పేషంట్ చెప్పే కథలు – 23
మెరవని తారకలు
–ఆలూరి విజయలక్ష్మి
ప్రకృతి చెక్కిలి మీద చీకటి చారిక పడింది. రుక్మిణి గుండెల్లో దుఃఖకడలి పొంగింది. ఒడిలో పాపాయి విలక్షణమైన ఏడుపు, విచిత్రమైన భంగిమ, కాంతిలేని కళ్ళు, వయసుతోపాటు ఎదగని శరీరం, మెదడు… తన బ్రతుకులో పెద్ద అపశృతి వికృతంగా వినిపించి కంపించింది రుక్మిణి హృదయం. తన రక్తాన్ని పంచుకుని పుట్టిన బిడ్డను చూస్తున్న కొద్దీ తెలిసి తెలిసి తాను చేసిన పొరపాటు కళ్ళముందు కదిలింది. అందర్నీ ఎదిరించి పోరాడి చివరి వరకు నిలబడి నెగ్గించుకోలేకపోయిన తన అసమర్థతకు, పిరికి తనానికి తనను తానూ అసహ్యించుకుంది. కాలం కాటుకు తనను తానూ అర్పించుకున్న నిస్సహాయస్థితి గుర్తుకొచ్చింది.
భవిష్యత్తు గురించి సుందర స్వప్నాల్ని కంటూ జీవితంలోని ఎత్తుపల్లాలేమిటో తెలియకుండా హాయిగా చదువుకుంటున్న రుక్మిణి హఠాత్తుగా తన ముందు నిలిచిన సమస్యను చూచి కంగారుపడి పోయింది. బి.ఎస్.సి., కూడా దాటకుండానే చదువు నాపవలసిన పరిస్థితి వచ్చింది. ఆర్ధిక పరిస్థితి తారుమారవడంతో వెంటనే రుక్మిణి పెళ్ళి చేసేసి తమ బాధ్యతను వదిలించుకోవడానికి ఆత్రుత పడసాగారామె తల్లిదండ్రులు.
“అది కాదమ్మా! అసలా చంద్రానికీ నాకూ పెళ్ళి అనే మాటను ఎవరమూ ఎప్పుడూ అనుకోలేదూ కదా! చంద్రాన్ని పొరపాటున ‘బావా!’ అని పిలిస్తేనే చితకతన్నే దానివి చిన్నప్పుడు?” తల్లి కళ్ళల్లోని ఎరుపును గమనించి ఆగిపోయింది రుక్మిణి. చదువు ఆగి పోయిందన్న దుఃఖానికి తోడు చంద్రంతో తన పెళ్ళి అని తల్లి చెప్పినప్పుడీ క్రొత్త విపత్తు నేలా ఎదుర్కోవాలో తెలియక తబ్బిబ్బు పడిపోయింది రుక్మిణి.
“అప్పటి దారి వేరు” తుంచేసినట్లుగా అంది వేదవతి.
నిజమే అప్పటి దారివేరు. అప్పుడో పేదరైతు భార్య అత్త. డబ్బుగల దాన్నని అహంకారంతో ఆమె నెంతగానో అవమానించేది అమ్మ. ఆడపడుచు చూపించవలసిన కనీస ఆదరణ, ఆప్యాయత అత్తపట్ల చూపలేదు. విధి వక్రించి తమది క్రింద చెయ్యి అయ్యేసరికి యిప్పుడెక్కడాలేని ప్రేమని నటించి ఆ అమాయకురాలిని ఒప్పించి, కానీ కట్నం లేకుండా మంచి ఉద్యోగస్తుడిని అల్లుడిగా కొట్టేయాలని ప్లాన్ వేసిందన్నమాట!…’ తల్లి స్వభావాన్ని బాధగా గుర్తిస్తూంది రుక్మిణి.
“చంద్రాన్ని చేసుకోవడం ఇష్టం లేదమ్మా నాకు.” తల్లికి కోపం వస్తుందని భయ పడుతూనే తన మనసులోని మాటను స్పష్టంగా చెప్పింది రుక్మిణి.
“ఏం? ఎందుకే నీకిష్టం లేంది? ఏం తక్కువయిందతనికి?” చర్రున లేచింది వేదవతి. తల్లి ఆక్రోశం చూస్తూంటే తిక్కగా, జాలిగా, దుఃఖంగా వుంది రుక్మిణికి. అమ్మ ఆలోచనల స్థాయి వేరు. తన ఆలోచనల స్థాయి వేరు. తాను చెప్పే కారణం చాలా హాస్యా స్పదంగా కనిపిస్తుందామెకు. అయినా తప్పదు, అసలు విషయం చెప్పి, నచ్చచెప్పి, అమ్మను ఒప్పించాలి.
“నువ్వు కోపం తెచ్చుకోకుండా నేను చెప్పేది వినమ్మా! చంద్రాన్ని చేసుకుంటే మాకు పుట్టబోయే పిల్లలు చంద్రం తమ్ముడిలా అవకరంగా, తెలివి తేటలు లేకుండా వుంటారేమోనని నా భయం. అత్త మేనరికం చేసుకోబట్టే కదా అలాంటి బిడ్డ పుట్టింది?”
“సింగినాదం కాదూ?” ఏం-మేనరికాలు చేసుకున్న వాళ్ళకే ఇలాంటి పిల్లలు పుడుతున్నారా? బయటి సంబందాలు చేసుకున్న వాళ్ళకెవరికీ ఇలాంటి పిల్లలు పుట్టడం లేదా? తిని కూర్చున్న వాళ్ళు తిన్నదరక్క చేసే ప్రచారాలివన్నీ” కొట్టి పారేసింది వేదవతి.
“అది కాదమ్మా! మేనరికాలు మంచివికావని సైన్స్ నిరూపించింది. బయటి సంబం ధాలు చేసుకున్నా అలాంటి పిల్లలు పుట్టొచ్చు. అది వేరే సంగతి. కానీ మేనరికాలు చేసు కున్న వాళ్ళకిలాంటి పిల్లలు పుట్టే ప్రమాదం మిగతావాళ్ళకంటే ఎక్కువ. అత్తకి అల్లాంటి కొడుకున్నాక చంద్రం పిల్లలలా వుండే ఛాన్సు మరీ ఎక్కువ” ఓపిగ్గా వివరించసాగింది రుక్మిణి.
“మాయదారి సైన్సు కబుర్లు నాకు చెప్పాకే! ఇప్పుడు మేనరికాలు చేసుకునే వాళ్లం దరికీ నీ మాత్రం జ్ఞానం లేదంటావా? ఎంతెంత చదువుకున్న వాళ్ళూ సుబ్బరంగా మేనరి కాల్ని చేసుకుంటున్నారు. ఏ కట్నం సరిపోకు, ఎదుటివారు నచ్చకో సైన్సునడ్డు పెట్టు కుని తప్పించుకుంటున్నారు తప్పితే సైన్సు మీద నమ్మకంతో మేనరికాల్ని మానేసి నాళ్ళను నేనింతవరకూ చూళ్ళేదు. పిచ్చివాగుడు వాగుతూ బంగారమన్తి సంబంధాన్ని కాలదన్నుకోకు!” అడ్డంగా వాదిస్తున్న తల్లికేలా నచ్చచెప్పాలో తోచక తండ్రి నాశ్రయిం చింది. తల్లి నోటికి జడిసి తండ్రి తన ఆసక్తతను బయటపెట్టాక చంద్రంతో తన మనసు విప్పి చెప్పింది.
ఎలా జరగాల్సి ఉంటే అలా జరుగుతుంది రుక్కూ! జరగబోయే దాన్ని మనం ఆప గలమా చెప్పు? నువ్వు చెప్పేదాన్లో నాకేమాత్రం నమ్మకం లేదు” రుక్మిణి అభ్యర్ధనను ఒక్క మాటలో కొట్టిపారేశాడు చంద్రం. చిన్నప్పటి నుంచి తమపట్ల తిరస్కారం చూపుతున్న అత్త తమ కాళ్ళు పట్టుకుని దేవురించే స్థితికి వచ్చినందుకు సంతోషం, రుక్మిణిలాంటి అమ్మాయిని వదులుకోలేని స్వార్థం చంద్రాన్ని సావకాశంగా, సంస్కారవంతంగా ఆలోచిం చనివ్వలేదు. ఉక్రోషంతో, ఆవేశంతో అందరితో వాదించి వాదించి అలిసిపోయిన రుక్మిణి ని తిట్టి, బెదిరించి బలవంతాన చంద్రానికి కట్టబెట్టిగాని శాంతించలేదు ఇంట్లోవాళ్ళు…
పాపాయి కీచుమని ఏడవడంతో గతాన్నుండి బయటపడింది రుక్మిణి. పాప భవిష్య త్తెలా ఉంటుందో డాక్టరుగారు చెప్పారు. నిస్సారంగా, నిరుపయోగంగా, మహాభారంగా బ్రతికి అకాలంలో రాలిపోబోయే ఈ పసికందులో పొంగే చైతన్యాన్ని, నిండు ఆయుష్షును నింపగల సామర్థ్యం ఎవరికుంది? ఆ నాడు తన నమ్మకాల మీద దెబ్బకొడుతూ సైన్సు నవహేళన చేసిన ఏ ఒక్కరికైనా తన కన్నీటిని తుడవ గల శక్తి ఉందా!! యెంత పెద్ద హోదా, యెంత గొప్ప సంపద తన బ్రతుకులో ఈ లోటు పూడ్చగలవు?! ఎన్ని కర్మ సిద్ధాంతాలు, యెంత వేదాంతం తన గుండెల్లోని ఈ మంటలనార్పగలవు?!
రుక్మిణి కళ్ళు వర్షిస్తున్నాయి.
*****
డా.ఆలూరి విజయలక్ష్మి ప్రముఖ రచయిత్రి, వైద్యులు, సంఘసేవకులు. దాదాపు 150 కథలు, 5 కథా సంపుటాలు, 4 నవలలు, 3 వైద్య సంబంధ గ్రంథాలు రచించారు. అనువాదాలు కూడా చేసారు. వీరి రచనలు వివిధ వార, పక్ష, మాస, దినపత్రికలలో ప్రచురితమయ్యాయి. కొన్ని కథలు ఆకాశవాణి విశాఖ పట్టణం, విజయవాడ కేంద్రాల నుండి ప్రసారమయ్యాయి. వనిత మాసపత్రికలో ‘ఆరోగ్య విజయాలు’ అనే శీర్షికను నిర్వహించారు.