యాత్రాగీతం

అమెరికా నించి ఆస్ట్రేలియా

(ఇటీవల మేం చేసిన ఆస్ట్రేలియా యాత్రని గురించి నా ట్రావెలాగ్ సిరీస్ “యాత్రాగీతం” లో భాగంగా ఈ నెల నుంచి మీకు అందజేస్తున్నాను. చదివి మీ అభిప్రాయం పెట్టడం మర్చిపోకండి.)

-డా||కె.గీత

భాగం-10

సిడ్నీ నించి కెయిర్న్స్ ప్రయాణం

బ్లూ మౌంటెన్స్ డే ట్రిప్ కి వెళ్లొచ్చి హోటలుకి తిరిగి చేరేసరికి సాయంత్రం ఆరు గంటలు కావొచ్చింది. 

          పిల్లల్ని వదిలి కాఫీ తాగుదామని బయటికి వచ్చి మళ్ళీ మార్కెట్ సిటీ ప్రాంతాని కొచ్చాం. 

          ఆ ఏరియాని హే మార్కెట్ (Hay Market) అంటారు. 18వ శతాబ్దం ప్రాంతంలో గుర్రాలకు గడ్డి, దాణా అమ్మేచోటు ఇది. తర్వాత్తర్వాత కోళ్ళు, మేకలు మొ.నవి అమ్మే చోటు కాగా క్రమంగా ఇది కూరగాయలు, పళ్ళ వ్యాపారాలకు ప్రధాన ప్రదేశం అయ్యింది.  తత్సంబంధిత చారిత్రక చిత్రాలు చూస్తూ అప్పటి పరిస్థితుల్ని ఊహిస్తూ అటూ ఇటూ తిరిగేటప్పటికే ఏడయిపోయింది.  

          ఆ చుటుపక్కలంతా చైనా టౌన్ కావడంతో అన్నీ చైనీస్ రెస్టారెంట్లే అధికంగా ఉన్నాయి. 

          అయితే హోటళ్ళ బయట రోడ్ల పక్కన కుర్చీలు, టేబుళ్ళు వేసి ఉన్న ఆరుబయట కూర్చుని తినడానికి చుట్టూ ఉన్న హోటళ్ళ వాళ్ళంతా ఇష్టంగా వస్తున్నట్టు అక్కడంతా రద్దీగా ఉంది. 

          ఇక మళ్ళీ హోటలుకి వెళ్ళి పిల్లల్ని తీసుకుని వచ్చి అక్కడే రాత్రి భోజనం చేసాం. 

          వెజ్ స్ప్రింగ్ రోల్స్, చికెన్ డంప్లింగ్స్, హానీ చికెన్, నూడుల్స్ పిల్లలు ఇష్టంగా తిన్నారు. 

          ఆ రోజుతో మూడు రోజుల మా సిడ్నీ సందర్శన విజయవంతంగా పూర్తయ్యింది. 

          మర్నాడు మధ్యాహ్నం మేం సిడ్నీ నుంచి మా ప్యాకేజీ టూరులో రెండో ప్రదేశమైన కెయిర్న్స్ (Cairns) నగరానికి వెళ్ళాల్సి ఉంది. 

          సిడ్నీలో దాదాపుగా అన్నీ చూసాం కానీ ‘మార్కెట్ సిటీ’ లోని కింది అంతస్తులోని మార్కెట్ ఒక్కటి మిగిలిపోయింది. మర్నాడు ఎలాగూ బుధవారం, ఆ మార్కెట్ తెరిచే రోజు. ఇక ఉదయాన్నే లేచి అన్నీ సర్దేసి ముందు మార్కెట్ కి వెళ్లొచ్చి రూమ్ ఖాళీ చేసేసి వెళ్ళాలని ప్లాన్ చేసుకున్నాం. 

          అయితే అందరం వెళ్తే సమయం సరిపోకపోవచ్చు కాబట్టి నేను, వరు మాత్రం మార్కెట్ కి వెళ్ళొచ్చాం. నిజానికి చాలా చవకగా వస్తువులు దొరికే చైనా మార్కెట్ అది. ముందురోజు మేం కొన్న మామిడిపళ్ళు ఇక్కడ ఒక్కొక్కటి రెండు డాలర్లకే అమ్ముతు న్నారు. దాదాపు మార్కెట్లో మూడవ వంతు పళ్ళు, కూరగాయలు, మిగతావన్నీ దుస్తులు, ఇతర చిల్లర మల్లర వస్తువులు. కానీ ఏ వస్తువూ నాణ్యత లేకపోవడం వల్ల మేం మా వరకు  సిడ్నీ టీ షర్టులు మాత్రం కొనుక్కుని బయటికొచ్చాం. 

          మా ఫ్లైట్ మూడు గంటల ప్రాంతంలో అయినా మా పికప్ రైడ్ పన్నెండుకే వచ్చే య్యడంతో మధ్యాహ్న భోజనం సిడ్నీ ఎయిర్పోర్టులో మిడిల్ ఈస్ట్ రెస్టారెంటులో చేసేం. 

          ఇక లగేజీ విషయానికి వస్తే ఆస్ట్రేలియా డొమెస్టిక్ ఫ్లైట్స్ లో చెకిన్ లగేజీ కి 20 కేజీలకి 20 డాలర్లు చొప్పున కట్టాలి. మా దగ్గిర రెండు చెకిన్ బ్యాగులకి $45 డాలర్లు కట్టేం. ఇక హ్యాండ్ లగేజీలో 7 కేజీలు మాత్రమే ఉండాలి అన్నది ఎంత కఠిన నిబంధన అంటే ఫ్లైట్ గేటు దగ్గిర ఒక తూకం తూచే మిషను తోసుకుంటూ ఇద్దరు వచ్చి అందరి దగ్గిర బాగుల్నీ తూకం వేసి మరీ ట్యాగులు వేస్తారు. 

          ఏడు కేజీలకు ఎక్కువ ఉంటే మళ్ళీ చెకిన్ చేసి రావాల్సిందే. 

          మా దగ్గిర రెండు కేజీలు ఎక్కువ వచ్చింది. మంచి నీళ్ళ బాటిళ్ళు రెండు ఉండడం వల్ల ‘సర్లే’ అని ఒదిలేసారు. ఇక తరవాత సారి ఈ తలనొప్పులు ఎందుకని డబ్బులు ఎక్కువైనా చెకిన్ లోనే ఎక్కువ లగేజీ పెట్టుకుని హ్యాండ్ లగేజీ పరిమితి మించకుండా జాగ్రత్త పడ్డాం. 

          మొత్తానికి సరైన సమయానికి ఫ్లైట్ ఎక్కి దాదాపు ఆరు గంటల ప్రాంతంలో కెయిర్న్స్ (Cairns) లో దిగేం. 

          సిడ్నీ నించి  కెయిర్న్స్  ఉత్తరంగా దాదాపు రెండున్నరవేల మైళ్ళ దూరంలో ఉంటుంది. దాదాపు మూడు గంటల పాటు ఫ్లైట్ లో ప్రయాణం. అంతే కాకుండా సిడ్నీ కంటే కెయిర్న్స్ సమయం ఒక గంట వెనక ఉంటుంది. 

          సిడ్నీ ప్రాంతం న్యూ సౌత్ వేల్స్ రాష్ట్రంలో ఉండగా ఈ కెయిర్న్స్ నగరం క్వీన్స్ ల్యాండ్ రాష్ట్రంలో ఉంది. పెద్ద ఖండం లాంటి ఆస్ట్రేలియా దేశంలో కేవలం ఆరు రాష్ట్రాలు మాత్రమే ఉండడం విశేషం. 

          కెయిర్న్స్  ఎయిర్పోర్టు చాలా చిన్నది. మేం ఫ్లైట్ దిగి బ్యాగేజ్ ఏరియాకి రాగానే ఎదురుగా మా పేరుతో బోర్డు పట్టుకుని ఎగ్జిక్యూటివ్ డ్రెస్ లో మా కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు మా పికప్ డ్రైవరు. 

          ఎయిర్పోర్టు బయటికి రాగానే మొదటిసారి నిజంగా  వేసవి కాలం అని అర్థమయ్యేలా ఉంది వాతావరణం. విశాఖపట్నంలో దిగినట్లు వేడిగా, ఉక్కపోత ఉంది అక్కడ. 

          అక్కణ్ణించి పదినిమిషాల దూరంలో ఉంది మా హోటలు. ఊరు మొత్తం అటూ ఇటూ నాలుగైదు మైళ్ళలోపే  ఉంటుందని, చక్కగా నడిచి తిరగొచ్చని చెప్పేడు మా డ్రైవరు. ఎస్ప్లనేడ్ అని పిలిచే ఇక్కడి సముద్ర తీరం వెంబడి నడక చాలా బావుంటుం దని చెప్పేడు. ఊళ్ళో ఉన్న ఇండియన్ రెస్టారెంట్ల గురించి, తన ఇండియా మిత్రుల గురించి కబుర్లు చెప్పేడు. 

          ఇక మా హోటలు బెన్సన్ లో చెకిన్ అయ్యి వెనువెంటనే సముద్ర తీరానికి బయలు దేరేం. దాదాపు  పది నిమిషాల నడక దూరంలోనే ఉంది ఎస్ప్లనేడ్. తీరానికి అనుకుని ఉన్న రోడ్డు వెంబడి రెస్టారెంట్లు, షాపులు ఉన్నాయి. మంచి నాణ్యమైన వస్తువులు అమ్మే ఇక్కడి నైట్ మార్కెట్ ప్రత్యేకమైనది. క్రిస్టమస్ నెల కావడం వల్ల తీరమంతా దీపాలతో కళకళలాడుతూ ఉంది. 

          తీరంలో ఒకచోట ఉన్న అతి పెద్ద స్మిమ్మింగ్ పూల్ ఏరియాలో ఆ రాత్రివేళ పిల్లలు, పెద్దలు కేరింతలు కొడుతూ ఆడసాగేరు. ఆ దగ్గర్లో జెయింట్ వీల్ కనబడగానే అటు పరుగె త్తేరు మా పిల్లలు. చిన్నప్పటి తరువాత మొదటిసారి మళ్ళీ జెయింట్ వీల్ ఎక్కేను ఇక్కడ. చుట్టూ గాజు అద్దాలు ఉండడం వల్ల పిల్లలతో బాటూ ఆనందంగా జెయింట్ వీల్ రైడ్ ని ఆస్వాదించేను. 

          ఇక తీరం వెంబడి ఎక్కడా తీరంలోకి దారి లేకుండా  గట్టున నిర్మించిన చెక్క దారిలో నడక వెచ్చగా, ఉక్కపోతగా ఉంది. అయినా ఎంతో బావుంది. నాకు ఎంతోఇష్టమైన దేవగన్నేరు పూల చెట్ల పరిమళం ముక్కును తాకింది. ఇండియా వెళ్ళిన అనుభూతి కలగడం వల్లనో ఏమో కెయిర్న్స్ ఊర్లో అడుగుపెట్టిన కొద్ది గంటల్లోనే నాకు అత్యంత ప్రీతి పాత్రమైన ప్రదేశమైంది.  

          అక్కడ ఇండియన్ రెస్టారెంటులో రాత్రి భోజనం చేసేం. అయితే అత్యంత ప్రత్యేకమైన ఆ భోజనం ఇంత వరకు మరెక్కడా ఎప్పుడూ తినలేదు, బహుశా: ఎప్పుడూ తినం కూడా! అదేవిటంటే- 

*****

(సశేషం)

 

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.