అరుదు.” అన్నాడు.

          ఆ మాట వింటూనే పొంగిపోయింది తన్మయి.

          “మీకెలా కృతజ్ఞతలు చెప్పను?” అంది.

          “అతనితో మాట్లాడుతున్నంతసేపు మీతో మాట్లాడుతున్నట్టే అనిపించింది. సరిగ్గా మీలాగే ఆలోచిస్తాడతను. మీలాగే మంచితనం. నాకెందుకో మీరు అతన్ని చేసుకుంటే మీ జీవితం సుఖవంతమవుతుందని అనిపిస్తూంది” అన్నాడు నవ్వుతూ.

          “ఇంతకీ ఏం మాట్లాడేరో చెప్పలేదు” అంది తన్మయి చిరునవ్వుతో.

          “ఏం లేదు. అతనికి మీ పట్ల ఉన్న ప్రేమని, సీరియస్ నెస్ ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాను. అంతే” అన్నాడు.

          “థాంక్యూ  సిద్ధూ!” అంది. 

          “ఒక్క విషయం మాత్రం స్పష్టత లేదు” అని ఆగేడు.

          తన్మయి ప్రశ్నార్థకంగా చూసింది అతని వైపు. 

          “మీ విషయం అతను వాళ్ళ వాళ్ళేవరికీ చెప్పినట్టు లేడు. వాళ్ళింట్లో అతనికి పెళ్ళి సంబంధాలు వెతుకుతున్నట్టు చెప్పేడు.”

          “మరి?” అంది తన్మయి.

          “అతనికి మిమ్మల్నే చేసుకోవాలని ఉంది. కానీ ఎవరూ ఒప్పుకోరనే భయమూఉంది. రెంటిలో ఏది బలమైనదో అతను నిర్ణయించుకోవాలి…” అని ఒక్క క్షణం ఆగి, “ఇది పెళ్ళితో సర్దుబాటు జరిగే సమస్య కాదు. ఇన్ఫాక్ట్ , పెళ్ళితో ప్రారంభమయ్యే సమస్య. కాబట్టి ఎంత బలంగా అతను నిలబడగలడు అన్నది అతనే నిర్ణయించుకోవాలి. మీ వరకూ మీరు చెయ్యగలిగినది అతన్ని నమ్మడం మాత్రమే. అంతా మంచే జరుగుతుం దని కోరుకుందాం. ” అన్నాడు.

          తన్మయి ముభావంగా ఉండడం చూసి “ఏదేమైనా మీరు నిరాశపడవలసినది ఏమీ లేదు. ఏది జరిగినా మీ మంచికే అని ధైర్యంగా ఉండండి. ఇది మీ జీవితంలో గొప్ప మలుపు కావాలన్నదే నా ఆకాంక్ష. మీకు ఎప్పుడు ఏ సహాయం కావాల్సినా నేను చెయ్యడానికి సిద్ధంగా ఉన్నాను. సరేనా?” అన్నాడు.

          తన్మయి కృతజ్ఞతా పూర్వకంగా నమస్కరించింది.

***

          సాయంత్రం ఇంటికి వచ్చేసినా తన్మయి చెవుల్లో ఒకటే మాట గింగిర్లు తిరుగు తూంది. 

          “అతనికి పెళ్ళి సంబంధాలు వెతుకుతున్నట్టు చెప్పేడు”

          ప్రభు ఇన్ని ఉత్తరాలలో ఒక్క సారి కూడా ఈ ప్రస్తావన ఎక్కడా తీసుకురాలేదు.

          ఎందుకని? తెలిస్తే తను బాధ పడ్తుందనా? చెప్పడం ఇష్టం లేకనా? చెప్పడం ఎందుకనా?

          లేక కరుణలా ఆలోచిస్తున్నాడా? 

          మరెవర్నో చేసుకుని తనని రెండవ భార్యగా ఉద్ధరించాలనుకున్న కరుణ మాటలు గుర్తుకొచ్చి మనసంతా కంపరంతో కూడిన బాధ మొదలయ్యింది. 

          ప్రభు నుంచి అటు వంటి స్పందన వినడం కాదు, కనీసం ఊహించడం కూడా ఇష్టం లేదు తనకి. అలాంటిది అదే నిజమైతే ఇక జీవితంలో తనెవరినైనా నమ్మగలదా?

          తీవ్రమైన దుఃఖ భారంతో కుమిలిపోతూ కళ్ళు మూసుకుంది.

          “అజ్ఞాత మిత్రమా! నన్ను రక్షించు. నన్ను రక్షించు!!”

*****

(ఇంకా ఉంది)

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.