ఇష్టసఖి

(నెచ్చెలి-2023 పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కథ)

-అరుణ చామర్తి ముటుకూరి

          నా జీవితంలో దానికో ప్రత్యేక స్థానం ఉంది. అసలు ఇది ఈ జన్మలోది కాదేమో అని కూడా అనిపిస్తూ ఉంటుంది, అప్పుడప్పుడు. నా లైఫ్ లో మలుపు తిప్పిన ముఖ్య సంఘటనలు అన్నిట్లో అదే ప్రముఖ పాత్ర వహించింది ఇంతకీ అదేమిటనేగా.. అదే నండి బస్సు ప్రయాణం. అదే నా ఇష్ట సఖి
 
          ఎందుకంటే అమ్మ కి నొప్పులు వస్తున్నాయి అనిపించగానే పక్క ఊరి ఆసుపత్రికని కారులో బయలుదేరారు అమ్మ నాన్న వాళ్ళు. అయితే ఏదో ఇబ్బంది వచ్చి కారు ఆగి పోవడం దారిలో వచ్చే బస్సు ఎక్కడం జరిగిపోయాయి. అయితే చెప్పానుగా బస్సుతో నా అనుబంధం. అలా అది ఇక్కడే మొదలైంది. అమ్మకి నొప్పులు ఎక్కువై  నేను బస్సు లోనే బయటకు వచ్చానట. ఈ ప్రపంచాన్ని చూడటానికి. ఇది నా మొదటి సంఘటన.
 
          ఆ తర్వాత కూడా వీలైనప్పుడల్లా బస్సులో ప్రయాణాన్ని ఇష్టపడే దాన్ని. ఒకసారి మా మేనత్త కుటుంబం మేము కలిసి బస్సులో తిరుపతికి బయలుదేరాం. అప్పుడు మధ్యలో ఎక్కిన ఒక కుటుంబం మమ్మల్ని గుర్తు పట్టి పలకరించారు.
 
          “‘సులో’ !నువ్వు సులోచనవే కదా?’
 
          అవును కాదు మధ్య తలూపుతూ చెప్పా ఆ ఆరడుగుల ఆజానుబాహుడుకి.
 
          “నన్ను గుర్తు పట్టలేదా? అమ్మా అపర్ణ ఆంటీ వాళ్ళు..”అంటూ వాళ్ళ అమ్మనికూడా తీసుకు వచ్చాడు.
 
          చాలాకాలం తర్వాత కలిసిన స్నేహితులు కదా అత్తయ్య, అమ్మ, మామయ్య, నాన్న కబుర్లలో పడ్డారు. మాధవ్ మాత్రం ఏ సంకోచం లేకుండా నన్నే చూస్తున్నాడు తినేసేట్టు.
చాలా సిగ్గేసింది. గలగలా మాట్లాడే నాకు మాటేపెగల్లేదు. చిన్నప్పుడు, మామయ్య అమ్మ తరచూ అనుకునేవారు మా ఇద్దరికీ పెద్దయ్యాక పెళ్ళి చేయాలని. అదంతా గుర్తుకొచ్చి.. నా బుగ్గలు సిగ్గుతో ఎరుపెక్కి కళ్ళు బరువెక్కాయి. అతన్ని కనీసం చూడను కూడా చూడ లేకపోతున్నా. బహుశా మాధవ్ కి కూడా అవన్నీ గుర్తుకొచ్చి, నేను తన దాన్ని అన్న హక్కుగా అలా చూస్తూన్నాడేమో!
 
          నెమ్మదిగా దగ్గరగా జరిగి నా చెవిలో “అమ్మ బొమ్మాళీ, పిందె పండైఃదే, వదల బొమ్మాళీ.. వదల “అని ఆట పట్టించాడు. “ఎంత అందంగా తయారయ్యేవే రాక్షసి.. “అంటూ ఏదో ఒకటి చెబుతూనే ఉన్నాడు. చిన్నప్పుడు నేను అల్లరి చేసి అతన్నిరికించే  దాన్నని అలా పిలిచేవాడు. అయితే అన్నీ గుర్తున్నాయన మాట ఇంకా మాధవ్ కి అనుకున్నాను.
 
          ‘జామ పళ్ళమ్మా, జామ పళ్ళు’ బస్సు ఆపగానే వచ్చేసారు. మాధవ్ ‘పళ్ళమ్మీ ఇలా రా ‘అని పిలిచి.. దోర దోరవి ఏరి ‘నీకు ఇష్టంగా’ అంటూ కొనిచ్చాడు. పెద్ద వాళ్ళిద్దరూ కళ్ళతోనే సైగలు చేసుకున్నట్టనిపించింది. అంతలోనే వెలిగింది అమ్మవాళ్ళు ..తెలిసే ఈ సారి రైల్లో వద్దని బస్సు ప్రయాణం పెట్టారేమో.?. అని బుర్రలో ఫ్లాష్ వెలిగింది. మొత్తానికి ప్రయాణం అలా అల్లరిగా సంతోషంగా సాగిన నాకు చక్కని భాగస్వామి దొరికేలా చేసింది. మధ్యలో వారంతా దిగాల్సి వచ్చినప్పుడు ప్రాణం పోయినట్టు అనిపించింది తిరుగు ప్రయాణంలో అతన్ని వదిలి వెళ్ళడానికి.
 
          “దిగులుపడకు పోనీ వచ్చేయనా …తొందరలో ముహూర్తం పెట్టిస్తాలే, వదిలాల్సి వస్తుందన్న దిగులుతో గబగబా ఏదేదో మాట్లాడుతూ”  చెవిలో చెప్తూన్నట్టు చిన్నగా బుగ్గ మీద ముద్దు పెట్టేశాడు.
 
***
          పెళ్ళయి నాలుగేళ్ళు అయింది. మా ప్రేమకు గుర్తుగా రెండేళ్ళ బాబి, మధ్య మధ్య లో మధుర మధురంగా బస్సు ప్రయాణాలు.. హాయిగా సాగుతున్న జీవితం. కానీ జీవితం ఎలా సాఫీగా సాగిపోతే తనని తలుచుకోమనేమో కష్టాలు తెస్తాడు దేవుడు. మాధవ్  కాలేజ్ మేట్ కీర్తి పెద్దల ఇష్టం లేకుండా ప్రేమ పెళ్ళి చేసుకోవడం, తర్వాత అతనెటో వెళ్ళి పోవడం.. డెలివరీలో కీర్తి చనిపోతే తనకు పుట్టిన అమ్మాయిని మాధవ్ కిచ్చి అనాధాశ్ర మంలో చేర్చడం ఇవన్నీ నాకు వేదన మిగిల్చాయి. అసలు కీర్తికి తనకు ఏమీ లేదు కదా అని చిన్న అనుమానం తొలవడం ప్రారంభించింది. నా బాధ అయినా, పరిష్కారం కాని సమస్య అయినా అన్నీ బస్సులో వెళ్తుండగా సమసిపోయి సంతోషం మిగిల్చాయి. అలా సమస్య గురించి ఆలోచిస్తూ లోకల్ బస్సు ఎక్కేశా అనాలోచితంగానే.
 
          ఎవరో తల్లీకూతుళ్ళు అనుకుంటా నా వెనక సీట్లో కూర్చుని చిన్నగా మాట్లాడు కుంటున్నారు.
 
          “అల్లుడు తప్పు చేశాను మళ్ళీ ఇంకోసారి అలా జరగదు అని అంటున్నాడు కదా”
 
          “తప్పు ఒకసారి కాదు కదమ్మా నమ్మితే ఇంత ద్రోహం చేశాడు”
 
          “నిజమే! కానీ ,ఆ పసివాడు ఏం చేశాడు తప్పు. అది వదిలేసి పోయింది. నీ పిల్లలకు తండ్రి లేకుండా చేయడం కంటే, ఆ పసివాడికి నువ్వు తల్లి అయితే పిల్లలు అన్యాయం కారు.”
 
          “కావచ్చు …అమ్మా! కానీ, వాడిని పక్షపాతం లేకుండా చూడగలనా!?”
 
          “నీకు ఇద్దరూ అమ్మాయిలే.. వాడిని కొడుకు పుడితే చూస్కున్నట్టుగా చూసుకో పైగా ఆ తప్పుని నువ్వు పెద్ద మనసుతో క్షమించి ఆదరిస్తే అతనిక ఎప్పటికీ తప్పు చేయడు”
 
          “అంతేనంటావా అమ్మ” ఆవేశంగా ఉన్న కూతుర్లో.. ఆలోచన కలిగించి దారి మళ్ళిం చాననీ ఆనందంతో ఆ తల్లి “ముమ్మాటికీ అంతే” అని చెప్పింది.
 
          ఆ సమస్య నాకు దగ్గరగా ఉండడంతో శ్రద్ధగా విన్నాను మొత్తం. ఆ పెద్దమ్మ ఎంత అందంగా చెప్పింది అది నాకు చాలా నచ్చింది. వాళ్ళ సమస్యలు ఆ పసివాడు భర్తకు ఉన్న మరో బంధం వల్ల ఏర్పడింది. కానీ నా విషయంలో అలా కాదు కదా. అనాధని పెంచ గల మనసు…  తెలిసిన వ్యక్తి పిల్లని పెంచుకునేందుకు సందేహం దేనికి!! ఒక నిర్ణయానికి వచ్చినట్లు నా మనసులో మబ్బులు తొలగి భారం  విడిపోయింది.
 
          “క్షమించు మాధవ్! నిన్ను  బాధ పెట్టాను నీ మీద చిన్న అనుమానం కూడా వచ్చింది. ఇలా సంస్కారవంతంగా ఆలోచించలేక పోయాను” నాలో నేను మథన పడుతున్నాను.
 
          “ఫర్వాలేదు లే! ఇప్పటికైనా అర్థం చేసుకున్నావ్. నాకీ అందాల రాక్షసి చాలు ఇంక ఎవరు వద్దు ” వెనక నుంచి వినబడింది.
 
          నా వెనక కూర్చున్న వాళ్ళు ఎప్పుడు ఎక్కడ దిగారో మాధవ్ ఎప్పుడు ఎక్కాడో ఆలోచనల్లో గమనించనే లేదు.
 
          “దోర జామ కాయలు తిను నీకు ఇష్టమని తెచ్చాను” చిన్నప్పటి నా ఇష్టాలు కూడా అంతగా గుర్తు పెట్టుకొని నన్ను ప్రేమించే భర్త పట్ల కాసేపైన ఇలా ఎలా ఆలోచించ గలిగేనని సిగ్గుపడ్డాను.
 
          మాధవ్ తెచ్చిన జామ కాయలు తింటూ  నా ఇష్టం సఖుడి పక్కన చేరాను, ఇష్ట సఖితో ప్రయాణం నిశ్చింతగా.

*****

Please follow and like us:

One thought on “ఇష్టసఖి (నెచ్చెలి-2023 పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కథ)”

  1. ” క్షమయా ధరిత్రి స్త్రీ” అన్నందుకు మీరు సులోచన పాత్ర ద్వారా చాల చక్కగా నిరూపించారు. ధన్యవాదములు !

Leave a Reply

Your email address will not be published.