అమ్మకు నేనేం చేశాను?

 -డా. మూర్తి జొన్నలగెడ్డ

తననొప్పులుపడి తాను
తన రక్తం పంచిస్తేను
ఈ లోకానికి వేంచేశాను
బువ్వెడితే భోంచేశాను
జోకొడితే పడకేశాను

విసిగించి వేధించాను
సహనానికి ప్రశ్నయ్యాను
మరుగయ్యి కవ్వించాను
కనుపించి నవ్వించాను

అమ్మేమరి అన్నింటానూ,
తలపైన చమురయ్యేను
నిగనిగల నలుగయ్యేను
శ్రీరామునిరక్ష య్యేను

నట్టింట్లో పండగతాను
పండగలో విందుగతాను
విందుల్లో సందడిగాను

నా చదువుల్లో జ్ఞానంగాను
నా సందెలలో ధ్యానంగాను
బరువుల్లో బాసటగాను
నేనడిచే బాటగ తాను
ఎన్నెన్నని నే చెబుతాను

ఆ అనుభవాల జలతారును
హృదిలోనూ మదిలోనూ
మమతల మడతలతోను
మహపదిలంగా దాచాను
మరివిడిచానో ఆతాను,

ఉగ్గుపాలతో మొదలయ్యేను
ఆ అనుభవాలు అలలయ్యేను
వెనుతిరిగి చూస్తేను
క్షీరసాగరమదియేను
ఎపుడైనా మధిస్తేను

ఆమె జ్ఞాపకాలకు సంజీవనిలా
చిందేనొక అమృత బిందువిలా!

******

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.