ఒక సెక్స్ వర్కర్ ఆత్మకథ (నళినీ జమీలా)

-పి. యస్. ప్రకాశరావు

          ‘ఏస్త్రీ కూడా కావాలని సెక్స్ వర్కర్ గా మారదు. పరిస్థితుల ద్వారా తయారు చేయబడుతుంది. చాలా మంది హైస్కూల్ చదువు పూర్తిచేసినవాళ్ళే. ఏ ఉద్యోగమూ దొరకానివాళ్ళూ, భర్తల దౌర్జన్యాలకు గురైనవాళ్ళూ, కట్నం సమస్యతో వీధిపాలైనవాళ్ళూ వేరే మార్గం దొరక్క ఈ వృత్తిలోకి వచినవాళ్ళే ‘ అంటూ తాను సెక్స్ వర్కర్ గా మారడం వెనుకనున్న నేపధ్యాన్ని వివరించింది కేరళలోని త్రిసూర్ కి చెందిన నళినీ జమీలా (18ఆగస్టు1954). నళిని ‘ఆటో బయోగ్రఫీ ఆఫ్ సెక్స్వర్కర్’ , ‘రొమాంటిక్ ఎన్ కౌంటర్స్ ఆఫ్ సెక్స్ వర్కర్’ రాసింది. ఈమె తీసిన డాక్యుమెంటరీలు అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్ లో, రష్యన్ కల్చరల్ సొసైటీ ద్వారా తిరువనంతపురంలో ప్రదర్శించారు. కేరళలోని సెక్స్ వర్కర్స్ ఫోరమ్ కోఆర్డినేటర్, 5 ఎన్ .జి.ఓ సంస్థలలో సభ్యురాలు కూడా. ‘సెక్స్ వర్కర్ ఆత్మకథ’ 13వేల కాపీలు అమ్ముడవడమే కాక వందరోజుల్లో ఆరో ముద్రణ వెలువడింది. మలయాళంలో రాసిన ఈ పుస్తకం ఆ తరువాత తెలుగు ఇంగ్లిష్, ఫ్రెంచ్ భాషలలోకి అనువదించబడింది. ఈ పుస్తకం మీద సెమీనార్లు జరిగాయి. విమర్శలు వెలువడ్డాయి.

          చదువు మూడో తరగతి. తొమ్మిదోఏట పెంకుల ఫ్యాక్టరీలో కూలీ. ఇళ్ళలో పనిమనిషి గా జీవితం ఆరంభం. ఇంట్లోని గొడవల వల్ల పద్దెనిమిదోయేట రోడ్డుపాలై విధిలేక ఒక సారా వ్యాపారికి భార్యగామారి అతని ద్వారా మద్యపానానికి అలవాటుపడింది. భర్త మద్యానికి బానిసై కేన్సర్ తో చనిపోతే అత్తగారి సాధింపులతో త్రిసూర్ చేరి సెక్స్ వర్కర్ గా మారింది. రాత్రి సుఖాన్ని పొందిన పోలీసు అధికారి తెల్లారి ఆమెను పోలీసులకు అప్పగించడంతో ‘నామొట్ట మొదటి క్లయింట్ నేర్పినపాఠం అది’ అంది. చుట్టూఉన్న ప్రతివాడూ నన్ను సెక్స్ కి వాడుకోవాలని చూసేవాడే ‘నా పిల్లల పోషణకు పది రూపాయలు లేకనే కదా ! ‘ఈ వృత్తి చేపట్టాను’ అంటుంది.

          జీవితంలో స్థిరపడాలని మూడు పెళ్ళిళ్ళు చేసుకుంది. ‘సెక్స్ వర్కర్లను తీవ్రంగా వేధించుకుతినేది బ్రోకర్లూ భర్తలూను. ఈ భర్తలు చేసే పనేమీ లేకపోయినా వాళ్ళను డబ్బూ సారా పోయించి పోషించక తప్పదు’ అంటుంది.

          కూతురిపోషణ కోసం కొంత మందికి రెండోభార్యగా ఉన్నా మూడేళ్ళపాటు బిచ్చ మెత్తుకున్నా, ముస్లిముగా మతంమారినా కడుపు నింపుకోవడం కోసం, కన్నబిడ్డ కోసం అంటుంది నళిని. ఆదాయంలేని సమయంలో బస్టాండుల్లోనో రైల్వేస్టేషన్లలోనో తలదాచుకొనే దుర్భర పరిస్థితిని ఎదుర్కొన్నానంటుంది.  ‘ప్రతివాడికీ నేను కావాలి. కానీ నా బిడ్డ అక్కర్లేదు’ అంటుంది నైరాశ్యంతో.

          ఎన్నెన్నో ఒడిదుడుకులు అవమానాలు, ఛీత్కారాలు, అనారోగ్యాలు పోలీసుల అరెస్టులు, గుండాలదాడులు. కోడి గద్దల నుంచి తన పిల్లలను కాపాడు కున్నట్టు యుక్తవయసులో అడుగుపెడుతున్న కూతురి రక్షణ.” మసీదులో గొలుసులతో కట్టి ఉంచిన పిచ్చివాళ్ళకు పరిచర్యలు చేస్తే వాళ్ళ బంధువులు చిల్లరడబ్బులిచ్చేవాళ్ళు.’ పండగ రోజుల్లో బిచ్చమెత్తుకుంటే కాస్తంత అన్నం దొరికేది..నేను చూడ్డానికి అందంగా కనిపించడంతో ఎవరూ జాలిచూపి బిచ్చమేసేవారు కాదు'(పే.93) ” “నా మనసులో ముద్రించుకుపోయిన అనుభవాలను సినిమా దృశ్యాలలాగా కళ్ళ ముందుకు తెచ్చుకుంటూ ఈ పుస్తకం రాసాను” అంటూ తన ఆత్మకథను ముగించింది.

          నళిని తన జీవితానుభవాన్నంతా వివరించి ‘ఇలాంటి దుస్థితి ఏ స్త్రీకీ రాకూడదు’ అని ముగిస్తే బాగుండేది. కానీఈమె తన వృత్తిని సమర్ధించుకుంది. ఉపాధ్యాయులు ఉచితంగా చదువు చెప్తున్నారా? గాయకులు తమ పాటలకు డబ్బులు వసూలు చేయడం లేదా! అన్నివృత్తుల్లో లేని తప్పు మాకే ఎందుకు ఆపాదిస్తారు? అంటుంది. కానీ ఉపాధ్యాయులు గాయకులు సమాజానికి అవసరం. సెక్స్ వర్కర్లు సమాజానికి అవసరం లేదనే విషయాన్నిఈమె గ్రహించలేదు. పురుషాధిక్య సమాజంలో నళినీ జమీలా వంటి స్త్రీలు పడిన పాట్లు తెలుసుకోడానికి మాత్రమే ఈ పుస్తకం పనికొస్తుంది.

( ‘ ఒక సెక్స్ వర్కర్ ఆత్మకథ ‘ 2005లో వెలువడింది. ప్రచురణ.H.B.T. రంగనాయకమ్మ గారు 2006లో దీని పై చక్కని సమీక్ష రాశారు.)

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.