సఖులు! అలౌకిక ఆనందాన్ని కూర్చేది, సకల సమ్మోహన కరమైన “మోహన రాగం ” గురించి ఈనెల తెలుసుకుందామా? ఇది అత్యంత పురాతనమైనది, విశ్వవ్యాప్తం అయినది కూడా! ఆ విశేషాలు ఏమిటో తెలుసుకుందాం.
మోహనరాగం 28వ మేళకర్త హరికాంభోజి రాగ జన్యం అవటం వలన ఉపాంగరాగం అని కూడా అంటారు. ఇందులోని ఆరోహణ, అవరోహణ “సరిగపదస”“సదపగరిస”. ఇందులో స్వరస్థానాలు షడ్జమం, చతుశృతిరిషభం, అంతరగాంధారం, పంచమం, చతుశృతి దైవతం. ఈ రాగంలో మధ్యమం, నిషాదం వర్జ స్వరాలు. ఐదే స్వరాలు ఉండటం వలన ఔడవ రాగం అంటారు. ఇది సర్వస్వరగమకవరీకరాగం, రక్తి రాగం.
ఈ రాగం అత్యంత పురాతనమైనది, ప్రసిద్ధమైనది. 3 వేల సంవత్సరాల పూర్వమే తమిళ సాంప్రదాయ సంగీతంలో “ముల్లై పన్” గా ప్రచారంలో ఉన్నది. హిందుస్తానీ సంగీతంలో ఈ రాగాన్ని “భూప్”లేదా “భూపాలి” రాగంగా పిలుస్తారు. విశ్వవ్యాప్తంగా హంగేరీ, స్వీడన్, మంగోలియా, రష్యా, ఆస్ట్రియా, యూరప్, అమెరికా, చైనా, జపాన్ వంటి అనేక దేశ సాంప్రదాయ సంగీతాలలో కూడా ప్రసిద్ధమైనది. అనేక నృత్య గీతాలు ఈ రాగంలో కూర్చబడ్డాయి. థాయిలాండ్ జాతీయ గీతం ఈ రాగంలోనే కూర్చబడింది.
ఈ రాగం చాలా ఆహ్లాదాన్ని, ఉత్సాహాన్ని పంచటమేకాక, చాలా తేలికైన రాగం. సమ్మోహన కరం. మన పౌరాణిక నాటకాలలో చాలా ఎక్కువగా ఉపయోగించపడుతోంది.
ఎటువంటి సంగీతానికైనా అనువైన రాగం. ఏ సమయంలోనైనా పాడదగినదే కానీ, ఉత్సాహాన్ని ఉద్వేగాన్ని నింపే రాగం కనుక, సాయం సమయం శ్రేష్టమైనది. మనసుని ప్రశాంత పరచగలదు. వినేవారి దుర్మోహలను అణచివేస్తుంది. జ్ఞాపకశక్తిని, ఏకాగ్రతను పెంపొందిస్తుంది. వీర, భక్తి, రౌద్ర రసాలను ఆవిష్కరించగల రాగం. ప్రేమ గీతాలకు చాలా అనువైన రాగం కనుక అనేక సినీ గీతాలకు ఈ రాగం ఉపయోగించబడింది.
ఈ రాగానికి సంబంధించిన కొన్ని గాధలు తెలుసుకుందామా?
- త్యాగరాజ స్వామి వారి కుమార్తె వివాహ వేడుకలు ముమ్మరంగా సాగుతున్నాయి స్వామివారి ప్రియ శిష్యుడు వాలాజాపేట వేంకటరమణ జాడ తెలియక స్వామి వారు ఒకింత ఆదుర్దాగా, కొద్ది కోపంగా ఎదురుచూస్తున్నారు. ఆ రోజుల్లో రైలు సదుపాయం లేదు. శిష్యుడు వేంకటరమణ కోదండరాముని చిత్రాన్ని స్వయంగా చిత్రించి దానిని భుజము పై పెట్టుకుని వాలాజాపేట నుండి తిరువయ్యురు సరిగ్గా సమయానికి చేరారట. ఆ కోదండరామయ్య చిత్రాన్ని చూడగానే తనలోని ఆవేశం, క్రోధం, ఆత్రుత వంటి దుర్మోహలు అన్ని నశించగా, పరవశుడై “నను పాలింపగ నడచి వచ్చితివా, నా ప్రాణనాథ” అనే కీర్తనని ఆశువుగా మోహన రాగంలో ఆలపించారట.
- త్యాగయ్యకు రాముని పై భక్తి, ప్రేమ అపారము. మేలుకొలుపు నుండి ఏకాంత సేవ వరకు నిత్యము క్రమం తప్పక చేసేవారు. కటిక పేదరికంలో ఉన్నా పాటించేవారు. ఒకరోజు వారి కుటుంబంలో ఎవరికీ తినటానికి గింజలేక పస్తు ఉన్నారట. రాత్రివేళ ఒక కుటుంబం వారి ఇంటికి విచ్చేశారట. తినటానికి కానీ, పెట్టటానికి కానీ ఏమీ లేదని త్యాగయ్య విచారించారట. కుటుంబ పెద్ద విచారించవద్దనీ, తమ వద్ద అన్ని సరుకులు ఉన్నాయననీ, తమ సేవకుడు వండి పెట్టగలరనీ ధైర్యం చెప్పాడట. చెప్పిన ప్రకారం ష డ్రసోపేతమైన భోజనాన్ని స్వామివారి కుటుంబం, అతిధి కుటుంబం ఆరగించారట. పొద్దున వరకు కబుర్లు చెబుతూనే అతిధి కుటుంబమంతా అదృశ్యం అయ్యారట. ఆవచ్చినవారు సీతారాములు, ఆంజనేయుడుగా అర్థమయి,“భవనుత నా హృదయమున రమింపుము” అనే మోహనరాగం కీర్తనని పాడారట.
- తంజావూరు ఆస్థానంలో గోవిందయ్య అనే గొప్ప సంగీత విద్వాంసుడు ఉండేవాడు. ఆయన మోహనరాగం పాడటంలో దిట్ట. ఇది విన్న ఉడయార్ మహాపాలయం జమీందారు గోవిందయ్య మోహన రాగం పాడితే వినాలని కోర్కెతో, తమ సంస్థానానికి రప్పించాడు. ఎన్ని రోజులైనా గోవిందయ్యకు పాడటానికి పిలుపు రాలేదు. సకల మర్యాదలు మాత్రం జరుగుతున్నాయి. కారణం తెలియరాక, ఖిన్నుడై ఒకరోజు తన మూట ముల్లెతో సంస్థానం విడిచి తన ఊరికి వెళ్ళిపోయాడు. ఒకనాడు చాలా ఆకలిగొని, ఊరి చివర కొలనిలో స్నానం చేసి తను తెచ్చుకున్న ఆహారం భుజించి,కొలనులోని చల్లని నీరు తాగి, ఒడ్డున కూర్చొని, మనసారా మోహనరాగాన్ని ఆలపించటం మొదలెట్టాడట. మనసులోనే తన గానం జమీందారు వింటే ఎంత బాగుండు అనుకున్నాడట. ఈయన వెనకనే మారువేషం లో తిరుగుతున్న జమీందారు ఆ గానానికి పరవశుడై తన ఆస్థానానికి తిరిగి తీసుకుని వెళ్లి అనేక సత్కారాలు చేశాడట. జమీందారుకి గోవిందయ్య మనఃపూర్వకంగా పాడే మోహనరాగం వినాలని కోరిక. అందుకే అలా చేసి విన్నాడట. ఏ రాగాన్నైనా మనసు విప్పి పాడితే ఉండే అందం వేరు మరి.
ఇక ఈ రాగం లోని కొన్ని రచనలు పరిశీలిద్దామా..
శాస్త్రీయ సంగీతం |
1 | నను పాలింప | శ్రీ త్యాగరాజు |
2 | భవనుత | శ్రీ త్యాగరాజు |
3 | ఎవరు రా | శ్రీ త్యాగరాజు |
4 | మోహన రామ | శ్రీ త్యాగరాజు |
5 | రారా రాజీవ లోచన | మైసూరు వాసుదేవాచారి |
6 | పెద్ద దేవుడని | మైసూరు సదాశివరావు |
7 | నరసింహ ఆగచ్చ | ముత్తుస్వామి దీక్షితులు |
8 | నాగలింగం నమామి సతతం | ముత్తుస్వామి దీక్షితులు |
- శ్రీ శ్యామశాస్త్రి ఎందుకనో ఈ రాగంలో రచనలు చేయలేదు
అన్నమాచార్య కీర్తనలు
- చేరి యశోదకు
- పొడగంటిమయ్య
- అదే చూడరే
- ఇతడొకడే
- జగన్మోహనాకార
- తత్తాదిగుడి ధీమ్ధీమ్
- నీవు తురుగము మీద
- గురుతెరిగిన దొంగ
లలిత సంగీతం |
1 | ముజ్జగాలు మోహించగా | బోయి భీమన్న | పి శాంత కుమారి |
2 | విశాల భారతదేశం మనది | దాశరధి | ఉపద్రష్ఠ కృష్ణమూర్తి |
3 | మోహన రాగ రాగిణి | బోయి భీమన్న | చిత్తరంజన్ |
సినిమా సంగీతం |
1 | మోహన రాగ మహా | మహామంత్రి తిమ్మరు | సుశీల, ఘంటసాల |
2 | లాహిరి లాహిరి | మాయాబజార్ | ఘంటసాల |
3 | ఉందిలే మంచి కాలం | రాముడు భీముడు | సుశీల, ఘంటసాల |
4 | చందన చర్చిత | తెనాలి రామకృష్ణ | సుశీల |
5 | ఘనాఘన సుందర | భక్తతుకారం | ఘంటసాల |
6 | ఈ నల్లని | అమరశిల్పిజక్కన్న | ఘంటసాల |
7 | ఏదో ఏదో అన్నది | ముత్యాలముగ్గు | పి రామకృష్ణ |
8 | జయ కృష్ణ ముకుంద మురారి | పాండురంగ మహత్యం | ఘంటసాల |
చూశారా ఎన్ని రకరకాల భావాలను చిందించే కీర్తనలు, పాటలు ఉన్నాయో ఈ రాగంలో? సమ్మోహన కరమైన, అత్యంత పురాతనమైన, అతి తేలికైన, నవరసాలను ఒలికించగల మోహనరాగ విశేషాలు మీకు నచ్చాయా? వచ్చేనెల మరొక మంచి రాగంతో కలుద్దాం. అంతవరకు సెలవు నమస్తే.
చాలా బాగా వివరించారు వాణి గారు.. మోహన రాగ లక్షణాలని.అలాగే వివిధ కృతులు,లలిత , సినిమా పాటలు కూడా
తోడి రాగం గురించి వినాలని చాలా ఆశగా ఉంది.ఆ రాగం నాకు ఎంతో ఇష్టం ,
Chalaa thanks Mani garu. Thappaka thodi ragam gurinchi vivaristu article rastaanu