గతపు పెట్టె

-డా||కె.గీత

గతపు పెట్టెని తెరవనే కూడదు
బిలబిలా ఎగిరే తూనీగల్తో బాటూ
తోకలు విరగదీసి
తలకిందులుగా వేళ్ళాడదీసిన
ముళ్ళ తాళ్ళు కూడా ఉంటాయి
మిలమిలా మెరిసే నక్షత్రాలతో బాటూ
అగాధాంధకారంలోకి
విసిరేసే ఖగోళాంతరాలు కూడా ఉంటాయి
గలగలా పారే జలపాతాలతో బాటూ
కాళ్ళకి బరువై ముంచేసే
బండరాళ్ళు కూడా ఉంటాయి
సువాసనలు అలుముకున్న అడవుల్లో
వేటాడే క్రూరమృగాలు
పచ్చని పరిమళాల పూల పొదల్లోనే
బలంగా చుట్టుకున్న నాగుబాములు
ప్రశాంత తామర కొలనుల్లో
రహస్యంగా పొంచి ఉన్న మొసళ్ళు

గతం పెట్టెని తెరవనే కూడదు
కన్ను మూసి తెరిచే లోగా
నీలోంచి
నీలోకి
ప్రవహించే
అనుభూతుల
చాటు
అనుభవాలు
నిన్ను
సలసలా మరిగిస్తాయి

అయినా
జలజలా జారే కన్నీళ్ళతోనే
గాయాల్ని కడిగే
సంయమనం ఒక్కటి చాలు

గతం పెట్టెని మోసుకుని
నువ్వెన్ని ఊళ్ళు తిరిగినా
తటాలున ఒక వాన చినుకు
దూరాన ఒక్క మిణుగురు
చిటారున వీచే ఒక తెమ్మెరలతో
నీ తల మీద భారాన్ని దించి

తూనీగల్ని
నక్షత్రాల్ని
జలపాతాల్ని
దోసిట పట్టి తెచ్చి
పరిమళాల
వర్తమానాన్ని
బహూకరిస్తుంది!

*****

(న్యూజెర్సీ తెలుగు కళా సమితి 40 ఏళ్ల ప్రత్యేక సంచిక “తెలుగుజ్యోతి” ప్రచురణ-) 

Please follow and like us:

5 thoughts on “గతపు పెట్టె (కవిత)”

  1. కవిత చాలా బాగుంది గీత గారు! గత కాలపు జ్ఞాపకాలు ముసిరినప్పుడు కలిగే అనుభూతిని బాగా వ్యక్తపరిచారు! గతంలో బాధ ఎంత ఉన్నా, పరిమళాల వర్తమానం అందిస్తే మంచిదే కదా!

  2. గతంలో అవాంఛనీయమైనవి ఎన్నో ఉంటాయి. సంయమనం ఉంటే ఆ అవాంఛనీయాలతోనే వర్తమానాన్ని పరిమళభరితం చేసుకోవచ్చు. ఇంతటి అపురూపమైన సందేశాత్మక భావాన్ని- అంతటి అపురూపమైన అక్షరమాలలో పొదిగిన ఈ కవిత చదవగానే మనసుపై చెరగని ముద్ర వేస్తుంది. కవయిత్రి డా. కె. గీతకు అభినందనలు.

  3. గీత గారు,
    మీ కవిత ” గతపు పెట్టె” చదువుతుంటే నాకు ఎందుకో స్కూల్ లో చదువుకున్న ” Pandora Box” గుర్తుకు వచ్చింది. మీరన్నది నిజమే. కానీ గటపు పెట్టె లో తియ్యటి అనుభవాలు కూడా ఉంటాయి కదా!!!
    ఏది ఏమైనా తెలుగు తల్లి కి మీరు చేస్తున్న సేవ కి జోహార్లు. మరోసారి మీకు అభినందనలు.

Leave a Reply

Your email address will not be published.