వెనుతిరగని వెన్నెల(భాగం-54)
–డా||కె.గీత
(*“కౌముది” లో ధారావాహిక నవలగా 2015 నుంచి 2020 వరకు ప్రచురించబడిన “వెనుతిరగని వెన్నెల” ఇప్పటివరకు చదవని వారి కోసం కౌముది సౌజన్యంతో నెల నెలా ఆడియోతో బాటూ ఇక్కడ ఇస్తున్నాం.)
***
జరిగిన కథ: అమెరికాలో తన తల్లికి స్నేహితురాలు, స్త్రీలకు సహాయం చేసే సంస్థ “సహాయ”ను నడిపే ఉదయినిని కలవడానికి వస్తుంది సమీర. నాలుగు నెలల గర్భవతైన సమీర, తనకు విడాకులు తీసుకోవాలని ఉందని, అందుకు దోహదమైన పరిస్థితుల్ని చెపుతుంది. ఉదయిని “తన్మయి” కథ చెపుతాను, విన్నాక ఆలోచించుకోమని చెప్తుంది సమీరతో. చుట్టాల పెళ్ళిలో కలుసుకున్న తన్మయి, శేఖర్ లకు పెద్దవాళ్ళ అనుమతితో పెళ్ళి జరుగుతుంది. పెళ్ళయిన మరుక్షణం నించే శేఖర్ అసలు స్వరూపం బయట పడుతుంది. మొదటి సంవత్సరంలోనే అబ్బాయి పుడతాడు. శేఖర్ తో ఒక పక్క కష్టాలు పడుతూనే తన్మయి యూనివర్శిటీ లో ఎమ్మే పాసయ్యి, పీ.హెచ్.డీ లో జాయినవుతుంది. శేఖర్ తో ఎన్నో రోజులు పోరాడి, చివరికి తన్మయి విడిపోతుంది. హైదరాబాదుకు దగ్గర్లో తన్మయికి లెక్చరర్ గా ఉద్యోగం వస్తుంది. చిన్ననాటి స్నేహితుడు ప్రభు అనుకోకుండా మళ్ళీ ఎదురయ్యి, పెళ్ళి ప్రపోజల్ తీసుకు వస్తాడు. తన్మయి ఒక ఏడాది గడువు పెట్టి, మధ్యలో కలుసుకోకూడదని నిబంధన పెడుతుంది.
***
ప్రభు ఉత్తరంలో తను చదివిన చివరి వాక్యం వెంటాడుతూ ఉంది.
తన్మయికి మెలకువ వచ్చేసరికి స్టాఫ్ రూములో ఒక పక్కగా ఉన్న బల్లమీద పడుకుని ఉంది. తాయిబా పక్కనే విసురుతూ కనిపించింది. చుట్టూ లెక్చరర్లు గుమి గూడేరు. తన్మయికి మెలకువ రాగానే అంతా ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు. ప్రిన్సిపాల్ గారు “ఏమిది మేడం, మరి నాల్గుదినాలు ఇంటికాడ ఉండుండ్రి” అన్నారు తేలికపడుతూ.
సిద్దార్థ నర్సుని వెంటబెట్టుకుని వచ్చేడు.
“మీరు గిట్ల పడంగనె పాపం సారు దవాఖానకు ఉరికిండు” అంది తాయిబా.
తన్మయి కృతజ్ఞతా పూర్వకంగా చూసింది సిద్దార్థ వైపు.
కాస్సేపట్లోనే పూర్తిగా తేరుకుంది తన్మయి.
కాలేజీ మధ్యలోనే ఇంటికి బయలుదేరింది తన్మయి. తాయిబా తోడు వచ్చింది.
సిద్దార్థ గేటు వరకూ వచ్చి ఆటో ఎక్కిస్తూ…
“నర్సు ఏం ఫర్వాలేదని చెప్పే వరకూ గాభరా పుట్టుకొచ్చింది. అయినా ఏంటి తన్మయీ! ఇప్పుడు కాలేజీకి తొందరేమొచ్చిందని వచ్చేరు. నా మాటవిని మరొక వారం రెస్టు తీసుకోండి అన్నాడు.
దారిలో తాయిబా ఉత్తరం తీసి చేతిలో పెట్టింది. “ఏంది మేడం, గట్ల సదవతానే పడిపోయిన్రు. అంత మంచిగనె ఉన్నదా?” అంది.
తన్మయి నిట్టూర్పు విడుస్తూ తల ఊపింది.
ఇంటికి రాగానే నిస్త్రాణగా మంచంమ్మీద వాలిపోయింది.
ఊరి నుంచి పొలం కౌలు వ్యవహారాలేవో అర్జంటుగా చెయ్యాల్సి ఉన్నాయని తల్లీ తండ్రీ అంతకు ముందురోజే బయలుదేరేరు.
వెళ్ళే ముందు జరిగిన సంఘటన జ్ఞాపకం వచ్చింది తన్మయికి.
భానుమూర్తి కూతురి దగ్గిరికి వచ్చి “ఒకసారి ఆలోచించమ్మా బాబు కోసమైనా నువ్వు, శేఖర్ కలిసి ఉంటే మంచిదేమో” అన్నాడు.
జ్యోతికి ససేమిరా ఇష్టం లేకపోయినా, కూతురు ఎవరినో పెళ్ళి చేసుకోవడం కంటే ఉన్నవాడితో సరిపెట్టుకోవడమే మంచిదన్నట్టు మాట్లాడకుండా ఉండి పోయింది.
ప్రభు వచ్చిన రోజు జరిగిన సంఘటన నుంచి తన్మయి అప్పటికీ కోలుకోలేదు.
తన పై ఎప్పుడూ చెయ్యి చేసుకోని తండ్రి తన పీకపట్టుకున్నాడు. అంత తప్పు తనేం చేసింది?
అదే అడిగింది.
నిజానికి ఆ రోజు నుంచీ తండ్రితో ముభావంగానే ఉంటూ వచ్చింది. ఇక ఉండబట్ట లేక అడిగింది.
“నువ్వు నీ సంతోషమే చూసుకుంటున్నావు కానీ, పిల్లాడి గురించి ఆలోచించేవా?” అన్నాడు తండ్రి గద్దింపుగా.
“ఇప్పుడు వాడికేమయ్యింది?” అంది రోషంగా.
“ఆ వచ్చేవాడు నీకు భర్త కాగలడేమో. కానీ పిల్లాడికి తండ్రి కాగలడా?” అని రెట్టించేడు భానుమూర్తి.
ప్రభు బాబుకి తండ్రి కాగలడో, లేడో తనకూ తెలీదు. కానీ వాడు శేఖర్ లాంటి దుష్టుడి నీడలో పెరగడం కంటే మంచిదే.
మంచి భర్త కాలేని శేఖర్ మంచి తండ్రి మాత్రం ఎలా అవుతాడు?
అదే చెప్పింది.
“నీ వితండ వాదాలకు నా దగ్గిర సమాధానం లేదు. మేం నీ మంచి కోరి చెపుతున్నాం. వినేది, లేనిదీ నీ ఇష్టం” అన్నాడు.
“నీ ఇష్టం” అన్న చివరి మాట “నీ ఖర్మ” అన్నంత విసురుగా వినబడింది తన్మయి కి.
ఇప్పుడీ ఉత్తరం.
నిజానికి ఉత్తరం పూర్తిగా చదవలేదు.
“ఇరువైపులా తల్లిదండ్రులు ఒప్పుకోవడం లేదు కాబట్టి ఒక నిర్ణయానికి వచ్చే నన్నాడు” అదేవిటో ఊహించుకోవడానికే భయం వేసి కళ్ళు తిరిగిపోయేయి తనకు.
ప్రభు తనను ఇలా నిస్సహాయంగా వదిలేసేటంత బలహీనమైనదా అతని ప్రేమ? ఎందుకో మనస్సు అంగీకరించడం లేదు. అతని ప్రేమ గట్టిదని తనకు అనిపిస్తూ ఉండేది, కాదు కాదు అదే నిజం కూడా!
మరెందుకిలా జరుగుతోంది? తనకే ఎందుకు జరుగుతోంది?
తప్పు తనదేనా? ముందంతా అతను వెంటపడినప్పుడు తనే ఏడాది గడువు పెట్టింది. ఇప్పుడు అతను తన జీవితం తను చూసుకుంటున్నందుకు తట్టుకోలేక పోతూంది.
కళ్ళు తుడుచుకుని ఉత్తరం మరొకసారి చదవడం మొదలు పెట్టింది. అతని ప్రతీ ఉత్తరంలోని ప్రేమ పూరిత అక్షరాల్ని హత్తుకుని ముద్దులు కురిపిస్తూ చదివేది.
ఇప్పుడు ఆపుకుందామన్నా దు:ఖం ఆగడంలేదు.
మొదటి పేజీలోని చివరి పేరాకి వచేసరికి మళ్ళీ నీరసం ముంచుకొచ్చింది.
“మా వాళ్ళు నా కోసం చెప్పాపెట్టకుండా సంబంధం మాట్లాడి, రేపు నిశ్చితార్థం అని ఫోను చేసేరు. ఇక మన సంగతి స్వయంగా వచ్చి చెప్పడం కంటే వేరే మార్గం కనబడ లేదు. తీరా వచ్చేనే కానీ ధైర్యం చాలడం లేదు. ఒక పక్క మీ వాళ్ళకూ ఇష్టం లేదని అర్ధమయ్యి పోయింది. ఇక వీళ్ళకు చెప్పినా ససేమిరా ఒప్పుకోరు. అందుకే ఇక ఒక నిర్ణయానికి వచ్చేను……..”
ప్రభూ! నిన్ను ప్రేమించే వ్యక్తిగా ఎప్పుడూ నేను నీ మంచిని, నీ సంతోషాన్ని కోరు కుంటాను, కానీ ఇది నీకు సంతోషమెలా అవుతూందో అర్థం కావడం లేదు. ప్రశాంతంగా ఉన్న నా జీవితంలోకి చొరబడి, నన్ను నీ ప్రేమతో వివశురాల్ని చేసి ఇలా తప్పుకోవడం నీకు న్యాయమెనా?” ధారాపాతమైన కన్నీటిని తుడుచుకుంటూ రెండవ పేజీ తిప్పింది.
“తనూ! నేను ఇప్పుడూ తీసుకొనబోయే నిర్ణయం వల్ల ఏమవుతుందనే ఆలోచన ఇక మానెయ్యదలుచుకున్నాను. ఏమైనా కానియ్యి. నేను ఉన్నపళంగా ఇక్కడి నుంచి ఎవరికీ చెప్పకుండా వచ్చెయ్యాలను కుంటున్నాను. మీ అమ్మానాన్న గార్లు వెళ్ళంగానే చెప్పు. నిన్ను చూడడానికి రెక్కలు కట్టుకుని వాలాలని ఉంది. నిజానికి నాకు నిన్ను వెంటనే చూడాలనుంది. ఎవరికోసమూ నేను నిన్ను వదులుకోలేను, దూరం చేసుకోలేను, ముఖ్యంగా నిన్ను అక్కడ వంటరిగా వదిలి నేను ఎక్కడా సంతోషంగా బతకలేను. చిన్న తనం నించి నిన్ను ప్రేమించినా సరైన సమయానికి నిన్ను దక్కించుకోలేకపోయాను. ఇక ఇప్పుడూ నీతో జీవితం పంచుకునే అవకాశాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోలేను. మన చుట్టూ ఉన్న ప్రపంచం, కుటుంబాలూ ఒప్పుకున్నా, ఒప్పుకోక పోయినా నేను నిన్ను వొదులుకోలేను. అయినా నీకు తెలీదూ? నా మనస్సు నీకు ఎప్పుడో సమర్పించానని? నువ్వే నేను, నేనే నువ్వని. హమ్మయ్య, నీకు ఇది రాసేక గానీ నా మనసు కుదుటపడడం లేదు. ఇవన్నీ సరేగానీ, నువ్వు త్వరగా కోలుకోవాలి. సమయానికి భోజనం చెయ్యడం మర్చిపోకు” ఆనందబాష్పాలతో గబగబా ముద్దులు కురిపించింది.
తనకి తెలుసు, తన ప్రభు తనకి అన్యాయం చెయ్యడని. అయినా తెలివి తక్కువది! ఉత్తరం సగంలోనే గాభరా పడిపోయింది.
ప్రభు ప్రేమని శంకిస్తే తనని తను శంకించుకున్నట్టే. అయినా తన కోసం కొట్టుకునే గుండె చప్పుళ్ళల్లో అతని నిజాయితీ ఎప్పటికప్పుడు తేటతెల్లమవుతూనే ఉందిగా. తనే పిచ్చిది.
ఒంట్లో నీరసంగా ఉన్నా కాళ్ళల్లోకి ఎక్కడ లేని హుషారు వచ్చినట్టయ్యి ప్రభుకి ఫోను చెయ్యడానికి రోడ్డు మీది ఎస్టీడీ బూత్ కి వచ్చింది.
“అరే మేడం, ఏడికి బోతున్నవు? అగో, నే తోలుకుపోత ఉండు” అంటూ తాయిబా వెంట వచ్చింది.
*****
(ఇంకా ఉంది)