పేషంట్ చెప్పే కథలు – 19
రేపటి వెలుగు
–ఆలూరి విజయలక్ష్మి
“గుడ్ మార్నింగ్!” వేకువలో జారిన తొలి కిరణంలా లోపలికి వచ్చింది మిస్ రోజీ. “గుడ్ మార్నింగ్” చిరునవ్వుతో ఆహ్వానించింది శృతి. విద్యాసంస్థలు వ్యాపార సంఘా లుగా మారి హాస్టల్ జీవితం తమ జీవితంలో ఒక పీడకలగా పిల్లలు భావించే స్థాయిలో వున్న బోర్డింగ్ స్కూల్స్ వర్థిల్లుతున్న తరుణంలో పదిమంది పిల్లల్ని తన యింట్లో ఉంచుకుని వాళ్ళకు సమగ్రమైన ఆహారంతోబాటు కాస్తంత ప్రేమనూ, ఆప్యాయతనూ పంచె మిస్ రోజీ అంటే గౌరవం శృతికి. పిల్లలకు కావలసింది కేవలం చదువు, విజ్ఞానం, సంపాదనకు కావలసిన సమర్థతను అలవరచుకోవడమే కాదు. వారి శారీరక, మానసిక వికాసానికి దోహదపరచే వాతావరణం, పరిస్థితులు కూడానని నమ్మి, అందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తున్న మిస్ రోజీకి తన వంతు సహాయాన్నందిస్తూ పిల్లలకు ఏ జబ్బు చేసినా శ్రద్థగా చూస్తుంది శృతి.
“పిల్లలంతా బావున్నారా!” శృతి అడిగింది.
“ఒక కుర్రాడి విషయంలో మీ సలహా కోసం వచ్చాను”
“చెప్పండి.”
“రవి తెలుసుగా మీకు?” రోజీ ప్రశ్న విని ఒక క్షణం ఆలోచిస్తూ వుండిపోయిన శృతి కళ్ళు అకస్మాత్తుగా తళుక్కుమన్నాయి.
“ఓ! గుర్తొచ్చాడు. గిరజాల జుట్టు, తెల్లటి బూరి బుగ్గలు, చక్రాల్లాంటి కళ్ళను తిప్పుతూ ముద్దుముద్దుగా కబుర్లు చెప్తాడు – వాడే కదూ?” ఉత్సుకంగా చూసింది శృతి.
“ఎస్… వన్ మినిట్. రవీ!” రోజీ పిలుపు విని రవి లోపలికి వచ్చాడు.
“వీడా రవి?” నమ్మలేనట్లు చూస్తుంది శృతి. పలచబడిన జుట్టు, పాలిపోయిన చెక్కిళ్ళు, ఎండిపోయిన శరీరం, కాంతిలేని కళ్ళు. దీర్ఘకాలిక జబ్బుతో బాధపడుతున్న వాడిలా వున్నాడు.
“ఏమయింది? ఎందుకిలా అయ్యాడు? సెలవుల్లో జబ్బేమైనా చేసిందా?” రవిని పరీక్షచేసి బయటకు పంపి అడిగింది శృతి.
“పెద్ద జబ్బేమీ చేయలేదట. కానీ… ఇతన్ని చూస్తుంటే ఇంట్లో వుంచుకోవడానికి జంకుగా వుంది. ఏమైనా జబ్బువల్ల యిలా అయిపోయాడేమో. అది మిగతా పిల్లలకు అంటుకుంటుందేమోనన్న అనుమానం. కొంచెం కోలుకునే దాకా స్కూలు పోయినా వాళ్ళింట్లోనే వుంచుకోమందామంటే – ఇంటి మాటెత్తితే చాలు హడిలి పోతున్నాడు. బలవంతాన వాళ్ళింటికి పంపడానికి బాధగా ఉంది. ఇక్కడే వుంచుకోవడానికి మిగతా పిల్లల క్షేమం దృష్ట్యా భయంగా ఉంది” విచారంగా చెప్పింది రోజీ.
“క్లినికల్ గా పెద్ద జబ్బేమీ కనబడటం లేదు. కానీ ఇంత మార్పుకి కారణమేమిటో? ఇంటి మాటెత్తితే ఎందుకు హడిలిపోతున్నాడు? అసలు కారణమేమిటో తెలుసుకుని కరెక్ట్ చెయ్యకపోతే ఇతను మానసికంగా యింకా దెబ్బతినే అవకాశం వుంది” దీర్ఘంగా ఆలోచిస్తూ అంది శృతి.
“అతని తల్లిదండ్రుల్ని గురించి, కుటుంబం గురించి ఏమీ తెలియదా మీకు” శృతి ప్రశ్న విని ఓ క్షణం ఆలోచిస్తూ ఉండిపోయింది రోజీ.
“పిల్లల తల్లిదండ్రుల వ్యక్తిగత విషయాల గురించి తరచి అడిగే అలవాటు లేదు నాకు. రవిని వాళ్ళమ్మ తీసుకొచ్చి చేర్పించింది. వాళ్ళ నాన్నెప్పుడూ రాలేదు. ఎప్పుడొ చ్చినా ఆవిడ ఒక్కటే వచ్చి రవికి కావలసినవి కొనిచ్చి వెళ్తూ ఉంటుంది.”
“మళ్ళీ ఎప్పుడొస్తుందామె? ఆవిడతో మాట్లాడి రవిని గురించి అసలు విషయం తెలుసుకోవాలి.”
“మీతో మాట్లాడి మీ సలహా తీసుకుని రవిని ఉంచుకునేదీ లేనిదీ చెప్తానని రేపోసారి రమ్మన్నానామెను. రేపు మీ దగ్గరకు తీసుకొస్తాను.”
మరునాడు రవి తల్లి సుభద్రను శృతి దగ్గరకు తీసుకొచ్చింది రోజీ. శృతి రవి గురించి, ఆమె కుటుంబం గురించి ఆమె నొచ్చుకోకుండా జాగ్రత్తపడుతూ అడిగింది. శోకదేవతలా కూర్చున్న సుభద్ర పెదవి విప్పి ఒక్క ప్రశ్నకూ జావాబివ్వలేదు. చివరికి మౌనంగానే చేతులు జోడించి సెలవు తీసుకుని వెళ్ళిపోయింది.
చిక్కుముడిలా ఉన్న సుభద్రను మరిచిపోవడానికి శృతి ప్రయత్నిస్తూ ఉండగా సుభద్ర దగ్గర్నుంచి జాబు వచ్చింది.
డాక్టర్ గారూ!
నేను రవి తల్లిని. అంతగా సభ్యతని పాటించకుండా మీ ప్రశ్నలకు జవాబివ్వని నన్ను మీరు మరచి ఉండరనే అనుకుంటున్నాను. నేనసహ్యించుకుంటున్న నా కుటుంబ జీవితం గురించి, నన్ను రంపపుకోత పెడుతున్న నా మానసిక పరిస్థితి గురించి నా అంతట నేను నోరువిప్పి చెప్పుకోలేక మీ ఎదుట మూగనోము పట్టాను.
నా చిన్నారి తండ్రి రవి అలా అయిపోవడానికి కారణం నేనే… ఒక దాని వెంట ఒకటి ఎన్నో తప్పటడుగులు వేస్తూ సమస్యల సుడిగుండంలోకి చేరుకున్నానిప్పుడు. ప్రేమిం చానని భ్రమించి కన్నవారిని ఎదిరించి బయటికొచ్చి రవి తండ్రిని వివాహం చేసుకు న్నాను. కొన్ని నెలలు కూడా గడవకుండానే నేను పెంచుకున్న కోరికలు, నేను కన్నా సుందర స్వప్నాలు ఆధారం లేనివని తెలిసొచ్చింది. మమ్మల్ని సన్నిహితం చేసిన ఆకర్షణ పొరలు విడిపోగానే నా భర్త, నేను భిన్న ధ్రువాలమని తేలిపోయింది. నా భర్తకు నేను సంపాదించే డబ్బూ కావాలి, తన పరిధిలో నుంచి బయటికి తొంగి చూడకుండా, పెదవి విప్పకుండా అతని అడుగులకు మడుగులొత్తుతూ బానిసలానూ పడుండాలి. స్వేచ్ఛకు, బానిసత్వానికి తేడా తెలిసిన నేను బానిసలా పడివుండలేకపోయాను. అతన్ని నేను కోరుకున్నట్లుగా మార్చుకునే ప్రయత్నంలో విఫలురాల్ని అయ్యాను. ఫలితంగా నా భర్త నుంచి విడిపోయి రవితో బయటికొచ్చేసాను.
భర్త నుంచి ధైర్యంగా విడిపోయి బయటికొచ్చిన నేను అంతే ధైర్యంగా బ్రతకలేక పోతున్నాను. ఈ క్రొత్త జీవితాన్ని, క్రొత్త పరిస్థితుల్ని చూసి నేను బెదిరిపోతున్నాను. అనుక్షణం భయంతో ఒణికిపోతున్నాను. నేను కోరుకున్న జీవితం నాకు లభించలేదన్న దుగ్ద, ప్రస్తుతం నేననుభవిస్తున్న జీవితం పట్ల నాకున్న అసంతృప్తీ కలిసి నిర్దయగా నా మనసుని నలిపేస్తున్నాయి. నేనేమిచేస్తున్నానో, ఎలా ప్రవర్తిస్తున్నానో తెలియనంతటి ఉన్మాద స్థితిలోకి పోతున్నాను. పువ్వులా సుకుమారంగా చూసుకోవలసిన పసివాణ్ణి కౄరం గా హింసించాను. నా రెక్కల కింద దాచుకుని రక్షించవలసిన వాణ్ని అతి దారుణంగా బాధించాను. నాలోని మాతృత్వం, మానవత్వం మంటగలిసిపోయి పిశాచినిలా ప్రవర్తించాను.
నా బాబు గురించి మీరు, మిస్ రోజీ పడుతున్న ఆరాటం చూసాక నా తప్పు తెలిసొ చ్చింది. నిష్పళంగా గడిచిపోతున్న నా ఈ జీవితమెలా తిరిగిరాదో కమ్మని కలలా గడిచి పోవాల్సిన నా బాబు బాల్యమూ తిరిగిరాదు. వ్యక్తిగా నా సుఖ సంతోషాల గురించి తాపత్రయ పడడమే గాక తల్లిగా ప్రేమతో నా బాబు భావికి సోపానాలు వెయ్యవలసిన బాధ్యత కూడా నా మీదుందనే నిజాన్ని గుర్తుచేశారు మీరు. రవి నన్ను ప్రేమతో పెనవేసు కోని రోజున నేను వ్యక్తిగానేగాక తల్లిగా కూడా ఓడిపోయినట్లే లెక్క అన్న వాస్తవాన్ని గుర్తించేలా చేసారు. అందుకు మీకెంతో కృతజ్ఞురాలిని.
నా మనసును నలిబిలి చేస్తున్న సంఘర్షణ నుంచి తప్పుకుని రవి కోసం స్థిర చిత్తంతో పరిస్థితులతో పోరాడతాను. ఇంక నా ప్రాణం, జీవితలక్ష్యం అన్నీ రవే.
నమస్సులతో
సుభద్ర
*****
డా.ఆలూరి విజయలక్ష్మి ప్రముఖ రచయిత్రి, వైద్యులు, సంఘసేవకులు. దాదాపు 150 కథలు, 5 కథా సంపుటాలు, 4 నవలలు, 3 వైద్య సంబంధ గ్రంథాలు రచించారు. అనువాదాలు కూడా చేసారు. వీరి రచనలు వివిధ వార, పక్ష, మాస, దినపత్రికలలో ప్రచురితమయ్యాయి. కొన్ని కథలు ఆకాశవాణి విశాఖ పట్టణం, విజయవాడ కేంద్రాల నుండి ప్రసారమయ్యాయి. వనిత మాసపత్రికలో ‘ఆరోగ్య విజయాలు’ అనే శీర్షికను నిర్వహించారు.