తెలుగు చర్చావేదికలు, బ్లాగులు & సైట్లు
-డా||కె.గీత
ముందు ప్రకరణాల్లోచెప్పుకున్నట్టు యూనికోడ్ లో తెలుగుని రాయగలగడం వల్ల టెక్నాలజీ పరంగా భాషను రాయడం, రాసిన దాన్ని కంప్యూటర్లలో అన్ని చోట్లా తిరిగి అదేవిధంగా తిరిగి చూడడంలో ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోయేయి. ఇక “లేఖిని” వంటి సాధనాలతో ఆన్ లైన్ లో తెలుగు సులభంగా రాయడం వంటివి సాధ్యమయ్యేయి.
ఇందువల్ల అంతకు ముందు వరకూ యాహూ గ్రూపు, గూగుల్ గ్రూపు వంటి చర్చావేదికల్లో RTS పద్ధతిలో తెలుగుని ఇంగ్లీషులో టైపు చేసే స్థానంలో తెలుగులో టైపు చేసే అవకాశం వచ్చింది.
ఈ RTS అంటే ఏవిటో Bhimalapuram.co.in లో చెప్పిన విధంగా ఇక్కడ చూడండి.
చర్చావేదికల విషయానికి వస్తే ప్రపంచ వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో విస్తరించి ఉన్న తెలుగు వారికి సమాచార ప్రసారంతో దూరాన్ని తగ్గించడానికి, అనేక విషయాల్ని పంచుకోవడానికి, చర్చించుకోవడానికి తొలివేదికలయ్యేయి. సభ్యత్వ నియమావళులను రూపొందించి ఔత్సాహికులు గ్రూపులకు నిర్వాహకత్వం వహించడమూ పరిపాటిగా ఉండేది.
ఇంటర్నెట్‌పై మాతృభాషలోనే సంభాషించుకోవాలనే ఆలోచన తెలుగువారికి పుట్టి రెండు దశాబ్దాలు దాటింది. అమెరికాలోని తెలుగు వాళ్లు వివిధ విషయాలపై చర్చించుకునేందుకు స్కిట్ (SKIT) అనే ఈ-మెయిల్ లిస్ట్ ను (లిస్ట్ సర్వ్) వాడటం 1990ల తొలినాళ్లలోనే మొదలైంది. ఇందులో సభ్యులందరు ఈ మెయిల్ ద్వారా సంభాషించుకునేవారు. వారి చర్చల్లో తరచూ తెలుగులో రాయగలిగే పరిజ్ఞానం ఏదైనా వుంటే బాగుండు అనే అభిప్రాయం వ్యక్తం అవుతూ ఉండేది. ఒకానొక దశలో అనేక వేలమంది తెలుగు వారు ఈ స్కిట్ లిస్ట్ సర్వ్ లో సభ్యులుగా ఉండేవారు.
1995లో ఈ-గ్రూప్స్ అనే కొత్తరకం ఇంటర్నెట్ సమూహాలు ఏర్పడటం మొదలైంది. అప్పుడే ‘తెలుసా’ అనే తెలుగు వారి ఈ-గ్రూప్ ఏర్పాటైంది. స్కిట్ క్రియాశీలక సభ్యుల్లో అనేకులు ‘తెలుసా’ లో చేరిపోవడంతో క్రమంగా స్కిట్ కనుమరుగైంది. (కొణతం దిలీప్)
దీనితోబాటుగా కంప్యూటరు, ఇంటర్నెట్ కనెక్షను ఉన్న వారికి పైసా ఖర్చు లేకుండా ఉచితంగా ప్రతిఒక్కరికీ తమ కంటూ ఆన్లైనులో ఒక ప్లాటుఫారం లభ్యమైంది. అదే “బ్లాగు”. అయితే 2000 వ దశకం తొలినాళ్ల నాటికి కంప్యూటరు, ఇంటర్నెట్ కనెక్షను కలిగి ఉన్న వారు కంప్యూటరు సాంకేతిక నిపుణుల వంటి వారే కాబట్టి చర్చావేదికలతో బాటు, బ్లాగు ప్రపంచపు తొలి నాటి బ్లాగర్లు దాదాపుగా వీరే.
బ్లాగు (blog) అనే పదం వెబ్‌లాగ్ (weblog) అనే పదాన్ని సంక్షిప్తంగా చేయడంతో వచ్చింది. బ్లాగు అంటే మామూలు వెబ్‌పేజీయే, కాకపోతే ఇందులో రాసిన జాబులు తేదీల వారీగా, చివరగా రాసిన జాబులు ముందు చూపిస్తూ అమర్చి ఉంటాయి. వ్యక్తిగత డైరీల నుండి రాజకీయ ప్రచారాల దాకా, వివిధ మాధ్యమాల కార్యక్రమాల నుండి పెద్ద కంపెనీల వరకు, అప్పుడప్పుడు కలం విదిల్చే రచయితల నుండి అనేక మంది చెయ్యితిరిగిన రచయితల సామూహిక రచనల దాకా బ్లాగులు విస్తరించాయి.
చాలా బ్లాగుల్లో చదువరులకు వ్యాఖ్యలు రాసే వీలు కలగజేస్తారు. అలా వ్యాఖ్యలు రాసేవారితో ఆ బ్లాగు కేంద్రంగా ఒక చదువరుల సమూహం ఏర్పడుతుంది. ఈ బ్లాగులూ, వాటికి సంబంధించిన వెబ్‌సైట్లూ అన్నిటినీ కలిపి బ్లాగోస్ఫియరు అని దాన్ని తెలుగులో బ్లాగావరణం అని అంటారు. ఏదైనా ఒక విషయం గురించి, లేక వివాదం గురించి బ్లాగుల్లో వాద ప్రతివాదాలు చెలరేగితే వాటిని బ్లాగ్యుద్ధాలు, బ్లాగు తుఫానులు అంటారు.
బ్లాగులు రకరకాల ఆకృతుల్లో ఉంటాయి. మామూలు బులెట్‌జాబితా లాగా పేర్చిన హైపరులింకుల (hyper links) వంటి వాటి నుండి, పాఠకుల వ్యాఖ్యలు, రేటింగులతో కూడిన సంక్షిప్త వ్యాసాల దాకా ఉంటాయి.
కొంత మంది నియంత్రణలో ఉండే ఫోరములు, ఎవరైనా చర్చ మొదలుపెట్టగలిగే మెయిలు జాబితాలకు భిన్నంగా సొంతదారు నియంత్రణలో ఉంటూ వారి వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించేలా బ్లాగు ఉంటుంది. (వికీపీడియా నుండి)
వ్యాస రచయిత బ్లాగు ని ఇక్కడ ఉదాహరణగా చూడవచ్చు.
“బ్లాగు” అనే అంశం తెలుగులో పూర్తి స్థాయిలో ప్రారంభం అయిన 2004 ప్రాంతంలోయూనికోడ్లో
తొలి బ్లాగు రాసిన వ్యక్తి “కిరణ్ కుమార్ చావా” అని చెపుతారు.
ఇప్పటికీ అడపాదడపా పోస్టులతో నడుస్తున్న “తెలుగుబ్లాగు” అనే చర్చావేదిక బ్లాగు ఎలా మొదలుపెట్టాలనే సంగతి నుండి, బ్లాగుల విషయంలో ఏ సాయం కావాలన్నా తొలిదశలో బ్లాగర్లకు మార్గదర్శకత్వం వహించేది.
బ్లాగులతో ఉన్న సౌలభ్యం ఏవిటంటే చిన్న చిన్న సవరణలతో బ్లాగులని నచ్చినట్టు అందంగా తయారుచేసుకోగలిగే అవకాశం ఉంటుంది. బ్లాగు స్వరూపంలో ప్రధానభాగమైన టెంప్లేట్లు కొన్ని ఉచితమైతే కొన్ని అమ్మకానికి ఉంటాయి. బ్లాగు ప్రొవైడర్లకు ఇలా బ్లాగు టెంప్లేట్లు అమ్ముకోవడం, అడ్వర్ టైజ్మెంట్లు ద్వారా డబ్బు సంపాదించడమే ప్రధాన లక్ష్యం. అందుకు ఎంత ఎక్కువ మంది యూజర్లు ఉంటే అంత మంచిది.
ఇక తెలుగు యూజర్ల విషయానికి వస్తే స్వీయ పాండిత్య ప్రదర్శనకు, సొంత ఆలోచనలు, భావాలు, మనసుకి నచ్చిన అనేక విషయాలు కత్తిరింపులు లేకుండా ఇతరులతో స్వేచ్ఛగా పంచుకోవడానికి బ్లాగులు చక్కని సాధనాలు.
ప్రపంచ వ్యాప్తంగా 2004 లో బ్లాగులు ప్రధాన స్రవంతిలో భాగం కాసాగాయి. రాజకీయ పరిశీలకులు, వార్తా సంస్థలు, ఇతర వ్యక్తులు ప్రజాభిప్రాయాన్ని రూపుదిద్దేందుకు, ప్రజల నాడిని తెలుసుకునేందుకు వాడసాగారు. రాజకీయ ప్రచారాల్లో పాల్గొనని నాయకులు కూడా తమ ఆలోచనలు, అభిప్రాయాలను వెల్లడి చేసేందుకు బ్లాగులను వాడుకున్నారు. కొలంబియా జర్నలిజం రివ్యూ పత్రిక బ్లాగుల గురించి రాయడం మొదలుపెట్టింది. బ్లాగుల సంకలనాల ముద్రణ మొదలైంది. రేడియో, టీవీల్లో బ్లాగరులు కనపడడం కూడా మొదలైంది. ఆ సంవత్సరం వేసవిలో జరిగిన అమెరికా రాజకీయ పార్టీల జాతీయ సమావేశాల్లో బ్లాగులు, బ్లాగరులు ప్రస్తావనకు వచ్చాయి. వెబ్‌స్టర్స్ డిక్షనరీ “blog”ను 2004కు ఆ సంవత్సరపు మాటగా గుర్తింపు నిచ్చింది.
ఇక బ్లాగుల్లో ఎవరెవరు ఎప్పుడెప్పుడు ఏమేం రాస్తున్నారో తెలుసుకునేందుకు కూడలి (2016 లోమూతబడింది), జల్లెడ (పనిచెయ్యడం లేదు), మాలిక(సమగ్ర లిస్టు లేదు), బ్లాగిల్లు (2016 తర్వాత అప్డేట్ చేయబడలేదు) వంటి బ్లాగు సంకలనులు ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని అందించడానికి ఉపయోగపడేవి. ఈ సైట్లలో బ్లాగుని రిజిస్టర్ చేసుకున్నాక ఆ బ్లాగులో కొత్త రచన రాగానే ఈ సంకలనులు ఆ సమాచారాన్ని వెంటనే తమ సైటులో ప్రధాన పేజీలో కనబడేటట్లు చేయడం, మరోపక్క ఈ సమాచారం తెలుసుకోవాలనుకున్న చదువరులకు బ్లాగుల్లో వచ్చిన కొత్త విషయాలు తెలిసికొనేందుకు అవకాశం కల్పించేవి ఈ సైట్లు. ఇందులో కొన్ని ఇప్పటికీ అసమగ్రంగానయినా నడుస్తూ ఉన్నాయి.
ఇక ఈమాట, పొద్దు వంటి ఆన్లైన్ పత్రికల్లో నెలనెలా బ్లాగుల్లో ఎక్కడ ఏ సమాచారం వస్తుందో తెలుసుకోగలిగే పరిశోధనాత్మక వ్యాసాలు ప్రచురితమయ్యేవి.
బ్లాగుల రకాలు చూస్తే కేవలం వ్యక్తిగత బ్లాగులే కాక రాజకీయ, న్యాయ, వ్యాపార, మత, ప్రసారమాధ్యమాల పరమైనవి మొ.న వెన్నో.
“తెలుగులో బ్లాగులు” అని పరిశోధన మొదలుపెట్టగానే లెక్కకు మిక్కిలి బ్లాగులు కనిపించాయి. అయితే కొన్ని పూర్తిగా ఆగిపోయినవి, కొన్ని దాదాపు ఆగిపోయినవి, కొన్ని కొనఊపిరితో బతికున్నవి, కాసిన్ని పట్టువదలని విక్రమార్కుల్లా ఇప్పటికీ నడుస్తున్నవి. ఇందుకు కారణం ఏవిటి? అని ఆలోచిస్తే నానాటికీ కొత్త ట్రెండులతో ముందుకు వెళ్తున్న కమ్యూనికేషన్ టెక్నాలజీలో ఇప్పుడు ఎవరికైనా బ్లాగులు రాసే తీరిక ఉన్నా చదివే తీరిక ఎవరికీ లేదేమో అని అనిపిస్తుంది.
2020ల తొలిదశకమైన ఇప్పటికాలంలో మొబైల్ ఇంటర్నెట్, సోషల్ షేరింగ్ , ఫోటోలు, వీడియోల షేరింగ్, సంక్షిప్తత వంటి సౌకర్యాల వల్ల ఫేస్బుక్, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, స్నాప్ చాట్ వంటి సోషల్ నెట్ వర్కు ప్లాటుఫారాలు అతివేగంగా బ్లాగు ప్రపంచాన్ని చేజిక్కుంచుకున్నాయి.
ఇక సైట్ల విషయానికి వస్తే ఇంతకు ముందు ప్రకరణంలోచెప్పుకున్నట్లు 1994లో మొదలు పెట్టిన ఆంధ్రప్రదేశ్ హోం పేజ్ సైటు తెలుగు వెబ్ సైట్లలో మొట్టమొదటిదని చెప్పవచ్చు.
డిజిటల్ మాధ్యమాలలో తెలుగును వాడటానికి ఉపయోగపడే పనిముట్లను, అప్లికేషన్స్, ఇతరత్రా సాధనాలను ఒక్క చోట చేర్చిన తెలంగాణా ప్రభుత్వ వెబ్ పేజ్ ఇక్కడ చూడొచ్చు. (https://it.telangana.gov.in/digitaltelugu)
2003 డిసెంబరులో ఆవిర్భవించిన తెలుగు వికీపీడియాకు బోస్టన్ నగరంలో సమాచార సాంకేతిక నిపుణుడిగా పనిచేస్తున్న వెన్న నాగార్జున శ్రీకారం చుట్టాడు. ఈయన రూపొందించిన పద్మ అనే లిప్యాంతరీకరణ పరికరం (ఇది ఇంగ్లీషు కీబోర్డ్ తో తెలుగు వ్రాసే తెలుగు భాషా అనువాద పరికరం) నెట్ లో తెలుగు సమాచార అభివృద్ధికి ఒక మైలురాయి. ఇది క్రమంగా తెలుగు భాషాభిమానులను విశేషంగా ఆకర్షించింది.
నానాటికీ విస్తరిస్తున్న టెక్నాలజీ వల్ల, పెరుగుతున్న నిపుణుల వల్ల క్రమంగా ఎవరికి వారు సొంత సైట్లు రూపొందింపజేసుకోవడం సులభసాధ్యం కాసాగింది.
బ్లాగు ఉచితంగా లభ్యం అవుతుంది కానీ సైటు నిర్మాణానికి, నడపడానికి ఖర్చు అవుతుంది.
వెబ్సైటుకి ఉదాహరణగా ఈ క్రింది చిత్రాన్ని చూడండి.
సైటు నిర్మాణానికి ప్రధానంగా ఒక డొమైన్ , ఒక ఐపీ, ఒక సర్వర్, ఒక వెబ్ ఫ్రేమ్ వర్క్ అవసరం.
ఈ సైటు నిర్మాణాన్ని ఇల్లు కట్టడంతో పోలిస్తే –
డొమైన్ అనేది సైటు యజమాని కోరుకున్న పేరుతో ప్రైమరీ డొమైన్లయిన .com, .in, .net వంటి వాటితో కలిపి ఇచ్చే రిజిస్టర్డ్ ఇంటిస్థలం అన్నమాట. డొమైన్ డాట్ కామ్, గోడాడీ, షాపిఫై వంటివి
డొమైన్లను అమ్ముతాయి. దీనికి సంవత్సర రుసుమును చెల్లించాల్సి ఉంటుంది.
ఇక ఐపీ (IP- Internet Protocol) అంటే వ్యక్తిగత అంతర్జాల ఆధారిత చిరునామా. దీనిని ఇంటర్నెట్ సర్వీసులు ఇస్తాయి. వీరే ఇంటి యజమాని అన్నమాట.
ఇక సర్వర్ అనే హార్డ్వేర్ సర్వీసు ఇంటికి పునాది వంటిది. సైటు లోని డేటాని భద్రపరచడానికి ఉపకరిస్తుంది.
ఇంటర్నెట్ సర్వీసు, సర్వర్ సర్వీసు నెలనెలా కట్టే రుసుములతో పొందవచ్చు.
వెబ్ ఫ్రేమ్ వర్క్ అనేది php, Angular JS వంటి నిర్మాణాత్మక అవసరాలకు సరిపడే సాఫ్ట్వేర్లకు సంబంధించినది. దీనిని ఇంటి నిర్మాణ శైలితో పోల్చవచ్చు. దీనిని నిపుణుల సాయంతో రూపొందించుకోవచ్చు. ఇందుకుగాను కొంత రుసుమును పనిని బట్టి చెల్లించాల్సి ఉంటుంది.
ఇక చివరగా వీటన్నిటితో తయారైన వెబ్ అప్లికేషను ప్లాటుఫారమే సైటు. అంటే ఇల్లన్నమాట.
ఇలా సైట్లకు అన్ని సర్వీసులూ విడివిడిగా కొనుక్కుని సైటు తయారుచేసుకోవచ్చు. లేదా అన్నిటినీ కలిపి అందించే వర్డుప్రెస్ వంటి హోస్టింగ్ సర్వీసుల ద్వారా కూడా పొందవచ్చు.
అన్నిటినీ ఒకచోట సక్రమంగా అమర్చి, యజమానికి నచ్చిన విధంగా రంగులు, హంగులు సమకూర్చడం కూడా నిపుణులు పనే. దీనికి మరి కొంత చెల్లించాల్సి ఉంటుంది.
ఇలా వెబ్ సైటు నిర్మాణం వరకే కాక, నడపడానికి నెలనెలా ఖర్చు కావడం, రాబడి వచ్చే అవకాశాలు మృగ్యం కావడంతో చాలా సైట్లు త్వరలోనే, మరి కొన్ని సైట్లు కొద్ది సంవత్సరాలలోనే మూతబడుతూ ఉంటాయి.
వీటన్నిటితో బాటూ శ్రద్ధగా ఎప్పటికప్పుడు కొత్త విషయాలను పొందుపరిచే వారు, సమస్యలను పట్టించుకునే వారు లేకపోతే ఎవరూ నివసించని ఇల్లులా బూజు పట్టిపోతుంది సైటు. బ్లాగులు అవసానదశకు చేరడానికీ ఇదే ప్రధాన కారణం.
*****