వెనుతిరగని వెన్నెల(భాగం-62)
–డా||కె.గీత
(*“కౌముది” లో ధారావాహిక నవలగా 2015 నుంచి 2020 వరకు ప్రచురించబడిన “వెనుతిరగని వెన్నెల” ఇప్పటివరకు చదవని వారి కోసం కౌముది సౌజన్యంతో నెల నెలా ఆడియోతో బాటూ ఇక్కడ ఇస్తున్నాం.)
***
జరిగిన కథ: అమెరికాలో తన తల్లికి స్నేహితురాలు, స్త్రీలకు సహాయం చేసే సంస్థ “సహాయ”ను నడిపే ఉదయినిని కలవడానికి వస్తుంది సమీర. నాలుగు నెలల గర్భవతైన సమీర, తనకు విడాకులు తీసుకోవాలని ఉందని, అందుకు దోహదమైన పరిస్థితుల్ని చెపుతుంది. ఉదయిని “తన్మయి”కథ చెపుతాను, విన్నాక ఆలోచించుకోమని చెప్తుంది సమీరతో. చుట్టాల పెళ్ళిలో కలుసుకున్న తన్మయి, శేఖర్ లకు పెద్దవాళ్ళ అనుమతితో పెళ్ళి జరుగుతుంది. పెళ్ళయిన మరుక్షణం నించే శేఖర్ అసలు స్వరూపం బయట పడుతుంది. మొదటి సంవత్సరంలోనే అబ్బాయి పుడతాడు. శేఖర్ తో ఒక పక్క కష్టాలు పడుతూనే తన్మయి యూనివర్శిటీ లో ఎమ్మే పాసయ్యి, పీ.హెచ్.డీ లో జాయినవుతుంది. శేఖర్ తో ఎన్నో రోజులు పోరాడి, చివరికి తన్మయి విడిపోతుంది. హైదరాబాదుకు దగ్గర్లో తన్మయికి లెక్చరర్ గా ఉద్యోగం వస్తుంది. చిన్ననాటి స్నేహితుడు ప్రభుతో మళ్ళీ పెళ్ళి జరుగుతుంది. ప్రభుతో బాటూ అతని కుటుంబం కూడా వచ్చి చేరి, హింస మొదలవు తుంది.
***
భానుమూర్తి మరణించిన పదకొండో రోజు పెద్ద దినానికి బంధువులందరూ వచ్చేరు.
ప్రభుకి చివరి నిమిషంలో ఆఫీసు పని పడడంతో రాలేకపోతున్నానని ఫోను చేసేడు.
“వాళ్ళ వాళ్ళేవ్వరూ ఎలాగూ రారు, ప్రభు వస్తే నైనా బావుణ్ణు” నిట్టూర్చింది తన్మయి.
బాబాయిలూ, మావయ్యలూ దగ్గరుండి అన్నీ చూసుకుంటూ ఉన్నా ప్రభు లేని లోటు స్పష్టంగా కనిపించసాగింది.
ముఖ్యంగా కడుపులో బిడ్డతో తను అవస్త పడకూడదని ఏ మూలనున్నా తనని ఓ కంట కనిపెట్టి గబుక్కున ఏ అవసరమైనా పరుగెత్తుకొచ్చే ప్రభు దగ్గిర లేకపోవడం బాధేగా మరి!
బంధువులు ఒకరూ ఒకరూ రాసాగేరు.
పదకొండు గంటల వేళ దేవి వచ్చింది. వస్తూనే జ్యోతితో “ఏవీ అనుకోకు వదినా, చిన్నదినానికి రాలేకపోయేను, వియ్యంకుడు కాబట్టి మీ అన్నయ్యగారు ఎలాగూ రాకూడదు” అని పక్కనే ఉన్న తన్మయి వైపు, పొట్ట వైపు ఎగా దిగా చూస్తూ గద్దించినట్టు “మళ్ళీ పెళ్ళి చేసుకున్నావని తెల్సింది. మన కులవేనా?” అంది. తన్మయి ఏదో అనేలోగా జ్యోతి కల్పించుకుని “అవన్నీ ఇప్పుడెందుకులేమ్మా” అని తన్మయి వైపు చూసింది అక్కడి నుంచి లోపలికి వెళ్ళమన్నట్టు.
“తల్లి ఎందుకు ధైర్యంగా తన పెళ్ళి గురించి చెప్పదు? తనేం తప్పు చేసింది? తనకు నచ్చిన వాణ్ణి పెళ్ళి చేసుకుంది.”
దేవి ప్రశ్న గుర్తుకు వచ్చింది.
“అయినా అతను ఏ కులమైతే వీళ్ళందరికీ ఏంటట? తండ్రి పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న తనని అడగాల్సిన ప్రశ్నలేనా ఇవి?”
అటూ ఇటూ పరుగెడుతున్న బాబుని దేవి దగ్గరికి పిలిచినా వాడు వెళ్ళకపోవడాన్ని గమనించింది తన్మయి. దేవి మూతి మూడు వంకర్లు తిప్పి తన్మయి వైపు చురచురా చూసి “ఏ గూటి సిలక ఆ గూటి పలుకే పలుకుతాదట, ఏం జేత్తాం మా కర్మ” అని గొణిగింది.
తన్మయి చూసీ చూడనట్టు అక్కణ్నించి లోపలికి వెళ్ళిపోయింది.
“ఇప్పుడు తనివన్నీ మనసుకి పట్టించుకోకూడదు. సమయానికి వనజ ఊర్లో ఉంది కాబట్టి సరిపోయింది. లేకపోతే ఒకదాని మీద ఒకటి వచ్చి పడ్తున్న సమస్యల్తో తల పగిలిపోతూంది తనకి.”
తన్మయికి అమ్మమ్మ చనిపోయినప్పుడు జరిగిన ఆస్థి పంపకాల యుద్ధం గుర్తుకు వచ్చింది. తన తల్లిదండ్రులకి తనొక్కతే సంతానం కాబట్టి సరిపోయింది. లేకపోతే అది కూడా తోడయ్యేది. శ్రాద్ధ కర్మలు, భోజనాలు, హడావిడి అయ్యి బంధువులు మెల్లగా వెళ్ళసాగేరు.
ఇలా చావు ఇంటి నుంచి వెళ్ళేటపుడు ఇంటి వాళ్ళకి చెప్పి వెళ్ళకూడదనేది ఆచారం కాబట్టి ఎవరు ఎప్పుడు వెళ్ళేరన్నది తెలియదు.
దేవి ఎప్పుడు వెళ్ళిందో కూడా తెలియదు.
“మహాతల్లి, మొత్తానికి వదిలిందమ్మా. అన్నీ ఆరాలే మనిషికి. ఆవిడ కొడుకు పెళ్ళాం ఉండగానే దేన్నో తగులుకుని ఊరేగొచ్చు. విడాకులయిపోయినా ఇక్కడ మాత్రం ఎవరూ పెళ్ళిళ్ళు చేసుకోకూడదు.” పిన్ని విసుక్కోసాగింది.
పొద్దుట్నించీ అటూ ఇటూ తిరుగుతూ దాదాపు నిలబడే ఉన్న తన్మయికి సాయంత్రం వేళకి బాగా నిస్సత్తువ వచ్చినట్లయింది. భౌతికంగా కడుపులోని బరువుకి తోడు మానసికమైన దిగులు కూడా తోడయ్యి మరింత భారం అనిపించసాగింది.
కడుపులో ఒక రకమైన సన్నని నొప్పిగా అనిపించసాగింది. ముందు బాబు పుట్టి నప్పటిలా. తన్మయి లెక్క బెట్టుకుంది. మర్నాటికి ఏడు నెలలు నిండుతాయి. లోపలి గదిలోకి వెళ్ళి నెమ్మదిగా మేను వాల్చింది. ఏ పక్క ఒత్తిగిలినా అలాగే నొప్పి రాసాగింది.
తన అవస్త గమనించినట్లు పిన్ని లోపలికి వస్తూనే “ఏమ్మా! ఏవైనా తిన్నావా లేదా?” అంటూ నుదుటి మీద చెయ్యి వేసి చూసింది. తన్మయి కడుపు మీద ఒక చెయ్యి పట్టుకుని మరో చేత్తో పిన్ని చేతిని గట్టిగా పట్టుకుంది. పిన్ని అర్థమయినట్టు గబుక్కున వరండాలోకి పరుగెత్తి “అక్కా! పిల్లకి నెప్పులొస్తన్నట్టున్నాయి, ఇదిగో ఏవండీ రిక్షా పిలిపించండి” అని అరిచింది.
జ్యోతి గబుక్కున వచ్చి కడుపు మీద చెయ్యి వేసి గాభరాగా “ఏమ్మా, ప్రసవం నెప్పిలా అనిపిస్తందా?” అంది.
తన్మయి తలూపగానే “బాబాయ్, ఊర్లో కొత్త డాక్టరు గారు ప్రసూతి ఆస్పత్రి పెట్టేరు కదా” అక్కడికని చెప్పండి రిక్షాకి అనరిచింది. గుమ్మం దగ్గిర నించి గాభరాగా తల్లినే చూస్తున్న బాబుని దగ్గిరికి పిలిచింది. గాభరా పడకు నాన్నా “చెల్లి బయటికి రావడానికి ఇంకా రెణ్ణెల్లు టైం ఉంది. ఇప్పుడేదో కొంచెం నెప్పిగా ఉందంతే. వెళ్ళి తొందరగా వచ్చేస్తాను.” అంది నెమ్మదిగా పంటి బిగువున బాధని ఆపుకుంటూ తన్మయి.
డాక్టరు పరీక్ష చేస్తూనే “ నొప్పి కంట్రోల్ అవ్వడానికి ఇప్పటికి మందు ఇస్తాను. కానీ ఆపరేషను చేసి బిడ్డను బయటికి తియాల్సి రావొచ్చు” అన్నారు.
తన్మయికి తల తిరిగింది.
“అదేవిటీ డాక్టర్, “ఇంకా ఏడో నెల ఇప్పుడే పూర్తయ్యింది కదా” అంది.
“తప్పదమ్మా కొన్ని సార్లు ఇలా ప్రీ టర్మ్ డెలివరీ చెయ్యాల్సి ఉంటుంది. ఇప్పుడు వెంటనే అడ్మిట్ కండి. ఉదయానే లేడీ డాక్టరుని పిలిపిస్తాను. ఆవిడ స్కానింగ్, మిగతా పరీక్షలు చేసి సరేనంటే డెలివరీ చేసేద్దాం. కానీ బేబీ ఇంకా పూర్తిగా ఎదగదు కాబట్టి ఇంక్యుబేటర్ లో ఒక నెల వరకూ నయినా ఉంచాల్సి ఉంటుంది. మీరేం గాభరా పడకండి. ఇక్కడే ఆ సదుపాయం కూడా ఉంది.” అన్నాడు.
జ్యోతి కాళ్ళలో ఓపిక లేనట్టు కూలబడింది “ఒక దాని మీదొకటి ఈ బాధలేంటి భగవంతుడా” అంటూ.
తన్మయి స్థిమితపడుతూ “అమ్మా! టెన్షను పడకు. నాకు సన్నగా నొప్పిగా ఉంది అంతే. అయినా డాక్టరు చెప్పినట్లు అడ్మిట్ అవ్వడమే మంచిదని అనిపిస్తూంది. రేపు లేడీ డాక్టరు చూసి చెప్తారని చెప్పేరుగా. పిన్నిని ఇక్కడ నా దగ్గిర ఉంచి, నువ్వు ఇంటికి వెళ్ళి అర్జంటుగా రమ్మని ప్రభుకి ఫోను చెయ్యి” అంది.
జ్యోతి ఇంకా భగవంతుడికి నమస్కరిస్తున్నట్టు గాల్లో చేతులు చూపిస్తూ “ఏమో తల్లీ! నీకున్న ధైర్యం నాకు లేదు. నాకు కాళ్ళూ చేతులూ ఆడడం లేదు. పైగా ఇప్పటికిపుడు ఆపరేషనంటే చేతిలో అంత డబ్బూ లేదు.” అంది.
తన్మయి తల్లి చేతుల మీద చెయ్యి వేసి “అమ్మా! ఆ విషయాలన్నీ ప్రభు చూసు కుంటాడు. నువ్వు దిగులు పడకు. నా దగ్గిర ప్రస్తుతం ఉన్నవి నేను కడతాను.” అంది అనునయంగా.
“మీ నాన్నగారే ఉంటే నాకీ బాధే లేకపోను” అని కళ్ళోత్తుకోసాగింది జ్యోతి.
“అదేటక్కా ఓ పక్క పిల్లకి బాలేకపోతే నువ్వూ ఇలాగేడుస్తా కూచుంటే ఎలాగ సెప్పు. మీ మర్దిగారు, నేను ఇయ్యన్నీ సర్దుకునీ వొరకూ మీకు సాయంగా ఉంటాంలే. పాప సెప్పి నట్టు నువ్వు ఇంటికెల్లి అల్లుడు గారికి పోను చెయ్యి” అంది పిన్ని.
తన్మయి కృతజ్ఞతా పూర్వకంగా చూసింది.
పైకి ధైర్యంగా మాటలు చెప్తూందే కానీ లోపల్లోపల భయంగా అనిపించసాగింది తన్మయికి. కళ్ళు మూసుకుని “మిత్రమా! ఎన్నో కష్టాల నుంచి గట్టెక్కించావు. నన్నీ కష్టం నించి కూడా గట్టెక్కించు, నాకు ధైర్యాన్ని ప్రసాదించు” అని వేడుకుంది. కడుపు మీద చెయ్యి పెట్టి “పాపాయీ! నువ్వస్సలు భయపడొద్దు. ఈ అమ్మ బతికుండగా నీకేం కాదు. ధైర్యంగా ఉండు” అని చెప్పింది.
గంటలో వనజ పరుగున వచ్చింది.
వస్తూనే తన్మయి బెడ్ దగ్గిరికి వచ్చి చెయ్యి పట్టుకుని “ఏం గాభరా పడకు. మేమంద రం ఉన్నాంగా” అంది.
“ఏటోనమ్మా ఈ కష్టాలు, మా రోజుల్లో కనీవినీ ఎరగం” అంది పిన్ని నిట్టూరుస్తూ.
వనజని చూడగానే బోల్డు ధైర్యం వచ్చినట్లయ్యింది తన్మయికి.
“ఒకప్పుడు మనిద్దరం ఎన్ని సాయంత్రాలు కలిసి కబుర్లు చెప్పుకునే వాళ్ళం! ఆ రోజుల్లో కష్టమంటే ఏవిటో అసలు తెలుసా మనకి?” మెల్లిగా అంది.
వనజ చెయ్యి నిమురుతూ “కష్టాల్లోకి ఎదగడమే జీవితం అనుకుంటా తనూ! అయినా ఏం భయపడకు. డాక్టరు రేపు ఇంటికి పంపేస్తారులే” అంది.
అలాగే అన్నట్టు తలుపుతూ “ఊరికి ఎప్పుడెళ్తున్నావు?” అంది తన్మయి.
“లేదు తనూ! అమ్మా వాళ్ళ ఇంట్లోనే ఉంటున్నాం. సుధాకర్ ఉద్యోగం మానేసి బిజినెస్ ప్రారంభించేరు రెండేళ్ళ కిందట. కానీ సరిగా కలిసి రాలేదు. మొన్నీమధ్యే నాన్నగారు ఈయనకి షుగర్ ఫాక్టరీలో ఉద్యోగం వేయించేరు. ఇంకా మా భవిష్యత్తు ఏవీ కుదుటపడలేదు. ఒక పక్క ఒకరికి ఇద్దరు పిల్లలయ్యేరు” అంది నిట్టూరుస్తూ వనజ.
అంతా బావుందనుకున్న వనజ సంసారంలో ఆర్థిక ఇబ్బందులన్న మాట.
ఏవిటో ఒక్కొక్కరి జీవితం!
వనజ చేతినలాగే పట్టుకుని “నాకు ఎప్పుడూ నువ్వే ధైర్యం. అలాంటి నువ్వు ఎప్పుడూ ధైర్యం కోల్పోకూడదు వనా! ఏం భయపడకు అంతా సర్దుకుంటుంది” అంది తన్మయి.
***
తెల్లారగట్ల మొదటి బస్సుకి ప్రభు వచ్చేడు. రాత్రంతా కలత నిద్ర పట్టి అప్పుడ ప్పుడే నిద్రలోకి జారుకుంటున్న తన్మయి నుదుటి మీద ప్రభు చేతి స్పర్శకి ఆనందంగా కళ్ళు తెరిచింది.
“ఎలా ఉందిరా” ఆదుర్దాగా అడిగేడు ప్రభు.
అతని హృదయంలోని ప్రేమంతా కళ్ళలో ప్రతిఫలిస్తూ కంటి మీద నీటి పొర కప్పింది.
తన్మయి నిశ్చింతగా తలూపింది.
ప్రభుని చూడగానే కొండంత బలం వచ్చింది. తనని వదిలి వెళ్ళ వద్దన్నట్టు అతని చేతిని గట్టిగా పట్టుకుంది.
పిన్ని లేచి “ఎప్పుడొచ్చేవు బాబూ” అని “హమ్మయ్య, మా అల్లుడుగారు వొచ్చీసేరు. మా అమ్ములుకి ఇంక బాధే లేదు” అంది నవ్వుతూ. మరో గంటలో జ్యోతి బాబుని తీసుకుని వచ్చింది. తొమ్మిది గంటలకి లేడీ డాక్టరు వస్తూనే పరీక్షలు చేసి “డెలివరీ చేసెయ్యడమే మంచిది” అంది.
అప్పటివరకూ ఇంటికి వెళ్ళి పొమ్మంటారని ఆశిస్తూ ఉన్నారు అంతా. ఇప్పుడా ఆశ కాస్తా అడియాస అయ్యింది.
ప్రభు గాభరాగా వెనకే వెళ్ళి విషయాలన్నీ అడిగి వచ్చేడు. వెనక్కి వస్తూనే తన్మయి దగ్గిరికి వచ్చి చేతిని గట్టిగా పట్టుకుని “ఏం భయపడక్కరలేదని చెప్తున్నారు డాక్టరు.
స్కానింగులో పాపాయి బానే ఎదిగినట్లు ఉంది కాబట్టి ఇంక్యుబేటరులో ఎక్కువ రోజులు పెట్టాల్సిన పని ఉండక పోవచ్చు అంటున్నారు. ఇక సిజేరియను ఈ రోజుల్లో చాలా కామన్ అయిపోయింది కాబట్టి వర్రీ అవ్వొద్దని అన్నారు. నువ్వు ధైర్యంగా ఉండు” అన్నాడు.
“కాలేజీకి ఫోను చేసి సెలవు చెప్పాలి. సిద్దార్థకి కూడా ఫోను చెయ్యి అంది” తన్మయి.
“సిద్దార్థ గారికి రాత్రే ఫోను చేసేను. అన్నీ ఆయన చూసుకుంటామన్నారు. సంతకాలు ఏవైనా అవసరమైతే పోస్టులో కాగితాలు పంపుతామన్నారు. నువ్వు నిశ్చింతగా ఉండు” అన్నాడు.
“ప్రభు అంత జాగ్రత్తగా ఈ ప్రపంచంలో తనని ఎవరూ చూడలేరేమో!” ఆపరేషను థియేటర్ లోకి వెళ్ళే వరకూ ప్రభు చేతిని వదలకుండా పట్టుకునే ఉంది తన్మయి.
“ఆ స్పర్శ లోనే గొప్ప నిశ్చింత ఉంది!”
మత్తులోకి జారుకుంటూ ఉన్నపుడు “మిత్రమా! నేను మరలా కళ్ళు తెరిచినా, తెరవకపోయినా నా బిడ్డని బ్రతికించు. నా బాబుని కాపాడు. నా ప్రభుని ధైర్యంగా ముందు కు నడిపించు.” అని వేడుకుంది.
నిజానికి పూర్తిగా మత్తులోకి జారుకోకుండానే ఆపరేషను పూర్తయ్యి పోయింది కూడా.
సిజేరియన్ ఆపరేషను ఇంత సులభమని తెలియదు తన్మయికి. మొదటిసారి తను అనవసరంగా మాములు డెలివరీ పేరుతో నరకం అనుభవించింది. పాపని బయటికి తీస్తూనే కళ్ళ ముందు “ఆడపిల్ల” అని ఒక్క క్షణం చూపించి వెంటనే ఇంక్యుబేటర్ రూం కి పంపేరు.
“ఆడపిల్ల” అన్న మాటే అమృత తుల్యంగా అనిపించింది తన్మయికి. తనకి పాపే కావాలని ఎప్పుడూ కోరుకుంది. అందుకే బాబుతో అస్తమాటూ “చెల్లి” అని చెప్పేది.
బయట ఉన్న ప్రభుకి పాపని ఒక్క సారి చూపించమని మత్తులోనే గొణగ సాగింది తన్మయి.
“మీరేం టెన్సను పడకండి పాపని ఆరి నాన్నగారే సొయంగా దగ్గరుండి ఇంక్యుబే టర్ రూముకి తీసుకెల్లేరు” అంది ఆయమ్మ నవ్వుతూ.
మరో అరగంటలో కుట్లు వెయ్యంగానే రూముకి మార్చేరు తన్మయిని.
“పాప బలహీనంగా ఉన్నా అన్ని అవయవాలూ పూర్తిగా ఎదగడం వల్ల ప్రమాదమేమీ లేదు” అంది డాక్టరు రూముకి షిప్ట్ చేసే ముందు.
తన్మయికి పాపని ఎప్పుడెప్పుడు చూస్తానా అని ఉంది. తన్మయిని చూసేక గానీ స్థిమితం లేనట్లు బయటే అటూ ఇటూ తచ్చాడుతున్న ప్రభు చప్పున లోపలికి వచ్చేడు.
చెమట్లు పట్టి ఉన్న ప్రభుని చూస్తూనే నీరసంగా నవ్వింది తన్మయి. కానీ అంతలోనే మత్తు ఆవహించడంతో మళ్ళీ కళ్ళు మూసుకుంది. కాస్సేపట్లో మెలకువ వచ్చేసరికి జ్యోతి తల నిమిరుతూ ఉంది. గొంతు తడారిపోతున్నట్లున్నా మాటల్ని కూడదీసు కుంటూ “పాప ఎలా ఉందమ్మా?” అంది.
జ్యోతి దుఃఖం నిండిన గొంతుతో “బానే ఉందంటున్నారమ్మా. కానీ అలా పిల్లని పెట్టెలో కట్టిపడేసినట్టు చూసేసరికి నా కడుపు నీరయిపోతూంది” అంది.
తన్మయికి దుఃఖం తన్నుకొచ్చింది.
ప్రభు వెంటనే కల్పించుకుని దగ్గిరికి వచ్చి ” తనూ! ఈ పరిస్థితుల్లో నువ్వసలు ఏడవకూడదు. మన పాపకి ఏవీ కాలేదు. అంతా బానే ఉంది. మనకే ఇవన్నీ చూడడం కొత్త కదా. అందుకే అలా అనిపిస్తుంది. డాక్టర్లు ఏం చేసినా పాప మంచి కోసమే కదా! ఇంకా రెణ్ణెళ్ళు కడుపులో ఎదగాల్సిన పాప ఇప్పుడే బయటి ప్రపచంలోకి త్వరపడి వచ్చేసింది. తనకి కడుపులోని వాతావరణం కృత్రిమంగానైనా కల్పించడమే మంచిది కదా!” అని..
“అత్తమ్మా! మీరు అనవసరంగా బాధ పడి తన్మయిని బాధ పెట్టకండి” అన్నాడు.
జ్యోతి వెంటనే “ఏవో బాబూ, మీలా మేం చదూకోలేదు. మాకివన్నీ తెలీదు. ఏదో కన్న కడుపు తీపి” అని నిష్టూరంగా అంది.
ప్రభు ఏమని రియాక్ట్ అవుతాడో అని తన్మయి లోపల్లోపలే భయపడింది.
ప్రభు నిశ్శబ్దంగా ఊరుకున్నాడు.
“హమ్మయ్య” అని నిట్టూర్చింది తన్మయి.
***
మర్నాడే తన్మయిని లేపి కూచోబెట్టేరు.
సాయంత్రానికి మెల్లిగా నడిపించి తన్మయికి పక్క గదిలోనే ఉన్న పాపని చూపిం చేరు.
పాపకి పాలు పిండి ఇవ్వడానికి మిషను తెప్పించేరు.
నర్సులే పాపకు ట్యూబులు మార్చి పెడుతున్నారు. కళ్ళు మూసుకుని ఇంకా కడుపులోనే ఉన్నట్టు నిద్రపోతూనే ఉంది పాప.
తల్లి అన్నదాని కాదు కానీ తన్మయికి బలహీనంగా ఉన్న పాపని అక్కడలా చూడగానే బాగా దుఃఖం తన్నుకొచ్చింది. మూడో రోజు తన్మయిని ఇంటికి వెళ్ళి పోవచ్చని చెప్పినా పాపను పంపేవరకూ తనూ ఆసుపత్రిలోనే ఉంటానని పంతం పట్టింది తన్మయి.
అయిదో రోజు నాటికి తన్మయికి తనంతట తనుగా లేవగలగడం అలవాటయ్యింది.
పాప దగ్గిరి నించి వచ్చేసరికి ప్రభు తల్లీ, తండ్రీ వచ్చి ఉన్నారు.
చెప్పాపెట్టకుండా వచ్చేవని వాళ్ళు అంటున్నా ప్రభుకి తెలియకుండా వచ్చే రన్నది నమ్మబుద్ధి కాలేదు తన్మయికి.
అయినా మామూలుగానే పలకరించింది.
జ్యోతి ముందు సంశయించినా కాస్సేపట్లో అంతా పరిచయంగా మాట్లాడుకోవడం చూసి స్థిమితపడింది తన్మయి.
ప్రభు అందరికీ టీలు పట్టుకురావడానికి బయటికి వెళ్ళేడు.
ఉన్నట్టుండి ప్రభు తండ్రి నోట్లో నములుతున్నదేదో బయటి గుమ్మం దగ్గిరకెళ్ళి కాండ్రించి ఊసి వచ్చి “ఊ…ఏం నిర్ణయించుకున్నారు?” అన్నాడు జ్యోతిని ఉద్దేశించి.
జ్యోతి అర్థం కానట్టు తెల్లబోయి చూసింది.
“అదే, మాకు మనవరాలు పుట్టింది. వచ్చే ఏడాదో, పై ఏడాదో మొగ పిల్లోడు కూడా పుడతాడు. ఇంక మీ మనవణ్ణి మీ ఇంటి కాడ ఉంచుకోవటం అందరికీ ఉత్తమం, ఏటి?” అన్నాడు.
తన్మయికి రక్తం సలసలా మరిగింది ఒక్కసారిగా.
“ఎవరికి ఉత్తమం? మీ మనవరాల్ని చూసుకోవడానికి వచ్చేరా? బాబు విషయం మాట్లాడడానికొచ్చేరా?” అంది తీక్షణంగా చూస్తూ.
జ్యోతి వెంటనే కల్పించుకుని బాలెంతవి అంతంత ఆవేశం తెచ్చుకోకమ్మా అంటూ “మీరేవంటన్నారో నాకు ఒక్క ముక్క అర్థం కావట్లేదు. మా పిల్ల తెలిసో తెలీకో మీ అబ్బాయిని చేసుకుంది. మధ్యలో పసి పిల్లోడు ఏం చేసేడు? దయచేసి ఇప్పుడిక్కడ ఇలాంటి మాటలు మాట్లాడకండి. మీ అబ్బాయి వచ్చేక మీరూ మీరూ తేల్చుకోండి.” అని లేచి బయటికెళ్ళిపోయింది.
తన్మయి ముఖం పక్కకు తిప్పుకుని కళ్ళు మూసుకుంది. వీళ్ళిక్కడ పంచాయితీ పెట్టడానికి వచ్చేరన్నమాట. ఒక పక్క డెలివరీ కష్టం కంటే మనసులో ముల్లులా గుచ్చుకుంటూన్న వీళ్ళ మాటలే ఎక్కువ బాధ పెడ్తున్నాయి. పసి పిల్లవాడు ఏం చేసేడని ఇంత కక్ష సాధింపు చేస్తున్నారో అర్థం కావడం లేదు.
ప్రభు వస్తూనే ఏదో జరిగిందని పసిగట్టినట్టు “పదండి పాపని చూసొద్దాం” అంటూ వాళ్ళని లేవదీసేడు.
తన్మయి ఎవరి వైపూ చూడకుండా కళ్ళు మూసుకునే ఉంది అక్కడ వాళ్ళు న్నంతసేపూ.
జ్యోతి వాళ్ళని ఇంటికి పిలవడం కూడా మానేసి మొహం తిప్పుకుని కూచుండి పోయింది. ప్రభు వాళ్ళని టౌనులో చుట్టాలింట్లో దించి వస్తానని చెప్పి బయలుదేరి వెళ్ళేడు.
వాళ్ళలా వెళ్ళగానే “ఇదా నువ్వు చేసుకున్న సంబంధం, ఆ మనిషి మాట్లాడే దానికి తలా తోకా ఉందా? ఎందుకొచ్చేడు, ఏం మాట్లాడతన్నాడు? అయినా నీ కొడుకు నీతో ఉండకూడని ఆంక్షలు పెడుతున్న వీళ్ళందరినీ ఇంట్లో ఉంచుకోవడానికి నీకు బుద్ధిలేదా, నీ మొగుడికి బుద్ధిలేదా? ఇదెక్కడి అన్యాయం మనుషులు?” అంది గట్టిగా.
ఏ మనుషుల గురించి తల్లికి తెలియకుండా ఇన్నాళ్ళూ దాచిపెట్టిందో ఆ మనుషులే ఎదురుగా వచ్చి మరీ వాళ్ళ బుద్ధి చూపించుకున్నారు. ఇక ప్రభు సరేసరి. బహుశాః వాళ్ళిప్పటికే చిలవలూ పలవలూ కల్పించి చెప్పే ఉంటారు. ఇక వాళ్ళున్నంత సేపూ ఇక్కడికి రానుకూడా రాడు.
తన్మయికి భయంకరమైన తలపోటు రాసాగింది. ఎటూ మాట్లాడని ప్రభు నిశ్శబ్దాన్ని అవకాశంగా తీసుకుని రెచ్చిపోతున్న వీళ్ళతో ఇక రోజూ పోరాటం చేస్తూ రావాల్సిందే.
ఒక పక్క పాప ఎప్పటికి ఒడిలోకి వస్తుందో అన్న ఆందోళన, మరో పక్క ఇలాంటి భయంకరమైన మనుషుల వల్ల మానసిక వ్యథ.
“మిత్రమా! ఎప్పటికైనా నాకు కష్టాలు గట్టెక్కే మార్గం ఉందా?” అంటూ మౌనంగా రోదించసాగింది.
*****
(ఇంకా ఉంది)
డా|| కె.గీత పూర్తిపేరు గీతామాధవి. వీరు “నెచ్చెలి” వ్యవస్థాపకులు, సంపాదకులు. తూ.గో.జిల్లా జగ్గంపేటలో జన్మించారు. ప్రముఖ కథా రచయిత్రి శ్రీమతి కె. వరలక్ష్మి వీరి మాతృమూర్తి. భర్త, ముగ్గురు పిల్లలతో కాలిఫోర్నియాలో నివాసముంటున్నారు.
ఆంధ్ర విశ్వవిద్యాలయంలోఇంగ్లీషు, తెలుగు భాషల్లో ఎం.ఏ లు, తెలుగు భాషా శాస్త్రం లో పిహెచ్.డి చేసి, 10 సం. రాల పాటు మెదక్ జిల్లాలో ప్రభుత్వ కళాశాల అధ్యాపకురాలిగా పనిచేసారు. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నించి 2006 లో “ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ” పొందారు.అమెరికాలో ఇంజనీరింగ్ మేనేజ్ మెంట్ లో ఎం.ఎస్ చేసి, ప్రస్తుతం సాఫ్ట్ వేర్ రంగంలో భాషా నిపుణురాలిగా పనిచేస్తున్నారు.
ద్రవభాష, శీతసుమాలు,శతాబ్దివెన్నెల, సెలయేటి దివిటీ, అసింట కవితాసంపుటులు, సిలికాన్ లోయ సాక్షిగా కథాసంపుటి, వెనుతిరగనివెన్నెల నవల, At The Heart of Silicon Valley -Short stories (2023),Centenary Moonlight and Other Poems(2023) ప్రచురితాలు. నెచ్చెలి ప్రచురణ “అపరాజిత” – గత ముప్పయ్యేళ్ల స్త్రీవాద కవిత్వం (1993-2022) పుస్తకానికి సంపాదకులు & ప్రచురణకర్త. ‘యాత్రాగీతం’ ట్రావెలాగ్స్, ‘కంప్యూటర్ భాషగా తెలుగు’ పరిశోధనా వ్యాసాలు కొనసాగుతున్న ధారావాహికలు. అజంతా, దేవులపల్లి, రంజనీ కుందుర్తి, సమతా రచయితల సంఘం అవార్డు, తెన్నేటి హేమలత-వంశీ జాతీయ పురస్కారం, అంపశయ్య నవీన్ పురస్కారం మొ.న పురస్కారాలు పొందారు.
టోరీ రేడియోలో “గీతామాధవీయం” టాక్ షోని నిర్వహిస్తున్నారు. తానా తెలుగుబడి ‘పాఠశాల’కు కరికులం డైరెక్టర్ గా సేవలందజేస్తున్నారు. కాలిఫోర్నియా సాహితీ వేదిక “వీక్షణం”, తెలుగు రచయిత(త్రు)లందరి వివరాలు భద్రపరిచే “తెలుగురచయిత” వెబ్సై ట్ వ్యవస్థాపకులు, నిర్వాహకులు.