లేఖాస్త్రం కథలు-3

చండశాసనుడు

– కోసూరి ఉమాభారతి

ప్రియమైన అక్కయ్య భానుమతికి,  

          అక్కా ఎలా ఉన్నావు? నేనిక్కడ మామూలే. రెండునెల్ల క్రితం అకస్మాత్తుగా అమ్మ చనిపోయినప్పుడు అమెరికా నుండి వచ్చి కర్మకాండలు జరిపించావు. దిగాలు పడి పోయిన నాకు ధైర్యం చెబుతూ, నెలరోజుల పాటు సెలవు పెట్టి మరీ… అండగా నిలిచావు. అమ్మ లేని లోటు ఒక్కింత తీరినట్టే అనిపించినా …నీవు తిరిగి వెళ్ళిపోయాక మాత్రం.. ఒక్కసారిగా ఒంటరితనం నన్నావహించింది. అయినా సరే, ఓ మోడులా కాలం వెళ్ళ బుచ్చేసేదాన్నే. కానీ మంచికో, చెడుకో దైవం మరోలా తలిచాడు. 

          ఇప్పుడు నేను ఓ విచిత్రమైన పరిస్థితిలో చిక్కుకున్నానక్కా. నా గోడు నీకే వినిపించవల్సిన అవసరం వచ్చింది. నీకు ఆలకించక తప్పదు. విషయానికి వస్తాను. నీ మరిది, అదే… నా భర్త వీరేందర్ ని కలిశావు కదా! అమ్మ పోయాక, పెద్ద సమస్యగా మారాడక్కా. ఇక అడిగేవారు లేరని నా పోలీసు భర్త చాలా దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నాడు.  కొత్తకాపురం అన్న ధ్యాస కానీ, తల్లి దూరమయిన దుఃఖంలో ఉన్నానన్న జ్ఞానం గానీ లేకుండా వింతగా ప్రవర్తిస్తున్నాడు. ‘భానుమతి చెల్లెలు మధుమతి’… ఒక్క పేరులోనే తప్ప మరెందులోనూ నీ అక్కయ్యతో నీకు పోలికే లేదు అంటూకొత్తగా నన్ను నీతో పోల్చి…హేళన చేయడం కూడా మొదలెట్టాడు.

          కట్నానికి ఆశపడి నన్నుపెళ్ళాడాడే  తప్ప నా పై అతనికి ఎటువంటి ఆసక్తి లేదు. కన్న తండ్రి వద్దనుకున్న తనయని కదా! వీరేందర్ కంటే మంచి సంబంధం దొరకదని ఇంటర్ ఫెయిల్ అయిన నన్ను అతనికి కట్టబెట్టింది అమ్మ. అతను ఒక తిరుగుబోతు, తాగుబోతు అని పెళ్ళయిన మొదట్లోనే నాకు తేటతెల్లమయింది. కానీ అమ్మ ఉన్న న్నాళ్ళు  నన్ను ప్రేమగా చూసుకుంటున్నట్టు డ్రామాలాడేవాడు. అమ్మకి ప్రతినెలా వచ్చే భరణం డబ్బులో సగం అతనికి ఇచ్చేది. అది ఓ అదనపు కానుకలా ఉండేది ఆ ఇల్లరికపుటల్లుడుకి. వైభోగం వెలగబెట్టేవాడు.

          నేనన్నా, కుటుంబ పరిస్థితన్నా వీరేందర్ కి చాలా అలుసు. నోరు మెదిపే ధైర్యం లేనిదాన్ని, తల్లి పోయి ఒంటరిదాన్నయ్యానని అతనికి అదును దొరికినట్టుగా అయింది కాబోలు. మా బతుకుల్ని హేళన చేస్తూ … అవమానిస్తున్నాడు. భరాయించలేకుండా ఉన్నానక్కా. వారినికో అమ్మాయిని వెంటేసుకుని వచ్చి, నా ఎదుటే అసహ్యంగా ప్రవర్తిస్తున్నాడు. ఆఖరికి నా జీవితం ఇలా బతకలేక, చావాలేక నిస్పృహలో కాలం గడుపుతున్నాను.  

          అయినా అక్కా … అతని విషయం కాసేపు అలా ఉంచి, నా మనసులోని కొన్ని ఇతర విషయాలని నీతో పంచుకునేందుకు ఈ లేఖ వ్రాసి.. నా ఫ్రెండ్ జానకి కంప్యూటర్ నుండి నీకు ఇమెయిల్ మెసేజీగా పంపుతున్నాను. 

          నాకు ఊహ తెలిసాక నన్ను వేధించిన ప్రశ్నలకి, సమస్యలకి.. నీవైనా సమాధానా లు ఇవ్వగలవో, లేదో. నీవు నా తోడబుట్టిన దానివి కనుక…  నీకు తెలిసిన విషయాలు నాకు అర్ధమయ్యేలా చెబుతావని ఆశిస్తాను.   

          నాకన్నా మూడేళ్ళు పెద్దదానివి. డిగ్రీ పాసయి, ఎం.బి.ఏ చేస్తూ…  ఓ చక్కని గాయనిగా కూడా గుర్తింపు పొందావు. జీవితాన్ని అందంగా తీర్చిదిద్దుకుంటున్నావు. మరి నీ చెల్లెలినైన నేను… ఓ గయ్యాళమ్మకి  కూతురిగా, కుదురులేని భర్తకు చేతకాని భార్యగా జీవితం సాగిస్తున్న ఓ అతిసాధారణ అమ్మాయిని. తెలివితేటలు, పెద్ద ఆలోచనలు, రంగుల కలలు నాకూ ఉన్నాయేమో అని తెలుసుకునే అవకాశమే లేకుండా గడిచిన ఒక దౌర్భాగ్యపు జీవనం నాది. 

          ఎందుకక్కా ఇలా? ఒకే తల్లి కడుపున పుట్టాము. మనిద్దరి తండ్రి కూడా ఒక్కడే కదా!  అలాంటప్పుడు మన కన్నతండ్రికి నీవు ప్రియమైన పుత్రికవెలా అయ్యావు? అదే తండ్రికి నేను ఓ అక్కరలేని అదనపు భారాన్నెందుకయ్యాను? 

          కానైతే, అక్కా .. నా పదవ పుట్టినరోజున నానమ్మా, తాతయ్యలతో అమ్మ పెద్ద గొడవ పెట్టుకున్నప్పుడు మాత్రం ఒక్క రవ్వ అర్ధమయింది. అమ్మ అరుపులకి ఆ రోజు నానమ్మకి బాగా కోపం వచ్చినట్టుంది. 

          “నీవు భర్తని నిత్యం సాధిస్తూ.. కొనిపారేసినట్టు మాట్లాడుతూ… ఇంటాబయటా వాణ్ని అభాసుపాలు చేయడం వల్ల నీ కాపురం కూలిందే  తప్ప వేరే కారణమే లేదు. నీ వేధింపు లకు సహనం చచ్చి విడాకులకు అప్లై చేసినప్పుడు నీవు చేసిన రాద్ధాంతానికి ఇల్లువదిలి అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు వాడు. తరువాతెప్పుడో మూడునెల్లకి అమెరికాలో తేలాడు. నీవు మళ్ళీ గర్భవతివన్న విషయం కూడా తెలియకుండానే నీ భర్త దేశం వదిలి వెళ్ళి పోయాడన్నమాట. నీ అహంకారం, లెక్కలేనితనమే నిన్నీ స్థాయికి జార్చాయి. ఎప్పటికి మారుతావో? ఛా.” అంటూ కళ్ళు తుడుచుకుంది నానమ్మ.

          అమెరికాలో పెద్ద చదువులు చదివొచ్చిన నాన్నకి … బలవంతంగా అమ్మతో పెళ్ళికి ఒప్పించింది తామేనని తల బాదుకుంది నానమ్మ.

          నేను పుట్టిన మూడేళ్ళకి అమ్మ భారీగా భరణం ఇప్పించుకుని విడాకులు తీసుకుందని కూడా ఆ రోజు ఆ పెద్దవాళ్ళిద్దరి మాటల వల్ల అర్ధమయింది. కానీ అక్కా, చెప్పు.. ఇదేమి న్యాయం? పెద్దకూతురువైన నిన్నుడార్జిలింగ్ లో బోర్డింగ్ స్కూల్లో వేసి చదివించిన నాన్న, చిన్నకూతురి ఉనికే లేనట్టుగా తటస్థంగా ఉండిపోయాడు. నేను అమ్మ ప్రాపకంలో అనిశ్చిత, పోట్లాటల నడుమ బతుకు సాగించాను. ఖరీదైన అభిరుచు లు నీవైతే, కనీసపు సరదాలు తీర్చుకోలేని మనస్థితి నాదయింది. ఒకే కడుపున పుట్టిన వాళ్ళమే అయినా మన ప్రాపకంలో ఎంతో తేడా. మన దృక్పథాల్లో ఎంతో వ్యత్యాసం కొట్టొచ్చినట్టుగా అగుపిస్తుంది. 

          అమ్మతో గొడవల వల్ల నా జీవితాన్ని చీకిటిలో ఉంచేసిన న్యాయం నాన్నది. నాలో ఆత్మవిశ్వాసం, ఆత్మస్థైర్యాలు ఎదిగే అవకాశాన్ని నేల రాసేసాడు కాదా ఆ తండ్రి మహానుభావుడు? ఇక నా ఆసక్తులకి, అభిరుచులకు, పైచదువులకి అవకాశమేది? ప్రోత్సాహమేది?

          ఊహ తెలిసినప్పటి నుండి మాత్రం సెలవలకి నీవు వచ్చినప్పుడు … ‘చెల్లీ’ అన్న నీ పిలుపు, కానుకగా నాకు నీవిచ్చే చక్కని దుస్తులు, నీకూడా పాడమంటూ నీ ప్రోత్సాహా లు నాకెంతో ఉత్సాహాన్ని, ఆనందాన్ని ఇచ్చేవి. నీ చెల్లెలుగా గుర్తింపబడినా చాలునను కునేదాన్ని. 

          రెండేళ్ళ క్రితమే కదా… ఇంటర్ తప్పి కనీసం కాలేజీకి వెళ్ళే అవకాశమైనా లేకుండా నేను చేసుకుంటే, నాన్న సాయంతో పై చదువులకి కెనడాకు వెళ్ళే ఏర్పాట్లు నీవు చేసుకోసాగావు. నిన్నింక ఎప్పుడు చూస్తానో అని కృంగిపోయాను.

          నాపట్ల నాన్న అవలంభించిన కఠినత్వం వల్ల … పుట్టుక నుండే మోడువారిన నా జీవితానికి, అంధకారమైన నా భవిష్యత్తుకి .. ఏకైక జవాబుదారి ఐన నాన్నకి ఎదురుపడి అడగాలనుకునేది .. ఒక్కటే… అక్కా. “ఇదెక్కడి న్యాయం నాన్నగారు? తండ్రి బాధ్యతల నుండి తప్పుకోడం భావ్యమా?” అని కాలర్ పట్టి కుదిపేయాలని ఉంది. కానీ నేను ఈ జన్మలో నాన్నని కలిసేది లేదు. కాబట్టి… నీవైనా ఆయన్ని నా తరఫున తప్పక నిలదీస్తా వు కదూ. నా కన్నతండ్రే నా పాలిట చండశాసనుడై నన్ను ఓ మరబొమ్మలా ఓ నిరాశ జీవిలా మార్చాడని చెప్పు. సరేనా? ఇవేనక్కా నిత్యం నన్ను తొలిచేసే విషయాలు. నీకు చెప్పాలనుకున్నదంతా చెప్పేసాను.  

          ఇప్పుడు వర్తమానంలోకి వస్తాను. ప్రస్తుతం వీరేందర్ సృష్టించిన సుడిగుండంలో చిక్కుకున్నాను. అమ్మ పోయాక నేను డిప్రెషన్ లోకి వెళ్ళిపోయానని, సైకియాట్రిస్ట్ వద్దకి తీసుకువెళ్ళి వైద్యం చేయిస్తున్నాడు. ఆ మందుల వల్ల రోజులో సగభాగం పడుకునే ఉంటాను. అదీ చాలదని మరో వారం రోజుల్లో షాక్ ట్రీట్మెంట్ మొదలవుతుందట. 

          నిజానికి నాకెటువంటి రుగ్మత లేదు. నేనెప్పుడూ ఇలాగే ఉంటాను. నా జీవితంలో ఏమి సంతోషాలు ఉన్నాయని తుళ్ళుతూ నవ్వుతూ ఉండడానికి? నన్ను ఓ మానసిక రోగిలా కట్టడి చేసేస్తే అతనికి అడ్డుగా ఉండనని నా భర్త ఆలోచన. సరే అక్కా. ఇంతకన్నా ఏమీ లేదు నా ఈ దౌర్భాగ్యపు జీవితాన. ఉంటాను.

నీ ప్రియమైన మధుమతి.

***

          తెల్లారుఝామున డోర్-బెల్ మోగడంతో హాల్లోకి పరుగున వచ్చాడు వీరేందర్. లైట్లు వేసి, తలుపులు తీసిన అతను ఎదురుగా తన భార్య తోబుట్టువు భానుమతిని చూసి నిశ్చేష్టుడయ్యాడు.

          “అరే, భానుమతి గారు మీరా? రండి లోనికి. అమెరికా నుండి ఇలా చెప్పాపెట్టకుండా రావడమేమిటి మేడమ్? మీ రాక గురించి తెలియజేసినట్టయితే, కనీసం ఎయిర్పోర్ట్ కన్నా వచ్చి మిమ్మల్ని రిసీవ్ చేసుకొనే వాడిని కదా!” అంటూ ఆమె పక్కన  ఉన్న లగేజీ అందు కున్నాడు వీరేందర్. 

          “నా చెల్లిని చాలా మిస్ అయ్యాను. చూడాలనిపించి వెంటనే బయలుదేరాను. ఇక మీరు కూడా వెళ్ళి పడుకోండి. మధుమతిలేచాక పొద్దున్నే మాట్లాడుకుందాము.” అనేసి సూట్-కేస్ అందుకుని పక్కనే ఉన్న గదిలోకి నడిచింది భానుమతి.

***

          హైద్రాబాద్ బంజారాహిల్స్ లోని ‘ఫామిలీ కౌన్సెలింగ్’ ఆఫీసులో డాక్టార్. నమ్రతా వ్యాస్ ఎదుట ఆసీనులై ఉన్నారు భానుమతి, మధుమతి, మధు భర్త వీరేందర్.  ఒక్కొక్క రూ తమని తాము పరిచయం చేసుకుని డాక్టరమ్మకి నమస్కరించారు.

          వారికి తిరిగి నమస్కరిస్తూ, భానుమతి వంక చూసిందామె. “చూడమ్మా భానుమతి,  కాలిఫోర్నియా నుండి మీ ఫాదర్ విష్ణువర్ధన్ ఫోన్ చేసి కొంత సమాచారం ఇచ్చారు. ఈ మీటింగ్ షెడ్యూల్ చేయమని వారే అడిగారు. వారం క్రిందట .. మధుమతి నీకు పంపిన లెటర్ నాకు షేర్ చేశారు. ఇక ఇప్పుడు మీరు చెప్పండి. ముందుగా…  వీరేందర్ గారి  నుండి వినాలనుకుంటున్నాను.” అన్నది డాక్టర్. నమ్రత.

          కొద్ది క్షణాలు తటపటాయించి గొంతు సవరించుకున్నాడు వీరేందర్. “మేడమ్,  తన తల్లి పోయాక మధుమతి పూర్తిగా అన్యమనస్కంగా, నిరాశగా ఉంటుందని…  సైకియాట్రిస్ట్ వద్దకు తీసుకువెళ్ళాను. అయన మధుకి వైద్యం చేస్తున్నారు. కానీ భానుమతి గారు వచ్చాక, తన చెల్లి ఆరోగ్య పరిస్థితి తెలుసుకుని… నాకు కొన్ని విషయాలు వివరించారు. కాబట్టి ఇక మధు విషయంలో నేను కూడా తన అక్కయ్య భానుమతి గారి సలహా ప్రకారంగా నడుచుకుంటాను. పూర్తి చేయూతనిస్తాను.” అన్నాడు సవినయంగా.

          “మంచి నిర్ణయం వీరేందర్ గారు. ఇప్పుడు మన మధుమతి ఆలోచన ఏమిటని తెలియాలి.” అంది డాక్టర్. నమ్రత్ర.

          మధు చిరునవ్వుతో డాక్టరమ్మ వంక చూసింది. “రెండువారులుగా నాకు జరుగు తున్న వైద్యం అనవసరమని నేను నమ్ముతున్నాను. అమ్మ పోయిన దిగులైతే ఎప్పటికీ ఉంటుంది. ఇక నేను ఒంటిరిదాన్నన్న గుబులు ఈ నాటిది కాదు. చిన్నప్పుడు తాతా నానమ్మలని వదిలి .. అమ్మతో ఫ్లాట్ కి మారడం నన్ను కృంగదీస్తే, పెద్దయ్యాక భానక్క… అమెరికాకి వెళ్ళిపోవడం…నన్ను మరింతగా కృంగదీసింది. మా అక్క భానుమతితో అనుబంధం బలపడాలన్న నా ఆశల పై నీళ్ళు చల్లినట్టయింది.

          ఆమె నా శ్రేయస్సు కోరి ఇచ్చే సలహా సహకారాలతో నా జీవితాన్ని మెరుగు పరుచు కోవాలని ఆశించాను. అక్క ఆదరణ ఉంటే, నాకు కరువైన నా కన్నతండ్రి ఆదరణ కూడా దక్కినట్టుగా భావించి నేను హాయిగానే ముందుకి సాగిపోగలనని భావించాను. ఇప్పుడైనా అక్క అండదండలు నాకుంటే, తిరిగి చదువు కొనసాగించి లెక్చెరర్ అవ్వాలని కోరుకుంటున్నాను. 

          ఇకపొతే, వీరేందర్ ఓ మంచి భర్తలా నడుచుకుంటే చాలు. మోసం, ద్వేషం, కుట్ర నేను భరించలేను. నా జీవితం నా ఆదీనంలో ఉండాలని కోరుకుంటున్నాను. నాకు మీరు సాయం చేయండి. మీకు రుణపడి ఉంటాను.” అంటూ చేతులు జోడించింది మధుమతి.

          అంతా విన్న డాక్టర్. నమ్రత “గుడ్ మధుమతి. నీ ఆలోచనలు స్పష్టంగా తెలియ జేసావు. నీ అక్కయ్య విషయంలోనే కాదు, నీ భర్త విషయంలో కూడా నీవు పెట్టుకున్న ఆశలు .. అత్యాశలేమీ కావు. నీకు తెలుసా? మీ ఇరువురి తండ్రిగారైన విష్ణువర్ధన్ యూనివర్సిటీ గోల్డ్ మెడలిస్ట్. 

          అమెరికా హార్వార్డ్ నుండి పి.హెచ్.డి చేసి తిరిగి అక్కడే టెన్యూర్డ్ ప్రొఫెసరుగా పనిచేస్తూ… రసాయనిక శాస్త్ర నిపుణుడిగా ప్రపంచవ్యాప్తిగా పేరు గడించారు. మీలోనూ అటువంటి మేధాశక్తి ఉండే అవకాశం ఉంది కదా!. ఐనా నీలాంటి యువతికి ప్రోత్సాహా లని అందించేందుకు నీ కన్నతండ్రి ఆదరణే ఉండాలన్న నియమాలు లేవు. నీ సహోదరి భానుమతి… ఈ రోజు ఇలా నీ పక్కన ఉందంటేనే ఆమెకి నీ పట్ల ఉన్న బాంధవ్యం అర్ధమవుతుంది. నోరు తెరిచి నీవు ఆమె నుండి కోరుకుంటున్నవేవీ ..  తీర్చ లేనివి కావు. నీలో పట్టుదల ఇలాగే ఉంటే నీ కోరికలన్నీ నెరవేరినట్టే. నీ వాళ్ళ అండ దండలు నీకున్నట్టే. అర్ధమయిందా?” అంటూ సీటు నుండి పైకి లేచింది డాక్టర్. నమ్రత.

          “కాఫీ బ్రేక్కి సమయం అయింది కదూ! బ్రేక్ తరువాతసెషన్ మళ్ళీ మొదలెడ దాము.” అంటూ లాబీలోకి దారి తీసిందామె.

***

          పది నిముషాలకి తిరిగి కన్సల్టింగ్ రూములో డాక్టర్ ఎదురుగా అక్కాచెల్లెళ్ళు, వీరేందర్ ఆశీనులయ్యారు..

          “చూడు వీరేందర్, నీ భార్య మధుమతికి మానసిక రుగ్మతలు ఉన్నాయని అనుకోను.. తన అక్కకి రాసిన లేఖ ద్వారా అమ్మాయి మనస్థితి అర్ధమయింది.  కన్న తండ్రి దూరంగా వెళ్ళిపోవడం, ఆ తండ్రి తన ఉనికినే గుర్తించకపోవడం, పెంపకం సవ్యంగా లేకపోవడం వల్లే… ఆమెలో భయాందోళనలు, అభద్రతా భావాలు చోటు చేసు కున్నాయి. ఇకనుండైనా ఆమెలో మనోస్థైర్యాన్ని పెంచేలా… ఆమె జీవితముండాలి.  అవసరమయినంత కాలం …  రెండువారాలకోసారి మీతో సహా మధుమతికి కౌన్సెలింగ్ సెషన్స్ షెడ్యూల్ చేయిస్తాను. మా మేనేజర్ మీ వీలుని బట్టి అపాయింట్మెంట్స్ చేస్తుంది.” అన్నది డాక్టర్. నమ్రత వీరేందర్ని ఉద్దేశించి.

          కొద్ది క్షణాల తరువాత వీరేందర్ నోరు విప్పాడు. “మేడమ్, నా సహకారం పూర్తిగా ఉంటుంది. నా భార్య తన తోబుట్టువు అడుగుజాడల్లో నడుస్తానంటే నాకన్నా సంతోషించే వారు ఎవరుంటారు చెప్పండి.” అన్నాడు..

          “ఇక మన భానుమతి కూడా తన ఆలోచనలని మనతో పంచుకోవడమే మిగిలింది. అది కాక చెల్లెలికి తన వంతు సహకారాలని ప్రకటిస్తుందేమో వినాలి.” అంటూ భానుమతి వంక చూసింది డాక్టర్. నమ్రత.

          పక్కనే ఉన్న చెల్లెలి భుజం పై చేయి వేసింది భానుమతి. “ఏమని చెప్పను మేడమ్… మధుమతి పుట్టినప్పటి నుండే నాకు తనంటే ఎంతో ఇష్టం. అమ్మానాన్నల నడుమ గొడవలు, అపార్ధాల గురించి నాకు తెలియక పోయినా… విడాకులు తీసుకున్నా రని, నాన్న అమెరికాలో స్థిరపడ్డారని’ కొన్నాళ్ళకి తాతయ్య ద్వారా తెలిసింది. అర్ధం చేసుకున్నాను. నా పై పెద్దగా ప్రభావం పడలేదు. నాన్న నాతో ప్రేమగా మాట్లాడేవారు. నాన్న మాట వినడం, ఆయన్ని గౌరవంచడం నాకు బాగా ఇష్టం. 

          నా పై చదువులకి నాన్న కెనడాలోని మాంట్రియల్ యూనివర్సిటీకి పంపారు. కాలేజీలో చేరినప్పుడు నాన్న అమెరికా నుండి కెనడా వచ్చి నన్ను కలిశారు. ఎన్నో యేళ్ళ తరువాత చూసాను నాన్నని. మరెన్నో విషయాలు మాట్లాడుకున్నాము. ఆయన రెండవ భార్య ‘షాలిని’  గురించి చెప్పారు. నాన్నకి నా పట్ల ఉన్న ప్రేమానురాగాలని గౌరవించి, మా తండ్రీకూతుళ్ళ బంధం కొనసాగేందుకు ఒప్పుకుని నాన్నని వివాహం చేసుకుందట. అంతా విన్నాక, కాస్త అదను చూసి…ఆయన వద్ద అమ్మా, చెల్లి గురించిన ప్రస్తావన తెచ్చాను. 

          నిముషం సేపు మౌనం పిదప, “నా గతంలో నుండి ఒక్క నీతో తప్ప ఇతరత్రా బంధా ల నుండి విముక్తి పొందాను భాను. మీ అమ్మకే కాక అప్పుడామె ప్రాపకంలో ఉన్న రెండో పాప భవిష్యత్తు దృష్ట్యా… వసతి, అవసరమైన నిధులు, అలిమోనీ ఏర్పాటు చేశాకనే విడాకులు తీసుకుని షాలినిని వివాహం చేసుకున్నాను.” అన్నారు నాన్న’….  అని చెబుతూ …  నిశితంగా చెల్లెలి వంక చూసింది భానుమతి.

          “నాన్న విషయంగా నాకు తెలిసినదంతా ఇదే మధు. కాకపొతే, నాన్న గురించి నా అభిప్రాయం ఒకటి చెప్పాలి. నాకు తెలిసి… ఆయన చాలా మంచివారు. సహృదయు లు.” అంది భానుమతి. 

          డాక్టర్ నమ్రత వంక చూస్తూ, “ఇకపోతే, మేడమ్, మీరన్నట్టు… నా చెల్లెలికి నేను అండగా ఉంటాను. ఆమె చదువుకోవడానికి అన్నివిధాలా సలహా సహకారాలు అందిస్తాను కూడా. నేను చెప్పినదంతా విని, నాన్న గురించి చెల్లెలు అర్ధం చేసుకుంటుందని తలుస్తాను.”  అంది భానుమతి.

          “బాగుందమ్మా, పోతే, విష్ణువర్ధన్ గారు మీ కోసం మెసేజ్ పంపారు.. వినండి” అంటూ రికార్డెడ్ మెసేజ్ ఆన్ చేసింది డాక్టర్. నమ్రత. .

          “హలో ఎవెరీబడీ .. మీ అందరికీ… గుడ్ మార్నింగ్. నా జీవితంలోని సంఘటన లకు, నిర్ణయాలకు సంజాయిషీ అంటూ ఏమీ లేదు. మధుమతి జీవితాన్ని నేలరాయా లన్న ఉద్దేశం అసలు లేదు. నా జీవితాన్ని, నా ఆశయాలని నిలబెట్టుకునేందుకు అప్పట్లో… నేను కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోవలసి వచ్చింది. అన్ని బాధ్యతలకు గౌరవాన్నిచ్చి, వాటి నుండి విముక్తి పొందేందుకు తగిన మూల్యం చెల్లించి, పరస్పర ఒప్పందాలతోనే నేను గతంతో విడిపోయాను.

          అయినా సరే ఆ క్రమంలో బాధితురాలిగా నిలిచిన మధుమతి పరిస్థితికి క్షంతవ్యు డిని. నాకు తెలియకుండా ఒక అమాయకురాలి వేదనకి కారణమయ్యానని అర్ధమయ్యి చాలా కృంగిపోతున్నాను. కుటుంబ బాంధవ్యాలని నేను బాగా అర్ధం చేసుకోగలను.  ఏమైనా… చిరంజీవి మధుమతి… నా అప్పటి పరిస్థితిని, ఇప్పటి పరిమితులని అర్ధం చేసుకోవాలని ఆశిస్తాను. భానుమతికి తన చెల్లెలి పై  మమకారం మెండుగా ఉంది. నాకు వారివురు భవిష్యత్తు గురించి ఆలోచన ఉంది. వారివురికీ మంచి జరగాలని ఆశిస్తాను. మధుమతికి చేయూత నివ్వమని డాక్టర్ నమ్రతని … కోరాను. ఆమెకి, ఆమె భర్త వీరేందర్ కి నా ఆశీస్సులు.” అనడంతో విష్ణువర్ధన్ సందేశం ముగిసింది.

          రికార్డర్ క్లోజ్ చేసి, ఎదురుగా ఉన్న వారిని ఉద్దేశించి.. “విష్ణు గారి మెసేజ్ తరువాత, ఇక నా వంతు వచ్చినట్టే. క్లుప్తంగా ముగిస్తాను. ముందుగా వారి గురించే. పాతికేళ్ళ క్రితం… ఇల్లు వదిలినప్పుడు, కొన్నాళ్ళు మా వద్దే ఉన్నాడు మీ నాన్న.

          ఇకపోతే, కుటుంబ వ్యవస్థలో బంధాలు, అనుబంధాలు ముఖ్యమైన పాత్ర పోషిస్తా యి. భార్యాభర్తల నడుమ పరస్పర అవగాహనా, గౌరవాభిమానాలు లోపించినప్పుడు ఘర్షణలు, ద్వేషాలతో కలిసి జీవించడమా? లేక పరస్పర అవగాహనతో విడిపోయి శ్రేయస్కరంగా జీవితాలని సాగించడమా? అన్న నిర్ణయాలు తీసుకోక తప్పదు. 

          ఇలా విడిపోయిన భర్యాభర్తలకి ఎందరికో కౌన్సెలింగ్ చేసిన అనుభవం నాది. కుటుంబాలు ముక్కలయితే, దాని ప్రభావం ఎక్కువగా కుటుంబంలోని పెద్దవాళ్ళ మీద, పసివారి మీద పడుతుంది. పిల్లల మానసిక ఎదుగుదల పై ప్రభావం పడుతుంది. వారిలో భయం, అభద్రతాభావం ఉంటుంది. ఏకాగ్రత లోపిస్తుంది. దాంతో వారిలో వ్యక్తిత్వ వికాసం దెబ్బతినగలదు. వారికి తల్లితండ్రుల్లో ఒకరి పట్ల అపార్ధాలు, అపోహలు ఏర్పడి ద్వేషభావంగా మారితే, అది దుష్పరిణామమే అవుతుంది.

          “కానైతే, బాధాకరమైన పరిస్థితుల నుండి మన మధుమతిలా బయటకి రాగల అవకాశం, భానుమతి లాంటి తోబుట్టువు అందించే ప్రేమ, చేయూతలు దక్కడం అదృష్టమనే అనాలి. తన జీవితం సుఖమయం అవ్వాలని విష్ణు గారిలా … నేనూ ఆశిస్తున్నాను.” అంటూ ఆమె సీటు నిండి లేచి వాచీ వంక చూసింది. “మళ్ళీ కలుద్దాము.  మీకు నా బెస్ట్-విషెస్.” అంటూ సెలవు తీసుకుంది డా. నమ్రత వ్యాస్.

*****

Please follow and like us:

5 thoughts on “లేఖాస్త్రం కథలు-3 – చండశాసనుడు”

  1. లేఖాస్త్రం-3 బాగుంది. తలిదండ్రులు వేరైపోతే పిల్లలు మానసికంగా ఎంత కృంగిపోతారో బాగా చెప్పారు. ఇది కథలా లేదు, ఒక స్త్రీ వ్యధలావుంది. చివరికి ఆమె కథ సుఖాంతమైనందుకు సంతోషంగావుంది.
    – తెన్నేటి శ్యామకృష్ణ
    హైదరాబాదు

  2. ఉమా భారతి గారు
    మీరు ఎంచుకున్న జానర్ చాల బాగుంది. కధ ను నడిపిన విధానం కూడా చాల ఆసక్తి కరంగా ఉన్నది. ధన్యవాదములు!

    1. మిక్కిలి ధన్యవాదాలు పద్మావతి గారు.. చదివి మీ శ్వనాదన తెలియజేసినందుకు సంతోషం ..

  3. కథలను లేఖాస్త్రం లాగా కూడా సంధించి వదల
    వచ్చన్న మాట. ఉమాభారతి గారి లేఖాస్త్రం చదువు
    తుంటే అర్థమయ్యింది. రచయిత్రి ముఖ్యంగా
    మధ్యతరగతి వారి కుటుంబ పరిస్థితులను
    కూలంకషంగా వివరిస్తున్నారు.

    1. సుబ్రహ్మణ్యం గారు.. మిక్కిలి ధన్యవాదాలు మీకు. నాకు కూడా లేఖాస్త్రం .. కాన్సెప్ట్ శీర్షికన రాయడం ఇష్టంగానే అనిపించింది.

Leave a Reply

Your email address will not be published.