విషాద నిషాదము

తృతీయ భాగము – స్వర ప్రసారము

-జోగారావు

అన్నపూర్ణాదేవి రవిశంకర్ దంపతుల వివాహము ప్రస్తుతము ఉత్తరాఖండ్ రాష్ట్రములోని ఆల్మోరా లో 15 ఏప్రిల్ 1941 లో జరిగింది. 30 మార్చ్ 1942 న వారికి జన్మించిన కుమారునికి “ శుభేంద్ర’ అని పేరు పెట్టుకుని, శుభో అనే ముద్దు పేరుతో పిలిచుకునేవారు.

జన్మించిన రెండు నెలలకి శుభో కు ప్రేవులలో ఒక అరుదైన వ్యాధి సోకింది.

ఆ బాధతో శుభో విపరీతమైన బాధతో అరుస్తూండే వాడు. నెలరోజుల వైద్యము జరిగిన తరువాత ఆరోగ్యము కుదుట పడినా, రెండేళ్ళ వయసు వరకూ శుభో రాత్రి పూట నిద్రపోయేవాడు కాదు . పగటి పూట పది గంటలకు పైగా సంగీత సాధన, రాత్రి నిద్ర లేక పోవడంతో , ఆ దంపతులకు మధ్య కీచులాటలు, దెబ్బలాటలు ప్రారంభం అయి వైషమ్యాలకు బీజము పడింది.

శుభో కు తండ్రి రవిశంకర్ చిన్నప్పటి నుండే సితార్ నేర్ప సాగేరు.

శుభో చిత్రలేఖనము అంటే ఇష్టపడేవారు,

1945 – 46 మధ్య అన్నపూర్ణాదేవి రవిశంకర్ ముంబాయ్ కు తమ నివాసాన్ని మార్చుకుని శుభో ను చిత్రలేఖనము నేర్చుకోవడానికి ముంబై లోని జే జే స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ లో చేర్పించేరు.

1946 – 1956 మధ్య దంపతులు ముంబయి, ఢిల్లీల లో అనేక కచేరీలు చేసేవారు.

ఆ సమయములోనే రవిశంకర్ కచేరీల వలన, చిత్ర సంగీత దర్శకత్వము వలన ముంబయ్ కు దూరంగా ఉండవలసి రావడము వలన శుభో కు సితార్ నేర్పే బాధ్యత అన్నపూర్ణాదేవి వహించేరు.

వారి సంయుక్త కచేరీలు జరిగినప్పుడు శ్రోతలు అన్నపూర్ణాదేవిని ఎక్కువగా మెచ్చుకునేవారు. కచేరీ పూర్తి అయిన వెంటనే శ్రోతలు ఆవిడ ముందు గుమిగూడి ఆవిడని ప్రశంసలతో ముంచెత్తి రవిశంకర్ గారిని పట్టించుకోవక పోవడముతో ఆయనలో భార్య పట్ల అసూయ ప్రారంభమయి అయిదేళ్ళకు విష వృక్షమయ్యింది.

సంగీత కచేరీలు ముగిసిన తరువాత అభిమానులు తనకు ధనమునిస్తే ఆవిడకు , సంగీతమునకు ధనము స్వీకరించరాదనే తన తండ్రి మాటలు గుర్తుకు వచ్చి ఇబ్బంది పడేవారు.

వైవాహిక జీవితానికి తన సంగీత విద్య పెట్టని కోట అని భావించిన అన్నపూర్ణాదేవి 1956 వ సంవత్సరములో ఒక రోజు తన తండ్రి ఫోటో శారదా దేవి ఫోటో ఎదురుగా నిలబడి, కన్నీళ్ళతో మరీ తన జీవితములో సంగీత కచేరీ చేయనని భీషణ ప్రతిజ్ఞ చేసేరు.

అంతే!

నాటి నుండి శ్రీమతి అన్నపూర్ణాదేవి బహిరంగంగా సంగీత కచేరీ చేయలేదు.

ఇంటి పట్టునే ఉండి శుభోకు సితార్ నేర్పుతూ, శిష్యులకు సంగీతము నేర్పేవారు.

సంగీత ప్రేమికులు అన్నపూర్ణాదేవి సుర్ బహార్ స్వరములు వినే అదృష్టము శాశ్వతముగా కోల్పోయేరు.

ఆ దంపతుల మధ్య అసహనము పెరుగుతూ,దూరము అధికమవడముతో 1944 వ సంవత్సరములో కుమారుడు శుభో తో అన్నపూర్ణాదేవి పుట్టిల్లు చేరుకుని మైహర్ లో రెండేళ్ళు ఉండిపోయేరు.

1946 వ సంవత్సరములో తిరిగి ముంబయ్ చేరుకున్న అన్నపూర్ణాదేవి కి పరిస్థితులలో మార్పు కనిపించలేదు.

రవిశంకర్ నెమ్మదిగా తన సోదరుడు ఉదయ్ శంకర్ బృంద సభ్యురాలు , తన అగ్రజుడు రాజేంద్ర శంకర్ మరదలు అయిన కమలా శాస్త్రికి దగ్గర అయ్యేరు.

ఆ విషయము తెలుసుకున్న అన్నపూర్ణాదేవి కి రవిశంకర్ పట్ల అసహ్యము ఆగ్రహము కలిగేయి.

పదేళ్ళు గడిచినా ఎడమొహం పెడమొహం గా ఉన్న భర్త రవిశంకర్ తనకు దగ్గరయ్యే అవకాశము లేదని భావించిన అన్నపూర్ణాదేవి 1967 వ సంవత్సరములో భర్త నుండి విడిపోయి కుమారుడు శుభో తో దక్షిణ ముంబయ్ వార్డెన్ రోడ్ లోనున్న ఆకాశ గంగా ఎపార్ట్ మెంట్ భవనములో ఆరో అంతస్తులోని ఫ్లాట్ కు మారేరు.

రవిశంకర్ సంగీత కచేరీలు చేస్తూ అమెరికాలో స్థిరపడ్డారు.

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.