యాత్రాగీతం

అమెరికా నించి ఆస్ట్రేలియా

(ఇటీవల మేం చేసిన ఆస్ట్రేలియా యాత్రని గురించి నా ట్రావెలాగ్ సిరీస్ “యాత్రాగీతం” లో భాగంగా ఈ నెల నుంచి మీకు అందజేస్తున్నాను. చదివి మీ అభిప్రాయం పెట్టడం మర్చిపోకండి.)

-డా||కె.గీత

భాగం-17

మెల్ బోర్న్ – రోజు 2 – క్వీన్ విక్టోరియా మార్కెట్- ఫిలిప్ ఐలాండ్ – పెంగ్విన్ పెరేడ్ టూరు

మెల్ బోర్న్ లో రెండో రోజు మేం ప్యాకేజీటూరులో భాగంగా మొదటి టూరైన ఫిలిప్ ఐలాండ్ – పెంగ్విన్ పెరేడ్ ఆన్ లైనులో మా టూరు సైటులో మాకిచ్చిన రిజర్వేషను వివరాల ప్రకారం ఉదయం పదకొండు గంటలకి మొదలవ్వాల్సి ఉంది. 

          ఆ రోజు ఆదివారం. నిజానికి ఇంటి దగ్గరైతే అంతకు గంటో, రెండుగంటల ముందో దాదాపుగా రోజు మొదలయ్యే సమయం అది. కానీ ఆస్ట్రేలియా టూరులో అప్పటికే ప్రతి రోజూ తెల్లవారుతూనే  లేచి పరుగులు పెడ్తున్న మాకు పదకొండు అంటే చాలా సమయం ఉన్నట్లే. పైగా చిన్నప్పుడు మా స్కూల్లో చదువుకున్న చిన్నారి స్రవంతి పెద్దదై మెల్ బోర్న్ లో నివసిస్తూ ఉండడం, నన్ను కలవడానికి ఆ రోజు ఉదయం వస్తూ ఉండడంతో పొద్దున్నే యథావిధిగా లేచి తయారయ్యేం. మా టైం టేబుల్ లో మరో స్లాట్ ఖాళీ లేకపోవడంతో పాపం ఎనిమిది గంటల కల్లా మా హోటలు దగ్గిరికి వచ్చి మమ్మల్ని కలుసుకుంది స్రవంతి. నా కోరిక మీదట స్రవంతి నన్ను, వరుని దగ్గర్లోని క్వీన్ విక్టోరియా  మార్కెట్ కి తన కారులో తీసుకు వెళ్ళింది. అక్కడే కాస్సేపు క్రొసాంట్ (Croissant) బ్రెడ్స్ తింటూ, కాఫీ తాగుతూ కబుర్లు చెప్పుకుంటూ కూర్చున్నాం. చిన్నప్పుడు అందమైన రెండు పోనీ టైల్స్  వేసుకుని, కళ్ళు ఆర్పుతూ భలే కబుర్లు చెప్పేది స్రవంతి. “గీతక్కా” అంటూ నా వెంటే తిరిగేది. తనని ఇన్నేళ్ళ తరువాత కలుసుకుని కబుర్లు చెప్తూ ఉంటే ఎంతో ఆనందం వేసింది. చిత్రంగా అప్పటి చిన్నపిల్లతో కాకుండా మరెవరితోనో మాట్లాడుతున్నటు అనిపించింది. జీవితాన్ని తనకి నచ్చినట్టు మార్చుకుని, గెలిచిన ఈ కాలపు అమ్మాయిగా తనని చూసి ఎంతో గర్వపడ్డాను. ముగ్గురం మూడు వయసుల వాళ్ళం. అయినా ముగ్గురం కలిసిపోయి హాయిగా కబుర్లు చెప్పుకున్నాం. మా కబుర్లు  తెమిలేసరికి సరిగ్గా 30 ని.ల వ్యవధి మాత్రమే మిగిలింది షాపింగ్ కి. 

          ఆ మార్కెట్ లో వస్తువులు నాణ్యంగా ఉండడం, తిరుగు ప్రయాణంలో 6 కేజీల బరువు ఇక్కణ్ణించి పట్టుకెళ్ళగలగడంతో మిత్రులకి, మా ఇద్దరి ఆఫీసు కొలీగ్స్ కి, మా పిల్లల స్నేహితులకి అంటూ ఆస్ట్రేలియా ప్రత్యేక స్థానిక వస్తువులు గబగబా బేరసారాలు లేకుండా కొన్నాను.  

          క్వీన్ విక్టోరియా మార్కెట్ సిడ్నీలోలాగా గొప్ప భవంతిలో కాకుండా మామూలు షెడ్లలో ఉంది. కాకపోతే 17 ఎకరాలలో విస్తరించిన పెద్ద మార్కెట్. ఇది దక్షిణార్థ భూగోళం లోనే పెద్ద ఓపెన్ ఎయిర్ మార్కెట్ అట. 1878 నించి నిరంతరాయంగా నడుస్తూ ఉంది. ఏటా దాదాపు పది మిలియన్ల మంది టూరిస్టులు ఇక్కడికి వస్తూ ఉంటారట. 

          సోమ, బుధవారాలు ఈ మార్కెట్ కి సెలవు. మిగతా రోజుల్లో ఉదయం 6 గం. నించి మధ్యాహ్నం 3 గం. వరకు తెరిచి ఉంటుంది. పూలు, పళ్ళు, కూరగాయలు, నాణ్యమైన చేనేత దుస్తులు, స్థానిక కళారూపాలు, వస్తువులు, పుస్తకాలు వంటివెన్నో దొరికే పరిశుభ్ర మైన మార్కెట్ ఇది. వస్తూ వస్తూ మాకొక రెండు మామిడిపళ్ళు, స్రవంతికొక ఇండోర్ మొక్క కూడా కొన్నాను. 

          స్రవంతి చక్కగా సమయపాలన చేస్తూ, సరిగ్గా పదకొండుకి మమ్మల్ని తిరిగి హోటలుకి తీసుకొచ్చింది. తనని కౌగిలించుకుని వీడ్కోలు చెప్పినపుడు నాకు గొంతు పూడుకుపోయిన దుఃఖంగా అనిపించింది. అది ఆ  చిన్నపిల్లకి  చిన్నప్పుడెప్పుడో వీడ్కోలు చెప్పినప్పుడు గడ్డకట్టిన దుఃఖం! వీడ్కోలు పునరావృతమైనా కాలం కదలక తప్పదుగా! నా శుభాశీస్సుల్ని తనకి తోడుగా వదిలి ముందుకు నడిచాను.  

          హోటలు లాబీలోకి వచ్చేసరికి సత్య కిందే మా కోసం వేచి చూస్తూ మా టూరుకి మమ్మల్ని ఎక్కించుకోవాల్సిన వ్యాను మా హోటలు నించి రెండు, మూడు మైళ్ళ అవతలెక్కడికో రాబోతున్నదని, మరొక పదినిమిషాల్లో ఊబర్ ఎక్కి అక్కడికి వెళ్ళాలని ఆత్రుతగా చెప్పేడు. ఇక హడావిడిగా పరుగు తీసాం. 

          దాదాపు పదకొండున్నర ప్రాంతంలో  మమ్మల్ని సెంట్రల్ మెల్బోర్న్ లో టూరు వ్యాను వచ్చి ఎక్కించుకుంది. వ్యాను నడిపే లేడీ డ్రైవరు అందరినీ నవ్విస్తూ కులాసాగా  నడపసాగింది. 

          మాతోబాటూ దాదాపు ఇరవై మంది వరకు మొత్తం వ్యానంతా నిండిపోయి ఉన్నారు యాత్రీకులు.

          మధ్యాహ్నం పన్నెండుగంటల ప్రాంతంలో సెయింట్ కిల్డా అనే ఊరి మీదుగా ప్రయాణించాం. 

          మా డ్రైవరు తన పేరు హిల్డా, ఈ ఊరి పేరు కిల్డా కాబట్టి ఈ ఊరంటే తనకి ఇష్టమని చెప్పి మమ్మల్ని నవ్వించింది. 

          మరొక పదిహేను నిమిషాల్లో మా టూర్ లోని మొదటి స్టాపు బ్రైటన్ (Brighton) అనే సముద్ర తీర పట్టణానికి  చేరుకున్నాం. ఈ తీరాన్ని డెండీ స్ట్రీట్ బీచ్ (Dendy Street Beach) అంటారు. ఇంగ్లాండ్ లోని బ్రైటన్ పేరుతో ఉన్న పట్టణ తీరంలాగే ఈ తీరాన్నీ తీర్చిదిద్దారు. ముఖ్యంగా ఇక్కడ ఉన్న బాతింగ్ బాక్స్ (Brighton Bathing Boxes) లనబడే చిన్న రంగురంగుల చెక్క షెడ్ల వంటివి ఇక్కడి ప్రత్యేకత. కంటికింపుగా, కొట్టొచ్చే రంగులతో ఒకదానితో ఒకటి పోటీ పడుతూ ఉంటాయి ఈ షెడ్లు. పేరుకి ఇవి బాతింగ్ బాక్సులే కానీ ఇప్పుడు స్నానాదులకి కాకుండా కేవలం బీచ్ లో కుర్చీలు, టెంట్లు వంటివి భద్ర పరుచుకునే స్థలంగా వాడుతున్నారు. అయితే ఈ బాక్సులు పొందాలంటే సామాన్యం కాదట! ఆ ఊర్లో ఇల్లు ఉండి ఉండాలట. అలాగే ఒక బాక్సు ఖరీదు దాదాపు 3,50,000 డాలర్లంటే ముక్కున వేలేసుకున్నాం. మొత్తానికిదొక స్టేటస్ సింబల్ అన్నమాట! 

          అక్కడ తెల్లని, నును వెచ్చని ఎండలో, మంద్రమైన కెరటాల తీరంలో  సేదతీరుతున్నవారిని, ఆడుకుంటున్న వారిని, ఈ అందమైన బుజ్జి బుజ్జి బాక్సుల్ని చూస్తూ అటూ ఇటూ నడిచేసరికే మాకిచ్చిన నలభై నిమిషాల సమయమూ అయిపో యింది.

*****

(సశేషం)

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.