నా జీవన యానంలో- రెండవభాగం- 45
-కె.వరలక్ష్మి
ఆ రోజు పూర్ణిమ. ఆకాశం మబ్బులు కమ్మి సన్నని జడివాన. పవర్ కట్. ఊరంతా నిశ్శబ్దం. అర్థరాత్రి – కిటికీ కవతల సన్నని పున్నమి వెలుగులో బండి, ఎడ్లు, నాలుగు టేక్సీకార్లు, ఆ వెనక టేకు చెట్లు, ఇంకా అవతల హైవే ఫ్లై ఓవర్ మీద వెళ్తున్న లారీల హారన్ల సన్నని మోత – ఒక చెయ్యి తిరిగిన చిత్రకారుడు గీసిన బ్లేక్ అండ్ వైట్ చిత్రంలా అద్భుతంగా ఉంది. నా ఒంటరి తనం మాత్రం నన్ను అంటిపెట్టుకునే ఉంది. ఎవరి జీవితం వాళ్ళ సొంతం –
దాని తాలూకు కష్టాలకూ, సుఖాలకూ తీసుకున్న నిర్ణయాలు మంచివైనా, చెడువైనా బాధ్యత వాళ్ళదే. జీవితాన్ని ఆనందంగా మల్చుకోవడం, దుఃఖభాజనం చేసుకోవడం వారి వారి చేతుల్లోనూ, చేతల్లోనూ ఉంటుంది.
2009 కొత్త సంవత్సరం కొంచెం ముందు స్మైల్, జ్వాలాముఖి, జనవరి 1న కొత్తపల్లి సత్య శ్రీమన్నారాయణ వంటి ప్రముఖ కవుల్ని మనకు లేకుండా చేసేసింది.
ఆ సంవత్సరం జనవరి 10, 11 తేదీల్లో ’మనలో మనం‘ అనే కొత్త సంస్థ ప్రారంభ సభలు జరుగుతాయని, తప్పక రచయిత్రులంతా రావాలని ఇన్విటేషన్ వచ్చింది. అనకాపల్లికి దగ్గర్లో ఉన్న ఇండో అమెరికన్ స్కూల్ ఆవరణలో ఏర్పాటు చేస్తున్నారట.
జనవరి తొమ్మిది మధ్యాహ్నం 3.30 కి బస్సెక్కితే అనకాపల్లి చేరేసరికి 7.30 అయ్యింది. విశాఖ వర్మగారు కారులో నన్నూ, ట్రెయిన్ లో వచ్చిన పుట్ల హేమలతనూ తీసుకెళ్ళేరు, అప్పటికింకా ఎవరూ రాలేదు. సభను ఎరేంజ్ చేస్తున్న మల్లీశ్వరి, విష్ణుమాత్రం ఉన్నారు, వాళ్ళకు అన్ని విధాలా సాయంచేస్తూ మల్లీశ్వరి భర్త శ్రీనివాస్, వర్మ, వేణు ఉన్నారు. మాకు మెయిన్ బిల్డింగ్ సెకండ్ ఫ్లోర్ లో ఉన్న అద్భుతమైన గెస్ట్ రూమ్స్ ఇచ్చారు. ఆ స్కూలు ఉన్న ప్రదేశం ఎంత బావుందో! మూడువైపులా కొండలు, పొగమంచులో అందాలొలికే పచ్చని ప్రకృతి, అందాలొలికేలా పెంచిన గార్డెన్స్ – ‘ఓహ్!’ అన్పించేలా ఉంది.
తెల్లవారు ఝామున హైదరాబాద్, వరంగల్, మిగతా ప్రాంతాల నుంచి చాలా మంది రచయిత్రులు వచ్చారు. ఉదయం 11 కి సభ ప్రారంభమైంది. అటెండైన అందరూ ఎవరి గళాన్ని వారు గట్టిగానే విన్పించారు. అది స్త్రీవాద రచయిత్రుల సభలా కాక కులాల వర్గాల సభలా అన్పించింది. షాఝమానా ముస్లింగొంతు, జూపాక సుభద్ర దళిత గొంతు అందరికన్నా గట్టిగా విన్పించాయి, మా ఊరి దగ్గర్లో ఉన్న కాట్రావులపల్లిలో పుట్టి ఒరిస్సా భువనేశ్వర్ లో స్థిరపడిన బాలాదేవి గారు మొదటిసారి అక్కడే పరిచయమయ్యారు.
అంతా బావుంది కాని, రోజుకు మూడుసార్లు రెండంతస్తులు దిగి చాలా దూరం నడిచి, మళ్ళీ ఒక అంతస్తు పైకెక్కి భోజనాలు, టిఫిన్లు చేసి తిరిగి అంతదూరం వెనక్కి రావడం చాలా మంది ఇబ్బంది ఫీలయ్యారు.
రాత్రి 7 గంటలకు రెండు బస్సుల్లో అందరం విశాఖపట్నం ద్వారకా నగర్ లో ఉన్న సిటీ లైబ్రరీకి వెళ్ళేం. ఇక్కడా స్టేజిపైన వాళ్ళే. రాత్రి 12 కి తిరిగి వచ్చి అలసి నిద్రించాం. మా రూంలో నేను, హేమలత, ప్రమీల, పుష్పాంజలి ఉన్నాం. ఇప్పుడు ఈ లోకంలోలేదు కాని, మదనపల్లికి చెందిన పుష్పాంజలి గొప్ప స్నేహశీలి, ముందు నా కథల్నీ తర్వాత నన్నూ ఎంతగానో అభిమానించింది. తరచుగా ఫోన్లో పలకరించుకుని మాట్లాడుకునే వాళ్ళం, చిన్న అనారోగ్యం హఠాత్తుగా ఆమెను ఎత్తుకెళ్ళిపోయింది తర్వాత రోజుల్లో. 11న కమిటీ మెంబర్స్ ని ఎన్నుకున్నారు, ముందే అనుకున్నట్టున్నారు. ‘‘నిన్నా, ఈ రోజూ స్టేజిపైన అవే గొంతులు వినీవినీ విసుగొచ్చింది’’ అని కొందరు అనుకోవడం విన్పిం చింది. ఆ ఎన్నికల్నీ, ఆ అభిప్రాయాల్నీ కొందరు అక్కడే వ్యతిరేకించేరు.
సాయంకాలం అందర్నీ రైల్వే స్టేషన్లో, నన్ను బస్ స్టాప్ లో దిగబెట్టేరు. ఇంటికి చేరేసరికి రాత్రి 11 దాటింది. మా చుట్టు పక్కల వాళ్ళకీ, ఇంట్లో అద్దెకున్న వాళ్ళకీ గొప్ప సందేహం, క్యూరియాసిటీ, బేగ్ లో కాసిన్ని బట్టలు పెట్టుకుని ఈవిడ ఎక్కడికి వెళ్తూ ఉంటుంది? అని అనుమానం. కొందరైతే, నేను క్రైస్తవమతంలో చేరేనని, సభలకి వెళ్ళివస్తున్నానని చెప్పుకోవడం మొదలు పెట్టేరట. వాళ్ళ దృష్టిలో సభలు అంటే క్రైస్తవ సభలే.
జనవరి 30 న జరగబోయే అస్మిత వార్షికోత్సవానికి స్త్రీవాద కథల్ని ఆహ్వానించేరు. నా ‘క్షతగాత్ర’ కథ బహుమతికి ఎంపికైంది. మార్చి 28న నేను హైదరాబాద్ వెళ్ళేను. 30 సాయంకాలం తెలుగు యూనివర్సిటీ ఆడిటోరియంలో జరిగిన సభలో అస్మిత నుంచి ఆ బహుమతి అందుకున్నాను. బేబీ హాల్దార్ రాసిన బెంగాలీ ఆత్మకథను శాంతసుందరి గారు ‘చీకటిబతుకులు’ పేరుతో తెలుగులోకి అనువదించగా ఆ పుస్తకం ఆవిష్కరణ జరిగింది, సభకు చాలా మంది రచయిత్రులు వచ్చేరు, సభ చాలా బాగా జరిగింది. మా అబ్బాయి ఫోటోలు తీసేడు.
ఫిబ్రవరి 1న ఒక మూవీ ప్రీవ్యూ చూడడానికి వెళ్తూ మా అబ్బయి నన్ను కూడా తీసుకెళ్ళేడు, ఆ సందర్భంగా జూబ్లీ హిల్స్ లోని ఆలయాల సముదాయం చూపించేడు. అక్కడి ఆలయం ఒక దానిలో మా జగ్గంపేట అబ్బాయి ఒకతను పూజారిగా ఉన్నాడు. నన్ను చూడగానే వచ్చి పలకరించేడు.
నేను రాసిన ‘బతుకుబండి’ నాటకం ఆ మార్చి 21న రేడియో నాటకోత్సవాల్లో ప్రసారమైంది. అప్పటికే కొన్ని నాటికలు, ‘నిరసన’ నాటకం రేడియోలో ప్రసారమ య్యాయి.
ఈ సంవత్సరం రైటర్స్ మీట్ నాగార్జున సాగర్ లో ఏర్పాటుచేస్తున్నామని తప్పక రమ్మని ఖదీర్బాబు నుంచి ఇన్విటేషన్ వచ్చింది. సమావేశాలు మార్చి 7, 8 తేదీలలో. మళ్ళీ హైదరాబాద్ ప్రయాణం. హైదరాబాద్ నుంచి వెళ్ళే వాళ్ళందరం 6వ తేదీ సాయంకాలం 5 గంటలకి సోమాజిగూడ ప్రెస్ క్లబ్ కి చేరుకున్నాం. 6 కి బయలు దేరిన బస్సులో ఖదీర్, అక్బర్, అజయ్ ప్రసాద్, దేవేంద్రాచారి, విహారి గారు, ఒమ్మిరమేష్, అక్కిరాజు, అనంత్, రామ్మోహన్ లతో నేను ఉన్నాం. దారిలో సురేష్, పద్మావతి, వాళ్ళ ఇద్దరు పిల్లలు, ఉమా ఆర్.యం. ఎక్కేరు. దారిలో ధాబాలో భోజనాలు. 9.30 కి సాగర్లోని యూత్ హాస్టల్ కి చేరుకున్నాం. అర్థరాత్రి ప్రతిమ, లాయర్ చంద్రశేఖర్, మరికొందరు వచ్చారు. 7 ఉదయం 8 కి కుప్పిలి పద్మ చూపు కాత్యాయని వచ్చారు. అల్లం రాజయ్య, తుమ్మేటి, వెంకటక్రిష్ణ, మధురాంతకం నరేంద్ర వచ్చారు. 25 మందితో కథా చర్చ ప్రారంభమైంది. విహారి, అల్లం రాజయ్యవంటి సీనియర్స్ తమకాలం నాటి రచనా విధానం మీద, మేమంతా మా రచనల మీద మాట్లాడాం. వెరసి కథా రచనలో కొత్తదనాన్ని ఎలా తేవాలో చర్చజరిగింది. రుచికరమైన భోజనాలు, చక్కటి పరిసరాలు బావున్నై. సాయంత్రం అలా ఆనకట్ట వైపు వెళ్ళి రౌండు సెంటర్లో చక్కర్లు కొట్టి వచ్చాం. మళ్ళీ ఫ్రెష్షప్పై వెన్నెల్లో గార్డెన్లో కూర్చుని చికెన్ కబాబ్స్ తింటూ కబుర్లు చెప్పుకొన్నాం. అనంత్ పాటలు విన్నాం. పద్మావతి కూతురు నాలుగేళ్ళ శిశిర అక్కడున్న ఆల్సేషియన్ డాగ్ తో బాగా స్నేహం చేసేసింది. శిశిర అన్నయ్య అయిదేళ్ళవాడు వాడో ఎట్రాక్షన్. (ఈ మధ్యనే వాడు వాళ్ళమ్మ కడుపులో చిచ్చుపెట్టి ఈ లోకం నుంచి నిష్క్రమించేడు) చర్చల తర్వాత అందరూ ఒకో కథ రాయాలి అనే నియమం ప్రకారం నేను ‘ఎందుకోతెలీదు’ అనే కథని శిశిర మీద రాసాను.
8 ఉదయం చినవీరభద్రుడు వచ్చాడు. ఆ రోజు కూడా మధ్యాహ్నం వరకూ చాలా మంచి చర్చజరిగింది. మధ్యాహ్నం క్రిష్ణానది చేపల కూర, పులుసు, ఫ్రైలతో భోజనాలు చేసి తిరుగుప్రయాణమయ్యాం.
మార్చి 21, 22 లలో ‘మనలో మనం’ సమావేశాలు వరంగల్ కాకతీయ యూనివర్సిటీ లో జరుగుతాయని తెలిసి నేను హైదరాబాద్ లో మా అబ్బాయి ఇంట్లో ఉండిపోయాను, 20 సాయంకాలం 4.15 కి ఇంటర్ సిటీ ఎక్కి 6.20 కి వరంగల్లులో దిగేను, హన్మకొండ కాకతీయ యూనివర్సిటీకి దగ్గర్లో ఉన్న కాత్యాయనీ విద్మహే ఇంటికి తీసుకెళ్ళేరు. ఆ రాత్రి కాత్యాయని గారింటి పై అంతస్తు మేడమీది గదిలో నాకు, జాజులగౌరికి అకామడేషన్ ఇచ్చారు. గాలిలేదని గౌరి కిటికీలు తెరిచేసింది. అంతే, దోమలు దాడి చేసి బాగా కుట్టేసాయి. నిద్రలేకుండా అయిపోయింది.
21 న యూనివర్సిటీ ఎకనామిక్స్ సెమినార్ హాల్లో సభ జరిగింది. కొందరు పేపర్స్ సబ్మిట్ చేసారు. లంచ్ యూనివర్సిటీలోనూ, డిన్నర్ జ్యోతిరాణి గారింట్లోనూ చేసాం. మా ఇద్దరితో బాటు ఆ రోజు వచ్చిన ప్రతిమ, మల్లీశ్వరి, విష్ణు, విజయభాను, లక్ష్మీ సుహాసిని కాత్యాయనిగారింట్లోనూ, మిగిలిన అందరూ యూనివర్సిటీ గెస్ట్ హౌస్ ల్లోనూ ఉన్నాం. 22 ఉదయం పి. సత్యవతి, సుంటసాల నిర్మల, కొండేపూడి నిర్మల వచ్చారు. సెమినార్ చర్చలు ముగిసాక అనుకోకుండా అందరూ యూనానిమస్ గా నన్ను బి.సీ. ల్లో అడ్ హాక్ కమిటీ మెంబరుగా ఎన్నుకున్నామన్నారు. దాన్నుంచి బైట పడాలనుకున్న నేను అనుకోకుండా అలా ఇరుక్కుపోయాను. ఆ రాత్రి గౌతమీ ఎక్కి మర్నాడు ఉదయానికి మా ఊరు చేరుకున్నాను. మార్చి 29న ఆంధ్రజ్యోతి ఆదివారం అనుబంధంలో నా ‘క్షతగాత్ర’ కథ వచ్చింది. ఉదయం 6 కి మొదలై రాత్రి 10 వరకూ ఎడతెరిపి లేకుండా ఒకటే ఫోన్ కాల్స్. ఎవరో తెలీని పాఠకులు స్త్రీలు – పురుషులు, 200 కు పైగా కాల్స్ మాట్లాడి మాట్లాడి అలసట వచ్చేసింది. మరోపక్క వందల కొద్దీ మెసేజెస్, ఎంతో మంచి డిస్కషన్స్, వెల్ విష్షింగ్స్. అంతా చాలా బాగా రియాక్టయ్యారు. బోలెడు మంది రచయితల నుంచి ఫోన్లు, గంటలకు గంటలు మాటలు, నామిని అయితే గంటపైగా మాట్లాడేడు, ‘సభలకూ, సమావేశాలకూ వెళ్ళోద్దు, మంచి కథలు రాయండి‘ అన్నాడు.
ఏప్రిల్ 27న సెలబ్రిటీ క్లబ్ లో భూమిక మీటింగ్ జరిగింది. తురగా జానకి రాణి గారితో సహా సీనియర్ రచయిత్రులు చాలా మంది వచ్చారు. స్త్రీల సంక్షేమం పైన అందరూ బాగా మాట్లాడేరు.
ఆ సంవత్సరం విశాఖపట్నం స్టీల్ సిటీ వారు మొదటిసారిగా పెట్టిన కథల పోటీలో నా కథ ‘ఒక స్వప్నం ` ఒక మెలకువ’ కి బహుమతి వచ్చింది. ఆ సందర్భంగా జూన్ 1న స్టీల్ ఫేక్టరీ సెక్టార్ నెం. 1, లైబ్రరీ అండ్ కమ్యూనిటీ హాల్లో జరిగిన సభకు అటెండై బహుమతి అందుకున్నాను. కాశీ విశ్వనాథ్ గారు ముఖ్య అతిథి, ద్విభాష్యం రాజేశ్వర్రావు గారు జడ్జి. సింహాచలం నుంచి ఇందూరమణ తనకారులో తీసుకెళ్ళి తీసుకొచ్చారు.
*****
కె వరలక్ష్మి జన్మస్థలం, ప్రస్తుత నివాసం తూర్పుగోదావరి జిల్లాలోని జగ్గంపేట. ప్రముఖ కవయిత్రి, “నెచ్చెలి” సంస్థాపకసంపాదకురాలు డా||కె.గీత వీరి అమ్మాయి. నాలుగు నవలికలు, 140 పైగా కథలు, చాలా కవితలు, రేడియో నాటికలు, వ్యాసాలు రచించారు. జీవరాగం (1996), మట్టి బంగారం (2002), అతడు నేను- (2007), క్షతగాత్ర (2014), పిట్టగూళ్లు (2017) కథా సంపుటులు, ఆమె (2003) కవితా సంపుటి, కథ, కథావార్షిక, రంజని, రచన, విశాలాంధ్ర, కవిత, కవితా వార్షిక, నీలిమేఘాలు మొ.లైన వెన్నో సంకలనాలు. చాసో స్ఫూర్తి పురస్కారం, రంగవల్లి, విమలా శాంతి పురస్కారం, సహృదయ సాహితీ, బి.ఎస్ రాములు, హసన్ ఫాతిమా పురస్కారాలు, పొట్టి శ్రీ రాములు తెలుగు యూనివర్శిటీ ధర్మనిధి పురస్కారం , రంజని, పులికంటి, ఆర్.ఎస్ కృష్ణమూర్తి అవార్డులు, అప్పాజోస్యుల- విష్ణుభొట్ల పురస్కారం, శ్రీమతి సుశీలా నారాయణ రెడ్డి సాహితీ పురస్కారం, ఆటా, తానా పురస్కారాలు మొ.నవి కథలకు అవార్డులు. శ్రీ శ్రీ, దేవుల పల్లి కృష్ణ శాస్త్రి అవార్డు మొ.నవి కవితలకు అవార్డులు. శాస్త్రీయ సంగీతం, గజల్స్ వినడం, మంచి సాహిత్యం చదవడం అభిరుచులు.