క ‘వన’ కోకిలలు – 21 :
‘రూపసి బెంగాల్ కవి’ జీబనానంద దాస్ (17 Feb 1899 – 22 Oct 1954)
– నాగరాజు రామస్వామి
శతాధిక గ్రంథాలు రాసినారాని ఖ్యాతిని, కొందరికి ఒకే ఒక పుస్తకం తెచ్చిపెడు తుంది. పుస్తకం పేరుచెప్పగానే రచయిత పేరు మస్తిష్కంలో తళుక్కు మంటుంది. అజంత స్వప్నలిపి, అనుముల కృష్ణమూర్తి సరస్వతీ సాక్షాత్కారం, నగ్నముని కొయ్య గుర్రం, రాహుల్ సాంకృత్యాయన్ వోల్గా నుంచి గంగకు, ఉన్న లక్ష్మినారాయణ మాలపల్లి, తిరుమల రామచంద్ర హంపీ నుంచి హరప్పా దాకా ఈ కోవకు చెందినవే. మహాప్రస్థానం అంటే మహాకవి శ్రీశ్రీ. జీబనానంద దాస్ ఒకేఒక్క కవిత “నేను బెంగాల్ ముఖంచూచాను” అతన్ని“రూపసి బంగ్లార్ కబి” – సుందర బెంగాల్ కవిని చేసింది.
నేను శాంతినికేతన్ లో వున్న రోజుల్లో విరివిగా విన్న విఖ్యాత సమకాలీన బెంగాల్ కవుల పేర్లు గురుదేవేంద్రనాథ్ ఠాగోర్, కాజీ నజ్రుల్ ఇస్లామి, జీబనానంద దాస్. జీబనానంద దాస్ విశ్వకవి రవీంద్రుని మన్ననలను పొందిన అధునిక మార్మిక కవి. నేటికీ, బెంగాలీ భాషలోని అత్యుత్తమ కవులలో ఒకడుగా గుర్తించబడుతున్న అగ్రశ్రేణి సాహితీ స్రష్ట. ‘రూపసి బెంగాల్ కవి’.
జీబనానంద దాస్ సుప్రసిద్ధ కవి, రచయిత, నవలాకారుడు, వ్యాసకర్త, సాహిత్య విశ్లేషకుడు, విద్యావేత్త.
బంగ్లాదేశ్ లోని కురుగ్రామం బారిసాల్ (Barisal)లో, వైద్య (Baidya) కుటుంబంలో జన్మించాడు. వాళ్ళ పూర్వీకులు ఢాకా ప్రాంతం నుండి వలస వచ్చిన కాందశీకులు. తాత బ్రహ్మ సమాజ సంస్కరణ వాది. వైదిక బ్రాహ్మణ చిహ్నమైన ఇంటిపేరు గుప్తను దాస్ గా మార్చుకున్నాడు. తండ్రి స్కూల్ టీచరు, బ్రహ్మవాది పత్రిక సంపాదకుడు. తల్లి కవయిత్రి. జీబనానంద దాస్ వాళ్ళ పెద్ద కొడుకు. చిన్ననాటి చదువు ఇంటి వద్దనే సాగింది. మెట్రిక్ పాసయ్యాక, కలత్తా, కటక్ వెళ్ళి M.A చేశాడు. అతని ఉద్యోగ పర్వం సాఫీగా సాగలేదు. ఎన్నో లెక్చరర్ ఉద్యోగాలు చేశాడు; పర్మనెంట్ అవడానికి చాలాకాలం పట్టింది. ఆర్థిక పరిస్థితులు అంతంత మాత్రంగానే వుండేవి. ఎలక్ట్రిక్ ట్రామ్ ఆక్సిడెంట్ వల్ల ఏబది ఏళ్ళకే మరణించాడు. అది ఆత్మహత్య కావచ్చునని కొందరి అనుమానం. జీబనానంద్ యుక్తవయసులో ఉన్నప్పుడు షోవనా అనే బంధవుల అమ్మాయిని ప్రేమిం చాడు. వరుస కలువని కారణంగా వివాహం చేసుకోలేక పోతాడు. లావణ్యప్రభను పెళ్ళి చేసుకున్నాడే కాని, వాళ్లిద్దరి మధ్య జీవితాంతం వరకు సయోధ్య కుదరలేదు. అతని అంతిమ ఘడియల్లోనూ ఆమె రాలేదు.
జీబనానంద దాస్ ఏకాంతాన్ని కోరుకునే ఒంటరి జీవి. అంతర్ముఖత అతని స్వభావం. చాలాకాలం వరకు అతనికి సాహితీ గుర్తింపు రాలేదు. మరణానంతరమే అతని ప్రతిష్ఠ పెరిగింది. అతని సమగ్రసాహిత్యం 7 కవితా సంపుటాలు, 800 కవితలు, 21 నవలలు, 108 కథానికలు వెలుగులోకి వచ్చాయి. Rupesh Bangla, Banalata Se, Mahaprithibi, Jhara Palok, Shreshtha Kavita అతని శ్రేష్ఠ కవన సంపుటాలు.
రవీంద్రుని ప్రకృతి ప్రేమతో పాటు, భగ్న మానవత, నగర జీవన నైరాశ్యం, ఒంటరి తనపు మనోభారం, మరణానికి దారితీసే జీవన వైక్లబ్యం , చారిత్రిక విషయ వైవిధ్యం అతని కవితా వస్తువులయ్యాయి. అంతర్ముఖ ఆత్మ విశ్లేషణ అతని కవిత్వానికి విశిష్టతను తెచ్చిపెట్టింది. అతని కవితల అడుగున, బాధామయ విషాదం అంతరివాహినియై ప్రవహిస్తుంది. నేపథ్యంలో, భూమ్యాకాశాలకు అతీతమైన ఏదోకాల్పనిక విభ్రాంతి (Fantasy) బొమ్మ కడుతుంది.
తొలి నాళ్ళలో అతని పై నజ్రుల్ ఇస్లామ్ ప్రభావం ఉండేది. కాని, తర్వాత కాలంలో తనదైన స్వతంత్ర కవితా రూపాన్ని నిర్మించుకున్నాడు. పాశ్చాత్య ఆధునికవాద (Modernism) నవ్యకవితా ధోరిణులకు ప్రభావితుడై, అతడు కొత్త కవనశైలిని, కొత్త అభి వ్యక్తిని, కొత్త బాణీని నిర్మించుకున్నాడు. అతని కవితలలోని అపురూప ఇంద్రియానుభవ సౌందర్య స్పర్శ అతన్ని నవ్య కవిని చేసింది. అతని నవీన కవితారీతి 20 వశతాబ్దపు బెంగాలీ కవిత్వాన్ని ఎంతగానో ప్రభావితం చేసింది. రెండవ ప్రపంచయుద్ధం తరువాత అతని కవితా దృష్టిలో గుణాత్మకమైన మార్పులు వచ్చాయి.
జీబనానంద తన పలు కవితలకు స్వీయానువాదాలు చేసి Modern Bengali Poems పేరున ప్రచురించాడు. టాగోర్ తెచ్చిన వివిధ కవుల కవన సంకలనం ‘ Bangla Kabya Parichay’ లో జీబనానంద్ కవిత ‘Mrityu’r Aagey’ ప్రచురించబడింది.
‘Banalata Sen’ కు రబీంద్ర మెమోరియల్ అవార్డ్, ‘Shrestha Kavita’ కు సాహిత్య అకాడమీ అవార్డ్ లభించాయి. సత్యజిత్ రే టెలివిజన్ సంస్థ నిర్మించిన అతని ‘Sunder Jibon’ కథకు నేషనల్ షార్ట్ఫిల్మ్ అవార్డ్ వచ్చింది.
జీబనానంద దాస్ రచించిన కొన్ని కవితల ఆంగ్లాను వాదాలకు నా తెలుగు సేతలు:
1.: నేను బెంగాల్ ముఖాన్ని చూచాను :
(I have seen Bengal’s face)
నేను బెంగాల్ ముఖాన్ని చూచాను,
ఇక నే నేప్రపంచ సౌందర్యం కోరను.
వేకువ చీకటిలో నిదుర లేచిన నాకు
మేడిచెట్టు ఆకుగొడుగు ఛాయలో కూర్చున్న
కొండకోకిల కనిపిస్తుంది;
నిశ్చలంగా వున్న
నల్లరేగు, పనస, రావి, మర్రి, ఓకు వృక్షాలు
ఆకు జెముడు పొదల మీద
పసుపు ఆకుల తుప్పల మీద
నీలి నీడలను రాల్చుతుంటవి;
చంపా నగరవాసి చాంద్
చూచే వుంటాడు తన వాణిజ్య నౌక నుండి
అశ్వద్థ, దేవదారు చెట్ల నీలి నీడలను.
అతుల్యం బెంగల్ సౌందర్యం!
పున్నమి చంద్రుడు కుంకుతున్న రాత్రిలో
గంగూర్ నది నీటి మీద తెప్పలో తేలుతూ
బెహులా సైతం చూచే వుంటుంది
బంగారు జొన్న చేలను,
అగణిత అశ్వత్థ వృక్ష శ్రేణిని,
ఆలకించే వుంటుంది ఆమె
అమర పురికి చేరుకునే ముందు
వన కోకిలలు పాడిన చిగురు పాటలను.
ఇంద్రసభలో ఆమె
తోక తెగిన పిట్టలా నర్తిస్తుంటే
కన్నీరు మన్నీరై విలపించింది
బెంగాల్ తట నీలలోలిత వనపుష్ప తతి.
బెహులా బెగాల్ శిపురాణంలోని మానసమంగల్ కావ్య నాయిక. అప్సరస మానస పంపిన కాలనాగుకాటుకు ఆమె భర్త మరణిస్తాడు. భర్త పార్థివ దేహాన్ని చిన్ని దోనెలో పెట్టుకొని, సుదీర్ఘ పడవ ప్రయాణం చేసి, దేవలోకం చేరుకుంటుంది ( మన పౌరాణిక సావిత్రిలా). వాళ్ళు ఇంద్రసభలో నర్తిస్తే గాని అతని ప్రాణాన్నిఇవ్వనంటారు. నిస్సహాయి అయిన ఆమె అక్కడ నృత్యం చేసి భర్తను దక్కించుకుంటుంది.
2. : వనలతా సేన్ :
( Banalata Sen by Jibanananda Das )
సహస్రాబ్దాలు సంచరించాను
అంధ నిశీథినీ పృథివీ పథాలలో;
సింహళ జలాలనుండి మలయసాగరాల దాకా.
ఒంటరిగా తిరిగాను
అశోకుని, బింబిసారుని నాటి విదర్భనగర
చిరంతన చీకటి జగత్తులలో.
నురుగులుమిసే జీవన సంద్రాలు చుట్టుముట్టిన
అలసిన ప్రాణాన్ని నేను;
నాకు శాంతిని ప్రసాదించింది
నటోర్ నగర నివాసి వనలతా సేన్.
ఆమె చెదిరిన కురులు
అలనాటి విదిశానగర చిరుచీకట్లు,
ఆమె మోము శ్రావస్తీపుర శిల్పశోభ.
నడి సంద్రంలో చుక్కాని విరిగి,
కొట్టుకుపోతున్న నౌకాభగ్న నావికుడు
హటాత్తుగా సినెమన్ హరిత దీవిని కాంచినట్టు
నలనల్లని ఇరులు పొరల గుండా
నేను ఆమెను చూచాను.
ఆమె,
ఆ నటోర్ నగర నివాసి వనలతా సేన్ అంది
పక్షిగూడు వంటి కనుబొమ్మలను ఎగిరేస్తూ
“ఇన్నాళ్ళు ఎక్కడుండి పోయావ్?” అని,
నిలదీసింది సమాశ్రిత నయనాలను ఎత్తి పడుతూ.
దినాంతాన ….
స్తబ్ధ శిశిర తుహిన తమస్సులా
కమ్ముకొస్తున్నది కడపొద్దు,
తన గరుత్తులకు అంటిన రవిరశ్మీ గంధాన్ని
దులిపేసుకుంటున్నది గరుడపక్షి,
పాలిపోయిన నేల గాలికి
మెరుపులద్దు తున్నవి మిణుగురులు,
సద్దు మణగుతున్నవి నదులు,
గూళ్ళకు చేరుకుంటున్నవి సందె పక్షులు,
స్తంభించింది సమస్త దినజీవన వ్యవహారం,
చివరకు అంతా చిమ్మచీకటి;
నా చుట్టూ శుద్ధ నిబిడాంధకారం,
నా కట్టెదుట
నటోర్ నగర నివాసి వనలతా సేన్!
3. : కొండ కోకిల :
(Magpie)
ఒక స్తబ్ధ మానవుడు
మైదానాల మీదుగా నిశ్శబ్దంగా నడచిపోతుంటాడు
మందకొడి నడక;
అతని ఆకురాలు కాలమంతా అలాగే గడచింది
ఊతకర్రల ఆసరాతో,
అరకొర అరక ఛాయల్లో,
నాగటెద్దుల గుక్కెడు నిశ్చల నీడల్లో.
అతడెవరికీ బదులు పలుకడు
ఆతని రహస్య నేలమాళిగ నుండి;
అతనికీ భాగీరథికీ ఏదో బాదరాయణ సంబంధం!
అపరాహ్ణ కాలం,
డాబా మీద శవపరీక్ష,
కొండ కాకి అరుస్తుంటుంది;
‘ఈ శవం ఎవరిది? ఎవరు శవ పరీక్షకులు?
ఎందుకీ భువి పై ఇంత రక్తపాతం?’
ఎడతెగని వానకోయిల వాయులీన పల్లవి!
ఆ అసుర సంధ్యలో
ఆ పల్లెజీవి నడచి పోతుంటాడు
మధ్యాహ్నపు ఎండలో మాడిపోతున్నట్టు.
రాబిన్ పక్షి రహస్య్యాన్ని విప్పి పాడుతుంటే
ఆదిమ కొండ కోకిల తిరిగొచ్చి నట్టుంటుంది.
4. : నాకు జ్ఞాపకం, నేనక్కడే ఉన్నాను :
( I know, I was there )
నాకు జ్ఞాపకం,
నాకు బాగా జ్ఞాపకం,
నేనక్కడే ఉన్నాను.
నేను బాబిలోనియా రాజుగా ఉన్నప్పుడు
నీవు నా బానిస కన్యవు.
రాత్రుల్లో నమాజు అజాలు
మంద మందంగా వినిపించేవి,
పగటి పూట పావురాలు
చుట్టూ గుంపులు గుంపులుగా ఉండేవి.
అంతా ఆవిరైపోయింది
నీలాకాశంలో లీనమయ్యే పొగలా.
కలుసుకోక తప్పదు నిన్ను;
తెలుసు నాకు ఎన్నాళ్ళ నుండో
ఎలాగైనా నిన్ను కలిసి తీరుతానని.
వేల వత్సరాల కాల కుహరం లోంచి
వినిపించింది
“వస్తాను, వస్తాను” అనే నీ కేక.
వేయేళ్ళ క్రితం కోల్పోయిన ఆమె
నా హేతువాద బుద్భుదాల సముద్రం మీద నిలిచి
ఆటకోలు హాస సంకేతమై చలిస్తుంటుంది,
నేను బాబిలోనియా బాసురి ఊదుతుంటాను
వయసు ముదిరినా, శక్తి ఉడిగినా.
ఆ అంధత్వం లోంచి తప్పించి
అఖండ కాంతిలోకి రప్పించేందుకు
ఆమెను మళ్ళీ మళ్ళీ పిలుస్తుంటాను.
ఎవరు ఈ స్త్రీలందరు?
నా పక్కపక్కనే నిలబడ్డారు?
నా కళ్ళకు, నా సర్వాంగాలకు తెలిసి వస్తున్నది
వాళ్ళు నిశ్శబ్ద కెరటాలై తరలి వచ్చారు.
5. : జీవన గీతం :
( The Song of Life )
స్ట్రెచర్ మీద నీవు పడిఉన్నప్పుడు
బహుషా
నీ కళ్ళను పొగమంచేదో కప్పేసి ఉంటుంది.
దిగులెందుకు?
చావు అంత అనుచితమైందేమీ కాదు;
లేకుంటే,
ఎందుకంత మంది ఎగిరే శలభాలై
మృత్యువును హత్తుకుంటారు?
స్వర్గానికి నిచ్చెనలు వేయాలని
అన్నన్ని శ్లోకాలు రచిస్తారు?
బలసిన గిత్లలను ఉత్తరించే స్పెయిన్ రక్తక్రీడలో
బలైపోయేందుకు ఆటగాడెందుకు సిద్ధమౌతాడు?
అనంత తిమిరంలో అర్ధాంతరంగా మునుగుతానేమోనని తెలిసీ
విర్రవీగే పొగరు అజేయుడు
ఎందుకు రోజంతా పోరాడుతాడు?
బుల్లెట్ల వర్షంలో పసుపు పాదాల పావురం
ఎందుకు అంగీకరిస్తుంది చావును?
అయినా –
గ్లాసును సారాయితో నింపుకుంటున్నంత సాఫీగా
మనం మనలోకి దిన కాంతిని వంపుకుంటాం!
సముద్రం, సముద్ర దిక్సూచీ, సూర్య రశ్మీ
అన్నీ అంతరిస్తాయి భూమి పొరల్లో నలిగి.
తెలివైంది మృత్యువు జీవితం కంటే;
మరకలనూ, మచ్చలనూ మలిపేసుకుంటుంది
సూర్యుడు తన వేడిసుడులను తానే మింగేసుకున్నట్టు.
6.: నేనే గనక చిరంజీవినైతే :
(If I got Eternal Life)
అంతం లేని జీవితం నా స్వంతమైతే
ప్రపంచాన్ని చుట్టివచ్చేవాన్ని,
ఊరు దారులన్నీ కలగలిపి తిరిగేవాన్ని.
గడ్డి పెరగడం, పండుటాకులు రాలడం,
ఆకాశం
ఉదయాలను తుడిచేయడం
సాయంత్రాలు
ఎదకు అంటిన రక్తరేఖలను కడిగేయడం
గమనించేవాన్ని,
తరగని తారల సమావేశాలను తిలకించేవాన్ని,
అపరిచిత అనాధ
చేజారిన రొట్టె ముక్కను
ఆతృతతో అందుకోవడం చూచేవాన్ని,
ఆమె కన్నుల్లోని
కాంతి సడలిన కడకంజ చీకట్లను కాంచేవాన్ని.
నిజంగా నేను చిరంజీవినై పోతే
ప్రపంచ పథాల
మురికి వాడల గుండా, ఇరుకు సందుల గుండా,
క్రిక్కిరిసిన ట్రాముల రద్దీ గుండా,
బస్సులు రేపిన ధూళి దారుల గుండా
ఒంటరిగా సంచరించేవాన్ని.
చిదురుముదురు చిచ్చులనూ,
మెల్లె కళ్ళ మేళాలను దాటుకుంటూ
వచ్చిన నాకు
ఇన్ని తోవలు చూపించిన ఇన్నిన్ని దృశ్యాలలో
ఏ ఒక్క క్షణమైనా మెరవ లేదు
నా జీవితేచ్ఛ అయిన నీ అపురూప రూపం!
7: ఝంఝానిల నిశీథిని :
(Windy Night)
నిన్నటి నిశీథిని బహు దళసరి
నిండిపోయింది క్రిక్కిసిన తారలతో
ఉద్ధృత ఝంఝం
రాత్రంతా నా దోమతెరతో ఆడుకుంది,
దోమతెర కడలి కడుపులా ఉప్పొంగి
తాళ్ళు తెంచుకొని తారలకేసి ఎగిరిపోయింది;
నా మగత నిద్రలో
నీలినింగి లోకి తెలిహంసలా దూసుకెళ్ళి
స్వాతి నక్షత్రపు ధవళదుకూల మయింది!
అంత ఆశ్చర్యకరమైంది గతరాత్రి.
నిదుర లేచాయేమో మరణించిన తారలన్నీ
లేశమైనా లేదు ఆకాశంలో చోటు;
చూచాను నేను
ఆ చుక్కలలో అఖిల లోకాల ఆత్మీయ మృతుల
వివర్ణ ముఖాలను,
ఆ నిశీథినీ అశ్వత్థ వృక్ష శీర్షాల మీద మెరిసే
పేరాసల డేగ కన్నుల మెరిసే నక్షత్రాలను.
ఆ వెన్నల రాత్రిలో
విశాల ఆకాశం మిణుకు మిణుకుమంటున్నది
బాబిలోన్ మహారాణి భుజం మీద వేలాడుతున్న
చిరుతపులి కండువాలా;
అంత అబ్బురమైంది గత రాత్రి.
వేల ఏళ్ళ నాడు మరణించిన
ఆకాశాంతరంగ తారకలు మోసుకొచ్చాయి
కిటికీ గుండా
మరణించిన వేనవేల ఆకాశాలను.
కళ్ళ ముందు నిలిచారు
దిగ్రేఖ మీది పొగమంచులో
బల్లాలు దూసి, భుజం భుజం ఒరుసుకుంటూ
బారులు తీరిన
అస్సీరియా, విదిశా, ఈజిప్ట్ రణభూములలో
నేలకొరిగిన ధీరవనితలు;
అక్కసుతో మరణాన్ని తమ పాదాల కింద తొక్కేసేందుకో,
పరిపూర్ణ జీవన విజయాన్ని ప్రకటించేందుకో,
తమ విహ్వల విషాద విషణ్ణ ప్రేమను ఉత్తేజ పరిచేందుకో.
నా వ్యధిత ఎదను చిద్రుపలు చేసిన
గత రాత్రి బలీయమైన నీలిక్రౌర్యం
నన్ను కమ్మేసింది;
ఆ రాత్రి
విస్తృతానంత వియత్ పక్షాల మీద తేలిపోతున్న
అల్పకీటకంలా
భూగోళం కొట్టుకు పోయింది.
సింహగర్జనకు బెదిరి చెదిరిన జీబ్రాలలా
నా గవాక్షంలోంచి చొచ్చుకొస్తున్నవి
పుడమి గుండెలో ఎగిసిపడే ఉత్తుంగ ఊర్పు కెరటాలు.
నా హృదయం నిండి పోయింది
పసిరిక సిరుల పరిమళాలతో,
దిగంతాలను మంచెత్తిన రవికిరణ ప్రభాసౌరభంతో,
బద్దలైన అశాంత కంపిత బృహత్తిమర పుంజంతో,
దెబ్బతిన్న ఆడపులి అరపులతో,
మచ్చికకు వీలుపడని వినీల జీవనోన్మత్తతతో.
భూమి నుండి చించి విసిరి వేయబడిన నా హృదయం
తాగి తూగుతున్న బెలూనులా ఎగిరిపోయింది
గాలి తరగల నీలి సముద్రంలోకి,
సుదూర నక్షత్రమండలాల లోకి
ఆరబోసిన తారలను పోకిరి గద్దలా చిమ్ముకుంటూ.
8.: రాత్రంతా సాగిన ఇరు తారల సంభాషణ :
( A Star converses with another particular Star all night)
తిరిగొచ్చిన ఆ అసుర సంధ్య
చూపులు నేలకంటిన చీకటిలో
కొనసాగింది రాత్రి రాత్రంతా
రెండు నక్షత్రాల రహఃసంభాషణ;
రాత్రంతా బాగానే గడిచింది, కొత్తగా;
ధూళిలో, ధూమంలో, జనసందోహంలో
నే నెన్నడూ చూడని వాళ్ళంతా వచ్చారు
ఈ మసక వేకువ వేళ!
నా కలలో
తారలు దారిచూపుతున్న రేతిరి ఆకాశం కింద
వినిపించింది కలశంలో పడుతున్న జలధార శబ్దం.
ముంజేతి గాజుల గలగలల స్వనం –
నా కనులిపుడు మేల్కొన్నవి,
ఆకసం రంగురంగుల మబ్బు దుప్పట్లు కప్పుకున్నది.
ఎన్ని సార్లు వెళ్ళానో
ఆ పల్లె పొలాలకు!
ముని కాళ్ళ మీద నక్కి నక్కి ఎన్నిమార్లు పోయానో
ఆ నీడలలోకి సీతాకోక చిలకనై,
ఎన్ని చెడుతోవలు తొక్కి వచ్చానో,
ఎన్నెన్ని వక్ర మార్గాలు చుటిటి వచ్చానో!
ఇప్పుడు
నా మోహ భ్రాంతి విడిపోయింది,
నా మైకం మటుమాయమయింది,
నా రాసకేళీ మందిరం కుప్ప కూలింది.
నిదుర నిండిన నా బరువు కనులు!
పతనమైన పైరు పాట!
ఎంత కాలం దాగుతుంది కలిత రహస్యం?
ఎంతదాకా సాగుతుంది స్ఖలిత స్వప్నం?
ఎవరినీ పోలని ఎర్రగులాబి ఛాయ!
తిరిగొచ్చిన ఆ అసుర సంధ్య!
చూపులు నేలకంటిన ఆ చీకటిలో
కొనసాగింది రాత్రి రాత్రంతా
రెండు నక్షత్రాల రహస్య సంభాషణ.
9. : మహా మలిసంజ వెలుగు :
(The Great Teilight)
తోపుడు బండి నిండా బంగరు ఎండు గడ్డి,
మసకబారుతున్న మలిసంజ వెలుతురు;
జొన్న చేల గోదాములల్లో రెపరెప లాడిస్తున్నవి
రంగురంగుల పిట్టలు,
జోగుతున్న తెలి గోధూళి నీలి నింగిలో లీనమౌతున్నది,
అస్తమిస్తున్న సూర్యుడు అలసందె చేల మీదకు వంగుతున్నాడు.
ఇప్పుడతనికి ఏకాంత నిదుర వాంఛ,
నిండు గర్భిణి వంటి నిగనిగల పంటచేను;
ఆమె కళ్ళలో జ్వలిస్తూ ఆరిపోతూ అగ్ని!
ఏదో ఒకరోజు
రమణీయమైన ఆ బొగ్గు ముక్క వాసన
ఊరటనిచ్చి తీరుతుంది అగ్ని కణానికి.
ఏదీ ఆ రాచరిక ఒప్పందం?
ఎందుకు ఎగిరెగిరి అడ్డగిస్తున్నది
రక్తత్యాగాలతో అలసి పోయిన ఉద్వేగాలను
ఈర్ష్యాళువైన తప్పుడు సాక్ష్యం?
నిర్ఘాంతపోతున్నది నా నిరుత్తర హృదయం;
కాలం ప్రశ్నిస్తున్నది ఓ నాజూకు పరివ్రాజికను
బుద్ధ నిర్వాణం జరిగింది ఎప్పుడని.
(ఈ అనువాద కవితలు 2015 లో ప్రచురితమైన నా ‘అనుస్వరం’ సంపుటి లోనివి).
ఆ కాలపు అసమాన బంగాలీ కవి జీబనానంద దాస్. గురుదేవులు రవీంద్రనాథ్ టాగోర్ తర్వాత చెప్పుకోదగిన గొప్పకవి జీబనానంద దాస్.
*****
వీరు కరీంనగర్ జిల్లా ( తెలంగాణ) లోని ఎలగందుల గ్రామం లో జవ్మించారు. వయస్సు 82 సంవత్సరాలు. పుట్టిన తేదీ, సెప్టెంబర్ 9,1939. ఉస్మానియా యూనివర్సిటీ నుండి సైన్స్ & ఇంజనీరింగ్ లో డిగ్రీలు తీసుకొని, పదిహేనేళ్ళుఇండియాలో పనిచేసి, శాంతినికేతన్ లో ఆరు నెలల పాటు సాంఘిక విద్యలో శిక్షణ పొంది, పాతిక సంవత్సరాలు నైజీరియా, ఘనా, ఓమాన్, సౌదీఅరేబియాల్లో ఉద్యోగాలు చేసి, పలు ప్రపంచ దేశాలు సందర్శించి, హైదరాబాద్ లో స్థిరపడ్డారు. ప్రస్తుత నివాసం యు.యస్ సిటిజన్ గా ఆస్టిన్, డాలస్. వీరు ప్రచురించిన పుస్తకాలు 16 ( 4 స్వీయ కవితా సంపుటాలు – ఓనమాలు, గూటికి చేరిన పాట, ఎదపదనిసలు, విచ్చుకున్న అక్షరం, 8 అనువాద సంపుటాలు – అనుధ్వని, అనుస్వరం, అనుస్వనం, పురివిప్పిన పొరుగు స్వరం, రవీంద్రగీత గీతాంజలి, జాన్ కీట్స్ పుడమి కవిత్వం ఆగదు, ఆక్టేవియా పాజ్ సూర్యశిల, కల్యాణ గోద – తిరుప్పావై, 1 వచనం – అనువాదం అనుభవాలు, ఆంగ్లంలో The great Void, Wings of Musings, Blue Pleasance. వీరి విచ్చుకున్న అక్షరానికి తెలంగాణ సారస్వత పరిషత్తు వారి ఉత్తమ కవితా సంపుటి బహుమతి లభించింది.