షరతులు వర్తిస్తాయి

(నెచ్చెలి-2024 పోటీలో తృతీయ బహుమతి పొందిన కవిత)

– పెనుగొండ సరసిజ

ఇక్కడ నీ ఆశలకు లక్ష్యాలకు ఏం దిగుల్లేదు.
ఇక్కడ సమానత్వానికి స్వేచ్ఛకి ఏం కొదవలేదు.
ఎలాగంటావా?
నీ ఆశలవైపు ఆశగా చూస్తావ్.
ఓ దానికేం !అంటూ కొన్ని ఆంక్షలు జోడించి
బేశుగ్గా అనుమతిస్తారు.
నీ లక్ష్యం చెప్పాలనుకున్న ప్రతిసారి
షరా మామూలుగా షరతులన్నీ చెప్పి మరీ పంపిస్తారు .
నీకేం పరవాలేదంటూనే
పడినా, లేచే కెరటం లాంటి
నీ పక్కటెముకల్ని
పట పట విరిచేస్తారు.
నీ చరిత్రకు అన్ని కోణాలు
బాణాలై గుచ్చుకుంటూనే ఉంటాయి.
ఇక్కడ
నాలాంటి నువ్వులు
నీలాంటి నేనులు
అందరూ సమానమే!
నువ్వు ఎంత చదివినా సరే
సంపాదన లేకపోతే, దద్దమ్మవైపోతావ్.
పోనీ సంపాదించావో, పెత్తనాలదానివైపోతావ్.
నువ్వెన్ని ఈఎంఐ లు,ఇన్సూరెన్స్ బిల్లులు కట్టు..
కాదన్నప్పుడు మాత్రం
కానిదానివైపోతావ్.

నువ్వెన్ని దశావతారాలన్నా ఎత్తు..
అయ్యో ఇంకా తల్లి కాలేదా ?
అంటూ నీ తలదించేస్తారు.

రెండు చేతులను నాలుగుగా చేసి
ఎంతందంగా ఇల్లు నడిపినా సరే,
హ.. హ..
ఆ నాలుగు చపాతీలు భూమంత గుండ్రంగా రాలేదని
నీ బుర్రను చపాతీలా మాడుస్తారు.
నువ్వెంత ఇంటీరియర్ డిజైనర్లానైన
ఇంటిని దిద్దు,
ఏ మర్చిపోయిన పచ్చి టవల్నో పట్టుకొని
నీ ఊపిరి పట్టు బిగిస్తారు.
నువ్వేన్నయినా చెప్పు,
పెన్ను పడితే గరిట పట్టలేదంటారు
గరిట పడితే గంగిరెద్దంటారు.
తెలివిగల్ల ఆడాళ్లను చూస్తే తెగ పొగుడుతారు.
అదే తెలివిగల్ల భార్య అయితే మాత్రం మాకొద్దంటారు.
నువ్వెంత పెద్ద అద్భుతాన్నయినా సృష్టించు .
ఆఖరికి అంతరిక్షాన్ని అధిరోహించు
ఆటల్లోనో లేక ఆటవిడుపులోనో వేసుకున్న
ఆ పొట్టి బట్టల్నే వాళ్ళు ప్రస్తావిస్తారు.
నువ్వు నేను మాత్రమేనా?
ఎన్ని పతకాలు తెచ్చి దేశ పతాకాలెగరేసిన వాళ్ళయినా సరే
ఓడిపోయినప్పుడల్లా ఒక్కసారిగా కొన్ని పుచ్చిన మెదళ్ళు
నీ కులాన్నో, మతాన్నో ముందేసు కూర్చుంటాయి.
సమాజాన్ని ఎదురొడ్డి సాధించిన
నీ విజయాలు ఎన్నయినా ఉండని

నువ్వు చెప్పినట్టు విననప్పుడల్లా నీకిక విరమణయే.
అందుకే ఇక్కడ నువ్వు, నేను
ఫోఘాట్..మాలిక్..కటారియా
అందరూ సమానమే.

*****
Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.