ఆమె అనంతం
(నెచ్చెలి-2023 పోటీలో ప్రత్యేక బహుమతి పొందిన కవిత)
– సుంక ధరణి
ఓ గాయం తగిలినప్పుడు
ఓ ఆకలి తడిమినప్పుడు
ఓ తోడు అడిగినప్పుడు
ఓ వ్యథ కమ్మినప్పుడు
బ్రతుకు శూన్యాలు గుర్తుకొచ్చి
బండరాళ్లై జడత్వంలో మునుగుంటే
విరబూసిన పత్తి కొమ్మ తెల్లనవ్వులా
ఎరుపు పులిమిన బొగెన్విలియా పూరెమ్మలా
రాగబంధాల్ని పూయిస్తూ
రాతిరేఖల్ని మారుస్తూ
ఓడిపోయిన ఓదార్పుల్ని
కొంగున ముడుచుకొని
సమస్తాణువుల మీదుగా
దిశ చూపే తారకలుగా
స్త్రీ, సోదరి, సతి…
స్థాయిలేవైనా
సమతోత్భవ పరిపూర్ణతను
ఒళ్ళంతా పులుముకొని
ప్రయాణిస్తుందామే…
ప్రపంచం నుండి ఆమెలోకి
ఆమె నుండి ప్రపంచంలోకి
విధితత్వపు పోకడలు వెన్నుతన్నినా
అఘాయిత్యపు వంచనలు రొమ్ము పొడిచినా
ప్రయాణిస్తుందామే
లోకం నుండి శోకంలోకి..
శోకం నుండి మైకంలోకి..
మైకం నుండి లోకంలోకి..
*****
కవిత చాలా బాగుంది.
ఆమె అనంతం_కవిత : స్త్రీ సహజత్వాన్ని అద్దంలో చూసినట్టుంది. నాకు నచ్చింది. రచయిత్రికి నా అభినందనలు.
👌👌