పడమటి దిక్కున వీచిన వింజామర ఈ సెలయేటి దివిటీ!
-వి.విజయకుమార్
(కె. గీత గారి సెలయేటి దివిటీ పై చిరుపరామర్శ)
కొండ వాలున నించుని ఆకాశం కేసి చూస్తూన్నప్పుడు నిరాధార జీవితం మీద ఒక వాన పూల తీగొచ్చి పడి పరిమళభరితం చేసినట్టు ఏ చిన్న అనుభవాన్నైనా రాగ రంజితం చేసి, ఒక్కో పద హృదయం పై పుప్పొడి పరిమళాలద్ది, వర్ణ శోభితాలైన సీతాకోకచిలుక లేవో అనుభూతుల మకరందాలను అందుకోకుండా పోతాయా అనుకుంటూ అన్వేషి స్తుంది కవయిత్రి హృదయం.
తెల్లారేప్పటికి మొగ్గలు తొడిగిన గుమ్మడి పాదో, మత్తెక్కించే సౌరభంతో కమ్మగా తలూచే యే తీగ మల్లి పొదో, ఆ పచ్చని ఆకులలో నిన్న ఎక్కడ దాక్కున్నాయో తెలీని కాగితప్పూల గుత్తి, బుకేలా చెయ్యి చాపినప్పుడు, నిన్నటికి నిన్న మోడువారిన తురాయి చెట్టు దేహమంతా కాంతులీనే రత్నాలు పొదిగి అగ్నివనంలా పూచి నవ్వుతున్నప్పుడు మిన్నకుండి పోవడం ఎవరితరం? హృదయం పసిపాపలా నవ్వుతుంది. కాగితపు హృదయం పై పల్లవించాలని ఉవ్విళ్ళూరుతుంది.
కె. గీత గారి భాషణా, కవనం, గాత్రం మృదు మధురాలు. ముళ్ళు లేని కొమ్మ గులాబీలా, సొగసుగా లాలిత్యాన్ని అద్దుకున్నట్టు హత్తుకుంటుంది యే పద పల్లవమైనా. ఎడారి గ్రాండ్ కాన్యన్లో విప్లవ కవి కాకపోయిన వారికి సైతం అక్కడి అరుణిమ జాడల్లో యే యోధుడివో నెత్తుటి ఆనవాళ్ళు ద్యోతకమైతే, గీత గారికి మాత్రం అలల నురగలు పారాణి పూసి వెళ్ళిపోతాయి చిలిపిగా. గగుర్పొడిచే గంధక ధూపాలు వెదజల్లే ఎల్లో స్టోన్ మీద నిలబడి చేతులు జాపి ఆశగా నిన్ను హత్తుకోవాలనిపిస్తుంది అంటారా ఎవరన్నా? గీత గారు తప్ప!
పెరట్లో పురుడోసుకున్న నారింజ తల్లిని చూసి వాకిలంతా గుండ్రని నక్షత్రాల గొడుగు పట్టిన బంగారు తల్లిగా మురిసిపోతారు. గుంభనంగా మోయాల్సిన జీవిత భారాల్ని గుర్తుచేస్తూ నారింజ తల్లి అమ్మైనప్పుడు, తానే తల్లై అమ్మకు భరోసా ఇస్తారు. ఇటు వంటి సమ్మోహన భావనలు కోకొల్లలు ఈ సెలయేటి దివిటీలో వెలుగు తామరలై మెరుపులీనాయి, తెల్ల కలువలై పల్లవించాయి.
“సెలయేటి దివిటీ” సాయం సంధ్య వేళ లేలేత పుత్తడి అద్దిన కిరణాలను నెమరేసు కుంటూ తణుకు బెళుకు లీనే మధురోహల జీవన ప్రవాహపు గతి. ఒకోసారి వడుదుడు కుల రాళ్ళ మధ్యా, ఇంకోసారి మెత్తని జలతారు ఇసుక తిన్నెల మీదుగా హొయలు ఒలుకుతూ జారిపోతూ వెళ్ళిపోయే జీవన పయనం. అనుభవాల ఫ్రిక్షన్ తో రాళ్ళు సైతం నునుపుదేరి సర్దుకుపోయి నమ్రంగా ముందుకు వెళ్ళడమే జీవిత పరమార్ధం అని చెబుతాయి.
ఈ ముప్పై యేడు కవితల సంపుటిలో ఒక్కో కవితా ఒక్కో అనుభవాన్ని పలవరిస్తుంది.
“సెలయేటి దివిటీ” లో నిరీక్షణ తాలూకూ వేదన ప్రతిఫలిస్తుంది.
జ్ఞాపకాల వెన్నెల దివిటీతో దారి వెతుక్కుంటూ ఇక్కడిక్కడే తచ్చాడుతున్నాను…ఎక్కడ చూసినా నువ్వే… నాలో దాక్కొని నన్నే నిన్ను చేసుకున్న నువ్వే –
నిజమే ముద్దుగా ఒత్తిగిలిన చంటాడిని వదిలి గౌతముడెలా వెళ్ళాడో తెలియదు…
“ఇంటి నొదల్లేని బెంగ” లో భలేగా చెబుతారు పసి బిడ్డల్ని ఇంట్లో వదిలి ఉద్యోగానికి వెళ్ళే సందర్భాల్లో ఒక మాతృమూర్తి ఆవేదనని…
కొన్ని కవితలు అమెరికన్ సమాజపు నేపథ్యంలో ఉద్యోగానుభవాల లోగిళ్ళలో ఉస్సూరనుకున్న సందర్భాలకు అద్దం పట్టేవైతే కొన్ని పరాయి నేల పై కొంగ్రొత్త సంస్కృతిలో మెలిపడిన అనుభవాల అంతర్లీన వివేచన.
యార్డ్ డ్యూటీలో
ఊచల మీద వేలాడేవన్నీ మృదువైన తురాయి పూలే
చిన్నారుల చిలిపి కళ్ళలో దాగున్నవన్నీ అందమైన బాల్యాలే అంటూ ఉద్యోగ ధర్మంలో పసివాళ్ళ చిలిపి అల్లరి పనుల కోతి చేష్టల్లో కూడా మధురమైన భావన ల్ని రమ్యాతి రమ్యంగా పలికిస్తారు. పార్కులో పిల్లలు కూడా పసికూనల పై పరవశంతో రాసిన ఒక అందమైన కవిత.
వీడ్కోలు విమానంలో ఒక విరహపు తెర రెపరెపలాడుతున్నట్టు అనిపిస్తుంది. సహచరుడి వియోగాన్ని విమానం ఖండాంతరాలు మోసుకెళ్తున్నప్పుడు మోగిన విషాద రిషభం.
నీ కను కొనుక్కుల్లో విత్తనాలై మొలిచిన దుఃఖం
నా గొంతులో వృక్షమై మోయలేకున్నాను
నువ్వొచ్చిన ప్రతిసారీ విడవాల్సిన రోదన సత్యం
నువ్వు వెళ్ళిన ప్రతిసారీ మళ్ళీ వస్తావన్న భరోసా అసత్యం
మంచు గబ్బిలం అమెరికన్ సమాజపు చీకటి కోణాన్ని స్పృశిస్తుంది. కొన్ని దయనీయపు రాత్రులు పతితులూ, బ్రష్టులూ, బాధాసర్ప ద్రష్టులూ, బతుకు కాలి పనికిమాలి శనిదేవత రథచక్రపుటిరుసులలో పడి నలిగిన హీనులూ, దీనుల…అత్యంత ధనిక సంపన్న దేశమని విర్రవీగే ఈ భూతల స్వర్గపు వీధుల్లో యే మలుపులోనో నిరాశతో నిరాశ్రయులుగా ఒదిగి ముడుచుకున్న వారి దేహాల గురించి తన ఈ అసమానమైన కవితలో గుండెల్ని పిండేస్తూ ఒకచోట,
తిరిగి తిరిగి ఎక్కడో ఒక ఇరుకు
కుప్ప పక్కన పడేసిన
సామాన్లలో విరిగిన బల్లలా
కాళ్ళు చేతులు కడుపులోకి విరుచుకుని
తెల్లార గట్ల చలిని మునిపంట
కొరికే ఆకారం
భూతల స్వర్గపు వీధుల్లో
మంచు గబ్బిలమై వేలాడుతూ
ఇది మీ హృదయాన్ని పట్టి పీడిస్తుంది. ఒక ధనిక సమాజంలో ఈ నిరుపేదల మూలుగులెందుకింకా? సంపదలతో పొంగే ఈ స్వర్గ ద్వారపు గడపలో ఈ ఆకలి కేకల ఘోషలు ఎందుకు? ఈ మంచు గబ్బిలాలు నిస్సహాయంగా రెక్కలు అల్లారుస్తూ వజ వజ వణికి పోవాల్సిన కర్మ ఏ శాప ఫలం?
ఈ ఆర్త గీతం మీ చెక్కిలి పై ఒక కన్నీటి చారికని మాత్రమే మిగిల్చిపోదు, అది మీ గుండెల్ని మండిస్తుంది. అసంబద్ధ సంపదల పంపకాల్లోని అమానవీయ ధోరణిని ప్రశ్నించమని సవాలు విసురుతుంది.
ఒక మానవీయ సమాజపు ఆవశ్యకతనూ ఆరంభాన్నీ స్వాగతిస్తుంది.
ఇటు వంటి ఎన్నో కవితలు గుదికూర్చిన “సెలయేటి దివిటీ” మిమ్మల్ని రాగరంజితం చేస్తుంది. కుదురుగా కూర్చొనివ్వకుండా ఆలోచనలను రేకెత్తిస్తుంది. అదే కదా ఏ మంచి కవితకైనా గీటురాయి! ఆ గీటురాళ్ళ నన్నింటినీ గీత గారు ఏనాడో దాటేశారు.
*****
నేను ఆంగ్ల సాహిత్యం మరియు అర్ధశాస్త్రం లో ఎం.ఏ చేశాను. అయిల సైదా చారి గారి రెండు కవితా సంపుటాలూ, అందెశ్రీ గారి కొన్ని పోయెమ్స్, దెంచె నాల గురితప్పిన పద్యం కవితా సంపుటి ఇంగ్లీష్ అనువాదాలు చేశాను. అంగార స్వప్నం లో కూడా కొన్ని అనువాదాలు చేశాను. రంగనాయకమ్మగారూ, గాంధీ గారు సంకలనం చేసిన వర్గాల గురించి పుస్తక అనువాదం ఇటీవల విడుదల అయింది. మరికొన్ని అనువాదాలు పుస్తకాలు గా వెలువడ్డాయి.నా సమీక్షలూ, కవితలూ, వ్యాసాలూ, తెలుగు పత్రికల్లో వస్తుంటాయి. సారంగ లో, కౌముదిలో ఒకటీ రెండూ వచ్చాయి. మీ పత్రికకి పంపడం ఇదే ప్రథమం. సాహిత్య ప్రపంచానికి నాది పూర్తిగా కొత్త మొహం.