అగజానన పద్మార్కం గజానన మహర్నిశమ్ ।
అనేకదంతం భక్తానాం ఏకదంత-ముపాస్మహే ॥
ఈ శ్లోకాలు పాడుకోకుండా ఎటువంటి కార్యక్రమాలు ప్రారంభం కావు అంటే అతిశయోక్తి కాదు. చెలులూ..! ఈ శ్లోకాలు మదిలో మెదలగానే, ఘంటసాల గారు తన గంభీర స్వరంతో ఆలపించిన “వాతాపి గణపతిం భజేహం” అనే కీర్తన జ్ఞప్తికి వచ్చింది కద? ఆ రాగమే హంసధ్వని. ఇవాళ హంసధ్వని రాగ సౌరభాన్ని ఆఘ్రాణిద్దామా?
హంస చేసే ధ్వానం, లేదా ఉఛ్వాస నిశ్వాసాలను పోలి ఉంటుంది అనే ఊహతో ఈ రాగానికి ఈ పేరు వచ్చి ఉంటుంది. ఈ రాగంలో గణపతి కీర్తనలు ఎక్కువగా ఉండటం ఒక విశేషం. గణపతి మూలాధార చక్రానికి అధిపతి. ఈ రాగం మూలాధార చక్రాన్ని ప్రేరేపి స్తుంది. బహుశా అందువల్లనే గణపతి కీర్తనలు ఎక్కువ రచించి ఉండవచ్చు. వాతాపి గణపతిం భజేహం అనే కీర్తన చరణంలో “మూలాధారక్షేత్రస్థితం” అని గణపతి గూర్చిన ప్రస్తావన ఉంది.
ఇక ఈ రాగ విశేషాలకు వస్తే ఈ రాగంలో ఐదు స్వరాలే ఉండటం వలన ఇది జన్య రాగాలలో ఔడవ రాగం, ఉపాంగ రాగం, వర్జ రాగం అని పిలువబడుతుంది. ఈ రాగానికి జనకరాగం 29వ మేళకర్త, ధీర శంకరాభరణ రాగం. కొన్ని ప్రస్తారాలను అనుసరించి కొందరు పండితులు ఈ రాగాన్ని 65వ మేళకర్త మేచ కళ్యాణి జన్యరాగంగా భావిస్తారు. ఈ రాగంలోని స్వరాలు ఆరోహణ, అవరోహణ క్రమంలో “సరిగపనిస”, “సనిపగరిస” ఇందులో చతుశ్రుతి రిషభం, అంతర గాంధారం, పంచమం, కాకలివిషాదం, స్వర స్థానాలు. ఇది వీరరస ప్రధాన రక్తి రాగం. అందువలన కచేరీలలో మొదట పాడటం వలన ఒక ఉత్తేజభరిత వాతావరణాన్ని కల్పిస్తుంది. శుభాన్ని ఆనందాన్ని పెంపొంది స్తుంది.
ఈ రాగాన్ని 16వ శతాబ్దంలో మహాగాయక పండితులు శ్రీ రామస్వామి దీక్షితులు గారు సృష్టించి “శ్రీ సుబ్రహ్మణ్యం” అనే కీర్తన రచించారట. వీరి కుమారుడే శ్రీ ముత్తు స్వామి దీక్షితులు గారు. వారే వాతాపి గణపతిం భజేహం అనే కీర్తన రచించారు. ఇప్పుడు ఈ రాగం ముఖ్యమైన రాగాలలో ఒకటిగా వ్యాప్తి చెంది, కర్ణాటక సంగీతం నుండి హిందుస్తానీ సంగీతంలో కూడా స్థానం సంపాదించుకుంది. హంసధ్వని పేరుతోనే ప్రసిద్ధ విద్వాంసులు ఉస్తాద్ అమన్ అలీ గారు హిందుస్తానీ సంగీతంలో బహుళ ప్రచారం చేశారు.
ఈ రాగం మూలాధార చక్రాన్ని ప్రేరేపితం చేయటం వలన, నరాల బలహీనత, డిప్రెషన్, నిద్రలేమి, తలనొప్పి, వంటి ఆరోగ్య సమస్యలకు ఉపశమనం కలిగిస్తుందట.
ఇక ఈ రాగం లోని కొన్ని ప్రసిద్ధ రచనలు పరికిద్దామా??
శాస్త్రీయసంగీతం |
1 | వాతాపి గణపతిం భజేహం | శ్రీముత్తుస్వామి దీక్షితులు |
2 | గంగణపతే నమోనమః | శ్రీ ముత్తయ్య భాగవతార్ |
3 | వినాయక నినువినా బ్రోచుటకు | శ్రీ వీణ కుప్పయ్యర్ |
4 | రఘునాయకా | శ్రీ త్యాగరాజు |
5 | శ్రీ రఘుకుల మందు | శ్రీ త్యాగరాజు |
6 | గజవదనబేడువే | శ్రీ పురందరదాసు |
7 | హరియే ఎరుగును | శ్రీ అన్నమాచార్య |
8 | దేవా నమోదేవ | శ్రీ అన్నమాచార్య |
9 | చాలదా హరినామ సౌఖ్యము | శ్రీ అన్నమాచార్య |
లలిత సంగీతంలో కూడా ఈ రాగం విరివిగా వాడబడింది.
లలితసంగీతం |
| గీతం | రచన | సంగీతం |
1 | తరలిరారమ్మా | శ్రీదేవులపల్లి కృష్ణశాస్త్రి | పాలగుమ్మి విశ్వనాధంగారు |
2 | నమస్తే శారదా | శ్రీ బోయి భీమన్న | శ్రీమతి ఈ.ఎస్.ఎం లక్ష్మిగారు |
3 | గజానన మము | శ్రీ పి. బుచ్చిరామకృష్ణ దాస్ | శ్రీ పి.వి. సాయిబాబాగారు |
కొన్ని సినిమాపాటలు కూడా చూద్దామా మరి.. ?
సినీసంగీతం |
| గీతం | సినిమా |
1 | శ్రీ రఘురాం జయ రఘురాం | శాంతినివాసం |
2 | స్వాగతం సుస్వాగతం | శ్రీ కృష్ణపాండవీయం |
3 | గోపాల ననుపాలింప రాదా | మనుషుల్లో దేవుడు |
4 | తరలిరాద తనే వసంతం | రుద్రవీణ |
5 | ఈనాడే ఏదో అయింది | ప్రేమ |
చూశారా చెలులూ? 16వ శతాబ్దంలో ఒక మహామహుని హృదయంలో ఉద్భవించిన
ఈ హంసధ్వని రాగం, శాస్త్రీయ సంగీతంలోనే కాక, వివిధ సంగీతాలలో ఎలావ్యాప్తి చెంది రసిక హృదయాలను అలరిస్తోందో?? మరొక మంచి రాగ విశేషాలతో త్వరలో కలుద్దాం.
రాగసౌరభాలు శీర్షికలో తోలిరాగంగా మీరు పరిచయం చేసిన ‘హంసధ్వని’ రాగం చాలా బాగుంది అక్కా. ఎన్నెన్నో మంచి పాటలను చక్కగా ఉదహరిస్తూ వ్రాసారు. అభినందనలు, ధన్యవాదాలు.
Chalaa thanks amma Mani
EXCELLENTdescription of Hamsadhwanifor common people.
Thank you akkayya
ఇప్పుడే ఈ పాటలన్నీ ఒకదాని తర్వాత ఒకటి వినాలన్న కోరిక కలుగుతున్నది. అంత ఆసక్తిని పెంచుతున్నారు, వాణి గారు.
Thanks a lot Nirmala garu for your response