బతుకు చిత్రం-34
– రావుల కిరణ్మయి
జరిగిన కథ: తల్లి ఆరోగ్యం బాగు చేయించడం కోసం సయిదులు ఆరాట పడుతుం టాడు .అందుకోసం మందులతో కాక తక్కువ ఖర్చులో మంత్రాలు తంత్రాలతో నయం చేయవచ్చని సరూప ఆశపెడుతుంది. అందుకోసం ఏం చెయ్యాలో చెప్తుంది. దాని కోసం సయిదులు ప్రయత్నిస్తుంటాడు. ఆ తరువాత
***
రాయలచ్చిమి చిన్న బిడ్డను చంకలో వేసుకొని వచ్చి ,
జాజులు …! నాకు నిద్ర మున్చుకస్తున్నది. ఇదేమో ఇంకా పంటలేదు. నువ్వే చూసుకో! అని ఒళ్ళో వదిలి జవాబు కోసం కూడా చూడకుండా వెళ్ళిపోయింది.
బిడ్డను దగ్గరగా పొదివి పట్టుకొని జో …కొడుతున్నా పడుకోకుండా తన పమిట కొంగు తో ఆడుకుంటున్న బిడ్డను చూసి, కాసేపు ఆడుకోనీలె ..అని మళ్ళీ సయిదులు కొసం చూడసాగింది.
చాలాసేపటికి వచ్చిన సయిదులుకు వడ్డించి దేవత చెప్పిన విషయం అడగాలను కుంది.
ఆట ముగిసి బిడ్డ నిద్రకువచ్చి ఏడుపు అందుకోవడంతో ,
అబ్బా ..! చూసినావయ్య? ఈ పిల్ల? ఎంత గడుసుదో? పంటలేదు. పండనిత్త లేదు . అని మురిపెంగా మళ్ళీ జో ..కొట్టసాగింది.
నా బిడ్డ గడుసా? ఇట్లా తే ..!నేనే పడుకోబెడుతా !అని తీసుకున్నాడు.
అబ్బా ..!ఏమిచ్చిన్త్రం ?ఎన్నడన్న ఎరుగుదునా ?అని బుగ్గలు నొక్కుకుంది.
ఇన్నోద్దులు నిజంగా తెల్వలేదే ?బిడ్డలు లేనోళ్ళ తండ్లాట ఇన్నంకనే కండ్లు తేటగయినయ్.
జాజులమ్మకు ఇదే మంచి సమయమని అనిపించి దేవతక్క చెప్పిన ముచ్చట ఏందని అడిగింది.
ఏమ్లె !అది అయ్యేది కాదులే !
నువ్వు చెప్పితే గదా !అయ్యేది కాంది తెలిసేది. అవ్వ పాణం బాగు చేపియ్యాలే. ఆమె చెప్పిందంటే మంచి ఉపాయమే అయ్యుంటది. అన్నది.
ఏం మంచి? వాళ్ళ డాక్టరమ్మకు బిడ్డలు లేరట , మన బిడ్డను సాదుకానికి తీసుకు న్టదట. ముగ్గురు ఆడివిల్లలేనాయే ,అందుకు అవ్వ పాణం బాగు చేస్తది అని మంతనాలు పెట్టింది. అన్నాడు.
విన్న జాజులమ్మ చాలా సేపటి వరకు తేరుకోలే.
కాసేపాగి, నువ్వేమన్నవ్?
ఏమంట, కుదరదన్న.
ఏ .? ఎందుకు ?
ఎట్లా కుదుర్తది? నేనేమన్నా తాచునా? పిల్లలు పుట్టీ పుట్టక ముందే తినటానికి?వీళ్ళను అమ్ముకోటానికి ? అన్నాడు. నిద్రపోయిన బిడ్డను మంచంలో వేసి చేద్దరు కప్పుతూ.
మరి ..?
మరి…?
ఆగీ …ఆగీ వస్తున్న మాటలని పూర్తిచేయలేక పోతున్నది.
మరి …ఏమిటో చెప్పు.
అవ్వను సంపుకుందామా? అన్నది.
దానికి వేరే చూడాలే.
ఎన్ని దినాలకు?
ఇప్పటికే నెలనాళ్ళకు నెన్నాలు గడిచి పోవట్టే. ముదిరిపోయి చేయి దాటి పోతేనో ?
అయితే …..
దేవతక్క చెప్పినట్టు చేసేయ్యడమే మంచిది .
ఏది …ఈ మాట నా మొకం చూసి సెప్పు
బిడ్డను వదిలిపెట్టి జాజులమ్మ దగ్గరగా వచ్చి అడిగాడు.
నువెన్ని మాటల ఎట్లడిగినా నేను గిట్నే సెప్తా. అవ్వ పాణమె ముక్కేం .
అవ్వ ఒప్పుకుంటుందా ?
ఎందుకు ఒప్పుకోదు ?
బిడ్డలనమ్మి తనకు బాగు జెప్పిచ్చడేందని గుండె ఆగుతదేమో !
అయినా …అవ్వ సంగతి పక్కన పెట్టు .నువ్వెట్ల ఒప్పుకుంటానావ్?
ఆమె …మీకు అవ్వ మాత్రమె. నాకు అంతకంటే ఎక్కువ. ఊరవతల గుడిసెల్ల బతికేదానికి ఇంత నీడ నిచ్చి ఎవ్వరూ లగ్గం ముచ్చట ఎత్తనప్పుడు తను నీతోని ముడేసి నాకో కుటుంబమిచ్చింది. ఎప్పట్నుండో ఆమె ఋణం ఎట్లా తీరుతదాని ఎదురు సూత్తన్న. ఇట్లా సైమం వచ్చింది.
జాజులూ …!నువ్వీ మాటలు మనసుల కెళ్ళే అంటున్నవా ? నీకు బిడ్డ మీద కొట్టుకుంట లేదా?
నాకు ఇంకా ఇద్దరు బిడ్డలున్నారు. పాపం ఆమెకు, అవ్వకు మరోటి లేదు కదా !భగమంతుడు నాకు ఇద్దరు అముడాలోల్లను గందుకే ఇచ్చి ఉంటడు. నా బిడ్డ సుఖ పడుతది. అవ్వ మనకు మిగులుతది. అన్నది స్థిరంగా.
సయిదులు , అయితే ఇంక ఆలోచించేదేమి లేదా ? ఇదే ఆఖరా ?
అవును . రేపొద్దుగాల దేవతక్కను కలుద్దాం. అని లేచింది .
సయిదులుకు ఆలోచనలతో మనసు గాభరా పడసాగింది.
ఇంత సాహసం చేస్తున్నదంటే జాజులమ్మకు అవ్వమీద ఎంత పావురం? కన్నతల్లి కోసం కొడుకుగా తను ఏమీ చెయ్యలేకున్నా , కోడలుగా తన కన్నబిడ్డను అమ్మతనం పక్కన పెట్టి ఇవ్వడానికి సిద్ధపడుతున్న జాజులుని చూసి ఒకింత గర్వ పడ్డాడు. తన నిర్ణయానికి కృతజ్ఞతలు చెప్పుకున్నాడు.
అయితే అవ్వకు తెలిస్తే …?ఎలా ?
అవ్వకు మనుమరాల్లంటే పాణం. ఎలా చెప్పాలి. ఇష్టం లేక ఈ మనాది తోనే ఇంకా ఏమయినా జరిగితే ..?
ఎన్నో ప్రశ్నలు వేధిస్తుండగా నిద్ర పోయాడు.
***
జాజులమ్మ పనికి పోతలేనని దేవతక్కను కలవడానికి వేల్లుతున్నానని చెప్పి సయిదులుతో బయలుదేరింది.
ఎవరూ ఎందుకని అడుగలేదు.
కమల గురించి అయి ఉంటుందని అనుకున్నారు.
రాయలచ్చిమి జాజులు కమలపట్ల చూపిస్తున్న ఆదరానికి సంతోషించింది.
రాజయ్యకు కూడా కోడలు పట్ల గౌరవమే కలిగింది. తన మాట గౌరవించి కమలతో పెళ్ళి చేయడమే కాక కడుపులో పెట్టుకొని చూసుకుంటున్నందుకు. అన్నీ తీరి కమలకు పిలగాడు పుట్టాలని దండం పెట్టుకున్నాడు.
కమల, తనకు పిలగాడే పుట్టి, జాజులు శ్రమ తీరాలని, తను చేసిన పనికి ఫలితం దక్కాలని, తనను కూచోపెట్టి సాదాలని కొడుకును ప్రయోజకున్ని చేసి ఆ కుటుంబానికి కానుకగా ఇవ్వాలని కలలు కనసాగింది.
దేవత అప్పుడే డ్యూటీకని బయలుదేరుతున్నది. వీరిని చూసి ఆగి పోయింది.
దేవతతో జాజులమ్మ తన అభిప్రాయాన్ని చెప్పి తన సహాయాన్ని కోరింది.
జాజులూ !నువ్వు నీ బిడ్డ భవిష్యత్తు గురించి చింత పడకు. ఆమె చక్కగా సాదుకుంటది. నువ్వు చేస్తున్న ఈ పున్నేమే నీ అత్తకు పాణభిక్ష పెడుతది. అని మాట్లాడి డాక్టర్ తో మాట్లాడి నేను మళ్ళీ కలుస్తాను అని చెప్పి ,
అత్తకు ఈ సంగతి తెలుసా? అడిగింది.
అత్తకే కాదు ఇంట్ల ఎవ్వలకు దెల్వదు.
మరేట్లా ?
ఎందుకు ?
వాళ్ళు అడ్డు చెప్తే ఎట్లా ?
అవన్నీ నేను చూసుకుంటాను. నువ్వు కూడా ఇప్పుడే ఎవరితోనూ ఏమీ అనకు.
గట్నే.
సరే పొయ్యస్తం. అని బయలుదేరారు.
కూరగాయలో, మరేదో ఇసిరే అమ్మినట్టు ఇంత అల్కగ సరే అన్నారు అని అనుకున్నా రాయలచ్చిమి మీద జాజులమ్మకు ఉన్న అభిమానానికి సంతోషించింది.
***
దేవత డాక్టర్ తో వివరంగా మాట్లాడి జాజులమ్మను పిలిచింది.
డాక్టర్ గారు రాయలచ్చిమిని పరీక్షలకు తీసుకురమ్మన్నదని అప్పుడే బీడ్డను కూడా తీసుకురమ్మని చెప్పింది.
జాజులమ్మ బిడ్డను, అత్తను తీసుకొని సయిదులు, దేవత వెంటరాగా డాక్టర్ను కలిసింది.
డాక్టర్ ఆ రోజు మొత్తం వీరికే కేటాయించినది.
నీ పేరు ..? అడిగింది.
రాయలచ్చిమి .
ఏం చేస్తుంటావు?
ఇప్పుడు ఏమీ లేదమ్మా. ఇంతకు ముందయితే కూలీకి వెళ్ళేదాన్ని. ఇప్పుడు పాణం బాగుండక వెళ్ళడం లేదు.
నీతో వచ్చినది ఎవరు ? బిడ్డనా?
కాదు, నా కోడలు. నాకు దేవుడిచ్చిన బిడ్డ.
నీకు ఏమయిందో తెలుసా ?
ఎమున్నదమ్మా !ఏదో ఈడు మీదవడి వచ్చిన తిప్పలే. కదా .
అవును ,అంతే !మరి నువ్వు ఏదయినా పని మా ఇంట్లో ఇస్తే చేస్తావా ? అడిగింది.
ఎందుకు చేయనమ్మా ? నాకు పని చేయడమే ఇష్టం. మా కోడలుకు చన్నిళ్ళ లెక్క ఆసరయితా.
వేరేగుడ్ ,
ఎప్పుడు రమ్మంటారు ?
నేను చెప్తాను. నువ్వెళ్ళు. అని పంపించేసింది.
అక్కడే ఉన్న దేవత అర్థం కానట్టుగా చూస్తుండడంతో,
దేవతా ! నేను నీతో వీళ్ళ మనుమరాలును పెంపకానికి అడుగమని చెప్పి చాలా తప్పు చేశాను డాక్టర్ను అయి ఉండి వైద్యం మరిచి వాళ్ళ అవసరాన్ని వాడుకోవాలను కున్నాను. వారి అనుబంధాలు చూస్తుంటే నాకు చెంప దెబ్బ కొట్టినట్టు అయింది. అందుకే అక్కరకు రాణి ప్రశ్నలు అడిగి పంపించాను.
మేడం! మీరు ఏమంటున్నార్ ఒక్కముక్కా అర్థం కావడం లేదు.
అందుకు డాక్టర్ నవ్వి ,
అవును నా దగ్గరికి వచ్చే ముందు వారు గుడికి వెళ్ళారు. నేనూ వెళ్లాను. నన్ను వాళ్ళు గమనించలేదు. నేనూ మామూలుగానే చూశాను.
గుడిలో వీరు ఒకరి తరువాత ఒకరు అక్కడున్న అయ్యగారికి డబ్బులు ముట్టజేప్పి అత్తకు బాగుండాలని కోడలు, కోడలూ కొడుకూ బాగుండాలని అత్త , అమ్మా , నా పిల్లలూ బాగుండాలని ఆయనా అర్చన చేయించారు.
అందరూ కలిసి చేయిస్తే సరి పోతుంది కదాని అయ్యగారు అడిగారు.
అవునయ్యా ! కానీ మీరు చేసేది ప్రతి రోజూ జరగాలి, అందుకు అవసరమయిన సామాగ్రిప్రతి పొద్దు తెచ్చియ్యడానికి మా వాళ్ళు ఇష్టపడరేమో! అందుకే నేనే వచ్చి మిమ్ముల కలిసి ముట్టచేప్తాను, అని ఒకరికి తెలియకుండా ఒకరు ఇలా అయ్యగారితో మాట్లాడడం చూస్తుంటే వాళ్ళనుబంధం ఎంత గొప్పదో తెలిసి వచ్చింది.
నీవు తీసుకచ్చిన తరువాత విషయం అర్థమయి వీరికి బిడ్డను దూరం చెయ్యడం కంటే ఆ బిడ్డతో పాటే ఆమెను మా ఇంట్లో ఉంచుకొని వైద్యం చెయ్యడం మంచిదని ఇలా చేశాను.
దేవత డాక్టర్ గొప్ప తనం అభినదించకుండా ఉండలేక పోయింది.
ఏమీ కాని వారి కోసం ఇంత రిస్క్ తీసుకోవడం అందరికీ సాధ్యం కాదు అన్నది.
మదర్ వంటివారి ముందు మనమెంత? సరే గాని వారిని అందరినీ లోపలకు పిలువు అని పిలిపించి,
జాజులమ్మతో రాయలచ్చిమి మీ బిడ్డలతో సహా మా ఇంటి పని చేయడానికి ఉంటుంది అందుకు ప్రతిఫలంగా మీ బిడ్డలకు నేనే అవసరాలు తీరుస్తాను. అలాగే ఆమె ఆరోగ్యం కూడా బాగయ్యేలా చూస్తాను అని మాటిచ్చింది.
జాజులుతో పాటు అందరికీ పట్టరాని ఆనందం కలిగింది.
*****
ఫోటో ఆర్ట్: రమేష్ పొతకనూరి
రావుల కిరణ్మయి .తల్లిదండ్రులు అనసుర్య పుల్లచారి గార్లు.జననం హుజురాబాద్ ,తెలంగాణ.తెలుగు భాషోపధ్యాయిని.70 వరకు కథలు.100కు పైగా కవితలు.చైతన్య గీతాలు,బాలగేయాలు,వ్యాసాలు,వివిధ పత్రికలలో ప్రచురితాలు.ఔధార్యం కథా సంపుటి.జీవశ్వాస నవల.వివిధ సాహితి సంస్థల తో బహుమానాలు.ప్రశంసలు.సమాజాన్ని చైతన్య పరిచేవిధంగా రచనలు చేయడం పట్ల చదవడం పట్ల ఆసక్తి.