విజ్ఞానశాస్త్రంలో వనితలు-18

ప్రపంచంలో మొట్టమొదటి మహిళా ఎనెస్తిటిస్ట్
రూపా బాయి ఫర్దూన్జీ

– బ్రిస్బేన్ శారద

          రోగికి సర్జరీ చేయడంలో ఎనస్తీషియా పాత్ర చాలా ముఖ్యమైందని అందరికీ తెలిసిన విషయమే. సర్జరీ పేషెంట్లకి మత్తు మందు ఇవ్వడం తప్పనిసరి. రోగి శరీరానికి మత్తు ఇచ్చే వైద్యులే ఎనెస్తీటిస్ట్. ఎనస్తీషియా ఇచ్చే ప్రక్రియ చాలా క్లిష్టమైనది. అంతే కాదూ, ఎనస్తీషియా నుంచి రోగి తిరిగి మేలుకోవడం కూడా కొంచెం టెన్షన్ కలిగించే విషయం. ఇప్పటికీ మెడికల్ కాలేజీల్లో ఎనస్తీషియా స్పెషాలిటీలో సీట్లు సంపాదించడం చాలా కష్టం.

          అటువంటి ఎనెస్తీటిస్టులలో ప్రపంచంలో మొట్టమొదటి మహిళా ఎనెస్తీటిస్టు మన హైదరాబాదుకి చెందిన డాక్టర్ రూపా బాయి ఫర్దూన్జీ అని తెలిసినప్పుడు మనకి సంతోషం కలగడం సహజమే కదా?

          డాక్టర్ రూపా బాయి వృత్తిని గురించీ, హైదరాబాదులోని ఆస్పత్రుల్లో ఆమె అందించిన సేవల గురించీ వివరాలు అందుబాటులో వున్నా, ఆమె జనన మరణాల గురించీ, కుటుంబ వివరాల గురించీ ఎటు వంటి వివరాలు అందుబాటులో లేవు.
ఇప్పుడు మనం ఉస్మానియా వైద్య కళాశాలగా పిలుచుకునే సంస్థ 1846లో నాలుగో నిజాం ప్రభువు, నసీర్-ఉద్-దౌలా స్థాపించారు. ఆయన ఈ వైద్య కళాశాలలో మగవారితో పాటు మహిళలూ చేరాలాని ఆశపడ్డారు, వారిని ప్రోత్సహించారు. అప్పుడది “హైదరాబాద్ మెడికల్ స్కూల్”గా (HMS) పిలువబడేది.

          1885లో నిజాం నవాబు మీర్ మహబూబ్ ఆలీ ఖాన్ తో పాటు, అప్పటి బ్రిటిష్ రెసిడెన్సీలో చీఫ్ సర్జన్‌గా సేవలందిస్తూ వున్న డాక్టర్ ఎడ్వర్డ్ లారీ ఆ సంవత్సరం మెడికల్ కాలేజీలో చేరడానికి ఎన్నిక చేసిన అయిదుగురు అమ్మాయిల్లో రూపా ఫర్దూన్జీ ఒకరు.

          అదే ఆమెని గురించి నమోదయిన మొదటి రికార్డు. 1885లో వైద్య విద్యలో చేరిన రూప 1889లో “హకీం” గా పట్టభద్రురాలయ్యారు. ఆ వైద్య విద్య ఉర్దూ మాధ్యమంలో వుండడం వల్ల, పట్టభద్రులని “డాక్టర్”అని కాకుండా, “హకీం”గా వ్యవహరించే వారు. అధ్యాపకులు ఆంగ్లేయులైతే, ఉర్దూ అనువాదకులుండేవారు.

          నాలుగేళ్ళ వైద్య విద్యలో రూపా ఎనాటమీ, ఫిజియాలజీ, సర్జరీ మొదలైన విషయా లు అధ్యయనం చేసారు. విద్య ముగించి 1889 నుంచి 1917 వరకు రూపా హైదరాబాదు లోని బ్రిటిష్ రెసిడెన్సీ హాస్పిటల్ (ఇప్పటి సుల్తాన్ బజార్ హాస్పిటల్), అఫ్జల్ గంజ్ హాస్పిటల్, జనానా హాస్పిటల్లలో ఎనస్తిటీస్టుగా సేవలందించారు.

          ఎనస్తీషియా అందించడంలో ఆమె నైపుణ్యం గమనించిన ఎడ్వర్డ్ ఆమెని ఇంకా మెరుగైన శిక్షణ కోసం 1909లో ఇంగ్లండు పంపించారు. అయితే ఎనస్తీషియా కొరకు ప్రత్యేకమైన శిక్షణ లేకపోవడంతో, భౌతిక శాస్త్రమూ, రసాయన శాస్త్రమూ చదువుకొన్నా రు. ఈ రెండూ ఎనస్తీషియా సమర్థవంతంగా అందించండానికి ఎంతో అవసరమైన పరిజ్ఞానం. ఆ తరవాత పాశ్చాత్య మెడికల్ డిగ్రీ కోసం జాన్ హాప్‌కిన్స్ యూనివర్సిటీలో చేరారు.

          హైదరాబాదు తిరిగొచ్చి, ఆస్పత్రిలో యథావిథిగా ఎనస్థీటిస్టుగా సేవలందించారు. ఆ రోజుల్లో రూపా బాయి “క్లోరోఫోం కమిషన్స్” అనే కార్యక్రమంలోనూ, హైదరాబాదులో పేథాలజీ కోర్సులోనూ పాల్గొన్నారు. రూపా బాయి గారి గురించీ, ఆమె వృత్తిపరమైన నైపుణ్యాల గురించీ “ఎ రిపోర్ట్ ఆన్ హైదరాబాద్ క్లోరోఫోం కమిషన్స్” అనే పుస్తకంలో వ్రాసారు.

          హైదరాబాదుకి చెందిన పార్సీహర్‌ ముస్జీకౌస్ అనే పరిశోధకుడు యాదృచ్ఛికంగా ఆమె సంపాదించిన సర్టీఫికేట్లన్నీ చూసి, సేకరించారు. ఆయనే ఆమె వృత్తి గురించీ, చదువూ, శిక్షణల గురించీ ప్రపంచానికి వెల్లడి చేసారు.

          ఎన్నో యేళ్ళు సేవలందించి డాక్టర్ రూపా బాయి ఫర్దూన్జీ 1920లో ఛాదర్‌ఘాట్ ఆస్పత్రి సూపర్ఇంటెండెంట్‌గా పదవీ విరమణ చేసారు. ఇంతకంటే ఆమె జీవితాన్ని గురించిన ఎటు వంటి వివరాలూ అందుబాటులో లేకపోవడం ఎంతో విచారించవలసిన విషయం.

***

ఉపసంహారం

చివరగా..
చదవన్నేర్తురు పూరుషుల్ బలెనే శాస్త్రంబుల్ పఠింపించుచో
నదమన్నేర్తురు శత్రు సేనల ధనుర్వ్యాపారముల్ నేర్పుచో
నుదితోత్సాహముతోడ నేలగలరీ యుర్విన్ బ్రతిష్ఠించుచో
ముదితల్ నేర్వగరాని విద్య గలదే ముద్దార నేర్పించినన్

అన్నారు చిలకమర్తి తమ “ప్రసన్న యాదవం” అనే నాటకంలో. శాస్త్రాలు, యుద్ధవిద్య లూ, నాయకత్వమూ- ఏ విద్య ఐనా స్త్రీ పురుష భేదాల్లేకుండా అందరికీ పట్టుబడుతుంది. ఆసక్తీ, ఏకాగ్రతతో సాధన చేస్తే.

          లెక్కలూ, భౌతిక శాస్త్రమూ, రసాయన శాస్త్రమూ, జీవ శాస్త్రమూ, జన్యు శాస్త్రమూ, ఏదైనా సరే, స్త్రీలు పాల్గొని తమదైన సేవ చేసిన-చేస్తున్న, విభాగం లేదంటే నమ్మి తీరాల్సిన నిజం. మన దేశంలోనే ఇస్రో, డిఫెన్సు, యూనివర్సిటీల్లో అద్భుతమైన ప్రతిభ చూపిస్తూ, అంతరిక్షంలోకి దూసుకెళ్తున్న మహిళా మణులున్నారు.

          ఈ వ్యాస పరంపరలో నేను చెప్పదల్చుకున్నది అదే.

          పూలు పంచిన చేతికి కూడా సువాసన అబ్బుతుంది. ఈ వ్యాసాలు వ్రాయడంలో నేను చదివిన పత్రికలూ, దేశ విదేశాల రచనలూ అభిప్రయాలూ నా జ్ఞానాన్ని, అవగాహ నను చాలా పెంచాయనడంలో అతిశయోక్తి లేదు.

          ఈ వ్యాసాలను చదివిన వారిలో ఒకరిద్దరు ఆడపిల్లలో, వారి తల్లి దండ్రులో సైన్సు పట్ల ఆసక్తిని పెంచుకున్నా, ఇతర్లని ప్రోత్సహించినా, వీటి ఆశయం నెరవేరినట్టే. నన్ను నమ్మి ఈ వ్యాసాల ద్వారా నా అభిప్రాయాలనూ, ఆలోచనలనూ పంచుకునే అవకాశం ఇచ్చిన నెచ్చెలి పత్రిక సంపాదకులకు ధన్యవాదాలతో ఈ వ్యాసావళి ముగిస్తున్నాను.

*****

(సమాప్తం)

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.