విజ్ఞానశాస్త్రంలో వనితలు-14

జాత్యహంకారాన్ని అధిగమించి దూసుకెళ్ళిన రాకెట్టు-కేథెరిన్ జాన్సన్

(1918-2020)

– బ్రిస్బేన్ శారద

 

          “ఫిగర్” అనే మాటకు ఆడపిల్ల అనే చవకబారు అర్థం ప్రారంభమై కొన్నేళ్ళయినా, నిజానికి “ఫిగర్” అనే మాటకి అంకె లేదా సంఖ్య అనే అర్థాలు కూడా వున్నాయి.

          2017లో విడుదలైన “హిడెన్ ఫిగర్స్” (Hidden Figures) అనే సినిమా చూసినప్పుడు నాకందుకే భలే సంతోషంగా అనిపించింది. “ఫిగర్స్” అనే మాటను ఈ కథలోని ముగ్గురు స్త్రీ శాస్త్రవేత్తలను ఉద్దేశించి వాడారు. గణిత శాస్త్రంలోనూ, ఇంజినీరింగులోనూ, రాకెట్ సైన్సులోనూ అద్భుతమైన ప్రతిభ కనపర్చిన స్త్రీలని “ఫిగర్స్” అనడంలో ఎంత “పోయెటిక్ జస్టిస్” వుంది కదా?

          2017లో విడుదలైన ఈ సినిమాకి మూలం అదే పేరుతో వొచ్చిన నవల. ఈ నవల వ్రాసినది మార్గట్ లీ షటర్లీ అనే అమెరికన్ రచయిత్రి. ఈ పుస్తకం గురించీ, ఈ సినిమా గురించీ చెప్పుకోవడానికీ, చర్చించడానికీ చాలానే వుంది. ఒక్క ముక్కలో చెప్పాలంటే సైన్సు చదవాలనుకునే విద్యార్థులంతా తప్పక చదివి తీరాల్సిన పుస్తకం, “హిడెన్ ఫిగర్స్”.

          ప్రధానంగా ఈ నవల ముగ్గురు మహిళా శాస్త్రవేత్తలూ, వారి స్నేహమూ, వారి ప్రయాణమూ గురించి. కేథరిన్ జాన్‌సన్, డోరొతీ వాహన్, మేరీ జాక్‌సన్ అనే ముగ్గురు ఆఫ్రికన్-అమెరికన్ మహిళలు నాసా సంస్థలో సాగించిన పరిశోధనలూ, చూపించిన ప్రతిభా- ఇవే ఈ నవలలో చెప్పిన విషయాలు. వీళ్ళు ముగ్గురూ వాళ్ళ వృత్తిలో జాతి వివక్షనూ, లింగ వివక్షనూ ఎదుర్కొన్నారు. ఎదుర్కొవడమే కాకుండా, ఎంతో ఎత్తుకు ఎదిగి నిలిచారు.

          1910 లో పుట్టిన డోరొతీ ఈ ముగ్గురిలోనూ పెద్దది. కేథరిన్ 1918లోనూ, మేరీ 1921లోనూ జన్మించారు. ముగ్గురూ అద్భుతమైన ప్రతిభా పాటవలుకలవారే. అయితే ఈ వ్యాసంలో కేథరిన్ గురించి మాత్రమే ప్రస్తావిస్తాను.

          అమెరికాలోని వెస్ట్ వర్జీనియా రాష్ట్రంలో వైట్ సల్ఫర్ వింగ్స్ అనే వూళ్ళో 1918 ఆగస్టు 26 న  కోల్‌మన్దంపతులకు నాలుగో సంతానంగా జన్మించారు. ఆమె తండ్రి జోషువాకోల్‌మన్, తల్లి రాబర్టా కోల్‌మన్. చిన్న వయసులోనే కేథరిన్ మేధా సంపత్తి అందరినీ అబ్బురపరిచింది. పదేళ్ళ వయసులోనే హైస్కూల్లో చేరి, ఆ పైన 1937లో, అంటే పద్దెనిమిదేళ్ళకే గణితమూ, ఫ్రెంచి భాషల్లో వెస్ట్ వర్జీనియా స్టేట్ యూనివర్సిటీ నుంచి పట్టభద్రురాలయ్యారు కేథరిన్.

          వర్జీనియా రాష్ట్రంలో ఆఫ్రికన్-అమెరికన్ విద్యార్థుల కోసం నడిపే స్కూల్లో టీచరుగా వృత్తి మొదలుపెట్టారు. 1939లో వెస్ట్ వర్జీనియా యూనివర్సిటీ ఆఫ్రికన్-అమెరికన్ విద్యార్థుల కోసం ఒక కొత్త గ్రేడ్యుయేట్ కోర్సును ప్రవేశ పెట్టారు. ఆ కోర్సుకు కేథరిన్‌తో పాటు మరో ఇద్దరు ఆఫ్రికన్-అమెరికన్ యువకులు కూడా ఎన్నికయ్యారు. అయితే, ఎందుకనో కేథరిన్ ఈ కోర్సు ముగించకుండానే తిరిగి వెళ్ళిపోయి తన ఉపాధ్యాయ వృత్తి లోనే కొనసాగారు.

          1952లో ఒక బంధువు ఆమెతో నేషనల్ అడ్వైసరీ కమిటీ ఫర్ ఏరోనోటిక్స్ (NACA) సంస్థలో జరగనున్న నియామకాల గురించి చెప్పారు.

          (నేషనల్ అడ్వైసరీ కమిటీ ఫర్ ఏరోనోటిక్స్ (NACA)  సంస్థ 1915లో అమెరికాలో ఖగోళ శాస్త్రం గురించీ, వైమానిక సాంకేతికల గురించీ పరిశోధనల కోసం స్థాపించబడిన సంస్థ. 1958లో ఇదే సంస్థ నేషనల్ ఏరోనోటిక్స్ ఎండ్ స్పేస్ (NASA)గా రూపాంతరం చెందింది.)

          1952లో NACA తమ లేంజ్‌లీ పరిశోధనాలయం కోసం ఆఫ్రికన్-అమెరికన్ గణిత శాస్త్రవేత్తలను నియమించాలన్న ప్రయత్నం మొదలు పెట్టింది. ఆ నియామకంలో ఉద్యోగం కొరకు ప్రయత్నించాలని కేథరిన్ కుటుంబంతో సహా న్యూపోర్ట్ న్యూస్ అనే వూరికి మారారు. 1953లో కేథరిన్ లేంజ్‌లీ పరిశోధనాలయంలో పని మొదలు పెట్టారు. అక్కడ ఆమె డోరొతీ వాహన్ నాయకత్వంలోని టీంలో పని చేసారు.

          ఆ సంస్థలో పని చేస్తూండగానే 1956లో కేథరిన్ భర్త జేమ్స్ గోబుల్ కేన్సర్‌తో మరణించారు. మూడేళ్ళ పిదప 1959లో కేథరిన్ జేమ్స్ జాన్సన్ అనే అమెరికన్ సైన్యాధికారినిపెళ్ళాడారు. 1957 నుంచి కేథరిన్ స్పేస్ టెక్నాలజీకి కావల్సిన గణితాన్ని రూపొందించారు.

          1986 వరకూ కేథరిన్ NASA కొరకు ఎనలేని సేవ చేసారు. ఎన్నెన్నో స్పేస్ మిషన్స్ కొరకు NASA సంస్థ కేథరిన్ లెక్కల పైన ఆధార పడింది. ముఫ్ఫై మూడేళ్ళ ప్రయాణంలో కేథరిన్ “హ్యూమన్ కంప్యూటర్” గా ప్రసిద్ధి చెందారు. అపోలో, ప్రాజెక్ట్ మెర్క్యూరీ, స్పేస్ షటిల్ ప్రోగ్రాం, మిషన్ టు మార్స్, కేథరిన్ ప్రజ్ఞనీ, గణిత మేధాసంపత్తినీ వినియోగించని ప్రోగ్రాం లేదంటే అతిశయోక్తి కాదు. ఇరవై ఆరు రీసెర్చి రిపోర్టులు తయారు చేసారు. “ప్రతి రోజూ పనికి వెళ్ళడాన్ని ప్రేమించాను,” అని చెప్పారావిడ ఒక ఇంటర్వ్యూలో.

          పని చేసే చోట ఎన్నో రకాల వివక్షలు ఎదుర్కొన్నారు కేథరిన్. అయితే, ముందున్న పని కలిగించే ఉత్సాహం ముందు అవన్నీ తాను పెద్దగా పట్టించుకోలేదని చెప్పారు కేథరిన్.

          2015లో తొంభై యేడోయేట అమెరికా అధ్యక్షుడు బరక్ఒబామా చేతుల మీదుగా అమెరికాలోని అత్యున్నత పురస్కారం, “ప్రెసిడెన్షియల్ మెడల్ ఆఫ్ ఫ్రీడం” అందు కున్నారు.

          2019 మార్చిలో కేథరిన్ భర్తజాన్సన్ తన తొంభై మూడో యేట మరణించారు. మనవలూ, మనవరాళ్ళూ, ముని మనవలూ, మునిమనవరాళ్ళతో నిండు నూరేళ్ళ జీవితం గడిపిన పిమ్మట కేథరిన్ జాన్సన్ తన నూట ఒకటో యేట 2020లో మరణించారు.

          నాసాలోని రెండు పరిశోధనాలయాలకు కేథరిన్ పేరిచ్చి గౌరవించారు. 2016లో బీబీసీ ఆమెను “ప్రపంచంలోని అత్యంత ప్రభావశాలులైన నూర్గురు మహిళల్లో ఒకరు” గా పేర్కొంది. ఆమెకి నాసా ఇచ్చిన పురస్కారాల చిట్టా చాలా పెద్దది!

          ఎంతో స్ఫూర్తివంతమైన జీవితాన్ని గడిపిన కేథరిన్ జాన్సన్ గురించీ, ఆమె సహచరుల గురించీ వివరించే పుస్తకం “హిడెన్ ఫిగర్స్”, సైన్సు చదవదల్చుకున్న విద్యార్థినీ విద్యార్థులందరూ తప్పక చదవాల్సిన పుస్తకం.

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.