జెన్నీ మార్క్స్

-వి.విజయకుమార్

          “మానవాళికి అన్నింటికన్నా ఎక్కువ ప్రయోజనం చేకూర్చగల పనిని ఎంచుకున్న ట్లయితే, ఎటువంటి భారాలు మనల్ని కుంగదీయలేవు. ఎందుకంటే అవి అందరి ప్రయోజనం కోసం మనం చేసే త్యాగాలు; అప్పుడు మనం అనుభవించేది అల్పమైన, పరిమితమైన, స్వార్థపూరితమైన ఆనందం కాదు. మన ఆనందం లక్షలాది ప్రజలకు చెందుతుంది, మన పనులు నిశ్శబ్దంగానే అయినా శాశ్వతంగా జీవిస్తాయి. మన బూడిద పై ఉత్తమ మానవుల వేడి కన్నీళ్ళు వర్షిస్తాయి.”

          పదిహేడేళ్ళకే ఇలా కమిటైపోయిన, ఆస్తిపాస్తులు అంతగా లేని, పోషించే అవకాశం ఉందో లేదో కూడా తెలీని ఒక యువకుడిని; ఒక కులీన వర్గానికి చెందిన, మతిపోగొట్టే సౌందర్యంతో వున్న, అనేక లలిత కళలతో అలరారే ఒక యువతి ప్రేమిస్తుందా?

          ప్రేమించడం కాదు, గుండెల్లో పెట్టుకుంది, అయి పుట్టిన దేశాలన్నీ, తన భర్తని “అత్యంత ప్రమాదకరమైన విప్లవ కారుడి” గా ముద్ర వేసి, ఎక్కడా నిలబడకుండా బహిష్కరిస్తూ పోతుంటే, కట్టుబట్టలతో “మహా సాధ్వి” వెంట నడిచింది. నడవడమే కాదు, జీవితంలోనే కాదు, మేధో శ్రమలో కూడా భాగస్వామి అయింది. వారాల పాటూ రొట్టె, బంగాళా దుంపలు తినాల్సి వచ్చిన పేదరికాన్ని కూడా చవి చూడటానికి సిద్ధం అయింది. పట్టు పరుపులు వదిలేసి రావడమే కాదు, చలి కుంగ దీస్తుంటే పసి బిడ్డలు పడుకునే పరుపుల్ని కూడా కుదవ పెట్టిన “కాఠిన్యాన్ని” అలవరచుకునే స్థాయికి దిగజార్చిన పేదరికాన్ని సైతం ఎంచుకుంది! మార్క్స్ రాసిన ప్రతి రాత ప్రతినీ తిరగ రాయడమే కాదు, మానవ జాతి మీద, గుండెల నిండా ప్రేమతో, ఆ “పిచ్చివాడు” దాని బతుకు గీతని మార్చడానికి అహర్నిశమూ చేస్తోన్న ఒక మహోన్నత యజ్ఞంలో తన బిడ్డలనీ, అఖిరికి తననూ సంతోషంగా అర్పించుకుంది. 

          అద్దె ఇళ్ళలో జీవితం దుర్భరంగా తయారయ్యేది. అద్దెలు సమయానికి కట్టేటం దుకు డబ్బులు లేనప్పుడు యజమానులు తీవ్రంగా అవమానిస్తూ వుండేవారు. ఇంట్లో అన్ని వస్తువులు తాకట్టులో వుండేవి. ఆ వస్తువుల్ని విడిపించడానికి జెన్నీ తీవ్రమైన ప్రయత్నాలు చేస్తూ వుండేది. ఒకసారి డిక్రీ తెచ్చిన ఇంటి యజమాని 5 పౌనుల కోసం బట్టలు, పరుపులు, పిల్లవాడి వుయ్యాల, బొమ్మలు కూడా వదల కుండా జప్తు చేయి స్తుంది…

          ఇంత ఘోరమైన అననుకూల పరిస్థితులలో కూడా జెన్నీ, మార్క్స్ చేసే ప్రతి పనిలోనూ సహకరిస్తూ వచ్చేది. నిరంతరం మార్క్స్ ని కలుసుకోవడం కోసం వచ్చే పోయే వారితో ఆ ఇరుకు గదుల ఇళ్ళు ఘోరంగా వుండేవి. అయినా సరే ఉన్నంతలో అతిథుల కోసం జెన్నీ ఏదో ఒకటి చేయడం ఎన్నడూ మానేది కాదు.

          కొత్తగా పెళ్ళై కాపురం పెట్టినప్పుడు అనేక మంది తమ లాంటి ప్రవాసితులు వచ్చి వెళుతుండే వారు. వారి కోసం తమకు కానుకల రూపంలో వచ్చిన డబ్బును ఒక పర్సులో పెట్టి బయట పెట్టేవారు. అవసరమైనప్పుడు వాళ్ళు వాడుకునేందుకు!

          మార్క్స్ ని బెల్జియం పోలీసులు అరెస్ట్ చేసినప్పుడు తనని విడిపించుకోవడానికి ఆమె పోలీస్ స్టేషన్ కి వెళ్ళాల్సి వచ్చింది. తనను వాళ్ళు వ్యభిచారులతో పాటూ ఒక చీకటి కొట్లో పడేశారు. తెల్లవారి రెండు గంటలు చలిలో నిలబెట్టి, పోలీసులు జుగుప్స కలిగేలా మాట్లాడుతూ మానసికంగా నొప్పించే ప్రయత్నం చేశారు. జడ్జి  కూడా “నువ్వు కులీనురాలివి, ప్రజాస్వామ్యం పేరుతో చెలరేగి పోతున్న అలగా జనంతో తిరగడానికి సిగ్గులేదా?” అంటూ ఘోరంగా అవమానించాడు. అటు వంటి సందర్భాల్లో కూడా ఏ మాత్రం వెరపు చెందకుండా, మార్క్స్ చెయ్యి వదలకుండా తుది వరకూ నీడలా వెన్నంటి నడిచింది జెన్నీ.

          వేదీ మేయర్ కి రాసిన ఒక వుత్తరంలో,”… కోరిన భర్త సాన్నిధ్యంలో బ్రతుకు సాగిస్తున్నాను, నా జీవితానికి ఎనలేని ఆలంబన ఆయన… ఆయన వెంట ఏ మహా ప్రస్థానానికైనా ఎంత  కంటకావృతమైన బాటనైనా సాగిపోయేందుకు నేను సిద్ధంగా ఉన్నా…”

          తల్లి మరణించినప్పుడు తనకు వచ్చిన వంద పౌండ్ల డబ్బుతో కుదువ పెట్టిన వస్తువులు విడిపించి కొద్దిగా సాధారణ జీవితాన్ని ప్రారంభిస్తున్న తరుణంలో మార్క్స్ మీద కుట్ర కేసు…ఆ కేసులో మార్క్స్ ని విడిపించుకోవడానికి జెన్నీ చేసిన ప్రయత్నం అసాధారణం…

          సంవత్సరమైనా నిండని పసిబిడ్డ హెన్రిచ్ సరైన సంరక్షణ లేక మరణిస్తాడు, ఇంకో ఏడాదిన్నరకి చిన్న కూతురు ఫ్రాన్సిస్కా మరణిస్తుంది…బిడ్డను వెనక గదిలో పడుకోబెట్టి విలవిలలాడిపోతున్న గుండెతో స్వయంగా పక్క శివారులో ఉండే ఒక ఫ్రెంచ్ ప్రవాసి తుడి దగ్గరికి వెళ్ళి, రెండు పౌనులు అడుక్కొని శవపేటిక తీసుకొస్తుంది జన్నీ! ఈ హృదయ విదారక సంఘటన హృదయాన్ని ఛిద్రం చేస్తుంది.

          అది జరిగిన మూడేళ్ళకు ఎడ్గార్ టీబీతో మరణించినప్పుడు మార్క్స్ ఎంతగా క్రుంగి పోయాడంటే, “నేను అనేక ఇక్కట్లు పడ్డాను, కానీ నిజమైన ఇక్కట్లు అంటే ఏమిటో ఇప్పుడే తెలిసింది” అంటూ భోరున విలపిస్తూ ఎంగెల్స్ కు వుత్తరం రాశాడు. ఆ దుఖం నుంచి ఉపశమనం కోసం ఎంగెల్స్ ఆ దంపతుల్ని మాంచెస్టర్ తీసుకు వెళ్ళాడంటే ఆ బాధ ఎంత భయంకరమైనదో అర్థం చేసుకోవచ్చు…

          మార్క్స్ కు పిల్లలంటే చాలా ఇష్టం…విల్ హెల్మ్ రాసినట్టు, “పిల్లల మధ్య లేకుండా మార్క్స్ బతకలేడు…” మార్క్స్ తరచూ అంటుండేవాడు, “క్రైస్తవ మతంలోని దుర్మార్గాన్నంతా ఒక్కందుకు క్షమించవచ్చు. పిల్లలను ప్రేమించమని ఆ మతం నేర్పింది మనకు” అలాంటి వాడు ఎడ్గార్ ని పోగొట్టుకున్నప్పుడు ఎంతగా విలపించి వుంటాడో అర్థం చేసుకోవచ్చు!

          అయినా ఆ దుర్భర దారిద్యం వారిని వదిలిన సందర్భాలు అరుదు. ఏడో బిడ్డ కూడా మరణించడంతో జెన్నీ శారీరకంగా, మానసికంగా కృశించి పోయింది. వరుసగా బిడ్డల మరణం, అదే సమయంలో జర్మన్ సమైక్యత కోసం ఆయన రాసిన వ్యాసంతో ఆయన పై తీవ్రమైన ఆరోపణలు రావడంతో రాత్రి పగలూ అని చూడకుండా కర పత్రాలు పనిలో లీనమైన జెన్నీ అనారోగ్యంతో మంచానికి పరిమితమై పోయింది. మశూచితో ఆమె దేహం పూర్తిగా దసిలిపోయింది. అప్పుడు మార్క్స్ పరిచర్యలతో ఎలానో కోలుకొని నిలబడ్డా 1850 నాటికి జెన్నీ మళ్ళీ తీవ్రమైన అనారోగ్యం బారిన పడిపోవడంతో మార్క్స్ మరింత కుంగి పోయాడు.

          ఒకవైపు తన అనారోగ్యం, మరో వైపు లేవలేని స్థితిలో పక్క గదిలో భార్య…కనీసం లేచి అటు తిరిగే అవకాశం కూడా లేనంత ఘోరమైన అననుకూల వాతావరణంలో మార్క్స్ ఈ మానవాళి కోసం పనిచేయడమంటే ఇంతకంటే గొప్ప త్యాగం ఈ ప్రపంచం లో వుంటుందా? 

          చివరికి మృత్యువుతో పోరాడి పోరాడి డిసెంబర్ 1881 రెండో తేదీన జన్నీ తుది శ్వాస విడుస్తుంది. మానవాళికి తన విముక్తి  కోసం దారి చూపే ఒక మహోన్నత మార్గదర్శి వెంట నడిచిన ఈ త్యాగమయి దుర్భర దారిద్యాన్ని అనుభవిస్తూ కూడా నిబ్బరంగా అడుగులు వేసింది. ఓ వైపు అంత్యక్రియలకు కూడా వెళ్ళలేని అశక్తుడిగా ఇంట్లో మార్క్స్!  

          ఎంగిల్స్ ఆ మహనీయ మూర్తి అంత్యక్రియల్లో ఇలా అంటాడు…

          ఆమె మరణంతో ఒక అసాధారణ స్త్రీ అదృశ్యమైంది 

          మహోన్నత ప్రేమ కావ్యం అంతమైంది 

          స్త్రీ జాతి ఒక ఆణిముత్యాన్ని కోల్పోయింది 

          విప్లవోద్యమం ఒక మణిపూసని చేజార్చుకుంది 

          కానీ… 

          ఆమె త్యాగం మనకు వెలుగు బాట 

          ఆమె కార్యక్రమాలు మనల్ని ఉత్సాహపరుస్తాయి 

          విప్లవోద్యమ విజయంలో ఆమె సజీవమూర్తిగా వర్ధిల్లుతుంది…

          ఈ జెన్నీ కథనాన్ని తానెంచుకున్న జీవితానికి స్ఫూర్తి దాయకంగా వుండేలా నిరంతరం మననం చేసుకోవడానికన్నట్టు దీన్ని శ్రీమతి లీలా సుందరయ్య ఆంగ్లంలో రాయగా శ్రీహరీ, విజయరావు గారలు తెలుగులోకి అనువదించారు. ఈ పుస్తకం నలభయ్యేళ్ళ క్రితమే వచ్చినా విప్లవ బాటలో నడిచే ఎందరో స్త్రీ మూర్తులకు జెన్నీ మార్క్స్ దారి చూపే వెలుగు దీపం. మానవీయ ప్రపంచాన్ని మలచుకోవడం అంటే సమిధలా కాలిపోవడం కాదు, ప్రమిదలా వెలుగు నివ్వడం! మార్క్స్ అన్నట్టు, మానవా ళికి ఎక్కువ ప్రయోజనం చేకూర్చే బాటని ఎంచుకుంటే మనని యే భారాలూ కుంగ దీయలేవ్! మన బూడిద పై మానవాళి విడిచే వెచ్చని బాష్పాలే మనకి నివాళి!

          ఎంతటి మహోన్నతుడా మనిషి? ఆ మనిషి వెంట తలొంచుకుని నడిచిన ఈ మనిషి జీవితం ఎంత మహోన్నతం!

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.