సరిలేరు నీకెవ్వరూ
(నెచ్చెలి-2023 పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కథ)
-జె.వి.ఎస్ లక్ష్మి
తెల్లని సముద్రతీరాలు, మణిసముద్రం, నీలిమడుగులు, రంగు రంగుల సముద్ర జీవులు, అనేక తాటిచెట్లు, ఈభూతాల స్వరం మాల్దీవ్స్ కాక ఇంకేంటి. ఈ ప్రక్రుతి అందాన్ని వివరించటానికి ఉపమానాలు కూడా కరువైపోయాయి. చూసి ఆనందించక , వివరించాలనుకోవటం నా తప్పు.
మోకాలిలోతులో వున్న సముద్రం యెంతదూరం నడిచినా అదేలోతు ఉండటం ఆశ్చర్యంవేసి..
“ఎవరబ్బా సముద్రంలోతు తెలుసుకోలేము అన్నది? మనం ఇలా ఎంత దూరమయినా అలవోకగా, అలలుదాటి, అడుగులేయగలం కదండీ” అని అడిగాను మా శ్రీవారిని.
“మరే! ఈ సముద్రం గురించి తెలీక ‘సంసారాన్ని ఈదటం కన్నా సాగరాన్ని ఈదటం తేలిక’ అన్న వాళ్ళకి చూపించాలి. ఇంద, ఈ కొబ్బరిబోండం తాగు అని నా చేతిలో పెట్టారు.
ఆ మాటల్లో, వెటకారం తొణికసలాడినా నేను పట్టించుకోలేదు, తన్మయత్వంతో బోండాన్ని అందుకోబోయి చేయిజార్చేసాను. దానితో ఆ బొండం ‘డాం ‘ అని పెద్దశబ్దంతో కింద పడిపోయింది. ఆ శబ్దానికి మా శ్రీవారు, ఏమైంది పడ్డావా? అంటూ పరిగెత్తుకుని వొచ్చారు వంట గదిలోకి, నేను పూర్తిగా స్పృహలోకి వొచ్చాను. పడింది బొండంకాదు నేను తోముతున్న ఇత్తడి గిన్నె. నేనున్నదీ మాల్దీవ్స్ లో కాదు, మా ఇంటి వాష్ఏరియాలో.
పనిమనిషి లేక ఎన్ని అవస్థలు పడుతున్నానో , తెల్లారుతోంది అంటేనే భయం పుట్టుకొస్తోంది. అంట్లుతోమాలి, ఇల్లు శుభ్రపరచాలి , బట్టలు ఉతకాలి, వంటలు వండాలి, క్యారియర్లు సర్దాలి, ఆఫీస్కి పరిగెత్తాలి పనీ చేయాలి. ఛి… ఈ జీవితం అంటేనే అసహ్యం వేస్తోంది. అంత అర్థంవున్న, నా చూపుని కనిపెట్టి, ఆ టాపిక్లో తలదూర్చటం ఇష్టంలేక నా మూడ్బాగోలేదని శ్రీ వారు అక్కడి నుంచి మెల్లిగా జారుకున్నారు. గడియారం గంటలు నా గుండెల మీద మోగుతున్నాయి.
మోకాలులోతు సముద్రం కాదు మోకాల్లోతు గిన్నెలు నా కోసం ఎదురు చూస్తున్నా యి. కలలు ఎప్పుడయినా కనచ్చు. గిన్నెలు మాత్రం ఇప్పుడే కడగాలి అని, నా పని మనిషి అవతారం, ఆ తరువాత వంటమనిషి అవతారాలు చాలించి, ఆదరాబాదరాగా ఉద్యోగి అవతారం ఎత్తాను.
ఆఫీస్కి వెళ్ళబోతూ అక్కడే అంటించిన ‘పనిమని’ ప్రకటన బోర్డు చూసాను. నా కళ్ళు మెరుపులు నాకే కనిపించాయి. వెంటనే పనిమని ఆఫీస్కి వెళ్ళాను. అది ఒక సాఫ్ట్వేర్ ఆఫీస్లాగ వుంది, ఇంతలో ఓ కుందనపు బొమ్మలాంటి అమ్మాయి నన్ను విష్చేసి “మే ఐ హెల్ప్యు” అంటూ మర్యాదగా అడిగింది. నేను గొంతు సవరించుకొని
“అదే పనిమనిషి…” అని మాట పూర్తిచెయ్యకుండానే
“ఓహ్ మీకు సర్వెంట్మెయిడ్ కావాలి అవునా?, అని ఏ గ్రేడ్ కావాలి ?” అని , వేరే రూంలోకి తీసుకెళ్ళింది.
“గ్రేడా ?” అదేంటి అనే లోపులే , అక్కడ వున్న స్క్రీన్మీద పవర్పాయింట్ ప్రెసెంటేషన్ తోటి ప్యాకేజీ వివరాలు చెప్పసాగింది.
“మా దగ్గర A , B అని రెండు గ్రేడులు వున్నాయి, వాటిల్లో మళ్ళీ A1 , A2 , A3 అని మూడు లెవెల్స్ A1 సెలెబ్రెటీస్ దగ్గర మాత్రమే పనిచేస్తారు. మీరు కాదు కాబట్టి మీకు ఆ వివరాలు అనవసరం.
ఇక A2 VIP ల దగ్గరే పని చేస్తారు. మీరు VIP ఆ? కాదుకదా ..” అని తానే చెప్పటం కొనసాగించింది నా సమాధానం వినకుండానే.
“తరువాత లెవెల్ A3 వీళ్ళు NRI ల దగ్గర పనిచేస్తారు, మీరు” అని మా సమాధానం కోసం ఆగింది. తల అడ్డంగా ఊపా…
నెక్స్ట్ స్లయిడ్ మీదవున్న B1 B2 B3 అని వేరే గ్రేడ్లో లెవెల్స్ గురించి చెప్పటం మొదలు పెట్టింది.
“B1 వీరు, ఇంగ్లీష్ తో పాటు మీ రీజినల్లాంగ్వేజ్లో మాట్లాడ గలరు. పూర్తిఎయిర్కండిషన్ ఇళ్ళలో మాత్రమే పని చేస్తారు. గ్లాస్ మరియు ఇంపోర్టెడ్ వెస్సెల్స్ మాత్రమే క్లీన్చేస్తారు. టూల్స్ కూడా ఇంపోర్టెడ్ అయివుండాలి. మీ వెస్సెస్ల్కి ఇన్సూరెన్సు కూడా ఈ ప్యాకేజీలో ఇంక్లూడెడ్, కార్పార్కింగ్ ఏరియా మీరే చూపించాలి” ఎటు వంటి మార్పులేని నా మొహం చూసి , b2 గురించి చెప్పసాగింది.
“B2 అంటే ఇంగ్లీష్ మాట్లాడలేరు, అంటే మీ ఇంటికి వొచ్చే గెస్ట్స్ని పలకరించలేరు, పిల్లలతోటి వీరు మాట్లాడలేరు. ఇంపోర్టెడ్తో పాటు స్వదేశీ వొస్తువులూ వాడతారు కానీ, వాటికి భీమా సదుపాయం ఉండదు. నాన్ఏసీ అయినా పరవా లేదు. బైక్పార్కింగ్ చూపించాలి, ఇకపొతే B3 వీరు మన ఊరి పనిమనిషుల్లాగా వుంటారు ఈ గ్రేడ్వాళ్ళు ఏ పాత్రలైనా క్లీన్చేస్తారు, చీపుళ్లు బూజుల కర్రలు కూడా వాడతారు. వీరికి డ్రెస్కోడ్ఉండదు.
B1, B2లకు, వీక్లీఆఫ్వుండవు అంటే, రిప్లేసెమెంట్స్వొస్తాయీ.. B3 కి వారానికి మాత్రం రెండురోజుల సెలవు, గవర్నమెంట్హాలిడేస్ అన్నీ ఉంటాయి. ప్రతి 6నెలలుకు 1000 /- ల గిఫ్ట్వౌచెర్ ఇవ్వాలి. ఏడాదికో ఇంక్రిమెంట్ 10 % ఇవ్వాలి. మీరు సెలెక్ట్చేసిన దాన్ని బట్టి , మీకు వివరాలు తెలియజేస్తాం ఇంకా ఏమైనా వివరాలు కావాలా ? “అని చెప్పటం ఆగింది, ఈ వివరణలతో నాకు డౌట్ ఏంటి ప్రాణాలే అవుట్ఐతేను అనుకోని. ఇంకా ఆశచావక మినిమమ్ ఎక్కడి నుంచి మొదలవుతుంది అని అడిగాను, దానికి ఆమె “మీ ఇల్లు లొకాలిటీ, మీ ఇంటి మెంబెర్స్ సంఖ్యా, అపార్ట్మెంట్ఆ ? విల్లానా ?మీ ఏరియాలో వుండే పెట్స్, ఇలా చాలా విషయాలు పరిగణనలోకి తీసుకోవాలి ఎంతలేదన్నా కనీసం నెలకి పదిహేను నుండి ఇరవైవేలు అవుతుంది” అని నేను ఎదురుచూస్తున్న సమాధానం చెప్పింది. ఇంటికి వెళ్లి చెబుతా అని బయటకు జారుకున్నా.
చిన్నఆశకూడా చితికిపోయేసరికి, వీళ్ళ పనే బావుందే అని ఏడవలేక నవ్వుకున్నా.
పనిమనిషి లేకపోతె వుండే కష్టాలు అన్ని ఇన్నీ కావు. పనిమనిషి లేని ఇల్లు శపించబడ్డ ఇల్లేకదా? ఈ శాపానికి విముక్తిలేదా? చూడముచ్చటయిన ముగ్గుతో , తళతళ మెరిసిపోతున్న గిన్నెలున్న ఇల్లులా ఉండాలి అంటే ఏమి చెయ్యాలి?ఈ వరాన్ని ఎలా పొందాలి? ఇలాంటి ఆలోచనలతో నా మెదడు , అంటగిన్నెలు సింక్లా తయారయింది. మంచి పనిమనిషిని, వరంగా పొందడానికి ఏదైనా నోము ఉంటే బాగుండును అనే ఆలోచన వొచ్చింది. అవును ఎందుకుండ కూడదు ?మంచి భర్తకోసం, మంచి సంతానం కోసం ,ధనం కోసం, ధాన్యం కోసం, ఇలా ప్రతి దానికీ నోములు వున్నాయి కదా అలాగే పనిమనిషి కోసం కూడా ఓ వ్రతం వుండే ఉంటుంది. వెంటనే కంప్యూటర్ముందు కూర్చొని వెబ్సెర్చ్చేశాను. “నోములబామ్మా” అనే వెబ్సైట్లో రకరకాల నోముల గురించి వుంది. ఇచట అన్ని నోముల వివరాలు ఇవ్వబడును. కావలసిన వారు కింది నెంబర్కి వీడియోకాల్చెయ్యచ్చని ఒక నెంబర్ ఇవ్వబడింది. ముందుగా 500 రూపాయలు పంపి అప్పోయింట్మెంట్తీసుకోవాలని అని కూడా వుంది. మరో ఆలోచన లేకుండా ఆ డబ్బులు కట్టేసి అప్పోయింట్మెంట్కోసం వెయిట్చేయసాగాను, మర్నాడు రాత్రి 12 :30 కి స్లాట్దొరికింది.
కళ్ళుకూరుకు పోతున్నా ఆ బామ్మాసాక్ష్యాత్కరం కోసం ఎదురు చూడసాగాను. ఆ సమయం ఆసన్నమయి కంప్యూటర్స్క్రీన్పై సర్వాభరణాలు పెట్టుకున్న ‘నోములబామ్మా ’ప్రత్యక్షం అయ్యింది. బామ్మాని చూడగానే హెడ్ఫోన్స్పెట్టుకున్న పార్వతీ దేవిలాగా కనిపించింది.
“హౌకెన్ఐహెల్ప్యు ? ” అని బామ్మా అడగంగానే , “భక్తా నీకు ఏ వరంకావాలో కోరుకో ” అన్నట్టు అనిపించింది. నా బాధవిన్న బామ్మా…
“నీ సబ్జెక్టు నాకు అర్థం అయ్యింది, మంచి పనిమనిషి కోసం ఒక వ్రతం కావాలి అంతేనా?” అని అడిగింది. దానికి నేను తలూపగా అప్పుడు బామ్మా ” ఇది నీ సమస్యే కాదు, ఇంటి ఇంటి సమస్య. నిజానికి పురాణాల్లో కూడా స్త్రీలు ఈ కష్టాలు పడ్డారు. పాండవుల అరణ్యవాసంలో ఉండగా, ఒకరోజు ద్రౌపతి శ్రీకృష్ణ భగవానుడితో “స్వామి! తిండికి లోటు లేకుండా అక్షయపాత్ర ఐతే వుంది కానీ, వంట గిన్నెలు కడగటానికి, ఇల్లు శుభ్రపరచడానికి, నాకు శక్తీ సరిపోవటంలేదు స్వామి. నాకు ఏదైనా దారి చూపించమని వేడుకొనగా అంతటా ఆ శ్రీకృష్ణుడు , ద్రౌపతికి వివరించిన వ్రతం ఇది. అప్పుడు ద్రౌపతి ఆ వ్రతం ఆచరించి , అరణ్యవాసంలో లాభపడింది. అంత అడవిలోనూ ప్రతీరోజు ఎవరో ఒకరు ఆమె దగ్గరకు వచ్చి గిన్నెలు తోమివెళ్లే వారు” అనగానే నా కళ్ళు మళ్ళీ మెరిసాయి, అరణ్యంలోనే దొరికితే ఇక్కడేంతసేపు అని అనుకున్నాను.
“ఈ వ్రత విధానం చాలా సులువు.
తెల్లవారుఝామున లేచి, అభ్యంగస్నానం చేసి, నేను పంపిన కథని చదువుకొని , నెత్తిన అక్షింతలు జల్లుకోవాలి. ఈ మంత్రం ‘ఓం పనిమాలక్ష్యమయినమః అని 101 సార్లు, స్మరిస్తూ గిన్నెలుతోముకొని, పనిమనిషి చెయ్యాల్సిన పనులన్నీ నువ్వే ఒక 15 రోజులపాటు చెయ్యాలి.
ఈ 15 రోజులు ఒక పనిమనిషికి నవకాయపిండి వంటలతో వేడి భోజనం పెట్టాలి ‘ 15 రోజులు అయ్యాక , నాలుగు పుంజీల పనిమనుషులు పిలిచి, నవకాయపిండి వంటలతో భోజనంపెట్టి , చీర, రవిక, పూలు, పండుతోపాటు, నీకు తోచిన 1gm బంగారం పెట్టి వాళ్ళ ఆశ్విర్వచనం తీసుకోవాలి. భక్తిశ్రద్దలు ముఖ్యం సుమా!” అని నవ్వుతూ మాయమైంది.
వెంటనే నా వ్రతం మొదలుపెట్టి వ్రతం పూర్తిచేశాను. మర్నాడు, తెల్లవారుతూనే మోగిన కాలింగ్బెల్శబ్దానికి తలుపు తీశాను, ఎదురుగా ఒక ఆడమనిషి “పనిమనిషి కావాలట..” అని అమృతతుల్యమైన మాటలు నా చెవిలో పోసినట్టు అడిగింది. నా నోము ఫలించింది అనుకున్నాను.
“నాపేరు శ్రీమహాలక్ష్మి, నన్ను శ్రీమ అని పిలుస్తారు, పని వివరాలు అన్నివిన్నాక నాకు, మీ పనికి పదివేలు కావాలి” అని చెప్పింది. నా గొంతులో వెలక్కాయ పడింది. నేను వెంటనే మా ఆయన్నీఅడిగి చెపుతా అన్నా.
దానికి ఆమె, ” ఒహ్హ్! మీరు డెసిషన్మేకర్కాదా ?“ అని నాకు ఒకటే స్లాట్మిగిలి వుంది తొందరగా మెసేజ్పెట్టండి. అని గిరుక్కున తిరిగి వెళ్ళిపోయింది.
‘పదివేలు !’మరీ అంతా!”పనిమని” కంటే తక్కువే కానీ, అని ఆలోచిస్తూ కూర్చున్నా ఇంతలో మావారు వొచ్చారు.
మావారితో సంప్రదించి పాతదానితో పొలిస్తే బెటర్అని నిర్ణయించుకొని , శ్రీమాకు మెసేజ్పెట్టాను. నిశ్చింతంగా నిద్రపోయాను. నిద్రలో ఘల్లుఘల్లున గజ్జలతో పనిమనిషి ఇంటి ముందు కళ్లపుజల్లి, ముగ్గులు పెడుతున్నట్టు కలలు కూడా కన్నాను. తెల్లగా తెల్లారిపోయినా శ్రీమా రాలేదు. ఏమైవుంటుందబ్బా అని మళ్ళీ ఫోన్చేశాను. ఫోన్ఎత్త లేదు. మళ్ళీ, మళ్ళీ ట్రైచెయ్యగా, ఓమెసేజ్వచ్చింది.
“మీరు పెట్టిన మెసేజ్లేట్అయినా కారణంగా నేను వేరేచోట చేరాను సారీ” అని దాని సారాంశం. శ్రీవారి దగ్గర ఘొల్లు మన్నాను.
“గుమ్మంలోకి వచ్చిన శ్రీమని కాలదన్ను కున్నావు . అదృష్టం ఒకేసారి తలుపు తడుతుందని నీకు తెలియదా. నాతో సంప్రదింపులు ఎందుకు. అయినా ఏమిచేస్తాంలే నీ మొహాన్ని మూడుగిన్నెలు, ఆరు కంచాలుతో వర్దిల్లమని రాసినట్టు వున్నాడు ఆ బ్రహ్మ”. అని అక్షింతలు వేశారు.
మర్నాడు మామ్మూలుగానే లేచి గిన్నెలు కడగడం మొదలు పెట్టాను. ఇంతలో తలుపు చప్పుడు అయింది. ఎవరబ్బా కొత్త పనిమనిష? అని ఆశగా తలుపుతీసాను. ఎదురుగా ఇంత ఇంత అట్టపెట్టెలు పట్టుకుని డెలివరీబాయ్ “మేడం అమెజాన్నుంచి వచ్చాము” అంటూ అట్టపెట్టెలు హాల్లో పెట్టి వెళ్లిపోయారు. నేను ఆశ్చర్యపోయాను. ఇవన్నీ ఏంటబ్బా ఈయన ఏమైనా ఇచ్చారా అనుకుంటూ “ఏమండీ!” అని గట్టిగా పిలిచాను. నా అరుపుకు మరుక్షణం హాల్లో వున్నారు మా వారు. “ఏమైనా ఆర్డర్ఇచ్చారా” అని అడిగాను. “అవును బంగారం డిష్వాషర్ , వాక్యూంక్లీనర్, వాషింగ్మెషిన్ఇలా అన్ని ఆర్డర్ఇచ్చేసాను. పనిమనిషి మీద ఆధారపడనవసరం లేదు” అంటూ సన్నగా నవ్వారు కనుబొమ్మలు ఎగరేస్తూ.
“అవునండి మీరు ఎంత మంచివారు! మీ లాంటి భర్త దొరకడం నా అదృష్టం. హమ్మయ్యా పని చాలా తేలిక అయ్యిపోతుంది. ఈ మాత్రం సపోర్ట్ఉంటేనా చెలరేగిపోతా ,మాల్దీవ్స్ కి ఎలాగ్లామర్గా వొస్తానో చూడండి”
“మాల్దీవ్స్లేవు, మహాబలిపురాలు లేవు ఆట్రిప్ బదులు ఇవన్నీ” అన్నారు. ఆ మాటకి నామాల్దీవ్స్ కల ముక్కచెక్క లైంది. కానీ వెంటనే తేరుకొని, కావాలి అంటే మళ్ళీ వెళ్ళచ్చు. మన కష్టాలకు శాశ్వత పరిష్కారం దొరికింది అని వెంటనే పని మొదలు పెట్టాను. ఒక వారానికి గాని నాకు అర్థం అవ్వలేదు, డిష్వాషెర్వుంది కానీ దానిలో అన్నీ మనమే వెయ్యాలి, తీయాలి, సర్దాలి. , దాని వాడకం అయ్యాక దాన్ని మళ్ళీ శుభ్రపరచాలి. వాషింగ్మెషిన్ఐతే తిప్పటం తప్ప మిగిలిన పని అంతా మనమే చెయ్యాలి, ఈవక్క్యూమ్క్లీనర్గొట్టం ఎత్తి పెట్టుకొనే సరికి నా భుజంలాగేస్తోంది,
పైగా వీటన్నిట్నీపెట్టుకోడానికి అదనపు స్థలం కావాలి. వీటివల్ల కరెంటు బిల్పెరిగిపోయింది. వీటి చాకిరీ కూడా నేనే చెయ్యాలి, కనీసం ఆమాల్దీవ్స్కిపోయిన బాగుండును. కనీసం ఒక వారం రోజులు ఈ బాధయినా తప్పేది.
అంత సులువయితే పనిమనిషులకు ఇంత డిమాండ్ఎందుకు?ఆ ఏజెన్సీ అంత పోష్గా ఎందుకు వుంది ? ఇవికొనే ముందు మనబుర్రకి తట్టలేదు.
ఎంతైనా మనిషి, మనిషే ..మరీముఖ్యంగా. పనిమనిషి, పనిమనిషే .. వీరి విలువ ఎన్ని మెషిన్లు వొచ్చిన సరితూగలేవు అందుకే ఓ మనిషి సరిలేరు నీ కెవ్వరూ ..
*****
జే వి ఎస్ లక్ష్మి , M A సోషియాలజీ , M A ఇంగ్లీష్ మరియు బి ఎడ్ చేసి ఉపాధ్యాయినిగా పదవీ విరమణ చేసి , హైదరాబాద్ లో స్ధిరపడ్డారు . వీరు ఏభైకి పైగా రేడియోలో హాస్య ప్రసంగాలు ఇచ్చారు , వీరు రచించిన నా గూడు అనే కథ ప్రజాదరణ పొందింది హిందీలో అనువదింపబడింది. వీరికి చిత్రలేఖనం అంటే ఆశక్తి , ఖాళీ సమయాల్లో విద్యార్థులకు నేర్పిస్తూవుంటారు.
చాలా బాగుంది కానీ విదేశాలలో ఇది కుదరదంటారు
హాస్యంతో కూడిన మంచి కథ! పనిమనిషి వుంటే వాళ్ళ నాగాలు, నఖరాలు భరించడంతో bp హై; పనిమనిషి (pm) లేకుంటే ఇంటి పనుల తో bp low …ఇంట్లో వున్న అందరూ ఇంటి పనిలో నేను సైతం అని సాయం చేయాలి. లక్ష్మి గారికి ధన్యవాదాలు.