అల్లంతదూరాన… ఆస్ట్రేలియాలో – 19
– విజయ గొల్లపూడి
జరిగినకథ: విశాల, విష్ణుసాయి పెళ్ళి కాగానే, సిడ్నీ ఆస్ట్రేలియా స్థిర నివాసులుగా వచ్చిన జంట. విశాల వర్క్ ఎక్స్ పీరియన్స్ అవకాశం రావడంతో టేఫ్ కాలేజ్ లో చేరింది. విష్ణుసాయి పరిస్థితులకి తగినట్లుగా ఒదుగుతూ, నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నాడు. ఆస్ట్రేలియాలో డ్రైవింగ్ టెస్ట్ లో పాసై, లైసెన్స్ సంపాదిం చాడు. ఇపుడు కారు తీసుకోవాలి. జాబ్ కన్సల్టెంట్ విష్ణు అనుకున్న డ్రీమ్ జాబ్ ఆఫర్ చేసింది. కాకపోతే అది నైట్ షిఫ్ట్.
***
మానవ జీవితం ఒక తెరువని పుస్తకం అయితే, ప్రతి ఏడాది ఒక క్రొత్త పేజీ. ఆ పేజీ పై నీకంటూ నీవు లిఖించుకుంటూ, నీ స్థానాన్ని, ఉనికిని చాటుకుంటూ అనుభవాలు సొంతం చేసుకుంటూ తుది శ్వాస వరకు జీవన గమనం సాగించాలి.
విష్ణుసాయి జాబ్ కన్సల్టెంట్ కి జాబ్ కి వచ్చే వారం వస్తాను అని మాటైతే ఇచ్చాడు కాని, కారు కొనడానికి డబ్బు ఎలా అడ్జస్ట్ చేయాలా అని తీవ్రంగా ఆలోచిస్తున్నాడు. తను ప్రస్తుతం చేస్తున్న పోస్ట్ ఆఫీస్ లో కర్తార్ సింగ్ కి విషయం చెప్పాడు. తను క్రొత్త జాబ్ లో చేరడానికి కారు ఎంత అవసరమో చెప్పి, ఫైనాన్స్ కోసం చూస్తున్నానని, అతని సహాయం అడిగాడు. కర్తార్ సింగ్ ఆలోచించి, సరే నేను ఏర్పాటు చేస్తాను. నాకు నాలుగు ఇన్ స్టాల్ మెంట్స్ లో తిరిగి ఇచ్చేయాలి. పైన ఒక వంద డాలర్స్ ఇంటరెస్ట్ తీసుకుం టాను. ఇదిగో ఈ కాగితం మీద ఇస్తున్నట్లుగా $3,000 కి సంతకం పెట్టు అని ఒప్పందంతో సంతకం పెట్టించుకుని, అతనికి డబ్బు సాయం చేసాడు.
విశాల ఆ రోజు తన వర్క్ ఎక్స్ పీరియన్స్ కాలేజీలో ఆఖరి రోజు. ఆఫ్టర్ నూన్ టీ ఏర్పాటు చేసి, స్టాఫ్ ఆమెకు బెస్ట్ విషెస్ తెలిపారు. బయటకు వస్తూ విశాల అనుకుంది. ‘చాలా చక్కని అనుభవం ఇక్కడ ఆస్ట్రేలియా వస్తూనే, కాలేజ్ లో గడించిన వర్క్ ఎక్స్ పీరియన్స్ ఈస్ మోస్ట్ వేల్యుబుల్. నాకు ఇంకో చక్కటి అవకాశం తప్పకుండా వస్తుంది’ అనుకుంటూ, ధీమాగా ముందుకు నడచింది. ఇంతలో విష్ణు స్టేషన్ కి రావడంతో ఇద్దరూ ట్రైన్ ఎక్కి, సెవెన్ హిల్స్ చేరుకున్నారు.
విష్ణూ విశాల చేయి పట్టుకుని, “ప్రస్తుతానికి అనుకుంటున్న సమస్యకి తాత్కాలికం గా పరిష్కారం దొరికింది. కర్తార్ సింగ్ దగ్గర అప్పు తీసుకున్నాను. మళ్ళీ జాబ్ లో జాయిన్ కాగానే నాలుగు నెలలలో తీర్చేస్తాను.” అంటాడు.
“అమ్మో! అప్పా! ఇండియాలో మనకి ఆస్తి, గట్రా ఉన్నా గానీ ఇక్కడ అప్పుచేయాల్సి వచ్చిందా?” అంటుంది విశాల.
“ఇండియా నుంచి కరెన్సీ, లావాదేవీలు ఇవన్నీ ఇపుడు కష్టంలే. మన వాళ్ళకి ఇవన్నీ విడమర్చి చెప్పేంత అవసరం లేదు. అయినా వాళ్ళకి నా పరిస్థితి అర్థం కాదు. కష్టమైనా, నష్టమైనా మనం ఇద్దరమే కలిసి భరిద్దాము. అపుడపుడు రిస్క్ తీసుకోవాల్సి ఉంటుంది. నాకు నా మీద నమ్మకం ఉంది. అందుకని నువ్వు కూడా అదే భరోసాతో ఉండు. ముందు భవిష్యత్తు బంగారు బాట కావాలంటే కొద్దిపాటి ఇబ్బంది పడాలి” అన్నాడు విష్ణు.
మర్నాడు ఉదయమే, విష్ణు, విశాల టాక్సీ తీసుకుని, కారు డీలర్ దగ్గరకు వెళ్ళారు.
విష్ణు, విశాలకు అక్కడ ఉన్న ఎఱ్ఱ కారు చూబెట్టి, ~ఇదే నేను తీసుకోబేయే కారు” అన్నాడు.
“కారు బాగుంది చూడటానికి” అంది విశాల.
ఇంతలో సేల్స్ మేన్ వచ్చి, పేపర్ వర్క్ అంతా పూర్తి చేసాక, ‘కంగ్రాట్యులేషన్స్!’ అంటూ విష్ణు చేతిలో కారు కీస్ పెట్టాడు.
విష్ణు కారు డ్రైవింగ్ సీటులో కూర్చోగానే, విశాల ఆనందంగా ముందు కారు సీటులో కూర్చుంది.
“దీస్ ఈస్ అ వెరీ హ్యాపీ మూమెంట్ మై డియర్ విష్ణు గారు” అంది జాయ్ ఫుల్ టోన్ తో విశాల.
“యస్ విశాలా! దిస్ ఈస్ అవర్ ఫస్ట్ మైల్ స్టోన్ హియర్ ఇన్ ఆస్ట్రేలియా. మనం వచ్చి నెల దాటింది. నిజంగా ఎక్కడికి వెళ్ళాలన్నా కారు కంపల్సరీ” అన్నాడు విష్ణు ఆనందం నిండిన స్వరంతో.
“అదిగో నీ ముందు ఉన్న ఆ డోర్ ఓపెన్ చెయ్యి. అందులో రూట్ మ్యాప్స్ పుస్తకం తీసుకో. మన ఇంటి అడ్రస్ చూడు” అన్నాడు విష్ణు.
విశాల బుక్ అందుకుని, ఈజీగానే ఇంటి అడ్రస్ పేజీ నెంబర్ చూసి కనుక్కో గలిగింది.
విష్ణు “ఐ నో విశాలా! యూ ఆర్ మై బెస్ట్ కేపబుల్ పార్టనర్ టూమీ” అన్నాడు నవ్వుతూ.
ఆ ప్రశంసకు చురుగ్గా విశాల విష్ణు కళ్ళలోకి చూసింది నవ్వుతూ.
రూట్ చూసుకుంటూ లెఫ్ట్, రైట్, స్ట్రైట్ ఇలా చెపుతూ విష్ణుకి బాగానే గైడ్ చేసింది విశాల ఇంటికి చేరుకోగానే, విశాల పళ్ళెంలో కుంకుమ, పసుపు, వినాయకుడి బొమ్మ తీసుకుని ఇద్దరు కారు దగ్గరకు వెళ్ళి, కారుకి పసుపు, కుంకుమ పెట్టి, వినాయకుడి బొమ్మ ముందు పెట్టి ధ్యానించుకున్నారు.
విష్ణు, రవికి ఫోన్ చేసి ఇలా అన్నాడు “ఒక గుడ్ న్యూస్ చెబుదామని చేసాను. మేము సెకెండ్ హ్యాండ్ కారు టొయోటా 90 మోడల్ తీసుకున్నాము. మీరు ఫ్రీ గా ఉంటే, మా ఇంటికి వస్తారా?”
“దట్స్ రియల్లీ ఏ గుడ్ న్యూస్ విష్ణు. ఒక అరగంటలో అక్కడకు వస్తున్నాము” అని ఫోన్ పెట్టేసాడు రవి.
రవి రాగానే, “పదండి అందరం కలిసి డ్రైవ్ కి వెడదాము” అన్నాడు. వాణి వెంటనే “అందరం హెలెన్స్ బెర్గ్ వేంకటేశ్వర స్వామి గుడికి వెడదాము” అంది.
“ఆ.. విష్ణు, మీరు నా కారు ఫాలో అయిపోండి. రూట్స్ మ్యాప్ దగ్గర పెట్టుకోండి. ఏ ఇబ్బంది ఉండదు” అన్నాడు రవి.
అందరూ ఎవరి కార్లో వాళ్ళు కూర్చున్నారు. ముందు రవి కారు బయలుదేరింది. వాళ్ళని అనుసరిస్తూ విష్ణు కారు పోనిచ్చాడు.
ఆ రోజు చక్కటి సూర్య రశ్మితో వాతావరణం ఆహ్లాదంగా ఉంది. అప్పటికి సమయం పదకొండు గంటలు కావస్తోంది. విష్ణు డ్రైవ్ చేస్తూండటంతో విశాల రూట్ మ్యాప్ చూడ సాగింది. డ్రైవ్ లో కాసేపటికి స్ట్రైట్ రోడ్ల తరువాత, దారి కొండలలోకి మళ్ళింది. చుట్టూ పచ్చపచ్చని చెట్లు, చేమలు. నిజంగా ‘తిరుపతి దారిని గుర్తుకు తీసుకువస్తోంది కదా!’ అనుకుంది విశాల మనసులో. కొండ పైకి వెడుతున్నపుడు చాలా మలుపులు తిరుగుతూ, మొత్తానికి రెండు కార్లు సరిగ్గా పదకొండు గంటల నలభై నిమిషాలకు గుడికి చేరుకు న్నారు.
“చక్కని బంగారు గోపుర శిఖరం, ప్రాకారంతో ఆలయం ఎంతో బాగుంది కదండీ!” అంది విశాలా సంభ్రమాశ్చర్యాలతో.
“మీ కారుని ఫాలో అవ్వడం వలన నాకు చాలా సులభమైంది” అన్నాడు విష్ణు.
“త్వరగా గుడిలోకి వెడదాము. 12 గంటలకు మూసివేస్తారు. మళ్ళీ సాయంత్రం నాలుగు గంటలకు గానీ తీయరు” అన్నాడు రవి.
అందరూ గుడి చుట్టూ ప్రదక్షిణం చేసి వినాయకుడు, శివుడు, దుర్గ, బాలత్రిపుర సుందరి, సుబ్రహ్మణ్య స్వామి, దక్షిణా మూర్తి, నవగ్రహాలు అందరి దేవుళ్ళకు దణ్ణాలు పెట్టుకుని సింహద్వారం వద్ద ఉన్న ఆలయంలో. తరువాత ఉత్తరాభిముఖంగా ఉన్న వేంకటేశ్వరస్వామి ఆలయంలోకి అడుగుపెట్టారు. అచ్చం తిరుపతి వేంకటేశ్వర స్వామి లాగనే ఇక్కడ సిడ్నీ లో కూడా నిలువెత్తు వేంకటేశ్వరస్వామిని చూడగానే విశాల చాలా భావోద్వేగానికి గురైంది. విశాల, విష్ణు ఇద్దరూ ఆనంద పారవశ్యానికి లోనయ్యారు. విశాల వేంకటేశ్వరస్వామిని చూడగానే, ఆనందంతో ‘భావములోన, బాహ్యము నందున గోవింద, గోవింద అని కొలువవో ఓ మనసా!’ అని అలవోకగా పాడటం విష్ణుని ఆశ్చర్యానికి గురి చేసింది.
పూజారి అందరికీ తీర్థం, శఠగోపం పెట్టి, పూలు, కుంకుమ ఇచ్చారు. వేంకటేశ్వర స్వామికి ఒకవైపు ఆండాళమ్మ, మరోవైపు లక్ష్మీ దేవి విగ్రహాలు ఉన్నాయి. ఎదురుగా పెద్ద హుండీ ఉంది. మరోవైపు సీతారాములు కొలువుదీరిన విగ్రహాలు, హనుమంతుడు, గరుత్మంతుడు ఇలా సర్వదేవతలు ఉన్న ఆలయం అది. “చాలా అద్భుతమైన దేవాలయం. ఇక్కడ ఆస్ట్రేలియా కూడా ఇంత సుందరంగా కట్టారు. దేవుడు సర్వాంత ర్యామి అనడానికి ఇంకేమి నిదర్శనం కావాలి?” అంది విశాల భక్తిపారవశ్యంతో.
“ఆగమ శాస్త్రాన్ని అనుసరించి 1979 లో వేంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణం ప్రారంభమైంది. జనసందోహానికి దూరంగా ఈ ప్రదేశం ఎందుకు ఎంచుకున్నారంటే తోటలు, నదులు, పర్వతాలు ఉన్న చోట దేవతలు కొలువై ఉంటారని బృహత్సంహితలో పేర్కొనబడింది. 1978 నవంబర్ 17 వ తేదీన ఈ ఆలయ కార్వనిర్వాహక సంఘం ఏర్పడింది. శ్రీ వేంకటేశ్వర స్వామి, శ్రీ మహాలక్ష్మి దేవి, ఇంకా శ్రీ ఆండాళ్ అమ్మవారి ప్రధాన ఆలయం 30 జూన్, 1985న ప్రారంభమైంది. ఆస్ట్రేలియా ఇంకా ఇతర దేశాల నుంచి ఎంతో మంది భక్తుల ఆర్థిక ప్రోత్సాహంతో, సంకల్పంతో ఈ ఆలయం స్థాపించారు. తిరుమల తిరుపతి దేవస్థానం వారు కూడా ప్రోత్సాహాన్ని అందించారు. ఇదే ఆస్ట్రేలియాలో నిర్మించబడిన మొట్టమొదటి హిందూ దేవాలయం” అని రవి హెలెన్స్ బెర్గ్ వేంకటేశ్వర స్వామి దేవాలయ చరిత్ర గురించి చెప్పుకొచ్చాడు. “చాలా సంతోషంగా ఉంది. ఈ రోజు మేము కారు కొనుక్కున్న తరువాత మొదటగా ఇక్కడికి రావడం” అంది విశాల.
తరువాత అందరూ అక్కడే ఉన్న దేవాలయ క్యాంటిన్ కి వెళ్ళారు. ఇడ్లీ, దోశ , పూరి, టీ ఆర్డర్ చేసి కబుర్లు చెప్పుకుంటూ లంచ్ చేసారు. తరువాత మళ్ళీ రవి కారు వెంబడి, విష్ణు తన కారును పోనిస్తూ, వెలుతురు ఉండగానే ఇంటికి చేరుకున్నారు.
విష్ణు మొదటిసారిగా వాళ్ళ యూనిట్ కి కేటాయించబడిన గ్యారేజ్ లో కారు పెట్టి, మెట్లు ఎక్కి వాళ్ళ యూనిట్ లోకి ఇద్దరూ వచ్చారు.
“ఈ రోజు నిజంగా చాలా దివ్యమైన రోజు. సమయానికి గుడికి వెళ్ళి, దేముడి దర్శనం చేసుకున్నాము. మహదానందంగా ఉంది” అంటుంది విశాల సంతృప్తిగా.
“నిజంగా విశాలా! దేముడికి మన గ్రాటిట్యూడ్ ని తెలుపుకున్నాము. నా సమస్య ఇలా పరిష్కరించడానికి ఒక మనిషి సహాయం సమయానికి అందింది. నిజంగా దేముడే ఆ రూపంలో వచ్చాడు అనుకుంటాను” అన్నాడు విష్ణు.
విష్ణుకి ఫోన్ రింగవడంతో, మొబైల్ ఎత్తి హలో! అంటాడు.
* * * * *
(ఇంకా ఉంది)