ఆరాధన-1 (ధారావాహిక నవల)

-కోసూరి ఉమాభారతి

నా మాట

కూచిపూడి నాట్యకారిణిగా, సినీ నటిగా, దేశవిదేశాలు పర్యటించిన సాంస్కృతిక రాయ బారిగా గుర్తింపు పొంది, ఉస్మానియా విశ్వవిద్యాలయంలో మాస్టర్స్ డిగ్రీ విధ్యార్ధినిగా.. జీవితం ఓ కలలా సాగుతున్న సమయంలో వివాహం చేసుకుని 1980 లో అమెరికాలో అడుగు పెట్టాను. 

          సరికొత్త జీవితం, సరికొత్త పరిసరాల నడుమ, భిన్న సంస్కృతుల సమాజంలో జీవనం సాగిస్తూ.. అమెరికా  దేశంలో ఓ గృహిణిగా, తల్లిగా, కళాకారిణిగా, నృత్య గురువుగా, రచయిత్రిగా ఇప్పటికి నాలుగు దశాబ్దాలకి పైగా గడచిన జీవితకాలంలోని  అనుభవాలు, అనుభవాలు నేర్పిన పాఠాలు, నా అంతరంగ తరంగాల నుండి వెలికి తీసిన విశేషాలు, సంఘటనలని అక్షరీకరించి ‘ఆరాధన’ పేరిట నవలగా మీ ముందుకు తేగలగడం సంతోషంగా ఉంది.

          మీరు చదివి, ఆదరిస్తారని ఆశిస్తాను. 

          ఈ చక్కని అవకాశం కల్పించి, ప్రోత్సహించిన ‘నెచ్చెలి’ అంతర్జాల వనితా పత్రిక కు,  సంపాదకురాలు డా. కె. గీత గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు.

రచయిత్రి: కోసూరి ఉమాభారతి

‘Natyabharathi’ Uma Bharathi

Dance Exponent – Actor – Writer

& Founder- Director

Archana Fine-Arts Academy

& Sri Sarada Satyanarayana Memorial Charitable Society

***

ఆరాధన

          మా అకాడెమీ నృత్యాలయంలో శనాదివారాలు చాలా హడావిడిగా ఉంటుంది.  ఓ పక్క కూచిపూడి రంగప్రవేశ కార్యక్రమాలకి సాధనలు, మరోపక్క స్థానిక తెలుగు బడి చిన్న పిల్లలకి ప్రాక్టీసులు నిర్విరామంగా జరుగుతుంటాయి. క్లాసుల వారీగా వచ్చీపోయే వారితో స్టూడియో కళకళలాడుతున్నా, తల్లితండ్రులు మాత్రం తమ వాహనాలకి పార్కింగ్ స్పేస్ దొరక్క అవస్థలు పడుతుంటారు.

          ‘గ్రేటర్ హిందూ టెంపుల్’ ‘వార్షిక నిధుల సేకరణ’ కార్యక్రమం కొరకు సీనియర్ స్టూడెంట్స్ కి అమ్మవారి పద్యం నేర్పించి క్లాస్ ముగించాను.

          ఆదిశంకరాచార్యుల సౌందర్యలహరిలోని కీర్తనకి ఆరంభ పద్యంగా నాకెంతో ఇష్టమైన సీస పద్యం..

“||…కనక రత్న కిరీట కమనీయ చంద్రరేఖా కాంతి వెన్నెల కరణివెలయా

ఫాల భాగాంచిత భవ్య కుంకుమ చిహ్నముదయ భాస్కరుని రుచి నొప్పు మీర

చెవుల దిద్దుల రుచి చిరునవ్వు జోడయి చెక్కుటద్దాల పై చిందులాడ

 

గళసీమనింపుగా కరుణామృతమునిండ…భయహర శంఖమ్ము పగిది పలుక

రత్నహారములురమునరంగు లీనఅమిత శుభములొసగు నాయుధముల దాల్చి

పదునెనిమిదికరంబులు పరగు దుర్గా సింహవాహిని మమ్ము రక్షింపు గాక…||”

        పాడుకుంటూ మరోమారు పద్యానికి నర్తించి .. వందన సమర్పణ చేసి వెనక్కి తిరిగే ప్పటికి, ద్వారం వద్ద నిలబడున్న ఓ నడివయస్కురాలు దూరం నుండే నాకు నమస్క రించింది. నాతో మాట్లాడాలని కోరింది. 

          ఆమె చేయి పట్టుకుని ఉన్న అమ్మాయి .. ఆమె కూతురనుకుంటా. వారిని లోనికి ఆహ్వానిస్తూ, కూర్చునేందుకు గురుపీఠంకి ఎదురుగా తివాసి పరిచాను.

          వచ్చి కూర్చుంది.  “నా పేరు మియా గుప్తా. పుట్టి పెరిగింది ఇండోనేషియాలో.. కనుక నా తెలుగు అంతంత మాత్రమే మేడమ్. కార్ పార్క్ చేసి మా వారు కూడా వస్తారు. మిమ్మల్ని కలవాలని ఎప్పటినుండో అనుకున్నా.. ఇవాళ కుదిరింది. ఇది మా పదేళ్ళ అమ్మాయితార. బే-పోర్ట్ గ్రీన్-వుడ్స్ స్కూల్లో ప్రత్యేక బోధన కార్యక్రమంలో చదువు కుంటుంది.” అంది కుమార్తె భుజం పై చేయి వేసి.

          “ఇండియా కల్చరల్హౌజ్ మరియు ‘గ్రేటర్ హిందూ టెంపుల్’ లో మీ అకాడెమీ కార్యక్రమాలకి తప్పనిసరిగా వస్తుంటాము. మీ నృత్యమన్నా, మీ ప్రోగ్రామ్స్ అన్నా మాకు చాలా ఇష్టం. సోషల్ మీడియాలో కూడా మిమ్మల్ని ఫాలో అవుతుంటాను.” అంటూ తన హ్యాండ్-బ్యాగ్ లోని వాటర్ బాటిల్ నుండి కొంచెం నీళ్ళు తాగి .. తారకి బాటిల్ అందిం చింది. 

          ఆమె చెప్పేది వింటున్నాను.  ‘అంతా బాగానే ఉంది. అయితే నేటి ఆమె రాకకి కారణం తెలియాల్సింది ఉంది.’ అనుకున్నాను. ఇంతలోనే, గ్లాస్ డోర్స్ తెరుచుకుని “నమస్తే మేడమ్. లోనికి రావచ్చునా? నా పేరు అభినవ్. మియా నా భార్య.” అంటూ లోనికి వచ్చి ఎదురుగా నిలిచాడు అతడు.

          “రండి. కూర్చోండి.” అనక తప్పలేదు. 

          “హిందూ ఆలయ కమిటీలో నేను మూడు మార్లు ఎగ్జిక్యూటివ్ సెక్రెటరీగా పని చేశాను. ఇప్పుడు బోర్డు మెంబర్ గా సర్వ్ చేస్తున్నాను. పదిహేనేళ్ళగా మీ కార్యక్రమాల గురించి మాకు బాగా తెలుసును. మీరు అన్నేళ్ళ క్రితం వినాయకుని గుడి అభివృద్దికి, తరువాత కళ్యాణమండపం నిర్మాణ నిధులకి వరస నృత్య ప్రదర్శనలు చేయడం, కమ్యూనిటీ సెంటర్, లైబ్రరీ, ఆలయ అభివృద్దికి కూడా ప్రతి యేడూ లాభాపేక్ష లేకుండా శ్రమదానం చేసే మీ ఔన్నత్యాన్ని ఎంతగానో ప్రశంసిస్తాము ఉమాభారతి మేడమ్.‘సేవే ధ్యేయం – నృత్యం మార్గం’ గా సాగే మీ అకాడెమీ కార్యక్రమాల గురించి తెలియని వారు ఉండరు కదా మేడమ్.” అంటూన్న అతనికి కృతజ్ఞతలు తెలుపుకున్నాను.

          అతని ఫోన్ మోగడంతో .. “మియా మీతో మాట్లాడుతుంది. నేను కొద్దిసేపు కాల్ అటెండ్ అవ్వాలి.” అంటూ నిష్క్రమించాడు అతను.

          “చెప్పండి మియా. ఏమిటి విషయం?” అడిగాను.

          ఉన్నట్టుండి ఆమె ముఖంలో కొంత నిస్పృహ కానవచ్చింది.  కొద్ది క్షణాల మౌనం తరువాత.. నా వంక చూసింది మియా. “మా అమ్మాయి తారకి మానసిక, బౌతిక ఎదుగు దలలో లోపం ఉంది. ‘ఆటిజం’ అని, మానసిక వ్యాధి అని చెప్పారు. చిన్నపిల్లల్లో ఒక్కో మారు ‘ఆటిజం’ ని అధిగమించవచ్చని కూడా తెలుసుకున్నాను.  తారని సాధారణ చదువులు కాక ఇతర విద్యల్లో ప్రవేశ పెడితే.. కొంతైనా ఏకాగ్రత కుదిరి తన మానసిక స్థితి మెరుగవుతుందన్న ఆలోచనతో.. ఆ దిశగా కూడా ప్రయత్నాలు చేశాను.

          సంగీతం, నృత్యం అంటే తారకి ఉన్న ఆసక్తి గ్రహించిన మేము ఊళ్ళోని భారతీయ నృత్యం, సంగీతం నేర్పుతున్న టీచర్ల వద్దకు తారని తీసుకువెళ్ళాము.  ఎవ్వరూ తారని శిష్యురాలిగా స్వీకరించేందుకు సుముఖత చూపలేదు.” అంటూ తల దించుకుంది. భావోద్వేగానికి గురయి కన్నీళ్ళు పెట్టుకుంది. 

          “అయ్యో మియా .. ఇలా బాధపడకండి.” అని సముదాయించాను. 

          కాస్త తేరుకున్నాక.. “ఇక నేనివాళ మీవద్దకు వచ్చిన కారణం చెబుతాను.” అంది మోమున చిరునవ్వుతో.

          “చెప్పండి.” అన్నాను.

          “మేముండే బే-పోర్ట్ ఒక యూనివర్సిటీ టౌన్. ఇక్కడికి ఓ గంట ప్రయాణం. ఊరు చిన్నదే అయినా అక్కడ నివశించే భారతీయుల సంఖ్య తక్కువేమీ కాదు. ఈ దేశంలో అడుగు పెట్టినప్పటి నుండీ గత పదిహేనేళ్ళగా మా నివాసం అక్కడే. మా వ్యాపారాలన్నీ అక్కడి నుండే మొదలుపెట్టాము. 

          మాది ‘ఫుడ్ మరియు రెస్టారెంట్ బిజినెస్. హూస్టన్ పరిసరాల్లోని పన్నెండు ‘ఆసియన్ ఫుడ్-వరల్డ్ మార్కెట్స్’ మేమే మేనేజ్ చేస్తున్నాము. ‘తారా ఇండియన్ రెస్టారెంట్స్’ లీజుకి ఇచ్చేసాము. 

          బే-పోర్ట్ లోని మా కార్యాలయం ఆవరణలో ఓ కమ్యూనిటీ హాల్ నిర్మించి మూడేళ్ళ వుతుంది. అక్కడ భారతీయ యువతకి ప్రయోజనకరమైన కార్యక్రమాలు చేపట్టాలని నా అభిలాష. వారంతాల్లో హెరిటేజ్ క్లాస్ నిర్వహించాలని మా ఆశయం. కాక సంగీతం, నృత్యం, యోగాభ్యాసంలో శిక్షణనివ్వగల గురువుల కోసం మూడేళ్ళగా మా అన్వేషణ సాగుతుంది. యువతకి, కమ్యూనిటీకి ఉపయోగపడేలా ఏదైనా చేయాలన్న నా తపనకి అభినవ్ సహకారాలు మెండుగా ఉన్నాయి. 

          నిజానికి మీ వంటి పేరున్న కళాకారులు..మా మొదటి ఎంపిక. ఐనా మిమ్మల్ని అడగడానికి సంకోచించాను. మీ స్థాయి కళాకారిణికి మాదొక ఆసక్తికర, లాభదాయక ప్రతిపాదనగా అనిపించకపోవచ్చునని భావించాను. అదీ గాక మీరు ప్రపంచ వ్యాప్తిగా పర్యటిస్తూనే, నృత్యశిక్షణ శిబిరాలు నిర్వహిస్తుంటారు. మీకు సమయం ఉండక పోవచ్చని మిన్నకుండిపోయాను.

          కానీ, కొన్నాళ్ళ క్రితం మీరు నిర్మించిన ‘టెంపుల్-బెల్స్’ అనే టెలీ-ఫిల్మ్ షూటింగ్ సందర్భంగా ఆడియన్స్ కావాలంటే.. ఆలయంలో మేమంతా పాల్గొన్నాము.  ఆ మూడు రోజుల సమయంలో మిమ్మల్నిదగ్గరి నుండి చూశాక మీరొక స్నేహశీలి, నిగర్వి అని ఆర్ధమయింది. అందుకే సంకోచం పక్కన పెట్టి ఇలా వచ్చాము.

          వారానికి రెండు మార్లు మా పిల్లలకి శిక్షణనివ్వమని బే-పోర్ట్ ‘ఆసియన్ కల్చరల్ సొసైటి’ తరఫున మిమ్మల్ని అభ్యర్ధించేందుకు వచ్చాము. సంప్రదాయ భారతీయ నృత్యం పట్ల ఆసక్తి ఉన్న నలభై మందికి పైగా యువత ఇప్పటికే తయారుగా ఉన్నారు.  పెద్దవాళ్ళకి కూడా క్లాస్ నిర్వహిస్తే.. మరో ఇరవై మంది కూడా ఆసక్తి చూపుతున్నారు.

          నృత్యం, యోగా, హెరిటేజ్ క్లాస్.. ఎలాగైనా సరే, ఏ క్రమంలో ఐనా సరే.. మీ ఇష్టం.‘ఆసియన్ కల్చరల్ సొసైటీ’కి ప్రెసిడెంట్ గా నేను కూడా ఈ ప్రాజెక్టుని ప్రమోట్ చేయగలను.

          పెద్దవాళ్ళవుతున్న మా ఆడపిల్లలకి మీ బోటి వారు స్పూర్తిదాయకులవ్వాలన్నదే నా అభీష్టం. ఆలోచించండి మేడమ్. మీకు కావాల్సిన సౌకర్యాలు, పారితోషికం అందించ డానికి మేము సిద్దం. మా సొసైటి ఆశయాలు, సభ్యత్వంగురించి, మా ప్రతిపాదన ఆశయాల గురించి కొన్ని వివరాలు ఇందు పొందుపరిచాము.” అంటూ ఓ కవర్ నా ఎదుట ఉంచి…

          “ఇక తారకి తల్లిగాఅయితే మిమ్మల్ని చేతులు జోడించి ప్రార్ధిస్తున్నాను. మీ శిక్షణలో మా అమ్మాయికి ఒకింత మేలు జరిగినా చాలును. నా జన్మ తరించినట్టే. అలా జరుగు తుందని నా గట్టి నమ్మకం. మీకు ఎప్పటికీ ఋణపడి  ఉంటాను.” అంటూ కన్నీళ్ళతో మియా చేతులు జోడించినప్పుడు నా కళ్ళు చమర్చాయి.

***

          రాత్రి భోజనం వద్ద మా వారితో మియా గురించి, ఆమె ప్రతిపాదన గురించి ప్రస్తావించాను.

          “ఇది ఓ కొత్త కాన్సెప్ట్. ఏమో, కళలకి ఉన్న మహత్యం మహ గొప్పదని ఎందరో చెప్పగా, రాయగా విన్నదే, చదివినదే. నీవే ఆలోచించు. తారా వంటి అమ్మాయిలకి శిక్షణనిచ్చేందుకు సుముఖత చూపని గురువుల్లా కాక .. తారా లాంటి వారికి శిక్షణనిచ్చి.. వారిని మెరుగు పరచగలవేమో!. నీకు సమయం ఉండి.. చేయగలిగితే మంచిదే.” అన్నారు మా వారు.

నాట్యశాస్త్రం నుండి ఓ శ్లోకం గుర్తు చేసుకున్నాను.   

దుఃఖార్తానాం శ్రమార్తానాం శోకార్తానాం తపస్వినాం

లోకోపదేశజననం కాలే నాట్య మేత ద్భవిష్యతి‘  

          నాట్యము ఉపదేసాత్మకమే కాక హితమును, ధైర్యమును, క్రీడను, సుఖమును, కూడా కలిగించునని, దుఃఖార్తులకు, శ్రమార్తులకు, శోకార్తులకు, దీనులకు, విశ్రాంతి కలిగించేది ‘నాట్యము’  అని బ్రహ్మ దేవుడు నృత్య కళ యొక్క ఉపయోగం గురించి నాట్య శాస్త్రంలో ప్రస్తావించాడని చదివాను.  

          నృత్యం, సంగీతం వంటి కళలు మేటి కళాకారులను తయారు చేసి ప్రపంచానికి అందించేందుకు, అసంఖ్యాక ప్రేక్షకులను అలరించేందుకు, రంజింపచేసేందుకు మాత్రమే కాదని.. అంతకు మించిన ఉపయోగాలు, ప్రయోజనాలు ఉన్నాయని తెలుస్తూనే ఉంది. 

          ‘తన కూతురి విషయంలో మియా ఇటు వంటి ప్రయోజనాల గురించే ఆలోచిస్తుం దనిపించింది. నృత్యం ఆభ్యసించడంలో నిమగ్నమయితే బిడ్డ జీవనం మెరుగవు తుందని ఆమె భావన కావచ్చు. ఏమైనా ముందుగా నాకు ఆలోచన కుదిరి, సమయం ఉంటే.. చూస్తాను..’ అనుకున్నాను.

          ఈలోగా, ఎల్-పాసో నివాసి మా పెద్దమ్మ కొడుకు.. రఘు, తండ్రికి వైద్య పరీక్షలు చేయించేందుకు హూస్టన్ వచ్చాడు. 

          ప్రాధమిక వైద్య పరీక్షలు, సలహా సేకరణ అయ్యాక, మా పెదనాన్నకి మరిన్ని అదనపు పరీక్షల అవసరం ఉన్నందున, రఘు ఓ మారు ఎల్-పాసో వెళ్ళి వస్తాన్నాడు.

          దాంతో తదుపరి అపాయింట్మెంట్ కి పెదనాన్నని నేనే హాస్పిటల్ కి తీసుకుని వెళ్ళాను. లాబీలోనికి వెళ్తుంటే.. మియా కనబడింది. చాలా నీరసంగా ఉంది. మియా చేయి పట్టుకుని నడిపిస్తున్నది నా శిష్యురాలు రాగిణి. వారివురినీ పలకరించినప్పుడు.. మియా కూడా మేము వెళుతున్న వైద్య విభాగానికే వెళుతుందని తెలిసింది..

          మియా వైద్యానికి, మా పెదనాన్న వైద్య పరీక్షలకి, కనీసం మూడుగంటలైనా సమయం పడుతుందని తెలియడంతో నేను, రాగిణి కాఫీ కోసం కేఫటేరియాకి వెళ్ళాము.

***

          మియా గురించి నా మనసులో ఎన్నో ప్రశ్నలు మెదులుతున్నాయి. కాఫీ సేవిస్తూ ముందుగా రాగిణి సంభాషణ మొదలుబెట్టింది. “మియా నాకు చిన్నమ్మ. నన్ను ఆస్ట్రేలియా నుండి ఇక్కడ యూనివర్సిటీలో పి.హెచ్.డి చేసేందుకు రప్పించిందే మియా. మా బాబాయి కొడుకులని కూడా ఇక్కడ చదివిస్తుంది ఆమె.  

          ఇకపోతే, వేసవి సెలవల్లో మీరు నిర్వహించే నృత్య శిబిరాలు అటండ్ అవుతుం టాను కదా మేడమ్. మీ గురించి బోలెడన్ని కబుర్లు చెబుతుంటాను చిన్నమ్మకి. మీరంటే ఆమెకి అభిమానం. బే-పోర్ట్ లో మీరు డాన్స్ క్లాస్ నిర్వహిస్తారని ఆమెతో పాటు మేము అందరం ఆశిస్తున్నాము.” అంది చిరునవ్వుతో.

          “అవునా?. ఆ విషయం అలా ఉంచితే.. ఇంతకీ మియా ఆరోగ్య పరిస్థితి ఏమిటి?  ఇక్కడ ఆమెని చూడ్డం ఆశ్చర్యంగా ఉంది.” అన్నాను.

          కొద్దిక్షణాల మౌనం తరువాత “చిన్నమ్మ కి కాన్సర్ వ్యాధి సోకి ఆరేళ్ళవుతుంది.  చాలా మందికి తెలుసును. బ్రెస్ట్ కాన్సర్ తో మొదలయింది ఆమె అనారోగ్యం. రెండేళ్ళ  క్రితం పెద్ద సర్జరీ చేసి ఆమెకి మాస్టెక్టేమీ, హిస్టరెక్టమీ చేశారు. ఓ రెండేళ్ళు బాగానే ఉంది. మళ్ళీ అదే వ్యాధి మిగతా శరీర భాగాలకి వ్యాప్తి చెందుతూనే ఉందట. ఆమె అనునిత్యం నిపుణుల పర్యవేక్షణలో ఉంటుంది కనుక .. తన పరిస్థితిని బట్టి ఇలా ట్రీట్మెంట్తోను, లేదా స్వల్ప సర్జరీలతోనూ వ్యాధి వ్యాప్తిని అరకట్టగలుగుతున్నారు. ఈ తడవకి ఇవాల్టి కీమో-థెరపీ ఆఖరి ట్రీట్మెంట్.” అని వివరించింది రాగిణి.

          ఊహించని మియా ఆరోగ్య పరిస్థితి నా మనసుని కలిచివేసింది. ఆమె పట్ల సానుభూతితో నిండిపోయింది. 

          “అందుకే చిన్నమ్మ తన కూతురికి చేతనయినది చేయాలని, తార జీవితాన్ని కొంతైనా బాగుపరచాలని శతవిధాలా ప్రయత్నిస్తుంది. తనకి దాపురించిన వ్యాధి వల్ల పాపం భయస్థురాలిగా మారిపోయింది మా చిన్నమ్మ. చాలా మంచి మనిషి మాచిన్నమ్మ.  అందరికీ సాయం చేసే గుణం. యువతకి స్పూర్తిదాయకమైన కార్యాలు చేపట్టాలనే ఆశయంతోనే.. కమ్యూనిటి సెంటర్ కట్టించింది. చిన్నతనంలో ఒడిస్సీ నృత్యం, హిందుస్తానీ సంగీతం నేర్చుకుంది. పెళ్ళయి అమెరికా వచ్చే వరకు ప్రదర్శనలు కూడా చేసింది. భారతీయ సంస్కృతిని మించినది లేదంటుంది.‘ప్రత్యేకించి భారతీయ కళల పట్ల ఆమెకి ఎనలేని ప్రేమ.” అంది రాగిణి.

*****

Please follow and like us:

One thought on “ఆరాధన-1 (ధారావాహిక నవల)”

Leave a Reply

Your email address will not be published.