బతుకు చిత్రం-36
– రావుల కిరణ్మయి
జరిగిన కథ: తల్లి ఆరోగ్యం బాగు చేయించడం కోసం సయిదులు ఆరాట పడుతుం టాడు .అందుకోసం మందులతో కాక తక్కువ ఖర్చులో మంత్రాలు తంత్రాలతో నయం చేయవచ్చని సరూప ఆశపెడుతుంది. అందుకోసం ఏం చెయ్యాలో చెప్తుంది. దాని కోసం సయిదులు ప్రయత్నిస్తుంటాడు. ఆ తరువాత
***
బిడ్డా !కమలా !తిన్నవా ?అడిగిండు రాజయ్య .
ఆ …ఆ …తిన్న మావా !
గట్లచ్చి పొయ్యేది సత్తేనా ?
ఔ …అన్నది పొడి పొడిగా .
ఏమక్కరకు అచ్చింది ?
అది ..అది …రేపోద్దుగాల ఏదో పని మీద ఊరు వోతాందట ,సోపతికి రమ్మన్నది.
నిన్నా ?
ఔ ..
పోతావా ?
అత్తను అడిగి పోదమనుకుంటానా. అన్నది అనుమానంగానే.
సరేతియి. అన్నట్టుగా రాజయ్య మళ్ళీ బయటకు వెళ్ళిపోవడంతో కమల తనలో తనే విషయం ఉన్నదీ ఉన్నట్టుగా గిదీ అని చెపితే ఒప్పుకుంటారా ? ఏదో ఒకటి అబద్ధమే నయమని అనుకుంది.
***
జాజులమ్మ ,అత్త అందరూ ఇల్లు చేరాక నెమ్మదిగా అడిగింది.సత్తి రమ్మన్నదని.
ఈర్లచ్చీమి ,బిడ్డా !ఇప్పుడు తిరుగుడు అంతా మంచిది కాదు గని ,పైలంగ పొయ్యత్త నంటే నీ ఇష్టం .అన్నది .
జాజులమ్మ మొకం చూసింది.
జాజులమ్మ ఎందుకో ఏమి మాట్లాడలేదు.
కమల ఆ మౌనం ఒప్పుకున్నట్టే అనుకోని మళ్ళీ అడుగలేదు.
***
తెల్లవారి అందరూ ఎవరి పనులకు వారు వెళ్ళిపోయాకా ,సత్తితోని కలిసి పసరు మందు తాగడానికి పక్క ఊరికి వెళ్ళింది.
అక్కడ జనం జాతర్ లెక్కనే ఉన్నరు. అందరు ఇసొంటో ల్లె కాక పిల్లల కోసం కూడా వచ్చినవాళ్ళు ఉన్నారు.
కమల ఆశ్చర్యపోయింది. లచ్చలు వెట్టి సదివిన సదువులకన్నా తాతల నాటి పసరు మందుల తోని పెద్ద డాక్టర్ ల కంటే వీళ్ళే ఎక్కువేయ్యిండ్రని.
సత్తి తన పరపతితోని తొందరగానే లోపలకు తీసుకెళ్ళింది.
అంతకు ముందే చేసి ఉంచిన పసరును చిన్న నూనె పావులో పోసి తాగించింది.
మూడు రోజులదాక పథ్యం చెప్పింది. వెల్లుల్లి కారంతోనే తినమన్నది.
డబ్బులు కూడా తీసుకోలేదు, కొడుకును ఎత్తుకొని వచ్చి ఇచ్చి పో ..!అని నవ్వింది.
కమలకు ఆమె మంచితనానికి గురి కుదిరింది. తనకు ఖచ్చితంగా మగ పిలగాడే అన్న ఆత్మా తృప్తి తో ఇల్లు చేరింది.
ఎవరికీ ఏమి చెప్పలేదు. ఎవరూ అడగలేదు.
పిల్లలు సేమ్యా వడలు తింటూ చేస్తున్న అల్లరిలో మునిగిపోయారు.
కమల కూడా వారితో చేరింది.
అందరికీ పళ్ళెంలో పెట్టుకువచ్చి కమలకు కూడా తినమని ఇచ్చింది.
కమలకు పథ్యం గుర్తుకు వచ్చి,
అత్తా ..!ఇగ తినుడు నాతోని గాదు. ఇయ్యాల పోద్దటి సంది తినుడు తప్ప ఇంకోటి లేదు. సత్తి వద్దంటే ఇనకుండ తినవెట్టింది. అని లోపల ఆకలిగా ఉన్నా, అబద్ధమా డింది.
తిన్నట్టుగ మొకం చేప్తలేదు గని ,…అన్నది ఈర్లచ్కిమి.
అత్తా !అలిసిపోయిదేమో !తినకుంటే అబద్ధమెందుకు అడుతది ?తన కోసం కాక పోయినా కొడుకు కోసమన్న తినదా ?ఏంది ?అని జాజులమ్మ అనడంతో ఈర్లచ్చిమి ఇంక మాట్లాడలేదు.
కమల,జాజులమ్మ అన్నట్టు కొడుకు కోసమన్న తినాలేగని ఎట్లా ?అనుకున్నది.
అందరూ ఎక్కడి వాళ్ళు అక్కడ నిద్ర పోయాక ఆకలికి తట్టుకోలేక సప్పుడు కాకుండా వంట గదిలోకి వెళ్ళి కారంతో కడుపునిండా తిని వచ్చి పడుకుంది.
కమల తినడం జాజులమ్మ చూసింది. కానీ ఏమయినా అంటే తినడం మానేసి తన పనికి సిగ్గుపడి తినడం కూడా ఆపెస్తుందని ఏమీ అనలేదు.
ఉదయం చద్దన్నం గిన్నె ఖాళీగా కనిపించడంతో ఈర్లచ్చిమి ,జాజులును అడిగింది.
జాజీ ..!రాత్రన్నం ఏమయిందే ?కుక్కలు,కోతులు గిన సొరబడ్డాయే ?అని .
కమల విన్నా విననట్టుగా వెళ్ళిపోయింది.
ఔ అత్తా !నేను మధ్యల మంచి నీళ్ళకని లేచి తలుపు సందు వెట్టిన ,పొద్దుగాల జూత్తే కుక్క ముట్టింది. ఇగ అంత పారేసిన.
అయ్యో !ఎంత పనయిపాయే. పిలగాండ్లకు కూరగాయలన్ని ఉడికేసి తినవెడు దమనుకున్న.అన్నది.
ఎనుకట రాత్రిపూట అన్నం మునిగేటట్టు నీళ్ళు పోసి ,అండ్ల చల్ల కలుపుకొని తిని పొలం పనికి పొయ్యేటోళ్ళు. దీన్ని తరవాణి చద్ది అనేటోళ్ళు. చల్ది వన్నం బలకరం, పుష్టికరం, తృప్తికరం చెప్పసాగింది.
ఏందే ?లేనిదానికి గింత జెప్పవడితివి ?నువ్వూ నీ చాదస్తం ,అని కోపగించుకునే సరికి మారు మాట్లాడలేదు.
జాజులమ్మ కమలను చూసింది.
కమల తల వాల్చి నిలుచుంది.
కమలా !కూలికి యాల్లయింది.నేను బోతాన.టయానికి ఇంతదిను .ఇవేమీ పట్టించు కోకు అని వెళ్ళిపోయింది.
ఆ రోజు మధ్యాన్నం కూడా వెల్లుల్లి కారం ఘాటుగా కలుపుకొని తిన్నది.
మళ్ళీ ఇంకా రెండు రాత్రులు ఎట్లా గడవాలా ?అని అనుకుంది.
సత్తిని సలహా అడిగితే అనుకుంది.
సత్తి ఇంటికి వెళ్ళి నిన్నటి సంగతి చెప్పి ఇంకా రెండు రాత్రులు ఎట్లా ?అన్నది .
ఓస్ ..!ఈ మాత్రం దానికే అంతా ఇదయి పోతావెందుకే ?సరిగ్గా తినే టయానికి నా కాడికి రా ?
అమ్మో !అనుమానపడుతారేమోనే ?
అట్లయితే ఈ టిపిని పట్టుకు పొయ్యి ఇది ఇచ్చి రావాల్నని రాపో !అప్పుడయితే ఎవ్వరూ వద్ధనరు .
అవునే !నిజమే !ఎవరికీ అంత ఓపికుండదు ,నాకు నెత్తిన పాలు పోసినవ్. అని అక్కడి నుండి వచ్చి సాయంత్రం సత్తి చెప్పినట్టే సరిగ్గా తినే టయానికి వెళ్ళి కడుపు నిండా వెల్లుల్లి కారంతో తిని వచ్చింది.
జాజులు ,ఈర్లచ్చిమి అడిగి ఊరుకున్నారు. సత్తి పరిచయం తెలిసినవారు కావడం చేత పెద్దగా పట్టించుకోలేదు.
మూడవ రోజు కమల చాలా సంబురపడింది. ఈ రోజుతో తన పథ్యం తీరిపోతున్నా డని ఇక తనకు ఏ డోకా లేదని ఉబ్బి తబ్బిబ్బయ్యింది.
ఆ సాయంత్రం కూడా ఏదో సాకు చెప్పి సత్తి దగ్గరే తిని వచ్చింది.
కానీ వెల్లుల్లి కారం వల్లనో ఏమో కడుపులో మంట మొదలయినా ఓర్చుకోసాగింది.
మూడో రోజు రాత్రి ఎంతకూ నిద్ర పట్టక కడుపు పగిలి పోతుందేమోనన్న నొప్పితో గిల గిల లాడింది. అయినా ఎవరికీ చెప్పలేదు.
రాత్రి బాగా పొద్దు పోయాక విరేచనాలు మొదలయ్యాయి.
మాటి మాటికి వెళ్తుండడంతో కంగారుగా లేచి కూర్చున్నారు.
అదేపనిగా వెళ్ళి రావడం వల్ల బాగా నీరసించింది.
మధ్యలో మూడు సార్లు వాంతులు కూడా కావడం ఈర్లచ్చిమి అనుమానంతోను , భయంతోనూ అడిగింది.
ఏమి తిన్నావని. కానీ కమల నీరసంతో ఏమీ చెప్పలేదు.
భగవంతుడా !ఈ రాత్రి ఎటు పొయ్యేది ?ఈ పిల్లను కాపాడు సామీ !అని మొక్కడం మొదలు పెట్టింది.
జాజులమ్మ చల్ల చేసి తాగమన్నా కమల ఒప్పుకోలేదు.
ఈ ఒక్క రాత్రి గడుస్తే తన్న మందు పని చేస్తుందని లేకుంటే వృధా అనే నమ్మకం తో అలానే ఉండిపోయింది.
జాజులమ్మ బలవంతం చేసినా తాగక పోవడంతో జాజులమ్మకు కూడా కంగారుగా అనిపించింది.
ఇప్పుడు వాంతులు కూడా పెరిగాయి.
కమల తన వెంట ఎవరినీ రానియక పోయి వస్తున్నది. ఎక్కడ తన పని బయట పడుతుందోననే భయంతో.
ఎన్ని సార్లు పోయిందో లెక్క లేదు .ఇక తెల్లవారుతుందనగా కమలను దేవతక్క దగ్గరక కయినా తీసుకెళ్ళాలని చూసింది జాజులమ్మ .
కానీ కమల లేచి నడిచి వచ్చే పరిస్థితి కనిపించక పోవడంతో తనే వెళ్ళి దేవతక్క ను తోడుకచ్చింది.
సైదులుతో సహా అందరూ భయంగానూ ,బాధగానూ ఉన్నారు.
దేవత వచ్చి నాడి పట్టుక చూసింది.ఆమెలోనూ కంగారు కనిపించింది, అందరికీ .
ఆమె ఎవరికీ ఏమి చెప్పకుండానే 108 కు ఫోన్ చేసింది.
మూడు రోజులుగా తనకు ఏం తినిపించారని అడిగింది.
జాజులమ్మ తనకు తెలిసినంత వరకు చెప్పింది.
కమలను మీరు సరిగ్గా పట్టించుకున్నట్టు నాకు అనిపించడం లేదు. పైగా డాక్టర్ గారి మందులు కాకుండా ఇంకేదో వాడినట్టుగా తేడాగా ఉంది. ఏదేమయినా మీరు ….. అంటుండగానే సయిరన్ తో అంబులేన్సు రావడంతో హడావిడిగా కమలను హాస్పిటల్కు చేర్చింది.
డాక్టర్ అన్ని పరీక్షలకు పంపిస్తూనే ముందు ఈమె బతకడం కష్టమని , కడుపులో బిడ్డను గురించి ఆశ వదులుకోవలసిందే నని దేవతకు క్లియేర్గా చెప్పి అన్ని ఫార్మాలిటీస్ పూర్తి చేయించి ఏమ్ర్జేన్సి వార్డ్ కు తరలించింది.
అందరిలోనూ భయం ఎక్కువయ్యింది.
జాజులమ్మ ,ఈర్లచ్చిమి దేవతక్కను ఎంతగా అడిగినా ఆమె సమాధానం దాటవే సింది .
ఇద్దరికీ ఏడుపు ఆగడం లేదు. కమలకు ఏమీ కాకూడదని కోటొక్క దేవతలకు మొక్కుతున్నారు.
అసలు ఏం జరిగి ఉంటుంది? జాజులమ్మకు తానయితే ఒక్కోనాడు పచ్చడి మెతుకులు పెట్టినా ఒక్కనాడు ఇట్లా కాలేదు. మరి కమలను జాజులమ్మ కంటే ఏక్కువగా పువ్వులో పెట్టి చూసుకున్టుండగా ఇలా ఎలా జరిగిందని ఈర్లచ్చిమి పరి పరి విధాలా ఆలోచనలో పడింది.
జాజులమ్మ కూడా అంతే. కమల తన కంటే ఎక్కువగా కష్టపడకూడదనే కదా !తను కదలనియికుండా ఇన్నాళ్ళూ చూసుకున్నది. మునుపెన్నడూ ఎటు వంటి అనారోగ్య మూ లేని మనిషి ఇప్పుడు ఇలా ఎలా ..?
ఆమెకు ఏమీ తోచడం లేదు.
సైదులు , రాజయ్య ఈ ఇద్దరినీ చూస్తూ కూర్చున్నారు. ఏదయినా చెడు మాత్రం జరగకూడదని బలంగా కోరుకుంటూ.
చాలా సమయం గడిచింది…
*****
ఫోటో ఆర్ట్: రమేష్ పొతకనూరి
రావుల కిరణ్మయి .తల్లిదండ్రులు అనసుర్య పుల్లచారి గార్లు.జననం హుజురాబాద్ ,తెలంగాణ.తెలుగు భాషోపధ్యాయిని.70 వరకు కథలు.100కు పైగా కవితలు.చైతన్య గీతాలు,బాలగేయాలు,వ్యాసాలు,వివిధ పత్రికలలో ప్రచురితాలు.ఔధార్యం కథా సంపుటి.జీవశ్వాస నవల.వివిధ సాహితి సంస్థల తో బహుమానాలు.ప్రశంసలు.సమాజాన్ని చైతన్య పరిచేవిధంగా రచనలు చేయడం పట్ల చదవడం పట్ల ఆసక్తి.