చిత్రలిపి
నల్లని నవ్వుల చల్లని దేవుడు
-ఆర్టిస్ట్ అన్వర్
కష్టకాలంలో నేతాజీ ట్యూషన్ సెంటర్ ఎదురుగా రాముడు ఉన్నా ఏం లాభంలేక పోయింది. పొద్దున ప్రయివేట్ సెంటర్ లో అడుగుపెట్టే ముందే గుడిలోకి కాళ్ళు కడుక్కుని చల్లని నల్లని తడి బండల మీద తడికాళ్ళు ముద్రలేకుండా నడిచి దేవుడికి ఒక నమస్కార ముద్ర పెట్టుకుని. పూజారి ఇచ్చిన చిన్న గారె ముక్క తినుకుంటూ చూస్తే గుడి ఆవరణలో తెల్లగా పసుపు పచ్చగా ఇంతకన్నా అందమైన పూవు లేదనిపించే గన్నేర్లు. రాముణ్ణి అని ఏం లాభం ట్యూషన్ టీచర్ తంతునప్పుడు ” హే రామా బచావ్ ” అన్నపాపాన పోలా. “రఘు కుల జల నిధి సోమ శుభ్రంగా చదువు అనుగ్రహించు తండ్రి” అని వేడుకున్న పుణ్యానా పోలా. రాముడు అంటే పరగడుపున గారెముక్క , పొద్దున్నే కనపడే నల్లని నవ్వుల చల్లని దేవుడు అంతే.
నిన్న రాత్రి మా వంటింట్లో ఒక తల్లీ కొడుకులు కలిసి వడపప్పు పానకం పథకం రచిస్తున్నారు. పూజ గూడులో రాముడు, అల్లాహ్ తో అంటున్నాడు. బొత్తిగా సౌరభం లేని ప్రసాదం అబ్బా ఇది. వచ్చే నెల రంజాన్ వస్తుంది కదా ఇదే వంటింట్లో సాంబ్రాణి వాసన తగిలిన పలావు వాసన మత్తే మత్తు. అందుకే అన్వర్ వాళ్ళింట్లో ఉండటం నాకు ఇష్టమనికూడా అంటున్నాడు. ఊరికే అలా అంటున్నాడు కానీ ఆయన మా ఇంట్లో ఎందుకు ఉంటాడు. ఆయన బాపు రమణ గార్ల గుండెల్లో సీతాసమేతంగా ఉంటాడు. ఆ గుండెల్లోని రాములవారి పాదాల చెంత బాపురమణలు ఉంటారు. అందువలన మా బాపుగారికి, రమణ గారికి మీకూ నాకూ శ్రీ రామ నవమి శుభాకాంక్షలు!
*****
నల్లని నవ్వుల చల్లని జేజికి
చక్కని బొమ్మల అన్వరాంజలి
బాపూ రమణల జ్ఞాపకాలతో
శ్రీరామునికీ చక్కిలిగిలి!