దేవి చౌధురాణి

మూలం – బంకిమ చంద్ర ఛటోపాధ్యాయ

తెనుగు సేత – విద్యార్థి

          ఇంటావిడ హరివల్లభ బాబు గదిలోకి వెళ్ళింది. ఆయన అప్పుడే నిద్రలేచి తువ్వాలు మీద నీళ్ళు చిలకరించుకుని, ముఖం తుడుచుకుంటున్నాడు. ఆయనను ముందు కొంచెం మచ్చిక చేసుకోవటానికి, “అయ్యో మిమ్మల్ని ఎవరు నిద్ర లేపారు? నేనందరికీ చెప్పా, గోలచేసి మిమ్మల్ని నిద్ర లేపొద్దని. అయినా నా మాట ఎవరు వింటారు?” అన్నది.

          “నా నిద్ర చెడగొట్టేదే నువ్వు. లేకపొతే ఎవరు లేపుతారూ? ఏదో పనిపడి ఉండుంటుంది, అందుకే నిద్ర లేపటానికి వచ్చావు. ఏంటి పని?” అన్నాడా ఇంటి పెద్ద.

          ఇంటావిడ నవ్వుతూ, “ఇవ్వాళ్ళ ఒకపని జరిగిందిలేఅన్నది. ప్రఫుల్ల పున్నమి ముఖమూ, మధురమైన కంఠస్వరాన్ని తలుచుకుంటూ, కొన్ని విషయాలు దాచిపెట్టి, కోడలికి వత్తాసుగా కొన్ని విషయాలు తను కల్పించి చెప్పసాగింది. అవేమీ పని చేయలేదు ఇంటాయన దగ్గర.

          “అంత సాహసమా వాళ్ళకు. ఇప్పుడే చీపురుకట్టతో నాలుగు బాది ఇంట్లో నుంచి లాగి అవతలకి పారెయ్యండిఅన్నాడాయన.

          ‘ఛీ ఛీ, ఏం మాట్లాతున్నారు? ఎంతయిన మన కోడలు కాదా? లోకం ఏదో కూసినంత మాత్రాన కులత అవుతుందా?” అన్నది ఇంటావిడ. ఇంకా సమర్ధిస్తూ చాలా చెప్పింది. అయినా ఇంటిపెద్ద పట్టు విడవలేదు. “ కులతను చీపుళ్ళతో కొట్టి తన్ని అవతల పారెయ్యటమే నా ఆజ్ఞఅని హూంకరించాడు. చివరకు ఇంటావిడ కోపంతో, “చీపుళ్ళతో కొట్టే పనేదో మీరే చెయ్యండి, మధ్యలో నేనెందుకు?” అంటూ విసవిసలాడుతూ అంతకు ముందు ప్రఫుల్లను వదిలి వచ్చిన చోటుకు చేరుకుంది. అక్కడ ప్రఫుల్ల లేదు. అప్పటికే పద్నాలుగేళ్ళ అమ్మాయి తలుపు చాటు నుంచి పిలిచి లోపలకి తీసుకు వెళ్ళి  తలుపు వేసుకుంది.

          “తలుపు ఎందుకు వేశావుఅడిగింది ప్రఫుల్ల

          “ఎందుకంటే, ఎవరూ రాకుండా. నిన్నొకటి అడగాలిఅన్నది పిల్ల.

          “నీ పేరేంటి?”

          “నా పేరు సాగర్.”

          “నువ్వు ఎవరమ్మా?”

          “నేను నీకు సవతిని.”

          “నువ్వు నన్ను గుర్తు పట్టావా?”

          “తలుపు చాటు నుంచి అన్నీ విన్నా.”

          “నువ్వేనా ఇప్పుడు ఇంటికి కాబోయే యజమానురాలివి?”

          “నేనెట్లా అవుతాను, అయ్యో అంత భాగ్యం కూడానూ, నేనేమన్నా నల్లగా ఉన్నానా, ఎత్తుపళ్ళు ఉన్నాయా.”

          “ఎవరు నల్లగా ఉన్నారు? ఎవరికి ఎత్తుపళ్ళూ?”

          “అదే, కాబోయే ఇంటి యజమానురాలికి.

          “అది అంటే, ఆమె ఎవరు?”

          “నీకు తెలీదా! ఎలా తెలుస్తుందిలే? నువ్వు ఇక్కడుంటే కదా. మనకి ఇంకొక సవతి వుంది.”

          “నేను కాకుండా ఇంకొక వివాహం జరిగిందని నాకు తెల్సింది. అది నువ్వే అయి వుంటావనుకున్నా.”

          “లేదు, ముందు తనతోనే పెళ్ళయ్యింది. నాకు వివాహమయ్యి మూడేళ్ళు అవుతు న్నది.”

          “ఏం? అంత అనాకారంగా ఉంటుందా?”

          “నాకయితే దాని మొఖం చూస్తే వాంతి అవుతుంది.” 

          “అందుకనేనా మళ్ళీ నీతో పెళ్ళి చేసారు?”

          “లేదు. ఎవరితోనూ అనమాకే, నీకు మాత్రమే చెపుతున్నాను. మా నాన్న దగ్గర బోలెడు డబ్బు ఉంది. నేనేమో మా నాన్నకు ఒక్కతే కూతురును. డబ్బు కోసమే…” 

          “అర్థమయ్యింది. ఇంకేమీ చెప్పాల్సినవసరం లేదు. కానీ, నీకు అందముంది, డబ్బుంది, మరి అమ్మాయి ఇంటి యజమానురాలు ఎట్లా అవుతుంది?”

          “నేను మా నాన్నకు ఒక్కతే కూతుర్నని చెప్పాను కదా. మా కన్నారు నన్ను అంత తొందరగా ఇక్కడకి పంపించరు. మా కన్నారికి వీళ్ళకీ మాట పడదులే, అందుకనే ఇక్కడ ఉండను. అప్పుడప్పుడూ వచ్చి పోతూ ఉంటాను. రెండు రోజులయ్యింది వచ్చి. ఇంకో నాలుగు రోజులు ఉండి పోతాను.”

          ప్రఫుల్లకు సాగర్ సరళంగా మాట్లాడే అమ్మాయనిపించింది. “నన్ను లోపలికెందుకు తీసుకొచ్చావు?”

          “ఏమన్నా తింటావా?”

          “ఇప్పుడేం తింటానులే!”

          నీ ముఖం ప్రయాణపు బడలికతో వడిలిపోయినట్టు కనిపించింది. ఎంతో దూరం నుంచి వచ్చి వుంటావు. దాహంగా ఉన్నట్టుంది. ఎవరూ నిన్ను ఏమన్నా తింటావా అని కూడా అడగలేదు. అందుకనే పిలిచా.”

          ప్రఫుల్ల ఏమీ తినని మాట వాస్తవమే. దాహంతో పెదాలు ఎండిపోయాయి. “అత్తగారు మావగారి దగ్గరకు వెళ్ళినట్టున్నారు. ఆవిడకు తెలీకుండా నేనేమీ తినను.”

          “లేదు లేదు, నువ్వు వీళ్ళ సొమ్ము తినాల్సిన అవసరం లేదు. నేను మా కన్నారింటి దగ్గర నుండీ తెచ్చుకున్న అప్పచ్చులు ఉన్నాయిలేఅంటూ చూపించింది

          ప్రఫుల్ల ఏదో చెప్పటానికి నోరు కొంచెం తెరవబోతే, సాగర్ గభాలున ఒక పాలకోవాను నోట్లోకి తోసింది. ప్రఫుల్లకు తినటం తప్పలేదు. సాగర్ కొంచెం మంచి నీళ్ళు ఇచ్చింది. నీళ్ళు తాగిన తరువాత ప్రఫుల్లకు కొంచెం నెమ్మదించింది. “నేను కొంచెం తినగలిగాను, పాపం అమ్మ సంగతేంటో?” అన్నది.

          “మీ అమ్మ ఎక్కడకు వెళ్ళింది?”

          “నాకు మాత్రం ఏం తెలుసు. ఇంకా ఇంటి బయటే నిలబడి వుందేమో!”

          “ఒక పని చేస్తే?.”

          “ఏం చెయ్యాలి?”

          “ఠాకురాణిని వాళ్ళ దగ్గరకు పంపించనా?”

          “ఆవిడెవరు?”

          “మన మావగారికి మేనత్త. ఇక్కడే వుంటుంది.”

          “ఆవిడేం చేస్తుంది?”

          “మీ అమ్మకు కొంచెం తినటానికి పెడుతుంది.”

          “అమ్మ ఇంటి తిండి మాత్రం తినదు.”

          “సర్లే, ఎవరో ఒక బ్రాహ్మలింట్లోనే తినాలి కదా.”

          “నీ ఇష్టం వచ్చినట్టు చెయ్యి. అమ్మది తీరే కష్టం కాదు.”

          సాగర్ వెళ్ళి ఠాకురాణికు సంగతి వివరించింది. పెద్దావిడ, “అవును తల్లి, ఇంటికి వచ్చిన వాళ్ళకి భోజనం పెట్టకుండా పంపిస్తామాఅంటూ, ప్రఫుల్ల తల్లిని వెతకటానికి బయలుదేరింది.

          “నువ్వు ఇందాక మాట్లాడుతున్నావే, అట్లాగే మాట్లాడవా చెల్లిఅన్నది ప్రఫుల్ల.

          “చెప్పటానికి ఏముంటాయి? ఏమీ లేవు. ఎలాగూ నేను ఇక్కడ వుండేదాన్ని కూడా కాదు. ఎంత తియ్యగా వున్నా, క్రిందపడిన మామిడిపండుని దేవుడికి ప్రసాదంగా పెట్ట లేము కదా! అలా వుంది నా పరిస్థితి. ఎలాగూ వచ్చావు కదా, నువ్వు ఇక్కడే వుండు.నేనైతే దెయ్యం మొహం కూడా చూడలేను.”

          “నేనైతే వుండటానికే వచ్చాను, నన్ను వుండనిస్తారనేమిటి?”

          “చూడు, మావగారు వుండమన్నా, లేకపోయినా, నువ్వు ఇక్కడే వుండు.”

          “వెళ్ళను, కానీ ఏం చెయ్యాలి? ఎందుకు వుండాలనుకుంటున్నానో తెలీదు. లేకపోతే, వుండి కూడా …”

          “లేకపోతే?”

          “నువ్వు నా జన్మ సార్ధకం చేయించగలవా?”

          “అంటే, అదేమిటి?”

          ప్రఫుల్ల కళ్ళలో నీళ్ళు తిరిగాయి. “అర్ధం కాలేదా చెల్లిఅన్నది.

          సాగర్‌కి అప్పుడు అర్ధమయ్యింది. “సాయంకాలమయ్యిన తరువాత ముందు గదిలోకి వచ్చి కూర్చో. పగలు ఆయన దర్శనం దొరకదుఅన్నది.

          “చెల్లీ, నా భవిష్యత్తు ఏమిటో ముందు తెలుసుకోవాలి. తరువాత నీకు ఒక మంచి బహుమానం ఇస్తాను. నాకు భాగ్యముంటే ఆయనతో ఒకసారి కలుస్తాను. ఆయన ఏమం టారో, అది కూడా విని వెళ్ళతానుఅని ప్రఫుల్ల గది నుండి బయటకి వెళ్ళింది

          అప్పటికి అత్తగారు ప్రఫుల్లను వెతికే పనిలో వున్నది. ప్రఫుల్లను చూసిఎక్కడకి వెళ్ళావమ్మాయి?” అంటూ ప్రశ్నించింది.

          “ఇల్లూ, వాకిలీ చూస్తూ నిలబడ్డాను.”

          “ఇదిగో అమ్మాయీ, ఇది నీ ఇల్లూ వాకిలి కూడాను. కానీ ఏం చేస్తాం, పేచీ రకంగానూ రాజీకి వచ్చేటట్లు లేదుఅన్నది అత్తగారు.

          ఇది విని ప్రఫుల్ల కృంగి క్రిందకు చతికిలబడిపోయి నెత్తిమీద చెయ్యివేసుకుని కూర్చుంది. ఏడుపేమీ మొదలుపెట్టలేదు, మౌనంగా అలాగే ఉంది. ఇది చూసి అత్తగారికి జాలివేసింది, ఇంకొకసారి ఇంటాయనను అడిగి చూద్దామనుకుంది. “ పూటకి ఇక్కడే ఉందువుగానీలే. రేపు చూద్దాంఅన్నది.

          “మా అమ్మ చరఖాతో నూలు ఒడుక్కుని సంపాదించే సొమ్ముతో ఒక్కరికి కూడా పొట్ట నిండదు. మరి నేను ఎలా బ్రతకాలో మావగారిని ఒకసారి అడిగి చూడండి. నేను నీచురాలినైనా, తుచ్ఛురాలినైనా, రకంగా చూసుకున్నా మీ కోడలినే కదా. మరి ఆయన కోడలిగా నాకు రోజులెలా గడవాలి?” అని ప్రఫుల్ల నెమ్మదిగా మనవి చేసుకుంది.

          “తప్పకుండా అడుగుతాఅన్నది అత్తగారు

          సాయంకాలం అయ్యేటప్పటికి అదే ముందుగదిలో ప్రఫుల్ల, సాగర్ కూర్చుని మాట్లాడుకుంటున్నారు. అప్పుడెవరో తలుపు కొట్టారు

          “ఎవరదిసాగర్ అడిగింది.

          “నేను.”

          సాగర్ ప్రఫుల్ల చెయ్యిపట్టుకుని లోగొంతుకతో, “తలుపు గొళ్ళెం తియ్యమాకు, దెయ్యం వచ్చిందిఅన్నది

          “సవతా?”

          “అవును, మాట్లాడమాకు, గమ్మునుండు.”

          “లోపల ఎవరున్నారు? సాగర్, మాట్లాడవేంటి?” అని వినపడింది తలుపుకి అటు వైపునుండి.

          “ఎవరు నువ్వు? మంగలిదానివా?” అన్నది సాగర్.

          “నువ్వు చావవే, నేను మంగలిదాన్నేమిటి?”

          “మరి ఎవరవు?”

          “నీ సవతిని. సవతిని (గట్టిగా), నయనని.”

          అసలు అమ్మాయి పేరు నయనతార. ఇంట్లో నయన కోడలా అని పిలుస్తారు. సాగర్ నేమో సాగర్ కోడలా అని పిలుస్తారు

          “ఎవరు, అక్కా! పొరపాటు అయ్యిందిలే, మంగల్దయితే తెల్లగా, అందంగా వుంటుంది కదా!” అన్నది సాగర్.

          “నువ్వు చావవే, మంగలిదానికన్నా నల్లగా వున్నానా నేను. పధ్నాల్గేళ్ళ పిల్లవి కాబట్టి బ్రతికిపోయావ్. లేకపోతే తాట తీసేదాన్ని.”

          “నాకు పధ్నాలుగేళ్ళు అయితే మాత్రం ఏమిటిలే? నీకు మాత్రం పదిహేడేళ్ళు  ఉన్నాయి. నీకంటే నాకు మంచి రూపం ఉంది, యవ్వనం కూడా ఉందిఅన్నది సాగర్.

          “ రూపం, యవ్వనం అంతా కలిపి మీ కన్నారింట్లో గడుపుకో. నిన్నో మాట అడగటానికి వచ్చాను.”

          “ఏమిటక్కా అది?” కొంత వెటకారంగా అడిగింది సాగర్.

          “ఏమని అడగమంటావు? నువ్వేమో సాయంకాలానికే తలుపులేసుకుని కూర్చున్నా వు. కనీసం తలుపు తియ్యటం లేదు.”

          “నేను దాక్కుని మిఠాయిలు తింటున్నా. ఏం నీక్కూడా కావాలా?” నయనకు మిఠాయిలంటే చాలా ఇష్టమని సాగరుకి తెలుసు.

          “తిను, తిను. నేను అడగటానికి వచ్చింది ఇంకొకరు కూడా వున్నారని విన్నాను. విషయమేమన్నా నీకు తెలుసా?”

            ఇంకొకరంటే? ఇంకొక మొగుడా?”

          “అది కాదే, అలా అసలెప్పుడన్నా జరుగుతుందా?”

          “అలాగే జరిగితే బాగుంటుందిలే, ఆయన కూడా నిన్ను చూసిన తరువాత, నన్ను వెంట పెట్టుకుని వెళ్ళతాడు.”

          “ఉసేవ్, అట్లాంటి మాటలు మాట్లాడకూడదు.”

          “అయితే, ఆలోచనలన్నీ మనసులోనే పెట్టుకోవాలా?” అన్నది సాగర్.

          “నీ నోటికొచ్చినట్లు వాగుతున్నావ్.”

          “నువ్వు సూటిగా అడగకపోతే మరి ఎలా చెప్పటమే అక్కా?”

          “ఇంకొక కోడలు వచ్చిందట కదా!” అన్నది నయన.

          “ కోడలు? ఎవరి కోడలు?”

          “ కోడలే, నాకు తెలుసు.”

          “నేనైతే వినలేదుఅన్నది సాగర్.

          “అదే, ఆ కులత …”

          “నేను అది కూడా వినలేదు.”

          “మనకి ఇంకొక సవతి, అది కులత అని నువ్వు వినలేదూ?”

          “లేదే!”

          “ఆయన మొదటి పెళ్ళి తాలుకాది కులత  …”

          “బ్రాహ్మణ కన్య కాదూ …?” 

          “బ్రాహ్మల అమ్మాయే అయితే, ఆయనతో కాపురానికెందుకు రాదూ …?”

          “ఒకవేళ ఆయన నిన్ను వదలి నా దగ్గరికి వచ్చేస్తే నువ్వు కులత అవ్వుతావా?” అంటూ ఎగతాళి చేసింది సాగర్.

          “ఎందుకే నా మీద అలా విరుచుకుపడతావు, ముచ్చుమొఖందానా.” 

          “అవునా, మరి నీకు అరవటం రాదన్నమాట!”

          “నువ్వు, డబ్బున్న ఇంటి పిల్లవు, పొగరెక్కువ, అందుకునే నామీదెప్పుడూ తూల టం, తిట్టటం. అత్తగారితో చెపుతాను వుండుఅంటూ వెనక్కిదిరిగి రుసరుసలాడుతూ పోబోయింది నయన.

          అప్పుడు సాగర్ తలుపు గొళ్ళెం తీసి, “అక్కా వెళ్ళోద్దులే, తలుపు తీసాను చూడుఅన్నది. నయనకు అంత కోపంలోనూ, ముందుకు వెళ్ళటమా లేకపోతే వెనక్కి తిరిగి సాగర్ గదిలోకి వెళ్ళటమా అని ఒక క్షణం ఆలోచించింది. సాగర్ తెచ్చుకున్న మిఠాయి లు తింటే పోలా అనుకుని వెనక్కి తిరిగి గదిలోకి వస్తే, మిఠాయిలు కనబడలేదు, ఇంకొక అమ్మాయి ఉంది

          “ఇదెవరూఅడిగింది నయన.

          “ప్రఫుల్ల.”

          “ప్రఫుల్ల ఎవరు?”

          “నువ్వు కులత అన్నావే, కోడలు.”

          “అరే, అమ్మాయి ఎంత అందంగా ఉన్నదో!” కొంత నిర్లిప్తంగా, ఆశ్చర్యంగా అన్నది నయన

          “నువ్వేమీ తక్కువ కాదులేఅన్నది సాగర్ నయనని.

          “చుప్, కాసేపు గొడవ ఆపు. అవును, సాగర్! అమ్మాయి నీకంటే కూడా అందంగా ఉన్నదే!!!” అంటూ ముక్కు మీద వేలేసుకుంది నయన.

*****

(సశేషం)

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.