సర్వసంభవామ్ – 2

-సుశీల నాగరాజ

చాలా కుతూహలం !
          FB లోనే అనుకుంటాను ఈ పుస్తకంలోని రెండు ఆర్టికల్స్ గురించి చదివినట్లు గుర్తు. వాటి గురించి ఆ రోజే నేనూ నా స్నేహితురాలు మాట్లాడుకున్నాము .

          స్నేహితురాలు మళ్ళీ పుస్తకం గుర్తుచేసి చదవండి అని చెప్పింది. 

          పుస్తకం చాలా మంది చేతులు మారినందుకు , బైండు చేయించారు. చివర్లు లాగి లాగి చదవాల్సి వచ్చింది. చిన్న అక్షరాలు వేరే. మనసు పరిగెత్తినా అక్షరాలు  పరిగెత్త లేకపోయాయి.

          స్వాతి పత్రికలొ  శీర్షికగా వచ్చిన 21 సంవత్సరాల తరువాత ప్రసాద్ గారు తన స్వానుభవాలను పుస్తక రూపంలొ తీసుకు వచ్చారు. ఇంత ఆలశ్యం ఎందుకని ప్రశ్నించే వారికి ఒకటే జవాబు’ నాహం కర్తా, హరిః కర్తా.’

          ప్రసాద్ గారు టి టి డీ కి ఛీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసరుగా నియమించబడ్డ సందర్భం నుంచి అంటే 1978 నుంచి 1982 వరకూ వారి జీవితంలో జరిగిన అద్భుత స్వానుభవా లను ఎలాంటి భేషజాలూ లేకుండ రాశారు.

          ప్రసాద్ గారి గురించి, వారి జీవనసరళి గురించి, తెలుసుకోవాలంటె చివరి వరకు వేచి ఉండాల్సిందె. ! అలాంటి వ్యక్తిలో ఇంత మార్పు, ఇన్ని మార్పులు, ఇంత ఆధ్యాత్మికత, ఇంత దైవభక్తి, చివరికి ‘నాహం కర్తా హరిః కర్తా’ అన్నారంటె చివరి వరకు చదవాల్సిందే!

          మనంకూడా మనకు తెలియకుండానే ఒక్కొక్క మెట్టూ ఎక్కుతూ, ఏడుకొండలూ ఎక్కి, భగవంతుని సన్నిధిని చేరుతాము.

          శేషాచలపర్వత సానువులు, ఆ గాలి, అందులో నుంచి వీచె ధూపదీప, నైవేద్యాల పరిమళాలు మనల్ని ఆవహిస్తాయి. దైవీక భావం మన మనసులో నిండిపోతుంది.. తెలియకనే ఒక దివ్యానుభూతి, ఒక తాదాత్మ్యతకు లోనయ్యాను.

          ప్రసాద్ గారితొ పాటూ ప్రతీ అడుగులో అడుగువేస్తాము, ఉద్రేకాలకు లోనవుతాము, ఈ గండం ఎలా గడుస్తుంది భగవంతుడా అన్న ఉద్వేగానికి లోనవుతాము. చివరికి  కొండంత కష్టాన్ని భగవంతుడి పాదాల ముందు అర్పించి నిద్రపోతాం. ఆ కష్టాలు సమస్యలు మానవరూపాల్లో వచ్చి పరిహరిస్తాయి!!!

          ప్రతి ఒక్క చాప్టర్ చదువుతుంటె  ‘తక్షణం ఏడుకొండల వేంకటేశ్వరుని దివ్య మంగళ రూపాన్ని దర్శించాలనిపించేది!’       

          ప్రవరాఖ్యుడు పసరు పూసుకుని హిమాలయ పర్వాతాలకు కళ్ళుమూసి తెరిచేలోపు వెళ్ళాడని ! అలాంటిది ఏదైనా ఒక  పసరు ఉండకూడదా ! అనిపించింది.

          ఈ పుస్తకం చదువుతోన్న క్రమంలో నాకు అమృతలతగారి ‘ఏకాంత…. బృందగానం’ గుర్తొచ్చింది.

          నాస్తికత్వం నుంచి ఆస్తికత్వం వైపు మరలిన క్రమంలో తనకు జరిగిన ఎన్నెన్నో అనుభవాలను క్రోడీకరిస్తూ ఆమె వెలువరించిన ‘ ప్రియమోయి నీ చెలిమి ‘ లో ‘భగవంతుడు- భక్తురాలి ‘ మధ్య జరిగిన సంభాషణలు నాకు గుర్తు రావడం , అవి చదువుతున్న సమయంలో నాలో కలిగిన గగుర్పాటు, ఆమె కట్టించిన అపురూప వేంకటేశ్వర స్వామిని తక్షణం దర్శించుకోవాలన్న ఆరాటం అన్నీ గుర్తొచ్చాయి.

          ఆ అనుభవాలన్నీ ఆమె నోట విన్నా , ఎందుకో మళ్ళీ మళ్ళీ వినాలనిపించి , ఎన్నో సార్లు అడిగేదానిని.

          ప్రసాద్ గారు చేపట్టిన పనులకు ఎదురైన సమస్యలు, భక్తుల సౌకర్యార్థం కొత్త పనులకు పూనుకున్నపుడు వచ్చిన తొందరలు, స్థానికుల నుంచి ప్రతిఘటనలు చదువు తుంటె ఎంతో బాధ కలిగేది.

          ఇలా ‘సర్వసంభవామ్’ పుస్తక పఠనం ఎన్నో అనుభూతులతోసాగింది.

*****

(సశేషం)

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.