ది బిచ్ (అమ్మ తల్లి)

-వి.విజయకుమార్

నాకు ముందే తెలుసు
నువ్వీ వీధిలో నెలలు నిండి
భారంగా తిరుగుతున్నప్పడే
యేదో ఒక రోజు
గంపెడు బిడ్డలతో
ప్రత్యక్షమౌతావనీ
ముత్యాల్లాంటి పసిబిడ్డల్ని
వేసుకుని దీనంగా చూస్తూ
నా అశక్తతను ప్రశ్నిస్తావని!

కడుపు నిండా పాలు తాగి
వళ్ళో ఈ బుజ్జిగాడు
గోముగా గీరుతూ
వెచ్చని పరుపు మీద
గుర్రుగా చూస్తూ
ఈ దేశపు దొరబాబులా
వెచ్చగా
ఇక్కడ!

నెల కూడా నిండని నీ పసికూనలు
వర్షపు చినుకుల్లో ముద్దయి
శిధిలమైన నీ దేహానికి
వేలాడే
తోలుతిత్తుల్లో
రాని నెత్తుటి జీరల
పాలచుక్కల కోసం
దీనంగా చూస్తూ
రేపటి రోజు
బతుకు విలువ తెలీని
యే మోటారు చక్రం కిందో
యే సంస్కార హీనుడి
చేతి నుంచి విసిరిన రాయికో
ఒక్కొక్కటిగా రాలిపోయే
నీ బిడ్డలతో
నువ్వక్కడ!

మాకిది షరా మామూలే!
“మాతల్ని” గౌరవిస్తామని కోతలు కోసే
ఈ పుణ్య భూమిలో అమ్మలు వరండాల్లో
ఇంకా వయసు మీరాక అవుట్ హౌజుల్లో
అక్కడ కూడా భరించలేని నాడు వృద్ధాశ్రమాల్లో
మాకిదేం కొత్త కాదు తల్లీ!

ఈ దేశపు వీధుల్లో
అర్ధరాత్రి నడుస్తూ
ఎన్ని జీవశ్చవాల్ని చూళ్ళేదు
వెచ్చగా పడుకొని
చేతగాని వాడిలా
ఎన్ని కన్నీళ్ళు కార్చలేదు

*
మొగ్గలన్నీ రాలి నువ్వు
వాడిన చెట్టులా మళ్ళీ 
ఎప్పుడో కనబడతావ్!

ఋతువు నిన్ను మళ్ళీ 
యమపాశమై
వెంటాడుతుంది
మళ్ళీ మళ్ళీ మళ్ళీ బిడ్డలు
వీధులు నిండిపోతూ
గుండెల్ని ఛిద్రం చేస్తూ
ఈ దేశపు నిర్భాగ్యుల్లా
నిరంతరం పదింతలై
నా దుఖాన్ని రెట్టింపు చేస్తూ

( వీధిలో పసిబిడ్డల్ని కనిపెంచే వీధి కుక్క తల్లిని చూసి)

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.