మాతృత్వం
(నెచ్చెలి-2023 పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కథ)
-ఝాన్సీలక్ష్మి జాష్టి (శ్రీఝా)
ఖాళీగా ఉన్నఉయ్యాలను చూసి నిర్వేదంగా నవ్వుకుంది భూమి. భూమి అని పేరు తనకు ఏ ముహూర్తాన పెట్టారోకానీ ఆ భూదేవిలాగానే ఏమి జరిగినా నోరుమెదపకుండా భరించాల్సి వస్తోంది, అయినా నోరుతెరిచి మాట్లాడితే మాత్రం ప్రయోజనం ఏముంది? మాటకు మాట ఎదురుచెప్తున్నావ్, ఇదేనా మీ అమ్మ నీకు నేర్పింది అంటూ ఎక్కడో దూరంగా ఉన్న తల్లిని కూడా మాట అనిపించడం తప్ప సాధించేది ఏముంది అని నిట్టూరుస్తున్న భూమి కెవ్వుమంటూ వినిపించిన పిల్లాడి ఏడుపువిని ఉలిక్కిపడిలేచి నుంచుంది.
భూమి ఓ భూమి ఎక్కడున్నావ్?పిల్లాడు ఏడుస్తుంటే చెవులకు వినిపించట్లేదా చూడు గుక్కపట్టి ఎలా ఏడుస్తున్నాడో అంటూ పిల్లాడిని తీసుకొని వచ్చింది భూమి అత్తగారు కళ్యాణి. మౌనంగా అత్తగారి చేతుల్లో నుండి పిల్లాడిని అందుకొని బిడ్డను ఒడిలో పడుకోబెట్టుకొని పాలు ఇవ్వడం మొదలుపెట్టింది. నీకు ఎన్నిసార్లు చెప్పాను పాలు ఇచ్చేటప్పుడు పిల్లాడి తల కొంచెం ఎత్తుగా పెట్టుకోవాలని అంటూ భూమి దగ్గరకు వచ్చి ఒడిలో పిల్లాడిని సరిచేసి పడుకో బెట్టింది కళ్యాణి. పాలుతాగడం అయిపోగానే మళ్ళీ మనవడిని భుజాన వేసుకొని వీడిని నేను చూసుకుంటానులే నువ్వెళ్ళి ఆ వంట పనులు చూసుకో మీ మామయ్య పొలం నుండి వచ్చేటైం అయింది అంటూ పిల్లాడిని తీసుకొని తన గదిలోకి వెళ్ళిపోయింది కళ్యాణి.
నిట్టూరుస్తూ వంటగది వైపు దారితీసింది భూమి. పొయ్యి మీద చారు మరుగుతుంటే ఆ చారుతో పాటు ఆమె మనసు కూడా మరగడం మొదలు పెట్టింది. పెళ్ళి చూపుల్లో నందు తనను చూసి నచ్చింది అని చెప్పిన క్షణం నుండి ఈ రోజు వరకు జరిగిన సంఘటనలు అన్ని ఆమె కళ్ళ ముందు గిర్రున తిరగడం మొదలుపెట్టాయి.
అబ్బాయికి అమ్మాయి నచ్చింది అంట ఇక మిగతా విషయాలు మాట్లాడుకుంటే ముందుకు వెళ్ళోచ్చు అంటున్న మధ్యవర్తితో ఇప్పట్లో అమ్మాయి పెళ్ళి చేయాలనే ఆలోచన లేకపోవడం వల్ల మేము ఏమీ సమకూర్చుకోలేదు, అనుకోకుండా వచ్చిన గుండెనొప్పితో రేపటి రోజు ఎలా ఉంటుందో అనే ఆలోచనతో ఇపుడు ఈ పెళ్ళిచూపులు ఏర్పాటు చేశాను. ఉన్నది అంతా నా హాస్పిటల్ ఖర్చులకే అయిపోయింది. ఇపుడు కట్నం అంటూ ఏమీ ఇవ్వగలిగే స్థితిలో మేము లేము, రేపటి రోజున పరిస్థితులు బాగుండి నా కొడుకు మంచిగా స్థిరపడితే అపుడు వాడే చెల్లెలికి ఏ లోటూ లేకుండా చూసుకుంటాడు అంటున్న నారాయణతో, అయ్యో నారాయణగారు అంత కంగారు అయితే ఎలాఅండి వాళ్ళుకూడా కట్నం ఏమీ అడగడం లేదు పెళ్ళి ఘనంగా చేస్తే చాలు అంట, ఇద్దరే మగపిల్లలు, ఆడపడుచులపోరు లేదు ఆస్తిపాస్తులు బాగానే ఉన్నాయి, అబ్బాయి అమ్మానాన్నలు మంచివాళ్ళు, ఇక అబ్బాయి తమ్ముడు హైదరాబాద్లో ఉద్యోగం చేసుకుంటున్నాడు. ఆ అబ్బాయి ఇక్కడికి వచ్చి ఉండడు, రేపు పెళ్ళిఅయినా వాళ్ళు ఆ సిటీలోనే ఉంటారు ఇక మీ అమ్మాయే ఆ ఇంటికి మహారాణి ఆలోచించుకోండి మరి అంటూ అరచేతిలో స్వర్గం చూపెట్టాడు మధ్యవర్తి.
రేపు తనకు జరగరానిది ఏదైనా జరిగితే ఇంకా స్థిరపడని కొడుకు, కూతురు పెళ్ళి చేయలేడు అనే ఆందోళనతో దొరికిన చోట్లల్లా అప్పులు చేసిమరీ కూతురు పెళ్ళి ఘనంగా చేసాడు నారాయణ. ఇంతాచేస్తే అపుడు భూమి వయసు పదహారు. తండ్రి ఆందోళన అర్ధం చేసుకొని మౌనంగా తలవంచి తాళి కట్టించుకుంది భూమి. ఒక్క కట్నం లేదు అన్నమాటే కానీ పెట్టుపోతల కింద అంతకన్నా ఎక్కువ ఖర్చే అయింది నారాయణకు. పెళ్ళి అయిన మరసటి ఏడు నుండి పిల్లల కోసం ఆరాటపడి భూమిని తొందర పెట్టడం మొదలుపెట్టారు అత్తమామలు. పిల్లకు అంత వయసు ఏమి అయింది అని అంటున్న భూమి వాళ్ళ అమ్మమాటలు పట్టించుకోకుండా మన రోజుల్లో ఇంత కన్నా చిన్న వయసులోనే పెళ్ళిళ్ళు చేయలేదా పదహారేళ్ళు వచ్చే సరికే మనం పిల్లల్ని ఎత్తుకో లేదా అంటూ దీర్ఘాలు తీసింది కళ్యాణి. అలా అలా ఇంకో ఏడాది గడిచి పోయింది
ఈలోగా కరోనా మహమ్మారి బారినపడి నారాయణ కాలం చేసాడు. తండ్రి పోయిన బాధలో ఉన్న భూమితో మీ నాన్నే నీ కడుపున పుడతాడేమో అంటూ హాస్పిటల్స్చుట్టూ తిప్పడం మొదలుపెట్టింది కళ్యాణి. హాస్పిటల్లో టెస్ట్చేసే డాక్టర్స్ఎవరైనా భార్యా భర్తలు ఇద్దరికీ టెస్టులు చేయాలి అంటే మా పిల్లాడిలో ఏ లోపం ఉండదు, ముందు ఈ పిల్లకు టెస్టులు చేయండి చాలు అనేది కళ్యాణి. ఆ టెస్టులు ఈ టెస్టులు అంటూ వాళ్ళు చెప్పిన టెస్టులు అన్నీ చేయించుకొని ఇచ్చిన మందుబిళ్ళలు అన్నీ వాడి భూమి ఒళ్ళు గుల్ల అవడం తప్ప ఎటువంటి ఉపయోగం లేకుండానే మరో రెండేళ్ళు గడిచిపోయాయి.
చిన్నోడికి పెళ్ళి సంబంధాలు వస్తున్నాయమ్మా , కానీ పెద్దోడికి ఇంకా పిల్లలు పుట్టలేదని ఆగాల్సి వస్తోంది, వాడికి పెళ్ళి చేసి వాడికి వెంటనే పిల్లలు పుడితే పెద్దోడ్ని వేలెత్తి చూపిస్తారని వీడి కోసం వాడి పెళ్ళి వాయిదా వేస్తున్నాం. మంచి సంబంధం అని పేదింటి పిల్లను కాణికట్నం లేకుండా చేసుకుంటే పిల్లలను కూడా కనలేక పోతోంది అంటూ ఇరుగు పొరుగు దగ్గర చుట్టాల దగ్గర సూటిపోటి మాటలు అనడం మొదలు పెట్టింది కళ్యాణి. భర్తను కోల్పోయి ఒంటరిగా మిగిలిన తల్లితో ఇవి అన్నీ చెప్పి ఆమెను బాధ పెట్టడం ఇష్టం లేక మౌనంగా అన్నిటినీ భరించడం అలవాటు చేసుకుంది భూమి.
చివరకు కళ్యాణి తమ్ముడు, అక్కా ఒకసారి ఇద్దరికీ కలిపి టెస్టులు చేపిద్దాం ఇపుడు అందరూ అలానే చేయిస్తున్నారు అనడంతో తమ్ముడు మాటకు ఎదురు చెప్పలేక తమ్ముడితో నందును, భూమిని హైదరాబాద్కి పంపించింది కళ్యాణి. అక్కడ టెస్ట్చేసిన డాక్టర్స్ భూమిలో ఏ లోపం లేదు అని నందు మాత్రం కొన్ని టాబ్లెట్స్వాడాలని చెప్పడంతో కళ్యాణి నోరు మూతపడింది కానీ ఆ విషయం మాత్రం ఎక్కడా బయటకు పొక్కకుండా జాగ్రత్త పడింది.
భూమి అదృష్టం కొద్దీ నందు ఆరు నెలలు మందులు వాడగానే భూమి నెల తప్పింది. ఇక అప్పటి నుండి కళ్యాణి ఆర్భాటం చెప్పనవసరం లేదు. భూమి ఎప్పుడు పడుకోవాలి ఎలా పడుకోవాలి ఏమి తినాలి ఎంత తినాలి అన్నీ ఆమె చెప్పేది, ఆమె చెప్పింది చేయకపోతే అలిగి వేరుగా ఒండుకునేది. ఆమెతో ఎందుకు గొడవ అని అన్నీ ఆమె ఇష్టప్రకారమే చేసేది భూమి.
ఇక బాబుపుట్టిన తర్వాత హాస్పిటల్లో ఇంకొకరిని ఎత్తుకోనివ్వలేదు కళ్యాణి. భూమి తరపు వాళ్ళకు ఆమె తరహా బాధకలిగించినా మనవడి మీద ప్రేమతో అలా చేస్తుందిలే, ఎలాగూ మన ఇంటికేకదా వస్తాడు అక్కడ ఎత్తుకోవచ్చులే అని సర్దుకు పోయారు. నామకరణం రోజు మా నాన్నపేరు కలిసి వచ్చేలా పేరు పెట్టుకుందాం బాబుకి అని అడిగింది భూమి, దానికి కళ్యాణి అర్దాయుష్షుతో పోయిన వాళ్ళ పేరు పెట్టుకోవడం మంచిది కాదు నేను నా మనవడి కోసం పేరు ముందే అనుకున్నాను అంటూ తనకు నచ్చిన పేరే ఖాయం చేసింది. కళ్ళ నిండా నీళ్ళతో చూస్తున్న భార్యతో అమ్మ ఏది చేసినా మన మంచి కోసమే చేస్తుంది కదా! వాడికి పేరు ఏది పెట్టినా నువ్వు నీ ఇష్టం వచ్చిన పేరుతో పిలుచుకో సరిపోతుంది అని సర్ది చెప్పాడు నందు.
బాబుకు మూడోనెల రాగానే కోడలిని మనవడిని ఇంటికి తెచ్చేసుకుంది కళ్యాణి. ఆ రోజు నుండి ఇక బాబుకు పాలు పెట్టెటైంలో తప్ప వాడిని మనసుతీరా ఎత్తుకోవడానికి కూడా భూమికి అవకాశం లేదు. తనకు దూరం అయిన తండ్రిని కొడుకులో చూసుకుందాం అనుకుంటే కొడుకు కూడా తనకు దూరం అయినట్లే అనిపించి మనసు కలచి వేస్తోంది భూమికి.
పేరున్న ప్రతి హాస్పిటల్చుట్టూ తిరిగి వాళ్ళు ఇచ్చిన ప్రతి మందు మింగి, కనిపించిన ప్రతి చెట్టుకు పుట్టకు మొక్కి, ప్రతి గుడిలో ముడుపులు కట్టి , ముక్కోటి దేవుళ్ళకు మొక్కి నవమాసాలు మోసి పురిటినొప్పులు పడి బాబును కన్నది కేవలం పాలు ఇచ్చే పదినిముషాలు వాడి సామీప్యం అనుభవించడం కోసమేనా? మరొక ఆరునెలలు పోతే వాడు పాలు మానేస్తే ఆ పదినిముషాలు కూడా వాడు నాకు దగ్గరగా ఉండడా? ఇంతకీ మాతృత్వం నాకా మా అత్తగారికా అని భూమిలో సుడులు తిరుగుతున్న ప్రశ్నలకు జవాబు చెప్పగలిగేది ఎవ్వరు ?
ఆడ పిల్లలు దొరకడం కష్టం అయిపోతుంది అని కట్నం లేకపోయినా సరే అని పెళ్ళి చేసుకొని రావడం తర్వాత మాటకు ముందు ఒకసారి మాటకు వెనక ఒకసారి నిన్ను కాణికట్నం లేకుండా చేసుకున్నాం అని దెప్పేవాళ్ళ మనసులు మారనంత వరకు, పిల్లలు పుట్టకపోతే లోపం భార్యాభర్తల్లో ఎవరిది అయినా కావచ్చు అనే కనీస జ్ఞానం మగపిల్లల తల్లిదండ్రుల్లో కలగనంత వరకు భూమిలాంటి అమ్మాయిల మదిలో మెదిలే ప్రశ్నలకు జవాబులు ఎవ్వరూ చెప్పలేరు.
*****
ఎన్నోఏళ్ళ నుండి పాఠకురాలిగా ఉన్న నేను మూడు సంవత్సరాల నుండి “శ్రీఝా” అనే కలం పేరుతో రచనా వ్యాసంగం కొనసాగిస్తున్నాను. ఈ మూడేళ్ళలో మూడు నవలలు, ముప్పైకి పైగా కథలు వంద వరకు కవితలు రచించాను. “అయ్యంగారి ఇంటి సొగసా” అనే నవల ప్రతిలిపివారి సూపర్ రైటర్స్ -3 లో పోటీలో టాప్ 2౦ లో ఒకటిగా నిలిచి నగదు బహుమతి గెలుచుకుంది. అపరాజిత అనే నవల కస్తూరివిజయం వారిచే ముద్రితమై అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్ లలో లభ్యమవుతోంది. నేను రచించిన కొన్ని కథలు/ కవితలు వివిధ పోటీలలో ప్రథమ, ద్వితీయ బహుమతులు గెలుచుకున్నాయి.
కథ బాగుంది… ఇలాంటి జీవితాలు ఎంత మందివో..
Thanks for your valuable feedback andi
Thanks for your valuable feedback
Thanks for your valuable feedback
బాగుంది కధ
Thank you
Thanks for your valuable feedback
ధన్యవాదములు
మాతృత్వం కథ బావుంది. తల్లి పడే క్షోబకు మరో కోణం చూపించారు. ఇది కధే కాదు.. నిజం కూడా .. 😢
Thanks for your valuable feedback
మీ అమూల్యమైన సమీక్షకు ధన్యవాదములు సురేఖ గారు
భూమిలో కొంత చైతన్యం వచ్చి అత్తకు ఎదురు తిరిగి కొడుకుని ఎత్తుకుని ముద్దు పెట్టుకుంది అని ముగిస్తే బాగుండేది.
మీ అమూల్యమైన సమీక్షకు ధన్యవాదములు అజయ్ గారు, కాలమెంతమారినా అణుకువ పేరుతో అలా అణిగిమణిగి ఉండేవాళ్ళను చూసిన అనుభవంతో రాసాను. అందుకే ముగింపు అలా ఇచ్చాను