నువ్వు – నేను
(నెచ్చెలి-2023 పోటీలో ప్రత్యేక బహుమతి పొందిన కవిత)
– జి. రంగబాబు
నువ్వు..తూరుపమ్మ నుదుట మెరిసిన
సిందూర బొట్టుగా సూర్యుణ్ణి వర్ణిస్తావు
పూట గడవక రోజు కూలికై
పరుగులెత్తే శ్రమైక జీవుల పాలిట
స్వేదాన్ని చిందించే
సామ్రాజ్యవాది సూరీడు..అంటాన్నేను..!
రేయి సిగలో విరిసిన సిరిమల్లె..
నింగిలో తళుకులీనే జాబిల్లి..
అంటావు నీవు..!
దీపమైనా లేని చిరుగు పాకల
బరువు బతుకుల ఇళ్ళలోకి దూరే
ఫ్లోరోసెంట్ బల్బు
ఆ చందమామ అంటాన్నేను
కొండల నడుమ నింగినుండి జారుతోందా
అని జలపాతాన్ని నీవు వర్ణిస్తావు..!
గ్రుక్కెడు మంచినీటి కోసం
కిలోమీటర్ల దూరం నడిచే
పేద ప్రజల మున్సిపాలిటీ
వీధి కుళాయిగా నేను పేర్కొంటాను..?
సృష్టిలో నీకు సౌందర్య సాధనంగా
కనిపించే ప్రతి వస్తువులోనూ
నాకు శ్రమైక జీవన సౌందర్యమే కనిపిస్తోంది..!
మరి నువ్వూ నేనూ
ఒకటెలా అవుతాం మిత్రమా..?
నువ్వు నువ్వే..నేను నేనే..!
*****